Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
5. విష్ణువు ద్యులోకమున ఆవిర్భవించినవాడు. ఫలదాతలలో శ్రేష్ఠుడు. యాగసహాయము కొఱకు యజమాని విష్ణువును స్తుతించుచున్నాడు. వరదుడు, ముల్లోకములను ఆక్రమించిన విష్ణువు విచ్చేసి యజమానిని ప్రీతుని చేయవలెను. యజ్ఞశేషము యజమానికి ఇవ్వవలెను.
(ప్రథమ మండలమున ఇరువది ఒకటవ అనువాకము సమాప్తము.)
ఇరువది రెండవ అనువాకము నూట ఏబది ఏడవ సూక్తము
ఋషి - దీర్ఘతముడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - జగతి.
1. భూమి మీద అగ్ని జ్వలించుచున్నది. సూర్యుడు ఉదయించుచున్నాడు. ఉష హర్షములు పంచుచు అవతరించుచున్నది. కావున అశ్వినులారా ! మీ రథమును నడిపించుడు. సవిత జగములను పనులకు నియమింపవలెను.
2. అశ్వినులారా ! మీ రథము వర్షము కలిగించునది. మీ రథమును నడుపుడు. మా మార్గములను నేతులతోను, తేనెలతోను నింపుడు. మా మానవులలో బ్రహ్మతేజస్సు ప్రకాశించవలెను. యుద్ధములందు శూరుల ధనము మాకు చెందవలెను.
3. అశ్వినుల రథము త్రిచక్రము. మధుమంతము. అశ్వవాహకము. స్తోతవ్యము. అది మూడు నొగలు, సర్వ సౌభాగ్యములు కలది. ఆ రథము మాకు అభిముఖముగా రావలెను. ద్విపాద, చతుష్పాద జంతువులకు సుఖము కలిగించవలెను.
4. అశ్వినులారా ! అన్నము తెండు. మధుర వాక్కుల పలుకరించుడు. ఆయువును పెంచుడు. పాపములను నశింపచేయుడు. శత్రువులను హతమార్చుడు. మాతో కలిసి ఉండుడు.
5. అశ్వినులారా ! మీ వలననే గోవులు గర్భములు దాల్చుచున్నవి. మీ వలననే సమస్త భువనములు గర్భములు దాల్చుచున్నవి. వర్షకర్తలారా ! మీరే అగ్నిని, జలములను, వృక్ష సంతతిని కలిగించుచున్నాడు.
(వర్షము వలన అన్నము వలన రేతస్సు రేతస్సు వలన గర్భము అని అర్ధము.)
6. అశ్వినులారా ! మీరు ఔషధవంతులు. వైద్యులు. అశ్వవంతులు. ధనవంతులు. బలవంతులు. అందువలననే యజమాని మనస్పూర్తిగా మీకు హవిస్సులు అందించుచున్నాడు. అందుకొనుడు.
శ్రీ మదాంధ్ర ఋగ్వేద సంహిత రెండవ అష్టకము మొదటి మండలము నందలి రెండవ అధ్యాయము సమాప్తము.
ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి |
నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని సమేత స్థివాంసః ||
మూడవ అధ్యాయము నూట ఏబది ఎనిమిదవ సూక్తము
ఋషి - దీర్ఘతముడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అశ్వినులారా ! మీరు వర్షించువారు. నివాసము సమకూర్చువారు. దుఃఖములను దూరము చేయువారు. పూజింప తగినవారు. ఇష్టప్రదాతలు. దీర్ఘతముడు మిమ్ము ధనము ప్రసాదించమని ప్రార్థించుచున్నాడు. అతనికి మంచి రక్షణలు, వరములు ప్రసాదించుడు.
2. అశ్వినులారా ! మీరు నివాసములను ఇచ్చువారు. వేదికయందలి హవిస్సు రూపమయిన అన్నమును గ్రహించి బుద్ధిని ధరించినారు. కోరికలు తీర్చు మనసు గలవారయి సంచరించుచున్నారు. మీకు తగిన హవిస్సులు ఇవగలవాడెవ్వడు? మీరు మాకు శరీరధారకమగు పాడి పశువులను ప్రసాదించుడు.
3. అశ్వినులారా ! సముద్ర మధ్యమున మునిగిన తౌగ్ర్యుని కొఱకు మీరు రథము అధిరోహించినారు. అతనిని దరికి చేర్చినారు. కావున వేగవంతములయిన అశ్వములతో యుద్ధమున గెల్చిన శూరులవంటి మమ్ము రక్షింపుమని ప్రార్థించుచున్నాము.
4. అశ్వినులారా ! ఉచథపుత్రుడగు దీర్ఘతముడు మిమ్ము మనసార స్తుతించుచున్నాడు. మాటి మాటికి మారుచు, మార్చుచున్న రాత్రింబవళ్ళు నా ఆయువును హరించకుండవలెను. నేను తాళ్లతో కట్టబడి భూమిమీద దొర్లుచున్నాను. నన్ను రక్షింపుడు.
5. తల్లులవలె జగమును పోషించు నదులు నన్ను, దీర్ఘతముని మునగకుండ కాపాడవలెను. నా దాసులు నన్ను బంధించి బోరగిల పడవేసినారు. నా శిరస్సునకు త్రైతుడను దాసుడు గంట్లు పెట్టినాడు. రొమ్మునకు, భుజములకు గూడ గాయములు చేసినాడు.
6. మమతా పుత్రుడగు దీర్ఘతముడు పదియుగముల వరకు సుఖముగా జీవించినాడు. అనంతరము వృద్ధుడు అయినాడు. బ్రహ్మసముడు అయినాడు. దేవత్వము పొందినాడు.
ఆలోచనామృతము
1. ఇప్పటికి తల్లిపేరు చెప్పుకున్న తొలి ఋషి దీర్ఘతముడు మాత్రమే.
2. దీర్ఘతముడు అనగా చాలకాలము చీకటిలో ఉన్నవాడు అని అర్థము.
3. 52వ సూక్తమున దీర్ఘతముని వృత్తాంతము చెప్పినాము. పుత్రులు కట్టెలుకట్టి దీర్ఘతముని నదిలో పడవేసినారు. ఆ దీర్ఘతముడు ఇతడు ఒక్కరో కారో తెలియదు. కాని పడిన బాధ ఒక్కతీరుగా ఉన్నది. అక్కడ పుత్రులు, ఇక్కడ దాసులు. అక్కడ నదిలో పడవేసినారు, ఇక్కడ నేల మీద బాధించినారు.
4. దాసులు రెండు విధములవారు. ఒకరు గర్భదాసులు. వారి తలిదండ్రులు దాసులు అయినందున వారు గర్భమునందే దాసులు అగుదురు. రెండవ వారు క్రయ విక్రయాదుల వలన బానిసలు అయినవారు.
గర్భదాసులకు విముక్తిలేదు.
5. దీర్ఘతముని బాధించినవారు గర్భదాసులు. ఇది బానిసలు తిరుగుబాటు వంటిది.
తిరుగుబాటు అనాదిగా ఉన్నది !
నూట ఏబది తొమ్మిదవ సూక్తము
ఋషి - దీర్ఘతముడు, దేవత - ద్యావాపృథ్వులు, ఛందస్సు - జగతి.
1. ద్యావాపృథ్వులు యజ్ఞవర్ధకములు, విశాలములు. యజ్ఞములందు మమ్ము స్పందింపచేయునవి. యజమాని వారిని స్తుతించుచున్నాడు. సేవించుచున్నాడు. ద్యావాపృథ్వులు సత్యబుద్ధిచే యజమాని కోర్కెలు తీర్చవలెను.
2. ద్యులోకము ద్రోహము ఎరుగని తండ్రి. అతనిని స్వశక్తితో మనసా ఆహ్వానించుచున్నాము. ప్రార్ధించుచున్నాము. తలిదండ్రులయిన ద్వావాపృథ్వులు మాకు సామర్ధ్యమును, రక్షణలను, అమృతత్వమును ప్రసాదించవలెను.
3. ద్యావాపృథ్వులారా ! ప్రజలు మీకు బిడ్డలు. వారు కర్మవంతులు. జ్ఞానవంతులు. తలిదండ్రులు అయిన మిమ్ము అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నారు. మీ సంతానము అగు స్థావర జంగమాత్మకమగు సమస్తసృష్టిని రక్షింపుడు. సత్యస్థానమును ప్రసాదించుడు.
4. ద్యావాపృథ్వులు అక్కచెల్లెండ్లు. ఒకే జన్మస్థానము కలవారు. ఒకరిని ఒకరు విడువని వారు. వారిని సత్కర్మ కిరణములు పరివేష్టించి ఉన్నవి. సముద్రమునందును స్వప్రకాశ కిరణములు ఆవరించి ఉన్నవి.
5. యజమానులమగు మేము సవితృని అనుజ్ఞ చొప్పున శ్రేష్ఠమగు ధనమును ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. మీ జీవనమునకుగాను యోగ్యములు అయిన వందలకొలది గోవులను ప్రసాదించవలసినదని అర్థించుచున్నాము.
నూట ఆరువదియవ సూక్తము
ఋషి - దీర్ఘతముడు, దేవత - ద్యావాపృథ్వులు, ఛందస్సు - జగతి.
1. సూర్యుడు శుభంకరుడు. జల ప్రదాత. పోషకుడు.లోకములను సుఖింపచేయువాడు. పండితుడు. ఉదకధారి. అతడు సుజన్మములు, వ్యాపారదక్షులు, స్వప్రకాశులు అయిన ద్యావాపృథ్వులను సర్వదా గమనించుచున్నాడు.
2. తండ్రియగు ద్యులోకము వర్షాదిరూపములచే సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. ద్వావాపృథ్వులు తలిదండ్రులు. వారు విశాలురు. ఘనులు. ఒకరితో ఒకరు కలియనివారు. వేరు వేరుగా ఉండువారు. వారు లోకములు అన్నింటిని రక్షించుచున్నారు. సర్వప్రాణులను తలిదండ్రులవలె రక్షించుచున్నారు.
3. ద్యావాపృథ్వులకు పుత్రుడు సూర్యుడు. సూర్యుడు బుద్ధిమంతుడు. ఫలములను ధరించినవాడు. అతడు తన ప్రజ్ఞచే సమస్త లోకములను పవిత్రము చేయుచున్నాడు. అతడే ఆవువంటి భూమిని, రేతస్సువంటి ఆబోతును, వర్షమును కలిగించుచున్నాడు. ద్యులోకమునుండి నీటిని పితుకుచున్నాడు.
(భూమి గోవు. వాన ఆబోతు. సృష్టి సాంతము సంతానము. నీటిని పితికి వర్షము కలిగించుట అందమయిన ప్రయోగము)
4. సకల భూతములకు సుఖములు కలిగించు ద్వావా పృథ్వులను సృష్టించినాడు. ఆ రెంటిని కదలకుండ మేకులతో బిగించిన భగవానుడు సర్వదేవతలందు శ్రేష్ఠుడు. అతడు మహా కళాకారుడు.
5. ద్వావాపృథ్వులు సమృద్ధములు అయిన అన్నములను ధరించి ఉన్నవి. వారి పౌరుష బలముననే మేముఎల్లకాలము పుత్ర పౌత్రులు కలవారము అగుచున్నాము. వారి వలననే మా దేహబలము వృద్ధి అగుచున్నది. అట్టి ద్యావాపృథ్వులను స్తుతించుచున్నాము.
నూట ఆరువది ఒకటవ సూక్తము
ఋషి - దీర్ఘతముడు, దేవత - ఋభువు, ఛందస్సు - జగతి.
1. అగ్ని మనకన్న ఘనుడు అగునా? మనకన్న పిన్నవాడు అగునా? ఇతడు మనవద్దకు వచ్చినాడా? ఇతడు దేవతయగు అగ్నియా? ఈ సందేహము తీరుట ఎట్లు? అన్నయ్యా ! అగ్నీ ! చమస పాత్ర, పానపాత్రను ఎంగిలిచేయకుము. అది గొప్పవంశమున పుట్టినది. కర్రతో చేసిన చమసము ఎట్లు వచ్చెనో చెప్పెదము.
(ఋభువులు సుధన్వుని ముగ్గురు పుత్రులు. తమ ప్రజ్ఞాపాటవములతో దేవతలు అయినారు. వారు సోమపానమునకుగాను యజ్ఞమునకు వచ్చినారు. వారికి నాలుగవవాడు అగ్ని వచ్చినాడు. ఇవి అప్పటి ఋభువులు అన్నమాటలు)
2. ఋభువులారా ! దేవతలు ఆజ్ఞాపించినారు. ఒక్క చమసమును నాలుగు చమసములుగా చేయుడు. అది చెప్పుటకే నేను వచ్చినాను. మీరు ఆవిధముగా చేసిన దేవతలతో సమానముగా యజ్ఞార్హులు అగుదురు.
(ఇవి అగ్ని అన్నమాటలు)
3. అన్నా ! అగ్నీ ! నీవు దేవతల దూతవు. నీవు చెప్పినట్లు గుఱ్ఱమునుండి మరొక గుఱ్ఱమును, రథము నుండి మరొక రథమును చర్మనిర్మితముకాని ఆవును నిర్మించి తెత్తుము.
(ఇవి ఋభువులు అన్నమాటలు)
4. ఋభువులు దేవతలు చెప్పిన పనులు చేసి తెచ్చినారు. "మావద్దకు వచ్చిన ఆ దూత ఏడి?" అని అడిగినారు. ఋభువులు చేసి తెచ్చిన నాలుగు చమసములను త్వష్ట చూచినాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు.
5. దేవతల సోమపానమునకు తాను చేసిన చమసమును చెరిపిన వారిని చంపుదును అన్నాడు త్వష్ట. ఆనాటి నుంచి సోమపానము చేయవలసి వచ్చినపుడు మానవులు మారుపేర్లు పెట్టుకున్నారు. తల్లికూడ పిల్లలను మారుపేరునే పిలిచినవి.
(నాటినుంచి అధ్వర్య-హోత-ఉద్గాత పేర్లు వచ్చినవి)
6. ఋభువులు నిర్మించిన 'హరి' అను రెండు అశ్వములను ఇంద్రుడు తీసికొన్నాడు. అశ్వినులు రథమును తీసికొన్నారు. బృహస్పతి నానావర్ణములు గల గోవులను తీసికొన్నాడు. ఋభువు, విభ్వ వాజ అణు సుధన్వపుత్రులు దేవతలను సోమభాగము తమకు ఇమ్మని కోరినారు.
7. ఋభువులారా ! చర్మ నిర్మితముకాని ఆవునుండి మరొక ఆవును కలిగించినారు. మీ వృద్ధమాతా పితరులను వయసు వారిని చేసినారు. అశ్వమునుండి అశ్వమును నిర్మించినారు. కావున మీ రథముల మీద దేవతల వద్దకు రండు.
8. సుధన్వ పుత్రులారా ! సోమమును సేవింపుడు. అది రుచించకున్న ముంజుగడ్డితో చేసిన సోమము సేవించుడు. అది ఇష్టము కాకున్న మూడవ సవనమునందు తృప్తిగా సోమపానము చేయుడు.
(ఇవి దేవతలు అన్న మాటలు)
9. ఋభువులు ముగ్గురిలో ఒకడు బలము శ్రేష్ఠము అన్నాడు. ఒకడు అగ్ని శ్రేష్ఠుడు అన్నాడు. మరొకడు భూమి శ్రేష్ఠము అన్నాడు. ముగ్గురును సత్యవాక్కులతో చమసపాత్రలను చేసినారు.
10. ఋభువులలో ఒకడు గోవు రక్తమును చేసినాడు. మరొకడు కత్తితో నరికి మాంసము చేసినాడు. మూడవవాడు మల మూత్రములను కల్పించినాడు. ఆవిధముగా ఒక ఆవును నాలుగు ఆవులను చేసినారు. ఇక తలిదండ్రులు చేయవలసినది ఏమున్నది?





