Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    11. ఋభువులారా ! మీరు వర్షమును ఉన్నత ప్రదేశములను చేర్చినారు. ప్రాణిజాలము కొఱకు పంటలు పండించినారు. ప్రాణిజాలము కొఱకు పల్లపునేలలందు నీటిని నిలిపినారు. కావున మీరు సూర్యలోకమున ఇష్టము వచ్చినంతకాలము వసింపుడు.

    12. ఋభువులారా ! మీరు మేఘములతో అంతరిక్షమును మూసినపుడు సూర్యచంద్రులు ఎక్కడ ఉందురు? మీ వర్షము కలిగించు బాహువులను పట్టిన వానిని నశింపచేయుడు. ఎదిరించిన వానిని హతమార్చుడు.

    13. ఋభువులారా ! మీరు సూర్యమండలమున శయనించి ఉన్నారు. మమ్ము జాగృతము చేయువాడు ఎవడు? అని సూర్యుని అడుగుడు. సూర్యుడు వాయువు జాగృతము చేసినాడని వక్కాణించినాడు. వర్షకాలము గతించినది. మీరు మరల జగములను ప్రకాశవంతము చేయుడు.

    14. బలవంతులగు ఋభువులారా ! మీ దర్శనమునకు ద్యులోకమునుండి మరుత్తు భూలోకమునుండి అగ్ని, ఆకాశమునుండి వాయువు సముద్రమునుండి వరుణుడు వచ్చుచున్నారు.

    ఆలోచనామృతము

    1. దేవతలది ప్రత్యేక వర్గము, వర్ణము, జన్మముకావు. అగ్ని, వాయువు, ఇంద్రుడు మున్నగువారు మానవ జాతికి చేసిన ఉపకారము వలననే దేవతలు అయినారు. ఋషులు సహితము అంతియే. కేవలము జన్మవలనకాక సాధనమున ఋషులు అయినారు. ద్రష్టలు అయినారు. స్మర్తలు అయినారు. ఇది ఆ విషయములు చర్చించు సందర్భముకాదు.

    2. పటు పరిశ్రమ, మేధాసంపత్తి, నిరంతర పరిశ్రమతో దేవతలలో చేరవచ్చునని ఋభువులు నిరూపించినారు. పాండిత్యమునకు శాస్త్ర పరిజ్ఞానమునకు జన్మముతో నిమిత్తము లేదని నిరూపించినారు.

    ప్రతిభకు ఏనాడును ఆటంకములేదు.

    "విద్వాన్ సర్వత్రపూజ్యతే" అన్నాడు భర్తృహరి.

    3. ఋభువులు ముగ్గురు సామాన్య మానవులు. ముగ్గురి సమిష్టికృషితో అనేక విజయములు సాధించినారు.

    (i) త్వష్ట చేసిన ఒక్క చమసమును నాలుగుగా చేసినారు. గుఱ్ఱమునుండి గుఱ్ఱమును, రథమునుండి రథమును సృష్టించినారు. బహుశః రూపములను మార్చి అంత పదార్థముతో ఎక్కువ వానిని చేసి ఉండవచ్చును. (ii) గోవు నుండి నాలుగు గోవులను సృష్టించుట కృత్రిమ గర్భధారణ వంటిదికావచ్చును. (iii) ఎత్తు ప్రదేశమునకు నీటిని ఎక్కించియు పల్లపు ప్రదేశమున నీటిని నిలిపియు సస్యములను వృద్ధిచేసి వ్యవసాయశాస్త్రజ్ఞులు అయినారు. (iv) వృద్ధులయిన తలిదండ్రులను వయసువారినిచేసి భిషగ్వరులు అయినారు.

    4. వీరి ప్రగతికి సామాన్యముగా గుర్తింపురాలేదు. అది ఈనాటికిని సహజము. వారిని అగ్ని పరీక్షలకు గురిచేసినారు.

    5. త్వష్టవంటి స్వప్రయోజనపరులు తమ ప్రాధాన్యతకు అడ్డువచ్చినందులకు అక్కసు కక్కినారు.

    6. ప్రతిభ సూర్యునివంటిది. తాత్కాలిక గ్రహణము పట్టవచ్చును. కాని వెలుగును నిలుపజాలరు. ఋభువులు కేవలము తమ స్వశక్తితో దేవతలను మెప్పించినారు. దేవతలు ఉదారముగా శాస్త్రజ్ఞుల పరిశ్రమను గుర్తించినారు.

    7. శాస్త్రజ్ఞులయిన ఋభువుల ప్రజ్ఞాపాటవములకు వారికి సూర్యుని అంతస్తు ప్రసాదించినారు. ఇది సామాన్యముకాదు !

    8. 14వ మంత్రము ఋభువుల అంతస్తును అందనంత ఎత్తునకు ఎత్తినది.

            దివాయాన్తిమరుతో భూమ్యాగ్ని రయంవాతో అంతరిక్షేణయాతి
            అద్భిద్యాతి వరుణః సముద్రైర్యుష్మా ఇచ్చతః శవశోనపాతః

                                  నూట ఆరువది రెండవ సూక్తము
                        ఋషి - దీర్ఘతముడు, దేవత - అశ్వము, ఛందస్సు - జగతి - త్రిష్టుప్.

    1. 'సప్తి' అను అశ్వము అన్నములు కలది. దేవతల వలన జన్మించినది. దాని వీరకృత్యములను యజ్ఞములందు వర్షించుచున్నాము. మిత్రుడు, వరుణుడు, అర్యమ, వాయువు, ఇంద్రుడు, ఋభువులు, మరుత్తులు మమ్ము నిందింపరాదు.

    2. బంగారు ఆభరణములతో అందముగా అలంకరించిన అశ్వము ముందునకు ఋత్విజులు ఉత్సర్గమునకుగాను మేకను పట్టుకొని పోవుదురు. వివిధ వర్ణముల మేకలు 'మే మే' అనుచు ముందుకుసాగును. అవి ఇంద్రుడు, పూషకు ఇష్టమయిన ఆహారములు.

    3. మేక దేవతలు అందరికి ఉపయుక్తమయినది. మేక పూష అంశమున పుట్టినది. శీఘ్రగమనముగల మేకను ముందుకు తీసుకొనివత్తురు. దేవతలకు రుచికరమగు భోజనము సిద్ధము చేయుటకుగాను త్వష్ట అశ్వసహితముగా మేకతో కూడ పురోడాశము సిద్ధము చేయును.

    4. ఋత్విజులు దేవతల అనుగ్రహ ప్రాప్తి కోరుదురు. వారు ఆయా సమయములందు అశ్వమును మూడుసార్లు అగ్నిముందునకు తీసికొనిపోవుదురు. అప్పుడు దేవతలకు యజ్ఞమును గురించి తెలియపరచుటకు ముందుగానే మేక దేవతలను చేరును.

    5. దేవతలను ఆహ్వానించు హోత, యజ్ఞమును నిర్వర్తించు అధ్వర్యుడు, అగ్నిని ప్రజ్వలింపచేయు అగ్నిసిద్ధుడు, సోమరసముతీయు గ్రావాగ్రాభుడు, కర్మానుప్ఠానముచేయు శంస్త, యజ్ఞపు ప్రధాని బ్రహ్మ, ప్రసిద్ధము, అలంకృతము, సుందరము అగు యజ్ఞముచేసి నదులను పూర్ణములు చేయవలెను.

    6. ఒకడు యాపస్తంభమునకు అనువగు వృక్షమును నరుకును. ఒకడు యూపమును మోయును. ఒకడు అశ్వమును కట్టుటకు కర్ర మంటపము సిద్ధము చేయును. ఒకడు అశ్వమును వండుటకు పాకపాత్రలను సేకరించును. వారందరికి మావంటి సత్సంకల్పము కలుగవలెను.

    7. మా కోరికలు ఫలించవలెను. అందము, బలిష్ఠము, విశిష్టము అయిన అశ్వము దేవతల ఇష్టపూర్తి కొఱకు రావలెను. దేవతలకు బలము కలిగించుటకు అశ్వమును మేము కట్టి వేతుము. దానిని చూచి మేధావులగు ఋత్విక్కులు ఆనందించవలెను.

    8. ఒక త్రాటితో గుఱ్ఱపు మెడను కట్టుదురు. ఒక త్రాటితో దానికాళ్లు కట్టుదురు. మరొకదానితో దానితలను కట్టుదురు. అశ్వము నోటిలో గడ్డి పెట్టుదురు. అవి అన్నియు దేవతలకు చేరవలెను.

    9. గుఱ్ఱపు మాంసము మీద ఈగలు వాలును. కోయునపుడు కత్తికి అంటుకొనును. కోయువారి చేతులకు గోళ్లకు అంటుకొనును. అవి అన్నియు దేవతలకు చెందవలెను.

    10. ఉదరమునందలి అజీర్ణ వస్తువు బయటికి వచ్చును. అపక్వ మాంసము మలినమును దూరము చేయవలెను. శుద్ధము పవిత్రము అయిన మాంసమును దేవతలకొఱకు పాకము చేయవలెను.

    11. అశ్వమును అగ్నిలో పచనము చేయునపుడు వచ్చు రసపదార్థము, శూలమునకు అంటిన మాంస భాగమున నేలమీద పడనీయరాదు. గడ్డిలో కలువనీయరాదు. దేవతలు ఉవ్విళ్ళూరుచున్నారు. వారికి సంపూర్ణ హవిస్సు అందవలెను.

    12. గుఱ్ఱపు మాంసము వండునపుడు చుట్టు నిలిచి చూచువారు ఉందురు. వంటకపు వాసన చూచి దేవతలకు అర్పించుమనువారు ఉందురు. మాంస భిక్షకొఱకు మూగిన వారుందురు. వారందరు మావలెనే సత్సంకల్పము కలిగి ఉండవలెను.

    13. మాంసపు వంటలను కలుపుటకు తెడ్డువాడుదురు. రసమును ఉంచుటకు ఆకులు వాడుదురు. వేడి నిలుపుటకు ఆచ్చాదనలు వాడుదురు. అవయవములను ఛేదించుటకు ఛురికను వాడుదురు. అవి అన్నియు అశ్వమాంసమును వ్యక్తపరచును.

    14. అశ్వము నిలిచిన స్థలము, అశ్వము కూర్చున్నస్థలము, అది పడుకున్న స్థలము, దానిని కట్టిన స్థలము, అది త్రాగిన నీరు, తిన్న గడ్డి అన్నియు దేవతలకు చేరవలెను.

    15. అగ్ని, ధూమగంధము అశ్వములతో శబ్దము చేయించరాదు. అగ్ని సంయోగమున సుగంధమయమయి పచనము చేయు భాండము కదలకుండవలెను. అశ్వమాంసము యజ్ఞము, హవనము కొఱకు తేబడినది. అది దేవతలకు సమర్పితము. వషట్కారయుతము. అట్టి అశ్వమును దేవతలు పరిగ్రహించవలెను.

    16. అశ్వమును వస్త్రమున కప్పుదురు. దానికి బంగారు అలంకారము చేతురు. దాని తల, కాళ్లు కట్టివేయుదురు. అవి అన్నియు దేవతలకు ప్రియమయినవి. ఋత్విజులు వాటిని అన్నింటిని దేవతలకు సమర్పింతురు.

    17. అశ్వమును బంధించినప్పటి నాసాధ్వని వ్యధ, కమ్చీతో కొట్టినప్పటి వ్యధ, గిట్టలరాపిడి వ్యధ, స్రుక్కు ద్వారా హవ్యమువలె మంత్రయుక్తముగా ఆహుతులు అర్పించుచున్నాను.

    18. అశ్వము దేవతల బంధువు. దాని రొమ్మునకు ముప్పది నాలుగు వంకల ఎముకలు ఉన్నవి. వాటిని కోయుటకు ఖడ్గమును ఉపయోగింతురు. అశ్వఛేదకులారా ! అశ్వపు అవయములు విచ్చిన్నము కాకుండకోయుడు. చూచుచు శబ్దము చేయుచు ఒక్కొక్క భాగమును విడదీయుడు.

    19. అశ్వమును అంతము చేయునది తేజోపుంజమయిన కాలమే అగును. కాలము దివారాత్రి రూపమయినది. అశ్వపు అవయవములను కోసి, పిండములు చేసి, అగ్నికి సమర్పించుకొనుచున్నాను.

    20. అశ్వమా ! నీవు దేవతలను చేరుదువు. అప్పుడు ప్రియమయిన నీదేహమునకు బాధ కలుగరాదు. కత్తులు నీ దేహమున ఎక్కువగా గాయములు చేయరాదు. మాంసమును అభిలషించువారు, అనభిజ్ఞులు అయిన ఛేదకులు నీ విభిన్న అంగములను వదిలి దేహమును బాధించరాదు.

    21. అశ్వమా ! నీవు మరణించవు. నిన్ను లోకము హింసించదు. నీవు ఉత్తమ మార్గమున దేవతలను చేరుచున్నావు. ఇంద్రుని హరి, నాగము అను రెండు అశ్వములు, మరుత్తుల పృషతనామక వాహనములు నీరథమునకు పూన్చబడును. అశ్వినుల రాసభస్థానమున నీరథమున వేగవంతమగు అశ్వము పూన్చబడును.

    22. అశ్వమా ! గోవులు, అశ్వములు, లోక రక్షకము అగు సంపద ప్రసాదించుము. మాకు పుత్రులను అనుగ్రహింపుము. తేజస్వియగు అశ్వమా ! మమ్ము పాపములనుండి కాపాడుము. హవిర్భూతమగు అశ్వమా ! మాకు దేహబలము ప్రసాదించుము.

                                      నూట ఆరువది మూడవ సూక్తము
                         ఋషి - దీర్ఘతముడు, దేవత - అశ్వము, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వమా ! నీ జన్మము మహత్తు కలది. నిన్ను సర్వులు స్తుతింతురు. యజమాని అనుగ్రహము కొఱకు మహారావము చేతువు. నీకు డేగవంటి రెక్కలు ఉన్నవి. లేడివంటి పాదములు ఉన్నవి.

    2. యముడు లేక అగ్ని అశ్వమును ఇచ్చినాడు. త్రిత లేక వాయువు అశ్వమును రథమునకు పూన్చినాడు. ఆ రథమును తొలుత ఇంద్రుడు అధిరోహించినాడు. గంధర్వులు, సోములు దానికళ్లెములు పట్టినారు. వసువులు సూర్యుని నుండి అశ్వమును కల్పించినారు.

    3. అశ్వమా ! నీవే యముడవు. నీవే ఆదిత్యుడవు. గోపనీయ వ్రతధారి త్రితవును నీవే. ద్యులోకమున నీకు మూడు బంధన స్థానములు ఉన్నవని పురోహితులు చెప్పుదురు.

    4. అశ్వమా ! ద్యులోకమున నీకు మూడు బంధనములు ఉన్నవి. అవి 1. వసుగణములు 2. సూర్యుడు 3. ద్యుస్థానము. నీకు భూలోకమున మూడు బంధములు ఉన్నవి. అవి 1. అన్నము 2. బీజము 3. భూస్థానము. నీకు అంతరిక్షమున మూడు బంధనములు ఉన్నవి అవి 1. మేఘము 2. విద్యుత్తు 3. గర్జన. నీవే వరుణుడవు. పూర్వపు ఋషులు నీ జన్మస్థానములను నిర్దేశించినారు. వాటిని మాకు తెలియపరచుము.

    5. అశ్వమా ! ఈ సమస్త స్థానములు నీ అంగ ప్రత్యంగములు అగుటను దర్శించినాము. నీవు యజ్ఞాంశమును ఆరగించునపుడు ఇక్కడ నీపద చిహ్నములు ఏర్పడును.

    6. అశ్వమా ! దూరతీరములనుండియే నా మనసుతో నీ రూపమును తెలుసుకున్నాను. నీవు నేలమీద, అంతరిక్షమున సూర్యునియందు సంచరించుటను నేను దర్శించినాను. నీ శీర్షము ధూళిరహిత, సుఖకర మార్గమున శీఘ్రముగా పయనించుచు క్రమముగా పైకి లేచును.

    7. అశ్వమా ! నీ ఉత్కృష్టరూపము భూమి మీద నాలుగు చెరగులు ఆహారముకయి తిరుగుటను దర్శించినాను. మానవుడు భోగ పదార్థములతో నీముందుకు వచ్చును. అప్పుడు నీవు నేలమీది తృణమును భక్షింతువు.

    8. అశ్వమా ! నీ వెనుక అశ్వము సాగును. నీ వెనుక మనుష్యులు సాగుదురు. మహిళల సౌభాగ్యము నీ వెనుక సాగును. ఇతర అశ్వములు నీ వెంట సాగినవి. నీ స్నేహమును సంపాదించినవి. దేవతలు నీ వీరకృత్యములను ప్రశంసింతురు.

    9. అశ్వ శిరము బంగారపుది. పాదములు ఇనుపవి. వేగవంతములు .వేగమున ఇంద్రుడు అశ్వమునకు సాటికాడు. దేవతలు అశ్వహవ్యాభక్షణకు వత్తురు. ఇదిగో ఇంద్రుడు వచ్చి ఉన్నాడు.

    10. అశ్వము స్వర్గపథమున సాగునపుడు దాని పృష్ట భాగము విశిష్టము అగును. పిడికెడు నడుము, బలవంతులు అగు దేవతా అశ్వగణములు గుంపులు గుంపులుగా వరుసలుగా హంసలవలె సాగును.

    11. అశ్వమా ! నీ దేహము శీఘ్రగమనము కలది. నీ మనసు వాయువేగము కలది. నీ మెడ మీది జాలు విభిన్న భావనలతో అరణ్యమున వివిధ స్థానముల భ్రమించును.

    12. వేగవంతమగు అశ్వము, ఆసక్తి చిత్తమున దేవతలను ధ్యానించుచు వధస్థానమునకు చేరును. అశ్వమిత్రమైన మేకను తనముందు నడిపించును. స్తోత్ర పాఠకులు వెనుక సాగుదురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.