Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



    దీపిక:

    ఒకసారి రామాయణానికి పయనిద్దాం. అది సుందరకాండ శింశుపావృక్షము, దానికింద సీతమ్మ దుఃఖభరితముగా యున్నది.
    రావణుడు కామాంధుడై ప్రవేశిస్తాడు. సీతను అనేక మాటలు అంటాడు బెదిరిస్తాడు. అదిరిస్తాడు. తాను సార్వభౌముడనంటాడు. రాముడు అడవి మనిషి అంటాడు.
    తుదకు సీతను తనతో రమించమని కోరతాడు.
    444అప్పుడు సీతమ్మతల్లి ఒక గడ్డిపరకను వారిద్దరి మధ్యను వేస్తుంది.
    ఈ గడ్డిపరక వేయుటకు రెండు అర్థాలు. పెండ్లి అయిన స్త్రీ మరొక పురుషుడితో మాట్లాడరాదు. కాబట్టి మధ్యన గడ్డిపరక వేసింది.
    మరొక అర్థము: రావణునితో 'నీవు గడ్డిపరకవు' అని చెప్పడము.
    అప్పుడు సీతమ్మతల్లి రావణునితో యిట్లన్నది: "ఆత్మాన ముపమాంకృత్వాశ్వేషుద్దారేషు రమ్యతాం"
    నిన్ను నీవే ఉపమానముగా తీసుకొనుము. నీ భార్యలతో రమించుము.
    "ఆత్మానముపమాంకృత్వా" దీనికి అనంతములైన అర్థములు వున్నవి. ఒక దానిని పరిశీలింతము. రావణుని తనను ఉపమానముగా తీసుకొనమని చెప్పుచున్నది. అట్లయిన నీ భార్యను మరొకడు అపహరించినాడు అనుకొనుము. పరిస్థితి గ్రహించుము. నీ వినాశమును కొనుక్కొనకుము.
    నీ భార్యలు వున్నారు గదా! వారికి అన్యాయము చేసి నావెంట ఏల పడుదువు? ఇది అంతయు 32వ శ్లోకములోని మొదటి పదము "ఆత్మా సమ్మేనసర్వత్వ' అను పదాని చూచినపుడు దర్శించిన దృశ్యము.
    ఈ రెండింటి అర్థము ఒకటే!

    అర్జున ఉవాచః

        యో - యం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన!
        ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితింస్థిరామ్ 33

    మధుసూదన! సమభావమును గురించి నీవు చెప్పినావు. ఈ యోగము స్థిరమైన స్థితిని ఉపదేశించినావు. నాది మనశ్చాంచల్యము. తెలిసికొన లేకున్నాను.
        చంచలం హి మనః కృష్ణ! ప్రమాథి బలవద్దృఢమ్!
        తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ 34

    కృష్ణా! మనస్సు చంచలము చపలము. బలీయము. దృఢము. కావున దానిని నిగ్రహించుట, గాలిని పేనుట వలె దుష్కరమని భావించుచున్నాను.

    దీపిక:

    స్వామి జ్ఞానశిఖరము. అర్జునుడు, మనము తృణప్రాయులము. అర్జునుడు అడిగిన ప్రశ్నయే అందరి మనస్సులనున్నది. సామ్యయోగము సమానత సమము ఉపదేశించినాడు. పదములు సులభముగా తేలికగా నున్నవి.
    విద్యావినయసంపన్నే బ్రాహ్మణేగని హస్తిని
    శునిచైవశ్వపాకే పండితా సమదర్శినః
    విద్యావంతుడు, వినయ సంపన్నుడు, బ్రాహ్మణుడు, గోవు, గజము, కుక్క, కుక్క మాంసము తినువాడు. వీరందరి విషయములో పండితులు సమదర్శినులు.
    భార్యను, పుత్రుని తనతో సమముగా భావించని మానవుడు అతి నీచునితో సమానముగా భావించుట కేవలము ఆదర్శము. ఆచరణ యోగ్యమగునా!
    మనస్సు చంచలమైనది, చపలమైనది, నరుని మీద పెత్తనము చలాయించునది. దానిని నిగ్రహించుట గాలిని పేనుటయే. అర్జునుడు శిష్యుడు - స్వామి ఆచార్యుడు.
    స్వామీ! మేమంతా అజ్ఞానులమే, శిష్యులమే, పుత్రులమే. మాకును అర్థము కాకున్నది.
    స్వామీ నీ స్థాయిలో నీవు చెప్పుచూ పోతూ యున్నావు. మాకు అంతగా అర్థము కావడము లేదు. ఆచరణ అలవికాకుండా యున్నది.
    ఇది మేము చేయు విన్నపము.    

    శ్రీ భగవానువాచః

        అసంశయం మహాబాహో! మనోదుర్నిగ్రహంచలమ్
        అభ్యాసేన తు కౌంతేయ! వైరాగ్యేణ చ గృహ్యతే 35

    అర్జునా! మనస్సు చంచలము. దానిని నిగ్రహించుట సులభము గాదు. ఇందులో ఎట్టి సంశయము లేదు. అయినా అభ్యాసము వలనను, వైరాగ్యము వలనను దీనిని నిగ్రహించవచ్చును.    
        అసంశయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః
        వశ్యాత్మనా తు యతతా శక్యో -వాప్తుముపాయతః 36

    మనసును కట్టనివానికి యోగము కష్టము. ప్రయత్నించి మనస్సును కట్టిన వానికి యోగము సాధ్యమని నా అభిప్రాయము.

    అర్జున ఉవాచః

        అయతిః శ్రద్ధయోపేతః యోగాచ్చలిత మానసః
        అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ! గచ్ఛతి 37

    ప్రయత్నము వలనను, శ్రద్ధ వలనను, మనస్సు చలిస్తుంది. యోగము ఫలించదు. అట్టివానికి కృష్ణా! ఏ గతి కలుగుచున్నది?
        కచ్చిన్నో భయవిభ్రష్టః ఛిన్నా భ్రమిన నశ్యతి!
        అప్రతిష్ఠో మహాబాహో! విమూఢో బ్రహ్మణః పథి 38

    కృష్ణా రెంటికి చెడ్డవాడై భగవానుని చేరుమార్గము నుండి జారినవాడై, ఆశ్రయ రహితుడై చెదరిన మబ్బువలె, అధోగతిపాలు కాడు గదా!
        ఏతన్మే సంశయం కృష్ణ! ఛేత్తు మర్హస్యశేషతః
        త్వదన్య స్సంశయస్యాస్య ఛేత్తా నహ్యు పద్యతే 39

    కృష్ణా! ఇది నా సంశయము. దీనిని నీవు మాత్రమే తీర్చగలవు. ఈ సంశయమును తీర్చుట నీకు తప్ప యితరులెవ్వరికిని సాధ్యము కాదు.

    శ్రీ భగవానువాచః

        పార్థ! నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే!
        న హి కళ్యాణ కృతశ్చిత్ దుర్గతిం తాత! గచ్ఛతి 40

    అర్జునా! అతడు యోగభ్రష్ఠుడు. అతనికి ఇహపరములందు అధోగతి కలుగదు. భగవత్ప్రాప్తికై ప్రయత్నించువానికి అధోగతి ఎట్లు కలుగును?    
        ప్రాప్యపుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీస్సమాః
        శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ణో - భిజాయతే 41

    యోగభ్రష్ఠుడు పుణ్యలోకములకు చేరును. అచ్చట శాశ్వతమునకు సమమైన సుఖములను అనుభవించును. తదుపరి శుచివంతుడు శ్రీమంతులైన గృహమున అభిజాయతే చక్కగా జన్మించును.
        అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్
        ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ 42
    
    అట్లు కాకున్న ధీమంతులైన యోగుల కులమున జన్మించును. ఇటువంటి జన్మ లోకమున దుర్లభతరముగదా!    

    దీపిక:
    
    యోగభ్రష్ఠుడు, పుణ్యలోకాలకు చేరుతాడు. చాలాకాలము అక్కడ సుఖాలు అనుభవిస్తాడు అన్నాడు 41 శ్లోకములో 42వ శ్లోకములో ఏమనుచున్నాడంటే పుణ్యలోకము కలుగదు అనుకొందాం. అంటే పుణ్యలోకము కలుగుట తప్పనిసరి కాదు అని అర్థము.    
    ఎంతటి యోగుల యింటిలో పుట్టినా, పుణ్య అనుభవము కాదుగదా!
    యోగము చేయుట పుణ్యలోకము చేరుటకే గదా!
        తత్ర తం బుద్ది సంయోగం లభతే పౌర్వదేహికమ్
        యతతే చ తతో భూయః సంసిద్దౌ కురునందన! 43

    అచట అతనికి పూర్వజన్మలో లభించిన యోగము అక్కరకు వచ్చును. అట్టి అనుభవముతో మదినిశ్చయముగా సిద్ధికోసము ప్రయత్నించుము.
        పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో పి -సః
        జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే 44

    అచట అతనికి పూర్వాభ్యాస అవకాశము లభించదు. ఐనను యోగము యొక్క జిజ్ఞాసువునకు శబ్దబ్రహ్మము లభించును.
        ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః
        అనేకజన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ 45

    అతడు ప్రయత్నిస్తాడు. మనసు పండుతుంది. యోగి అవుతాడు. పాపరహితుడు అవుతాడు. అతనికి అనేక జన్మల సిద్ధి కలుగుతుంది. అతడు ఉత్తమ గతికి చేరుకుంటాడు.
        తపస్విభ్యో -ధికో యోగీ జ్ఞానిభ్యో -పి మతో -ధికః
        కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున! 46

    తపస్యులకంటే యోగి గొప్పవాడు. జ్ఞానులకంటే యోగి అధికుడు. కావున కర్మములకంటే యోగము గొప్పది. కాబట్టి అర్జునా! నీవు యోగివి అగుము.
        యోగినామపి సర్వేషాం మద్గతేనాంత రాత్మనా
        శ్రద్దావాన్ భజతే యో మాం స మే యుక్తతమోమతః 47

    రుద్రాదిత్యాది దేవతలను ధ్యానించే యోగులకంటే నన్ను తలచి శ్రద్ధావంతుడై భజించువాడు పరమశ్రేష్ఠుడు అగుచున్నాడు.
    ఆత్మసంయమ యోగము అను ఆరవ అధ్యాయము ముగిసినది.

                                 ఓం శాంతిః శాంతిః శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.