Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                ఆరవ అధ్యాయము

                                              ఆత్మసంయమ యోగము

    శ్రీ భగవానువాచః
    
        అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః
        స సన్న్యా సీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః 1

    ఫలాపేక్ష లేక కర్మను ఆచరించువాడు సన్యాసి, యోగి. అతడు అగ్నివంతుడు. క్రియావంతుడు అగుచున్నాడు.
        యం సాన్న్యసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ!
        నహ్య సంన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన || 2

    అర్జునా! దేనిని సన్యాసము అనుచున్నామో అదే యోగము. సంకల్ప త్యాగము చేయనివాడు యోగి కాజాలడు.                ఆరురుక్షో ర్మునేర్యోగం కర్మకారణ ముచ్యతే
        సయోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే|| 3

    యోగమును అధిష్ఠించదలచినవాడు నిష్కామముగా కర్మను ఆచరించవలెను. అట్టివానికి సంకల్ప రాహిత్యమే మోక్షప్రాప్తి అగుచున్నది.
        యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే
        సర్వసంకల్ప సన్న్యాసీ యోగారూడస్తదోచ్చతే 4

    ఇంద్రియములను, కర్మలను త్యజించిన సర్వ సంకల్ప సన్యాసి, యోగారూఢుడు అనబడుచున్నాడు.
        ఉద్ధరేదాత్మ నా -త్మానం నాత్మాన మవసాదయేత్
        ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపు రాత్మనః 5

    లోకములో మనుజులు తమను తామే అధోగతి పాలు చేసుకొందురు. తమను తామే ఉద్ధరించుకొనవలయును. తనలోనే మిత్రులు వున్నారు. శత్రువులు వున్నారు.
        బంధురాత్మా త్మనస్తస్య యేనాత్మై వాత్మనా జితః
        అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతా - త్మై వ శత్రువత్ 6

    ఆత్మను ఆత్మతో గెలిచినవాడు తనకు తానే మిత్రుడు అగుచున్నాడు. అనాత్మవాది. శతృత్వ స్వభావుడు తనకు తానే శత్రువు అగుచున్నాడు.
        
    దీపిక:

    1. మూడవ శ్లోకములో యోగారూఢపదము ప్రయోగించాడు. దానికి మేము యోగాధిష్టుడు అన్నాము.
    నాల్గవ శ్లోకమున స్వామి యోగారూఢుని నిర్వచనము యిచ్చినాడు. దానిని అట్లే అర్థము చేసుకొనునది.
    2. స్వామి ఐదవ శ్లోకమున తనలోనే శత్రుమిత్రులున్నారని అన్నాడు. ఆరవ శ్లోకమున వివరించినాడు.
        జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః
        శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః 7

    శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, మాన అవమానములు జయించినవాడు ప్రశాంత మానసుడగువాడు పరమాత్మ సమాహితుడు అగుచున్నాడు.
        జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః
        యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః 8

    జ్ఞానము విజ్ఞానములయందు తృప్తిగలవాడు, నిశ్చలుడు, విజితేంద్రియుడు, మట్టిని, రాతిని, బంగారమును సమానముగా జూచువాడిని యోగి అనుచున్నారు.
        సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు
        సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే 9

    మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్తులు, శత్రువులు, బంధువులు, సాధువులు, పాపిష్టులయందు సమబుద్ధి గలవాడు శ్రేష్టుడు అనబడుచున్నాడు.
        యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః
        ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీ రపరిగ్రహః 10

    ఏకాకి, ప్రశాంత స్థలములో నిలచినవాడు, నిగ్రహి, కోరికలు లేనివాడు, ఇతరులనుంచి గ్రహించనివాడు యోగి అనబడుచున్నాడు.
        శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిర మానస మాత్మనః |
        నాత్యుచ్చ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరమ్|| 11

    శుచియైన ప్రదేశమున నిలువవలెను. మనసును స్థిరపరచుకొనవలెను. మరీ ఎత్తుగాని, తచ్చుగాని ప్రదేశముల దర్భాసనమును జింకచర్మమును పర్చవలెను.
        తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః
        ఉపవిశ్యా- సనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే 12

    అచ్చట ఏకాగ్రమానసియై మనస్సును, ఇంద్రియ క్రియలను నియంత్రించి, ఆత్మను పరమాత్మయందు ఏకము చేసి అంతఃకరణ శుద్ధికై ధ్యానము చేయవలయును.

    దీపిక:

    ఆసనమును నిర్దేశించినాడు. వ్యక్తి మనసును నిర్థారించినాడు. ఇదంతయు అంతఃకరణశుద్ధికి -
    అంతఃకరణమనిన దేహము లోపలి భాగము. దేహ ఉపరి భాగము స్నానాదులచేత శుచిమంతయు శుభ్రము అగును. కాని అంతఃకరణములకు స్నానము లేదు. వానిని శుభ్రము చేయు మార్గము సుగమము మాత్రము కాదు.
    ఎత్తు పల్లములు లేని శుభ్రమైన ప్రదేశమున జింక చర్మముపై దర్భలు పరచి దానిమీద కూర్చుండవలెను. ఇది బహిరము మాత్రమే.
    అక్కడ ఏకాగ్రచిత్తుడు కావలయును. మనసు ఒకదాని మీద నిలువదు. మనసు నిశ్చలమగుట దుష్కరమైన విషయము.
    చిత్తము ఇంద్రియములను వశపరచుకొనవలయును. చిత్తమే నరుని నడుపునది. ఇంద్రియములు దాని మాట వినునది. వాటిని వశపర్చుకొనుట లేక నిగ్రహించుట. కొండను త్రవ్వుట కంటే కష్టమైనపని. ఇది అంతయు కేవలము అంతఃకరణ శుద్ధికి మాత్రమే. అది యోగము గాదు. స్వామికి దరిదాపులది కాదు. మోక్షము మాట లేదు.
        సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః
        సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్|| 13

    మెడ, తల రెండింటిని సమయముగా వుంచవలెను. కదలక స్థిరముగా నుండవలెను. దృష్టి దిక్కులను చూడరాదు. నాశికాగ్రమును మాత్రమే చూడవలెను.
        ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః
        మన స్సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్సరః 14

    ప్రశాంతచిత్తులు కావలెను. భయమును వీడవలయును. బ్రహ్మచారి వ్రతమున స్థిరముగా నుండవలెను. చిత్తమును నిలుపవలెను. ఆ విధముగా నాయందే చిత్తము గలవాడు కావలెను. అట్టివాడు మత్పరాయణుడు అగును.
        యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః
        శాంతి నిర్వాణ పరమాం మత్సంస్థా మధిగచ్ఛతి 15

    ఏకాగ్ర మనసు కలవాడు కావలెను. సదాత్ముడు కావలెను. మనసును నిగ్రహించిన యోగి కావలెను. అతనికి శాంతి లభించుచున్నది. పరమ నిర్వాణము ప్రాప్తించుచున్నది. నా సంస్థానమునకు చేరుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.