Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
నాత్యశ్నతస్తు యోగో -స్తి న చైకాంత మనశ్నతః
న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున! 16
ఒకడు ఏమీ భుజించడు. మరొకడు అతిగా భుజించును. ఒకడు అతిగా నిద్రించును మరొకడు నిద్రించకనే వుండును. అటువంటి వారికి యీ యోగసిద్ధి కలుగదు.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా 17
ఒకడు మితాహారి. మితవిహారి కర్మములందు యుక్త చేష్టుడు. మిత నిద్ర, మిత జాగ్రత్త కలవాడు. అతనికి యీ యోగము దుఃఖహారి కాగలదు.
యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావ తిష్ఠతే
నిఃస్పృహ స్సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా 18
ఒకడు నియతుడు. చిత్తమును ఆత్మయందే నిలుపువాడు. సర్వకామములందు దృష్టి లేనివాడు. అట్టివాడు యోగ యుక్తుడు అగును.
యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా
యోగినో యతచిత్తస్య యుంజతో యోగ మాత్మనః 19
గాలి లేని చోటు. అచ్చట దీపము నిశ్చలముగా వెలుగును. అట్లే చిత్తము నిశ్చలము కావలెను. ఇట్టివాడు నిర్వికారముగా వుండును. నిశ్చలముగా ఉండును.
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా
యత్రచైవాత్మ నాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి 20
యోగసేవయందు చిత్తము ఉపరమించును. ఆత్మ యందు ఆత్మను దర్శించువాడు తృప్తుడు అగుచున్నాడు.
సుక మాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్
వేత్తియత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః 21
బ్రహ్మానందము ఇంద్రియాతీతము. దానిని పవిత్రతయే దర్శించును. అటువంటి ఆనందములో వున్న యోగి, పరమాత్మ స్వరూపము నుండి విచలితుడు కాడు.
యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః
యస్మిన్ స్థితో న దుఃఖేన గురణాపి విచాల్యతే 22
ఒకనికి స్వామి దర్శనమగును. అతడు మరొక దానిని మించినదిగా తలచడు. ఆ స్థితియందున్న వాడు ఎంతటి దుఃఖములోను చలించడు.
తం విద్యాద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితమ్ త
స నిశ్చయేన యోక్తవ్యః యోగో -నిర్వణ్ణ చేతసా 23
సంసారము దుఃఖ రూపము. దానినుండి విముక్తి కలిగించునది యోగము. అట్టి యోగమును నిర్మల మనస్సుతో యజించవలెను.
సంకల్ప ప్రభవాన్కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః
మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః 24
సంకల్పములు కోరికలు కలిగించును. వానిని నిశ్శేషముగా వదలవలెను. మనసునే ఇంద్రియ గ్రామముగా భావించవలెను. దానిని పూర్తిగా నిగ్రహించవలెను.
శనైశ్శనై రుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా
ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్ 25
మెల్లమెల్లగా సాధన చేయవలయును. అందు ఆనందము పొందవలయును. మనసును ఆత్మయందే నిలుపవలెను. దేనిని గురించి ఆలోచించరాదు.
యతోయతో నిశ్చరతి మనశ్చంచల సుస్థిరమ్
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ 26
మనస్సు చంచలము. అస్థిరము. అది ఎటునెటో చరించును. అటనట దానిని నియమించవలెను. దానిని వశము చేసుకొనవలెను.
ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్
ఉపైతి శాంతరజసం బ్రహ్మ భూత మకల్మషమ్ 27
ప్రశాంత మానసుడగు యోగి, ఉత్తమ సుఖమును పొందుచున్నాడు. అతడు శాంతిని పొందుచున్నాడు. నిష్కల్మష బ్రహ్మను చేరుచున్నాడు.
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః
సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యంతం సుఖ మశ్నుతే 28
యోగి కల్మషము లేనివాడు అగును. అతడు సదాత్ముడు, ఏకాగ్రచిత్తుడు. అతనికి అత్యంత బ్రహ్మసంస్పర్శ కలుగును. అతడు సుఖీభూతుడగుచున్నాడు.
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః 29
యోగియైనవాడు సర్వభూతములందు తనను చూచుకొనును. తాను సర్వభూతము లందుండును అట్టి యోగయుక్త ఆత్మ సమదర్శనుడు అగుచున్నాడు.
యొ మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి 30
ఒకడు సర్వత్రా నన్నే దర్శించును. సర్వములందు నన్నే దర్శించును. అట్టివానికి నేను అదృశ్యుడను కాను. నాకు అతడు అదృశ్యుడు కాడు.
సర్వభూతస్థితం యొ మాం భజత్యేకత్వ మాస్థితః
సర్వథా వర్తమానో -పి స యోగీ మయి వర్తతే 31
.jpg)
సర్వభూతములను తానుగానే భావించువాడు ఏకమాతృడైన స్వామిని భజిస్తాడు. అతడు యోగి. సర్వా స్థలయందును నాయందే ప్రవర్తిల్లుచుండును.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో -ర్జున!
సుఖం వా యది వా దుఃఖంస యోగీ పరమోమతః 32
అర్జునా! తనవలెనే సమస్తమును చూచును.
సుఖదుఃఖములను సమముగా చూచును. అటువంటి యోగి పరమశ్రేష్ఠుడు.





