Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta

స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ 22
వాడు సకామభక్తుడు. అన్యదేవతలను ఆరాధించును. వానిని నేను అనుగ్రహింతును. అతడు ఆ దేవతల వలననే కోరిన కోర్కెలను పొందును.
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్స మేధసామ్
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి 23
అన్యదేవతలను ఉపాశించువాడు అల్పబుద్ధుడు. వాడికి లభించిన ఫలమును అల్పమైనదే. నశించునదే. కాని నన్ను ఆరాధించువారు నన్నే చేరుచున్నారు.
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః
పరంభావ మజానంతః మమావ్యయ మనుత్తమమ్ 24
నేను అవ్యక్తుడను. అవ్యయుడను. ఉత్తముడను. నా యీ యొక్క పరమస్వభావమును బుద్ధిహీనులు గుర్తించరు. నన్ను సాధారణ మానవునిగా తలంతురు.
నాహం ప్రకాశం స్సర్వస్య యోగమాయా సమావృతః
మూఢో - యం నాభిజానాతి లోకో మామజ మవ్యయమ్ 25
నన్ను యోగమాయ కప్పియున్నది. కావున మూర్ఖులు నా ప్రకాశమును గ్రహించజాలరు. లోకము నన్ను పుట్టుక లేని వానిగా, నశింపని వానినిగా గ్రహించదు.
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున!
భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన 26
నాకు భూత, భవిష్యత్, వర్తమాన సృష్టి తెలియును. కాని నా యందు భక్తి శ్రద్ధలు లేనివారు నన్ను తెలియ జాలరు.
ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత!
సర్వ భూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప! 27
రాగద్వేషాలు ద్వంద్వములు. లోకమును అంతులేని మోహములో పడవేస్తున్నవి.
యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్.
తే ద్వంద్వ మోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః 28
కొందరు పుణ్యాత్ములుందురు వారి పాపములు చెరిగి పోవును. ద్వంద్వము, మోహము నుండి విముక్తుడైనవాడు, దృఢవ్రతుడు నన్ను భజించుచున్నారు.
జరామరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి యే
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలమ్ 29
జనన మరణ విముక్తికై ప్రయత్నించువారు నన్ను ఆశ్రయించుచున్నారు. వారు బ్రహ్మమును, ఆధ్యాత్మికమును, అఖిల కర్మములను తెలియుచున్నారు.
సాధిభూతాధిదైవం మా సాధియజ్ఞం చ యే విదుః
ప్రయాణకాలే పి చ మాం తే విదుర్యుక్త చేతసః 30
అధి భూత అధి దైవత అధి యజ్ఞములు తెలియువాడు అంత్యకాలమున నన్ను తెలియువాడు నన్నే చేరుదురు.
దీపిక:
1. అర్జునుడు సాధారణునకు సంకేతమాత్రుడు. మనకు తెలియనిది అర్జునునకు తెలియదు. స్వామి ఉపదేశించునది సమస్త మానవాళికి, సమస్త మానవాళిలో అర్జునుని స్థితియే.
ఆరవ అధ్యాయము వరకు అర్జునుడు ఊగిసలాడుచున్నాడు. తనకేమీ అర్థము కావడము లేదంటారు. తనకు మాత్రము శ్రేయస్సు కలిగించు ఒకే ఒక మార్గమును ఉపదేశించమంటాము.
ఇది సాధారణుని స్వార్థ స్వభావము. లోకములో అన్నింటిలే స్వామియు తనకే సహాయము చేయవలయును అనుకుంటాడు.
మరొక్క విషయము
అర్జునుడు స్వామిని గ్రహించినాడా! విశ్వసించినాడా! ఇది అనుమానాస్పదమే.
ఈ అధ్యాయమున స్వామి తన స్వస్వరూపమును, మహత్తును తెలియపర్చుచున్నాడు. ఇది బహుశః అర్జునునిలో లేక మనలో విశ్వాసము కలిగించుటకు కావచ్చును. ఎట్లయినను స్వామిని కొంతలో కొంత అర్థము చేసుకొనగల అదృష్టమును స్వామి మనకు కలిగించినాడు.
2. స్వామి తానే సమస్తమును అనుచున్నాడు. తనయందే సమస్తము వున్నది అనుచున్నాడు. సమస్తమునందు తానే వున్నాను అనుచున్నాడు. ఇది పరాత్పర లక్షణము. ఇది వ్యాఖ్యకు అతీతము. అయినను:
ఓం ఈశావాస్య మిదం సర్వం యత్ కించిజ్జగత్యాం జగత్
తేనత్యక్తేన భుంజీధా మాగృధః కస్యస్విద్ధనం
ఇది సాంతం ఈశ్వరమయమే. జగములందలి యీ కొంచెము జగత్తు సాంతం ఈశ్వరమయం. అతడు త్యజించిందే అనుభవించు. అన్యుల ధనము ఆశించకు.
ఈశావాస్య ఉపనిషత్తు-1
సమస్తము ఈశ్వరమయం. ఈశ్వరుడు లేనిది ఏదీలేదు. అతడే అంతటా నిండియున్నాడు. విశ్వంలో, విశ్వాంతరాళంలో ఎన్ని జగత్తులున్నాయో? ఏమో! మానవుడు ఎరుగడు. మానవునికి తెలిసిన తెలియని జగత్తులన్నియు, ఈశ్వరమయములే. అన్ని మహాజగత్తుల్లో మానవుడు ఎంతటివాడు? బహు చిన్నవాడు. కొద్దివాడు. అల్పుడు కాడు. స్వల్పుడు. ఈ చిన్నవాడికి సకల జగములను గురించి చెబితే ఏం అర్థము అవుతుంది? వాడి జీవితకాలమే నాలుగునాళ్ళు.
3. జీవితము ఏకముకాదు బహుః
ఒకడుగాని, ఒకటిగాగాని జీవించుట అసాధ్యము. జీవించుటకు ఎక్కువమంది ఎక్కువ వస్తుజాలము అవసరము. ఇది లోకమునందలి ఏ సమాజమునకైనను వర్తించును. ఎట్లనిన : మానవుని అవసరాలు ఒకటే. ఆలోచనలు వేరు వేరు. ప్రకృతి బహుసౌందర్యవతి. భూమి ఒకే రీతిగా ఉండదు. నీటిలో వ్యత్యాసములుండును. ఇంతకు చెప్పదలచినదేమనగా జీవితము 'బహు' ఏకము కాదు. ఇట్లే సమాజము 'బహు' ఏకము కాదు.
భారత తాత్వికతయు ఇంతే. 2000 సంవత్సరముల పూర్వము ప్రపంచ తాత్వికత బహురూపులది. బహువర్ణములది. బహురుచులది. బహు సౌందర్యము గలది.
ఏకము నియంతృత్వము. బహు స్వేచ్ఛ సమానతలు. ఇప్పటి భారత తాత్వికత బహుమార్గములది. బహు రూపులది. బహు తీరులది. బహు సిద్ధాంతములది మనము అర్థము చెసుకొనవలసినది ఏమంటే స్వామి బహు సిద్ధాంతములను బహురూపములుగా చిత్రించుచున్నాడు. వాటిలో మనకు నచ్చినది, విశ్వాసము కలిగించినది మాత్రమే ఉపాదేయము అగుచున్నది. స్వామి సమస్తమును బహు విధములుగా తెలియపర్చుచున్నాడు. అన్నింటిని తెలుసుకొనుట అవసరము. విశ్వసించిన దానిని నిశ్చయముగా ఆచరించుట అవసరము. ఇదియే భగవానుడు మనకు ఉపదేశించుచున్నాడు. యీ విషయములో సంశయమునకు తావులేదు.
సంశయాత్మా వినస్యతి
4. మనము బహు దేవతారాధకులము. వేదమున ముప్పది ముగ్గురు దేవతలున్నారు. పదకొండు మంది భూమిమీద, పదకొండు మంది అంతరిక్షమున, పదకొండు మంది ఆకాశముపైన.
అగ్ని, వాయువు, భూమి మీద ప్రత్యక్ష దేవతలు. సూర్య చంద్రాది గ్రహ నక్షత్రాదులు అంతరిక్షపు దేవతలు. ఇంద్రుడు, బృహస్పతి ఇత్యాదులు స్వర్గదేవతలు. అంతేకాదు. మనకు చెట్టు, పుట్ట, పాము, చీము, అన్నియు దేవతలే. వీటన్నింటిని మనము రక్షించుకొన్నాము. పూజించినాము.
ఎందులకు?
ఇవి అన్నియు జీవితము కోసమే. మన జీవితానికి అవసరమైన ప్రతి దానిని దేవతగా గుర్తించినాము. ఆ విధముగా సత్యం - శివం - సుందరం జీవితము గడిపాము. అన్యమతాలు ఒక దేవత నారాధించమంటున్నాయి. వాటిని ప్రకృతితోను, జీవితముతోను సంబంధము లేదు. పారలౌకిక జీవితము తప్ప అవి భూమిమీద జీవించవు.
మానవుడు విభిన్న రీతులవాడు. ఏ ఒక్కడు రెండవ వానికి సమానము కాడు. 'జిహ్వకు ఒక రుచి, పుర్రెకు ఒక గుణము' అనేది సామెత. కాబట్టి ఎవరి గుణము, ఎవరి స్వభావము, ఎవరి ఆలోచన వారిదే. కావున దేవతలనారాధించుకొను స్వేచ్చ ప్రతి ఒక్కరికిని ఉండవలసినదే. తినుటకు, బ్రతుకుటకు వున్న స్వేచ్ఛ ఆరాధనలో ఏల వుండరాదు? ఇంతకు భూమి, వాయువు, అగ్ని సూర్యచంద్రాదులు వేదములో చెప్పబడిన ముప్పది ముగ్గురు దేవతలు ఒక్కొక్కరు గాని, కొందరు కలసిగాని పరాత్పరుడు కాజాలరు.
భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే, సృష్టికర్త పరాత్పరుడు ఒక్కడే!
అన్ని మతాలకు, సిద్దాంతాలకు ప్రవక్తలు వేరు. కాని పరాత్పరుడు ఒక్కడే.
5. స్వామి అనేక దేవతలను పూజించువారిని గురించి వివరించినాడు. తాను వారిని అనుగ్రహింతునన్నాడు.
ఇంతటి విశాల, ఉదార, విస్తీర్ణ హృదయము మరెవరికైన వుండునా?
ఉండదు.
పరాత్పరునికి మాత్రమే ఉండును.
జ్ఞాన విజ్ఞానయోగమను సప్తమ అధ్యాయము ముగిసింది.
ఓం శాంతిః శాంతిః శాంతిః





