Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
13. మాతా పితరులను చేరుటకు అశ్వము విశిష్టము నివాస యోగ్యమగు స్థానమునకు పయనమయినది. అశ్వమా ! హవ్యదాతలు ధనము పొందుటకొఱకు నీవు ప్రసన్న చిత్తమున దేవతల వద్దకు వెళ్లుము.
నూట ఆరువది నాలుగవ సూక్తము
ఋషి - దీర్ఘతముడు, దేవతలు - అనేకులు, ఛందస్సు - వేరువేరు.
1. పూజనీయులగు జగత్పాలకులు హోత లేక సూర్యుడు, మధ్యమభ్రాత లేక వాయువు సర్వత్ర వ్యాపించి ఉన్నారు. వారి మూడవ సోదరుడు అగ్ని ఆహుతులు అందుకొనును. సోదరుల మధ్య సప్తకిరణముల సూర్యుడు దర్శనము ఇచ్చును.
(వీరందరు అదితి పుత్రులు కావున సోదరులు)
2. సూర్యునిది ఏకచక్ర రథము. దానికి ఏడు గుఱ్ఱములు పూన్చబడినవి. ఒకే అశ్వము ఏడు పేర్లతో లాగును. చక్రమునకు మూడు నాభులు ఉన్నవి. అవి జీర్ణము కావు. శిథిలముకావు. సర్వలోకములు వానినే ఆశ్రయించును.
3. సప్తచక్ర రథమున ఉన్నవే సప్తాశ్వములు. అవే ఆ రథమును లాగును. ఏడుగురు అక్కచెల్లెండ్లు ఈ రథము ముందు నడతురు. ఇందు ఏడుగోవులు లేక కిరణములు లేక స్వరములు ఉన్నవి.
4. తొలుత జన్మించిన వానిని ఎవడు చూచినాడు? కోదదర్శప్రథమం జాయమానం. అస్థిరహితములు అస్థులను ఎప్పుడు కలిగినవి? ఎప్పుడు పృథ్వి నుండి ప్రాణము రక్తము పుట్టినవి? ఆత్మలు ఎక్కడి నుంచి ఉత్పన్నమయినవి? ఈ జిజ్ఞాసకు గాను ఎవడు విద్వాంసుని వద్దకు వెళ్లును?
5. నేను అజ్ఞానిని. నాకు ఏమియు అర్థము అగుటలేదు. అందుకే అడుగుచున్నాను. ఇవి సందిగ్ధములు. దేవతలకు రహస్యములు. ఒక వత్సరపు సూర్యుని కొఱకు ఏడు సోమ యజ్ఞములు చేసినారు. అవి ఏమిటి?
6. నేను అజ్ఞానిని. ఏమియు తెలియని వాడను. తెలుసుకొనవలెను ఆసక్తితో జ్ఞానులను అడుగుచున్నాను. ఆరు లోకములను నిలిపి ఉంచినవాడు ఎవడు? జన్మరాహిత్యమున జీవించువాడు ఎవడు? వారు ఒక్కరేనా?
7. వేగవంతుడు, సుందరుడు అగు ఆదిత్యుని స్వరూపము అతి నిగూడమయినది. అతని కిరణములు పాలుపితుకును. తేజః స్వరూపములు అగును. నీటిని పీల్చును. ఈ విషయములు తెలిసిన వారు వివరించవలెను.
8. భూమాత తండ్రియగు ద్యులోకమునందు ఉన్న సూర్యుని స్వానుష్ఠానమున పూజించినది. అంతకుముందే తండ్రీ లోలోపల తల్లితో సంగమించినాడు. తల్లి గర్భము ధరించతలచి రసమును దాల్చినది. వారిద్దరు సస్యములు ఫలింప చేయుటను గురించి మాట్లాడుకొనుచున్నారు.
9. ద్యులోకమను తండ్రి, కోరికలు తీర్చు పృథ్వి యొక్క భారము వహించుచున్నాడు. గర్భమున జలమును దాల్చిన మేఘము మధ్యన ఉన్నది. వర్ష జలము దబదబ కురిసినది. మేఘవాయు కిరణ సంయోగము పృథ్విని సస్యశ్యామలము చేసినవి.
10. ఏకమాత్ర ఆదిత్యునకు భూమి, ఆకాశము, అంతరిక్షము ముగ్గురు తల్లులు. అగ్ని, వాయువు, సూర్యుడు ముగ్గురు తండ్రులు. ఆదిత్యుడు తలిదండ్రులతో ఊర్ధ్వమున ఉన్నాడు. అతడు అలసట ఎరుగడు. ద్యులోక పీఠమున దేవతలు సూర్యుని గురించి చర్చింతురు. దానిని ఎరిగినవాడు లేడు. కాని వారు సర్వమును చర్చింతురు.
11. సత్యాత్మకమగు ఆదిత్యుని పన్నెండు ఆకుల చక్రము స్వర్గము చుట్టు భ్రమించుచుండును. అయినను అది పాతబడదు. అగ్ని ఆ చక్రమునందు 360 పగళ్లు, 360 రాత్రుల రూపమున 720 అయి వసించును.
12. అయిదు ఋతువుల కాళ్లు, పన్నెండు మాసముల రూపముగల ఆదిత్యుడు ద్యులోకపు పూర్వార్థమున ఉన్నప్పుడు కొందరు అతనిని పురీష లేక జలదాత అందరు. ఆరు ఋతువుల ఆకులు. ఏడు కిరణముల చక్రములు కలిగి ద్యులోకపు రెండవ సగమున ప్రకాశించు సూర్యుని మరికొందరు 'అర్పిత' అందురు.
13. నియమముగా ఆవర్తించు అయిదు ఋతువుల ఆకుల చక్రమునందు భువనములన్నియు లీనములు అయి ఉన్నవి. దాని ఇరుసు భువనభారము వహించును. అలసట ఎరుగదు. దాని నాభి సర్వదా సమానముగా ఉండును. చలించదు.
14. సమానమగు అంచులు గలిగి శిథిలము ఎరుగని కాలచక్రము నిరంతరము భ్రమించుచుండును. దీనితో అయిదుగురు లోకపాలురు అయిదు రకముల జనులు పదిమంది కలిసి భూమండలమును ధరింతురు. సూర్యుని నేత్రరూపమగు మండలమున వర్షజలమున దాగినది. సమస్త జగములు, ప్రాణులు సహితము అందుననే నిలిచినవి.
15. ఆదిత్యుని సహజాతమగు ఋతువులలో ఏడవది అధికమాసము, ఒంటరిది. మిగిలిన ఆరు ఋతువులు ఉభయములు. రెండు మాసములవి. కదలికగల ఈ ఋతువులను దేవతలు సృష్టించినారు. ఈ ఋతువులు అందరకు ఆనందకరములు. స్థాన భేదమున వేరు వేరుగా నిలుచును. రూపభేదమున విభిన్న ఆకృతులు కలిగి ఉండును. అవి తమ ప్రభువు కొఱకు వంతులు వంతులుగా తిరుగుచుండును.
16. కిరణములు స్త్రీలు అయ్యు పురుషులు. కన్నులు ఉన్నవారే దీనిని చూడగలరు. చూపు మందగించినవారు కానలేరు. మేధావి అయిన పుత్రుడు మాత్రమే వీనిని గ్రహించగలడు. వీనిని అన్నింటిని గ్రహించగలవాడే తండ్రులకు తండ్రి అగును.
"పితుష్పితాసత్"
17. వత్సరూపమగు అగ్ని పృష్ఠభాగము ముందరికాళ్లతోనూ, ముఖభాగము వెనుకకాళ్లతోనూ ధరించిన గోరూపమగు ఆదిత్యరశ్మి ఊర్థ్వమునకు పోవును. అది ఎక్కడికి పోవును? ఎవరికొఱకు నడిమినుండి తిరిగి వచ్చును? దళమధ్యమున ప్రసవించదు? అది ఎక్కడ ప్రసవించును?
18. భూలోకమున ఉన్న అగ్నిని, ఊర్థ్వలోకమున ఉన్న సూర్యుని భూలోకమున ఉన్న అగ్ని యుక్తముగ ఎవరు ఉపాసింతురో వారే మేధావివంటి ఆచరణగలవారు. ఇవి చెప్పినవాడు ఎవడు? అలౌకికమగు మనసు ఎక్కడ పుట్టినది?
"మనఃకుతో అధి ప్రజాతమ్"
19. కొందరిని విద్వాంసులు అధోముఖులు అందురు. వారినే ఊర్థ్వముఖులని కూడ అందురు. ఊర్థ్వముఖులు అన్న వారిని అధోముఖులని కూడ అందురు. సోమ ఇంద్రులు మండల ద్వయమున ఏర్పరచినారు. యుగళ అశ్వాదులవలె ఆ మండలములు విశ్వభారమును వహించుచున్నవి.
20. జీవాత్మ, పరమాత్మలను రెండు పక్షులు ఒకే దేహము లేక వృక్షమున నివసించును. వానిలో జీవాత్మ రుచికరములయిన రావిఫలములను తినును. పరమాత్మ దేనిని అనుభవించడు. అతడు ద్రష్టమాత్రమే.
21. సూర్య మండలము నుండి రమ్య కిరణములు కర్తవ్య జ్ఞానయుక్తమగు అమృతాంశమున బయల్వెడలును. అవి సాహసోపేతముగా సకల భువనములను రక్షించును. నాది అపరిపక్వ బుద్ధి. అయినను ఆ కిరణములే నన్ను నిలిపినవి.
22. ఆదిత్యుని జలగ్రాహ కిరణములు రాత్రి వృక్షముపై వసించును. ప్రాతః కాలమున జగములను వెలుగులతో నింపును. విద్వాంసులు ఆ వెలుగును ప్రాపణీయములని భావింతురు. అది ఎరుగనివాడు అనుభవింపజాలడు.
23. భూమి మీది అగ్నిస్థానమును తెలిసినవారు, దేవతలు అంతరిక్షమున వాయువును సృష్టించినారని తెలిసినవారు, ఊర్థ్వతమ ప్రదేశమున సూర్యుని స్థానము తెలిసినవారు అమృతత్వము పొందుదురు. "అమృతత్వమానశుః"
24. అతడు గాయత్రి ఛందస్సుతో పూజామంత్రమును సృష్టించినాడు. అర్చన మంత్రమున సామమును కల్పించినాడు. త్రిష్టుప్ ద్వారా ద్రుచ, త్రుచ రూప వాక్కును చేసినాడు. ద్విపాద చతుష్పాద వచనములతో అనువాక రచన చేసినాడు. అట్లే అక్షర ప్రణాళిక ప్రకారము ఏడు ఛందస్సులను కల్పించినాడు.
25. జగతీ ఛందమున ద్యులోకమున వృష్టిని స్తంభింప చేసినాడు. రథంతర సామము లేక సూర్యమంత్రములందు సూర్యుని దర్శించినాడు. పండితులు గాయత్రికి మూడుపాదములు ఉన్నవి అందురు. అందువలన గాయత్రి మహత్తులోను, తేజస్సులోనూ అన్నింటిని అధిగమించును.
26. నేను పాడి ఆవును పిలుతును. పాలు పితుకుటలో నిపుణుడు ఆవు పాలు పితుకును. ఆ సామమునందలి శ్రేష్ఠ భాగమును సవిత గ్రహించవలెను. అందువలన అతని తేజస్సు వృద్ధిచెందును. సవితను ఆహ్వానించుచున్నాను.
27. ధనము గల ధేనువు దూడ కొఱకు మనసులో మసలుచు 'అంబా' అని వచ్చును. అది అశ్వినులకు పాలు ఇవ్వవలెను. సౌభాగ్య లాభమున వర్థిల్లవలెను.
28. ఆవు కళ్ళు మూసుకుని దూడ కొఱకు 'అంబా' అనును. దూడ మూతి నాకి 'అంబా' అనును. దూడ మూతిమీద నురుగు చూచి 'అంబా' అనును. దూడకు కడుపునిండుగా పాలు త్రాగించి తృప్తి చెందును.
29. దూడ ఆవు చుట్టు తిరిగి అవ్యక్త శబ్దము చేయును. ఆవు గోచర భూమి నుండి 'అంబా' అనును. ఆవు పశుజ్ఞానముతో మానవులను లజ్జితులను చేయును. వ్యక్తమయి తన రూపమును ప్రకటించును.
30. చంచలుడు, శ్వాసనిశ్వాసలు కలవాడు కార్యము ముగిసిన పిదప నిశ్చలుడగును. మర్త్యునితో ఉత్పన్నమగు ఆత్మ శ్రాద్ధ భక్షణ చేయుచు విహరించుచుండును.
(ఆత్మవేరు, దేహము వేరు అని చెప్పుచున్నాడు)
31. ఆదిత్యుడు ప్రసన్నుడు, రక్షకుడు. అంతరిక్షమున అతని రాకను దర్శింతును. సర్వగమనము, సహగమనముగల కిరణపుంజములు అప్పుడప్పుడు అచ్చాదితములు అగును. అయినను భువనములకు వచ్చుచుండును. పోవుచుండును.
32. గర్భము చేసినవాడు దాని తత్త్వమును ఎరుగడు. గర్భమున ఉన్నవానికి జ్ఞానము లుప్తము మాతృగర్భమున పరివేష్టుడయి ఉన్నవాడు సంతానవంతుడగును. పాపలుప్తుడు అగును.
33. స్వర్గము నన్ను పాలించునది. స్వర్గము నాకు తండ్రి. పృథ్వియొక్క కక్ష్య నాకు మిత్రము. విశాల పృథ్వి నాకు తల్లి. ఉచ్ఛద్వయము ద్యావాపృథ్వుల మధ్య అంతరిక్షము ఉన్నది. దూరమున ఉన్న ద్యులోకరూపుడగు తండ్రి దిగువనున్న పృథ్వి రూపమగు తల్లికి గర్భము ధరింప చేయుచున్నాడు.
34. భూమికి అంతము ఎక్కడ అని అడుగుచున్నాను. లోకములకు ఉత్పత్తి స్థానము ఎక్కడ అని అడుగుచున్నాను. సేద్యసమర్థమగు అశ్వపు రేతస్సు ఎక్కడ అని అడుగుచున్నాను. సమస్త వాక్యముల పరమస్థానము ఎక్కడ అని అడుగుచున్నాను.
35. వేదము పృథ్వికి అంతము అగును. యజ్ఞము లోకములకు ఉత్పత్తి స్థానము అగును. సోమము సేద్యసమర్థగు అశ్వపు రేతస్సు అగును. ఋత్విక్కు లేక బ్రహ్మ సమస్త వాక్యములకు పరమస్థానము అగును.
36. ఏడు కిరణములు సంవత్సరములో సగము భాగము గర్భధారణ చేయును. అనంతరము వర్షించును. రేతస్సు రూపముగల వృష్టిదానము చేయును. జగత్తును సారభూతముచేసి విష్ణువు లేక ఆదిత్యుని కార్యమును నిర్వహించును. వారు సర్వజ్ఞులు, సర్వతో గమనులు. వారు తమ ప్రజ్ఞద్వారా జగత్తులందు అంతర్భూతులు అయి ఉందురు.
37. నేను ఉన్నానో లేనో నాకు తెలియదు. నేను మూఢుడను. చిత్తమును కప్పి ఉంచినాను. జ్ఞానపు ప్రథమ కిరణము నాలో వెలిగినప్పుడు వాక్యార్థము గ్రహించగలను.
38. నిత్యము అనిత్యముతో కలిసి ఒకే స్థానమున ఉండును. అవి శరీరమును చేరినపుడు ఒక్కొక్కసారి ఊర్థ్వమును, ఒకసారి అధోభాగమునకు చేరును. అవి ఒకేచోట ఉండును. లోకములందు కలిసి సంచరించును. లోకము వీనిలో అనిత్యమును గుర్తించును. నిత్యమును గుర్తించదు.
39. సర్వదేవతలు మహదాకాశముతో సమానులయి మంత్రాక్షరముల మీద ఉపవిష్టులు అయి ఉన్నారు. ఇది తెలియనివాడు ఎన్ని వేదములు చదివి ప్రయోజనమేమి? ఈ విషయము తెలిసినవాడు సుఖించును.
40. హననము చేయకూడని గోవు సస్యములు, తృణములు మేసి పాడిగలది కావలెను. అందువలన మేము సహితము సంపన్నులము అగుదుము. ఆ గోవు ఎల్లవేళల గడ్డి మేయవలెను. సర్వత్ర సంచరించవలెను. నిర్మల జలమును త్రాగవలెను.
41. మేఘనినాద స్వరూపిణి, అంతరిక్ష విహారిణి అగు వాక్కు వర్షజలమును కలిగించి శబ్దము సృష్టించును. అది ఒకప్పుడు ఏకపది-ఒకప్పుడు ద్విపది, ఒకప్పుడు చతుష్పది, ఒకప్పుడు అష్టపది ఒకప్పుడు నవపది అగును. ఒకప్పుడు సహస్రాక్షర వ్యాప్తమయి అంతరిక్షము మీద స్థిరముగ నిలిచి శబ్దము చేయును. "సహస్రాక్షర పరమే వ్యోమన్"
42. అచటి నుండియే సర్వ మేఘములు వర్షించును. అచటినుండియే నలుదిశల ఆశ్రితులకు రక్షణ లభించును. అచటినుండియే జలము ఉత్పన్నమగుచున్నది. జలమే సర్వప్రాణులకు ఆధారభూతము అగుచున్నది.
43. నేను పిడకల పొగచూచినాను. పొగసర్వత్ర వ్యాపించినది. అనంతరము అగ్నిని చూచినాను. దానిమీద ఋత్విక్కులు ఫలప్రదాత అగు సోమమును పచనము చేయుదురు. ఇది వారి ప్రథమ అనుష్ఠానము అగును.





