Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    2. అగ్నీ ! నిన్ను అర్చించనివానికి, ధనముండి హోమమునకు ఉపయోగించనివానికి, దేవతలను అర్చించని వానికి, స్తుతించనివానికి సంపదలు మున్నగునవి ఇవ్వకుము.

    3. అగ్నీ ! నీవు మేదావివి. గొప్ప దేవతలలో గొప్పవాడవు. నిన్ను యజించువాడు ద్యులోకమున చంద్రుడై వెలుగును. మేము నీకు భక్తులము. అందువలన ఘనులమై ఉన్నాము.

                                         నూట ఏబది ఒకటవ సూక్తము
          ఋషి - దీర్ఘతముడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - జగతి.

    1. యజమానులు గోవులను కోరుదురు. అర్చింతురు. వారు తమ సామర్థ్యమున సూర్యునివంటిది, సర్వప్రియమైనది, యాగార్హమైనదియగు వైద్యుతాగ్నిని కల్పించినారు. ఆ అగ్నియొక్క బలమునకు, ధ్వనికి ద్యావాపృథ్వులు గడగడలాడినవి.

    2. మిత్రావరుణులారా ! సోమయాజులకు మీరు మిత్రులు అగుచున్నారు. అతనికి వారములు ఇచ్చుచున్నారు. అతనిని పోషించుచున్నారు. మిమ్ము పూజించు వారిని సహితము అదేవిధముగా అనుగ్రహించుడు. మీరు యజమాని చేయు స్తోత్రములను ఆలకించుడు.

    3. మిత్రావరుణులారా ! మిమ్ము ద్యావాపృథ్వులు స్తుతించుచున్నవి. తమకు బలము ప్రసాదించవలసినదని యజమానులు మిమ్ము ప్రార్థించుచున్నారు. వారికి మీరు యజ్ఞ సామర్థ్యమును ఇష్ట ఫలములను ప్రసాదించుచున్నారు. వారు అందించు యజ్ఞములను, హవిస్సులను మీరు స్వీకరించుచున్నారు.

    4. మిత్రావరుణులారా ! మీరు బలవంతులు. ద్యులోకాగ్రమునందు ఉన్నవారు. సర్వత్ర నివసించువారు. తృప్తులను చేయువారు. గోవునువలె సోమ యాగమును సేవించువారు. మీరు విచ్చేయుడు. మీకు ప్రియమును విశాలమును అయిన ఆసనమున ఆసీనులుకండు. మా యజ్ఞమును పూర్తిచేయుడు.

    5. మిత్రావరుణులారా ! విశాలమగు ఈ భూమండలమున గోవులకు స్థలమును ఏర్పరచినారు. ఆ గోవులు పాడి గలిగించుచు మందలు మందలయినవి. ఆ గోవులు ఉదయాస్తమయముల అంతరిక్షమునందలి సూర్యునిచూచి దొంగను పట్టుకొనువాడు అరచినట్లు అరచుచు సుఖముగా సంచరించుచున్నవి.

    (ఉదయము మేతకుగాను అడవికి పోవునపుడు సాయంత్రము ఇంటికి తిరిగి వచ్చునపుడు గోవులు అంబారావములు చేయును. ఆ అరుపులు దొంగలను పట్టువాని అరుపులవలె ఉన్నవి అనుచున్నాడు.)

    6. మిత్రావరుణులారా ! యజమాని చేయు స్తోత్రములకు మీరే ప్రభువులు. మీరు యాగములకు విచ్చేసినపుడు అగ్ని కేశములవంటి జ్వాలలు మీకు హవిస్సులు అందించుచున్నవి. మీరు వర్షించుడు. మాకు అభ్యుదయము కలిగించుడు.

    7. మిత్రావరుణులారా ! మేధావి అగు యజమాని మిమ్ము యాగములందు స్తుతించుచున్నాడు. హవిస్సులు అర్పించుచున్నాడు. తగిన సాధనములతో యజ్ఞము చేయుచున్నాడు. అట్టి యజమానికొఱకు విచ్చేయుడు. అతని యజ్ఞము కోరుడు. అతని స్తుతులను గ్రహించుడు.

    8. మిత్రావరుణులారా ! మీరు వర్షమును ఇచ్చు తొలివారు. యజమానులు యాగములందు మీ యందు మనసుంచి, మంచి స్తుతులతో అర్చించుచున్నారు. మీ గుణములను, మనసా స్తుతులందు కూర్చుచున్నారు. మీరు మంచి మనసున వారిని అనుగ్రహించుడు. ధనములను ప్రసాదించుడు.

    9. మిత్రావరుణులారా ! మీరు అన్నవంతులు. ధనవంతులు. అందువలననే మమ్ము అనుగ్రహించినారు. మాకు అన్నమును, ధనమును ప్రసాదించినారు. దివారాత్రములకు మీ ప్రభావము లేదు. నదులకు లేదు. అసురులకులేదు. మీకు ఉన్న సంపద వారికి లేదు.

                                             నూట ఏబది రెండవ సూక్తము
            ఋషి-దీర్ఘతముడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్రావరుణులారా ! మీరు కాంతులనే వస్త్రముగా ధరించినారు. మీ సృష్టికార్యములు అవిచ్చిన్నములు. కీర్తనీయములు. మీరు సత్యస్వరూపులు మా పాపములను నశింపచేయుడు.

    2. ఇరువురిలో ఒకడు సత్కర్మలు ఆచరించువాడు. అతడు ఆలోచనగలవాడు. బుద్ధిమంతులు మెచ్చువాడు. శత్రువును హింసించువాడు. మూడు అంచుల ఆయుధముగల శత్రువును, నాలుగు అంచుల ఆయుధమున జయించువాడు. దేవ నిందకులు స్వయముగనే నశింతురు.

    (లోకమున సర్వకాలములందును మంచివారు చెడ్డవారు ఇద్దరే ఉన్నారు)

    3. మిత్రావరుణులారా ! పాదములు ఉన్న ప్రాణులకన్నముందే పాదములేని ఉషస్సు అవతరించినది. మీ ఉభయుల ప్రభావమును ఎరిగినవారులేరు. ఈ లోకమును మీ శిశువు అగు సూర్యుడు ధరించుచున్నాడు. అతడు సత్య ప్రకాశము కలిగించును. అసత్య అంధకారమును అంతమొందించును.

    4. ఉషస్సు కన్యకా, సూర్యుడు ప్రియుడు. సూర్యుడు నిరంతరము సంచరించుచున్నాడు. క్షణము నిలువడు. అతడు వేరువేరుగా ఉన్న వెలుగులను వ్యాపింప చేయుచున్నాడు. సూర్యుడు జగత్తునకు హితకరుడు. మిత్రునకు, వరుణునకు ప్రియమయిన స్థానమున నిలిచి ఉన్నాడు.

    5. సూర్యుడు గుఱ్ఱములు, కళ్లెములు లేని వేగవంతమగు రథమున వెలుగులు పరచుచు గగనమున విహరించుచున్నాడు. మనసును మించిన సూర్యుని వేగమునకు మిత్రావరుణులు కారకులు అయి ఉన్నారు. అందువలననే మానవులు మిత్రావరుణులను సేవించుచున్నారు.

    6. నేను మమతా పుత్రుడను. దీర్ఘతముడను. కర్మలయందు ఆసక్తి కలవాడను. గోవులు తమ పొదుగులందు వరుణరూపమున ఉన్న పాలతో నన్ను రక్షించవలెను. నాకు కర్మజ్ఞానము కలుగవలెను. నా నోటితో మిమ్ము హోమ శిష్టాన్నము అడుగవలెను. మీరు నా కర్మను పూర్తి చేయించవలెను. రక్షించవలెను.

    7. మిత్రావరుణులారా ! మేము మిమ్ము స్తుతించుచున్నాము. మమ్ము రక్షించుటకు విచ్చేయుడు. హవిస్సులను స్వీకరింపుడు. మేము చేయుచున్న కర్మయుద్ధమున శత్రువును సహించు శక్తి ప్రసాదించుడు. ద్యులోకమునుండి దిగు వర్షము మాకు హర్షము కలిగించవలెను.

                                      నూట ఏబది మూడవ సూక్తము
           ఋషి - దీర్ఘతముడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్రావరుణులారా ! మీరు నేతివాగులు పారింతురు. మేము మీ ఉభయుల విషయమున సమాన ప్రీతిగలవారము. మిమ్ము హవిస్సులు, నవస్సులు, ఆజ్యములతో యజింతుము. మీరు మా సర్వకర్మలను పోషించుచున్నారు. మేము మిమ్ము పూజించుచున్నాము.

    2. మిత్రావరుణులారా ! మేము మీ యాగము చేయ సంకల్పించినంతనే మీ తేజస్సు మాలో చేరినది. అందువలన మీ మనస్సులను ఆకర్షించ గలిగినాము. మా హోత మీ మహాత్మ్యమును మాకు తెలియ పరచినాడు. అప్పుడు నేను యజమానినయి యాగము చేసినాను. సుఖములు అనుభవించుచున్నాను.

    3. ఆరాతహవ్యుడనురాజు యొక్క హోత తన యజమానికి మేలు కోరి మిత్రావరుణులకు తృప్తి కలిగించినాడు. యజ్ఞమునందు హవిస్సులు అందుకున్న మిత్రావరుణులు యజమానికి గోవులను, బహుక్షీరములను కలిగించవలెను.

    4. మిత్రావరుణులారా ! మీరు అన్నము, పాడి, పురోడాశములు కలవారు. మీరు జనులకు గోవులను, జలములను ప్రసాదించినారు. వారికి హర్షమును, తృప్తిని కలిగించుచున్నారు. ప్రాచీన పాలకుడగు అగ్ని యజమానికి పాడి పశువులను ప్రసాదించవలెను.

                              నూట ఏబది నాలుగవ సూక్తము
            ఋషి - దీర్ఘతముడు, దేవత - విష్ణువు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. విష్ణువు చేసిన మహా కార్యములను వివరించుచున్నాను. ముల్లోకములను విష్ణు వే సృజించినాడు. విష్ణువే ఊర్ధ్వ లోకమును స్థాపించినాడు. అతడే మూడు విధములుగా లోకములను కల్పించినాడు. విష్ణువును సమస్త జనులు స్తుతింతురు.

    2. అసమ పర్వతమున ఉండు భయంకరమగు మృగమువలె విష్ణువు తన మహాకార్యముల వలన సమస్త జనులచే స్తుతించబడుచున్నాడు. ఆ విష్ణువు యొక్క మహిమగల మూడు అడుగులందు సమస్త లోకములు ఇమిడి ఉన్నవి.

    3. విష్ణువు మహోన్నత పదమున నివసించువాడు. అతని కొఱకు మేము మహాస్తోత్రమును రచించినాము. అది ఆ మహావిష్ణువును చేరవలెను. ఈ విశాల విశ్వమును విష్ణువు తన మూడు అడుగులచే ఆక్రమించినాడు.

    4. విష్ణువు పాదములు మధురములు. పూర్ణములు. అతని మూడు అడుగులు అన్నమునకు అక్షయములు. విష్ణువు ఒక్కడే భూమి, నీరు, తేజస్సు అను ధాతువులచే సమస్త లోకములను సృష్టించినాడు.

    5. విష్ణువు సర్వజనులకు బాంధవుడు. దేవతలను గూర్చి యాగములు చేయువారు విష్ణుపదమును చేరి తృప్తులు అగుదురు. విస్తార పదన్యాసమయిన విష్ణుపదము మధుర ప్రవాహము కలది. విష్ణువునకు ప్రియమగు ఆ స్థానమునకు నేను చేరవలెను.

    6. విష్ణు స్థానము అనేకులు స్తుతించునది. వర్షించునది. ఉత్కృష్టమయినది. అక్కడ కాంతికిరణములు సుదీర్ఘములయి విస్తీర్ణములు అగును. యాజమాన దంపతులు అట్టి నివాస యోగ్య స్థానమును చేరవలెనని మేము కోరుచున్నాము.

                          నూట ఏబది అయిదవ సూక్తము
             ఋషి - దీర్ఘతముడు, దేవత - విష్ణువు, ఛందస్సు - జగతి.

    1. విష్ణువు స్తోత్రప్రియుడు. ఘనుడు. శూరుడు. విష్ణువు, ఇంద్రుడు కామగమనులు. వేగవంతములయిన గుఱ్ఱములను పోలినవి అయినను ఇతరులకు అసాధ్యమయిన మేఘములను ఆక్రమించినవారు. అధ్వర్య, ఋత్విజులారా ! మీరు ఆ ఇరువురి కొఱకు సోమరూప అన్నమును సిద్ధము చేయుడు.

    2. ఇంద్రావిష్ణులారా ! మీరు మేఘములను కొట్టి వర్షము కురిపించువారు. మీ ప్రకాశవంతమగు గమనమును యజమాని పూజించుచున్నాడు. అతనికి మీరు ఇవ్వవలసిన ఫలము శత్రువునకు అందనిది. చలనశీలమగు హవిస్సు. మీరు దానిని అగ్ని ద్వారమున యజమానికి కలుగచేయుచున్నారు.

    3. సోమరూప హవిస్సులు ఇంద్రుని పౌరుషమును వృద్ధి చెందించును. ద్యావాపృథ్వులు సమస్త భూతములకు తల్లులు. ఇంద్రుడు రేతస్సు - తేజస్సులను ద్యావాపృథ్వులకు అర్పించును. అప్పుడు మూడు మూర్తులయిన తండ్రి, కొడుకు, మనుమడు కలుగుచున్నారు.

    4. విష్ణువు సర్వమునకు స్వామి, పాలకుడు, హింసారహితుడు, వర్షి. మూడు అడుగులతో సమస్తలోకములను ఆక్రమించినాడు. మేము అంతటి విష్ణువునకు స్తుతి కర్తలము. మమ్ము రక్షించుమని విష్ణువును ప్రార్థించుచున్నాము.

    5. విష్ణువు యొక్క రెండు పాదన్యాసములు స్వర్గమును చూచినవి. మానవుడు వానిని మాత్రమే స్తుతించుచున్నాడు. సేవించుచున్నాడు. విష్ణువు మూడవ అడుగు ద్యులోకమును మానవుడు మనసుతో కూడ తెలియలేడు. సర్వగమనముగల వాయువులు, పక్షులు మాత్రమే ఎరుగ గలవు.

    6. విష్ణువు తొంబది నాలుగు గమనములచేత వివిధగతులను వృత్తమువలె తిప్పుచున్నాడు. అట్టి కాలాత్మక విష్ణువు గొప్ప దేహము కలవాడు. వివిధ రూపములుగ కనిపించువాడు. అన్నింట ఉన్నవాడు. అధికుడు. అతడు ఆహ్వానములు ఆలకించి ఆరుదెంచుచున్నాడు.

    (విష్ణువును కాల స్వరూపుడుగా ప్రతిపాదించుచున్నాడు. సంవత్సరము 1+0 అయనములు 2+ ఋతువులు 5+ నెలలు 12+ పక్షములు 24+ రోజులు 30+ జాములు 8+ రాశులు12=94) అప్పటికి ఋతువులు అయిదు మాత్రమే అయి ఉండవలెను.

                          నూట ఏబది ఆరవ సూక్తము
             ఋషి - దీర్ఘతముడు, దేవత - విష్ణువు, ఛందస్సు - జగతి.

    1. విష్ణువా ! నీవు మిత్రుడవు. సుఖప్రదుడవు. జలములను ఉత్పత్తి చేయువాడవు. సమృద్ధిగా అన్నము కలిగించువాడవు. రక్షకుడవు. సర్వవిధముల అధికుడవు. యజమాని నీ మహిమలు ఎరిగినాడు. మాటిమాటికి నిన్ను స్మరించుచున్నాడు. హవిస్సులను అర్పించుచున్నాడు. నిన్ను ఆరాధించుచున్నాడు.

    2. విష్ణువు నిత్యుడు. జగత్కర్త. నిత్యనూతనుడు. స్వయంభువు. మహాత్ముడు. అట్టి విష్ణువునకు హవిస్సులు అర్పించువాడు అన్నవంతుడగును. ఆ మహాత్ముని జన్మమును స్తుతించినవాడు విష్ణుపదమును చేరును.

    3. విష్ణువు అనాది సిద్ధుడు. యజ్ఞ స్వరూపుడు. జలముల కర్త. స్తుతి కర్తలారా ! మీరు విష్ణువును ఎరిగిన రీతిని అతని కొఱకు స్తుతులను సమకూర్చుడు. విష్ణునామమును తెలియుడు. విష్ణునామమును చాటుడు.

    "విష్ణో సుమితిం భజామహే" మంచి మనసుతో విష్ణువును భజింతుము.

    4. విష్ణువు మిత్రుడు, మహామహుడు. స్వర్గమును సృష్టించగల బలము కలవాడు. మేఘమును వర్షింపచేయువాడు. ఋత్విజులతో కూడిన మేధావి అగు యజమాని చేయు ప్రసిద్ధ యాగమును వరుణుడు సేవించవలెను. అశ్వినులు సేవించవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.