Home » vaddera chandidas » Anukshanikam 2



    "అవును."
    "యెవరీమె?" అని సిగరెట్ వెలిగించాడు విజయ్ కుమార్.
    యీ మహల్లో వున్న చాలా పోర్షన్లలో ఒకదాన్లో వుంటారు" యం.ఏ. ప్రయివేటుగా కడుతుందట. వివరాలు కనుక్కోటానికి వాళ్ళ నాన్న పంపించారు."
    "పేరు?"
    "తెలియదు. వాళ్ళ నాన్న పేరు తెలుసు. మేడమీద వుంటారు."
    "ఆ మధ్య మా నిజాం కాలేజీ రంగారెడ్డి కనిపించాడు. మిమ్మల్ని చాలా పొగిడేస్తున్నాడు."
    "యిప్పుద్ మీది నైట్ లా కాలేజీ కదా__ నిజాం కాలేజీ కాదుగా? విరసించే లెక్కన అన్ని కాలేజీలూ మీవేననుకోండి. అంకినీడు పెళ్ళిలో పరిచయం అయ్యాడు అతను. నాకు నచ్చాడు." అన్నాడు శ్రీపతి.
    "ఒట్టి తిరుగుబోతు" అన్నాడు విజయ్ కుమార్.
    "నేనూ తిరుగుబోతునే"
    "యెంతమాట? వాడికీ, మీకూ పోలికా!" అన్నాడు విజయ్ కుమార్.
    "అభిరుచిలో అవసరంలో స్థాయిలో తేడా వుంటే వుండొచ్చు. నాకు అతనంటే గౌరవం యేర్పడింది. నిజాయితీ బేరం అతనిది. పైగా అతనికి కొన్ని నియమాలున్నాయి. మోసగించి యే స్త్రీనీ నాశనం చెయ్యడు, కార్నర్ చెయ్యడు."
    "యిఁహిఁ. ఐమీన్. అఫ్ కోర్స్. అట్లాంటివాడే అనుకోండీ__"
    "యెలా వున్నారు? కులాసా? హౌ యీజ్ మిసెస్ విజయ్ కుమార్? పిల్లలా?" అన్నాడు శ్రీపతి.
    "ఫైన్. ఇంకా పిల్లల్లేరు. మీతో చిన్న పనిబడి వచ్చాను__"
    "చెప్పండి" అన్నాడు శ్రీపతి.
    ఢిల్లీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ వినయ్ కౌల్ మీకు తెలుసునని విన్నాను__"
    "అంతగా పరిచయం లేదు. క్రితంసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అతనిని కలుసుకోలేకపోయాను. ఫోన్లో మాట్లాడాను. వ్యాపార రీత్యా తెలియదు."
    "ఢిల్లీలో షోరూం ప్లాట్ కోసం చూస్తున్నాం. అతని అడ్రసు.
    నా దగ్గిర అడ్రస్ లేదు. డైరక్టరీలో ఫోన్ నంబరు చూసి దాన్లోవున్న అడ్రస్ ప్రకారం వెళుతుంటాను, లేదూ ఫోన్ చేస్తే తనే వస్తుంటాడు. డైరక్టరీలో చూస్తే తెలుస్తుంది."
    "మీకు లెటర్ ఇవ్వటానికి వీలయితే__"
    "పరిచయానికి స్నేహానికే ఐతే ఇవ్వగలను. వ్యాపార వ్యవహారానికైతే అక్కర్లేదు. దేనికదే వెరీ ఇంజీనియస్. కానీ డిసీవర్ కాదు. మంచికి మంచి. చెడుకి చెడు వంటి స్వభావం. వూరికే నా పేరు చెప్పొచ్చు రిఫరెన్స్ కి. మీరే వెళుతున్నారా?"
    "నాకా వ్యాపారాల గొడవలు సరిపడవు. నేను విరసానికీ ఫైన్ ఆర్ట్సుకీ పరిమితం. మావాళ్ళే వెళ్తారు. అతని పూర్తి పేరు__ డైరక్టరీలో చూడటానికి_"
    "కౌల్ సి. వినయ్ అని చూడండి. ఒకే పేరు వుంటుంది."
    "థ్యాంక్సండీ. వస్తాను. యేదో బిజీగా వున్నట్లున్నారు."
    "బిజీ ఏంలేదు. బయటికి వెళ్ళబోతుండగా ఆవిడొచ్చింది. అంతలో మీరొచ్చారు. పదండి నేనూ బయటికే వస్తున్నాను" అని లేచి మధ్యగది గుమ్మంలో అడుగుపెట్టి వంగి, పక్కనుంచి తాళం అందుకున్నాడు శ్రీపతి.
    వాకిట్లో కొచ్చాడు.
    విజయ్ కుమార్ స్కూటర్ వంద గజాల అవతల వుంది.
    "ఇల్లు అదేమో అనుకుని అక్కడాగి అడిగాను. రండి బజార్లో డ్రాప్ చేస్తాను" అన్నాడు విజయ్ కుమార్.

                                95

    "అయ్య పిలుస్తున్నాడు" అన్నాడు ప్యూను వచ్చి రామ్మూర్తితో.
    కాగితాలలోంచి తలపైకెత్తకుండా, 'అయ్యట అయ్య, బియ్యే థర్డు క్లాసు వెధవ వీడికి అయ్యట....' అనుకుంటున్నాడు రామ్మూర్తి.
    "విన్నావా లేదా?"
    "అప్రాసీ వెధవ__ఏకవచన ప్రయోగం__మర్యాదా మన్ననా లేవు వీళ్ళకి. శ్రీపతి కాదంటాడు. వీళ్ళకి సౌమ్యత మంచితనం అమాయకత్వం వుందట. రాయలసీమ ప్రాంతంలో వాళ్ళకీ ఏకవచనమేనట. కాగా నాటుతనం అలక్ష్యం వున్నాయట. సర్కారు ప్రాంతీయులకు మర్యాద బాగా తెలుసట. అవసరం అయితే వాయించడమూ తెలుసట.
    తూర్పు సర్కారు ప్రాంతంలో అతి వినయం, అతి మర్యాద మన్ననలున్నాయట. అవసరం ఐతే నిలువునా ముంచేసే తనము వుందట. శ్రీపతికేం తెలుసు. ఒడ్డున కూచున్న కబుర్లు. యీ ఆఫీసుల్లో సబార్డినేట్ గా వుద్యోగం చేస్తే తెలుస్తుంది. కానీ అట్లా అంటే ఒప్పుకోడేమో, ప్రతి ఆఫీసరూ ఇంకోడికి సబార్డినేటేనని మలుస్తాడేమో....ఈ అలగా జనానికి మర్యాదా పాడూ లేవు...."
    "సాబ్ యిన్నవా?"
    __సాబ్ అంటే, గారు, అండీ అనికదూ! పాపం తురక పాలనలో వుండిపోయి తెలుగులో మన్నింపులు తెలియకనే కావచ్చు. ఉర్దూలో అయితే అట్లా కాకపోవచ్చు. ఈ మర్యాద మన్ననలు పొందటానికి నేనిప్పుడు ఉర్దూ యెక్కడి నేర్చుకునేది....
    "అయ్య బయటకు పోవాల్నట. జెల్దిపో. గా కాగజ్ లు అప్పటికి చూస్కోరాదు? కోపం చేస్తడు__"
    __కోపం చేస్తాడా కుర్మా చేస్తాడా. యింట్లో కుర్మానే చేస్తాడు. కస్సుబస్సుమంటూ ఎగురుతాడీ థర్డ్ క్లాస్ బియ్యే వెధవ__యింట్లో పిల్లి. పిల్లి కూడా కాదు. పేను_వుట్టి పేను కూడా కాదు. కుక్కిన పేను_ వాడి పెళ్ళాం. అమ్మబాబో, దానిముందు యెవడైనా కుక్కిన పేనే అవుతాడు. వీడి పెళ్ళాంకి బుర్ర గొరిగించి మీసాలెట్టి....
    రామ్మూర్తి ఆలోచనలోంచి లేచాడు. లేచిన రామ్మూర్తిని అనసరంగా ఆలోచనలు ముసురుతూనే వున్నాయి.
    అది అట్లా తగలెట్టావేం? అంటాడు కస్సుమని చూడగానే. అట్లాగే తగలడుతుంది నీ మొహంలాగా__అంటాను నేను కరుగ్గా. యేం వుద్యోగం చెయ్యాలని లేదా? అంటాడు, పీకించితే మళ్ళీ నీ మూతిపళ్ళు రాలగొట్టించి వచ్చాను మర్చిపోయావురా__అంటాను నేను పరిహాసంగా. వెధవ సిగ్గుతో కుంగిపోతాడు....
    రామ్మూర్తి ఆఫీసరు గదిలోకి చొరబడ్డాడు.
    "మిస్టర్ రామ్మూర్తీ, అ లెటర్ ఏంచేశావు? యింకా నోట్ పుటప్ చెయ్యలేదేం?" అన్నాడు ఆఫీసరు ధాటిగా.
    "యస్సార్. చేస్తున్నాను సార్."
    "యెన్నాళ్ళు చేస్తావు? ఇదేం రిసెర్చనుకుంటున్నావా?"
    "నెససరీ ఇన్ఫర్మేషన్ కోసం కలెక్టరాఫీసుకి రాశాం సార్. అది రాగానే__"
    "ఇన్ఫర్మేషన్ కి కాళ్ళు లేవు దానంతటది రావడానికి. అవసరం మనది. వెళ్ళి పట్టుకొచ్చి చెయ్యి"
    "యస్సర్."
    రామ్మూర్తి గది బయటపడ్డాడు.
    "అవసరం మనదట. జాయింటుగా వ్యవహరిస్తున్నాడు. కతికేది ఆ వెధవేగా? అమ్యమ్యా వెధవ పైగా సిగ్గులేకుండా నన్నంటున్నాడు. ఇన్ఫర్మేషన్ కి కాళ్ళు లేవట దానంతటది రావడానికి_జోక్ కాబోలు అది_ వెధవకి జోకడం కూడా రాదు. జోకడం అంటే యిక్కడ తూచడం అని అర్ధం వుంది. వీడికి తూచడం బాగా వచ్చు. పార్టీలని బాగా తూచగలడు. ఎవడెంత బరువు పెట్టగలిగేది పెట్టలేనిదీ. ఏమో వాడి బాధ లెట్లాంటివో_ నెలనెలా జీతం మాత్రమే ఇస్తే వీడి పెళ్లాం వీణ్ని యింట్లోకి రానివ్వదేమో_అందుకోసం గడ్డి కరుస్తాడు. గడ్డి కరిస్తే నాకేం గుడ్డు కరిస్తే నాకేం. మధ్యలో నన్ను కరవడం దేనికి? పట్టుకుని నాలుగు వాయించానంటే. పోరా టొంపే_అని దులిపేశానంటే రోగం కుదిరిపోతుంది.
    రామ్మూర్తి తన సీటువైపు నడుస్తూంటే కార్నర్ సీట్లో కూర్చుని వున్న టైపిస్టు మేరీ సౌందర్య తిలకం. "రామ్మూర్తిగారూ మీ కాగితాలు రడీ" అంది ఇంగ్లీషులో.
    పక్కకి తిరిగి, "థాంక్యూ" అని ఇకిలించి, అటు రెండడుగులు వేసి ఆ కాగితాలు అందుకున్నాడు.
    దీనికి పుట్టగానే ఆ పేరు పెట్టివుంటే దీనమ్మా బాబూ గుడ్డివాళ్లైవుండాలి. తిలకం అవసరం లేనిదిగానీ_అసలు నుదురేదీ తిలకం పెట్టుకోడానికి! ఆ గుర్రపు ముఖంలో నుంచి కారే సౌందర్యం. ఆహా_ తోలు కారు నలుపు కాకపోబట్టీ, పల్చటి జుట్టు కత్తిరించి నూనె లేకుండా జాలుగా వుంచబట్టీ, తొడలూ చంకలూ కనబడేలాగా పొట్టి గౌనేసుకుని అంటూ సొంటూ లేకుండా తిరగబట్టిగానీ లేకపోతే....బయటికి చూడడానికి యెట్లా కనిపిస్తేనేం_ అన్యాయం_ రూపం దేముంది దేవుడిచ్చాడు_ మనసు మంచిది. బుద్ధీ మంచిదే....




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.