Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    4. అగ్ని సర్వ సంపన్నుడు. భృగు వంశజులు అగ్నిని ఉత్తరవేదియందు భూతముల బలమున అభిముఖముగా స్థాపించినారు. అగ్ని సూర్యునివలె ధనములకు ఈశ్వరుడు అయినాడు. ఆ గనిని స్వగృహమున స్తుతింతుము.

    5. వాయువుల ధ్వనివలెను, రాజు పంపిన సేనవలెను, అంతరిక్షమున పుట్టిన పిడుగువలెను, అగ్నివారింప శక్యముకానివాడు. ఆ అగ్ని జ్వాలాదంతములతో శత్రువులను హరించును. శూరునివలె శత్రువును హింసించును. వనములను దహించును.

    6. అగ్ని బహుపర్యాయములు మా స్తుతులను కోరవలెను. సర్వజనులకు నిధివంటివాడు కావలెను. అనేక విధముల ఉపకరించవలెను. మమ్ము కర్మలకు ప్రేరేపించవలెను. లాభార్జనకు తొందర పెట్టవలెను. మేము అగ్నిని స్తుతించుచున్నాము.

    7. అగ్ని నేతితో మండువాడు. యజ్ఞమున ముందు ఉండువాడు. యజమాని అగ్నిని మిత్రునివలె భావించును. అగ్నిని సమిధలతో వెలిగించి అలంకరించుచున్నాడు. చక్కగా వెలుగునట్టి, వ్యాపించునట్టి, యజ్ఞము నిమిత్తము దీపించునట్టి అగ్ని మా సకల కర్మలను రక్షించవలెను.

    8. అగ్నీ ! పొరపాటు లేకుండ వర్తించుచు, కళ్యాణకరములు, సుఖప్రదములు అగు రక్షణలతో మమ్ము కాపాడుము. పుట్టుకతోనే హింసారహితమయి, ఇతరులు అవమానింప శక్యముకాని రక్షణలతో మమ్ము కాపాడుము.

                                         నూట నలుబది నాలుగవ సూక్తము
                             ఋషి - దీర్ఘతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - జగతి.


    1. అధ్వర్యుడు మిక్కిలి ప్రజ్ఞావంతుడు. అతడు అగ్ని వ్రతమును అవలంబించుచున్నాడు. ప్రదక్షిణముగా ప్రవర్తించుచు అగ్నిస్థానమందు ఉండు స్రుక్కులను ధరించుచున్నాడు.

    2. జలధారలకు జన్మస్థానము సూర్యుడు. జలధారలు సూర్యుని ఆవరించి అగ్నిని స్తుతించుచున్నవి. అగ్ని జలముల మధ్య నిలుచును. అట్టి అగ్నితో భూమికి చేరిన జలము అమృత ప్రాయము అగును. దానిని జనులు త్రావుచున్నారు.

    3. హోత-అధ్వర్యుడు సమాన ప్రతిభగలవారు. వారు పరస్పర సహకారమున అగ్నికార్యము నిర్వహింతురు. తదుపరి అది ఆహవనీయ అగ్ని అగును. అది యజ్ఞ సారథియై కళ్లెముల పట్టి సర్వత్ర వ్యాపించును.

    4. హోత అధ్వర్యుడు ఇద్దరును సమాన ప్రతిభావంతులు. వారికి యజ్ఞము సమాన ఫల స్థలము. హోత, అధ్వర్యులు దంపతులవలెను, రాత్రింబవళ్లవలెను సఖ్యముగా అగ్ని కార్యమును నిర్వహించుచున్నారు. ఆ అగ్ని పుల్లలు లేనపుడు ముదుసలి అయి, పుల్లలు పడినంత వయసువాడు అగుచున్నాడు. హోత, అధ్వర్యుడు ఇద్దరు సమర్పించిన హవిస్సులను తిని అగ్ని ప్రాయపువాడు అగుచున్నాడు.

    5. అగ్నిని కలిగించుటకు అరణిని చేతుల పదివ్రేళ్లు పట్టును. పదివ్రేళ్ళు విడిచినపుడు అగ్ని విముక్తము అగును. సంతసించును. మేము నరులము. మమ్ము రక్షింపుమని అగ్నిని ఆహ్వానించుచున్నాము. ధనుస్సు నుండి ప్రసరించు బాణములు శత్రువుమీద పడును. అట్లే అగ్ని నుండి బయల్వెడలిన నిప్పురవ్వలు ప్రసరించుచున్నవి. ఆ రవ్వలు వృద్ధిపొంది అగ్ని ప్రజ్ఞావంతుడయి కనిపించుచున్నాడు.

    6. అగ్నీ ! నీవే అంతరిక్షమున పుట్టిన వానికెల్ల అధిపతివి. పృథ్వియందు పుతినవాటికి అన్నింటికి అధిపతివి. స్వయముగా పశువులను పాలించు అధిపతివలె స్వతంత్రుడవు. నీవు అంతటి విశాల సంపదలు గలవాడవు. హితకరుడవు. రమణీయుడవు. ధ్వనించువాడవు. ద్యావాపృథ్వులు నీ యజ్ఞమును వహించుచున్నవి.

    7. అగ్నీ ! నీవు హవిస్సు కలవాడవు. యజ్ఞము కొఱకు పుట్టినవాడవు. శుభ కర్మలు కలవాడవు. సర్వజగములకు గృహస్థునివలె నిన్ను సర్వజనులు సేవింతురు. విచ్చేయుము. హవిస్సులు స్వీకరించుము. నీకు ప్రియమగు ఈ స్తోత్రమును మరల మరల కోరుము.

                                   నూట నలుబది అయిదవ సూక్తము
                 ఋషి - దీర్ఘతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్, 5 జగతి.

    1. అగ్ని అంతటికి పోగలవాడు, రాగలవాడు. అతడు అన్నీ తెలిసినవాడు. చైతన్యవంతుడు. శీఘ్రగామి. అతనియందు అన్నీ ఉన్నవి. అన్ని భోగములు ఉన్నవి. అన్ని భోగములు ఉన్నవి. ధనములు ఉన్నవి. బలములు ఉన్నవి. అతడు బలవంతుడగు రాజునకు సహితము ప్రభువు. యజమానులారా ! అట్టి అగ్నిని అర్థించుడు.

    2. అందరు అగ్నినే అడుగుదురు. ఎవడును విపరీతముగా అడుగడు. అడిగినను అగ్ని ధీరుడయి తాను గ్రహించిన దానినే చెప్పును. అగ్ని తన మాటకు ముందు ఇతరుల మాటను సహించడు. తన మాట తరువాతి మాటను సహితము సహించడు. అట్లని అగ్ని గర్వికాడు. అతడే సమస్త జనులను రక్షించుచున్నాడు.

    3. మన పిలుపులు, స్తుతులు అన్నియు అగ్నినే చేరుచున్నవి. అతడు ఒక్కడే మన మాటలు వినువాడు. అనేకములను ప్రేరేపించువాడు. తపింపచేయువాడు. యజ్ఞ సాధకుడు. అవిచ్చిన్న రక్షణలు ఉన్న శిశువువలె ప్రియుడయినవాడు. అట్లీ అగ్ని త్వరపడి హవిస్సులు అందుకొనుచున్నాడు.

    4. అధ్వర్యుడు అరణిమధించి అగ్నిని ఆవిర్భంపచేయుచున్నాడు. అగ్ని ఆవిర్భవించినంతనే ఫలసాధనకు సర్వత్ర వ్యాపించినాడు. ఆనందించునట్లు ఆజ్యము సమర్పించు యజమానిని అగ్ని లాలించుచున్నాడు.

    5. అగ్ని సర్వజ్ఞుడు. జలజ్ఞాని. యజ్ఞజ్ఞాని. సత్యస్వరూపుడు. చర్మము పరిచినట్లు ఓషధులు పరచిన వేదికమీద నివసించును. అన్వేషి, కర్మధారి, వససంచారి అగు అగ్ని మర్త్యుడు అగు యజమానికి ప్రజ్ఞానము బోధించును.

                                   నూట నలుబది ఆరవ సూక్తము
                      ఋషి - దీర్ఘతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. సవనములు అను మూడు తలలు కలది, ఛందస్సులు అను ఏడు కళ్లెములు గలది, అంగవైకల్యము లేనిది, ద్యావాపృథ్వులు సమీపమున ఉన్నట్టి యజ్ఞాగ్ని నిశ్చలమగు హవిస్సులను భక్షించుచున్నాడు. అట్టి అగ్నికి సంబంధించిన యాగములు దేవ విమానములను అన్నింటిని పూరించుచున్నవి. అగ్నిని స్తుతింపుము.

    అగ్నికి వర్తించు అర్థము:-

    ద్యులోక, భూలోక, అంతరిక్షములు అను మూడు తలలు కలవాడు, ఏడు నాలుకలను కళ్లెములు కలవాడు, అంగవైకల్యము లేనివాడు, ద్యావాపృథ్వుల సమీపమున ఉన్నట్టి అగ్ని నిశ్చలమగు హవిస్సును భక్షించుచున్నాడు. అట్టి అగ్నికి సంబంధించిన యాగములు దేవ విమానములను అన్నింటిని పూరించుచున్నవి. అగ్నిని స్తుతింపుము. 

    2. అగ్ని వర్షించువాడు. మహాత్ముడు. అతడు భూమి, అంతరిక్షమును వహించుచున్నాడు. అగ్ని ముదిమి ఎరుగనివాడు. గొప్పవాడు. రక్షకుడు. అతడు మాయజ్ఞ గృహమునకు అభిముఖుడు అగుచున్నాడు. వేదికమీద ఆసీనుడు అయినాడు. ఈ అగ్నిజ్వాలలు పొదుగువలె ఉన్న అంతరిక్షమును దూడవలె నాకుచున్నవి.

    3. ఒకే వత్స అగు అగ్నికి అభిముఖముగ సంచరించు యజమాని, అతని పత్ని, రెండు ధేనువులయి శోభనకర్మవంతులయి అంతట సంచరించుచున్నారు. మార్గములను అగ్ని చుట్టు సిద్ధపరచుచున్నారు. ప్రజ్ఞానములను ధరించుచున్నారు.

    4. అధ్వర్యులు మున్నగువారు బుద్ధిమంతులు. జ్ఞానవంతులు. వారు వృద్ధిపొందు అగ్నిని వేదికయందు ఉంచుచున్నారు. అనేకవిధములుగా అగ్నిని రక్షించుచున్నారు. యజ్ఞ ఫలములను ఇచ్చు అగ్నిని సర్వవిధముల సేవించుచున్నారు. సర్వజనకుడయిన అగ్ని మానవులకు ప్రత్యక్షమయినాడు.

    5. అగ్ని అనుగ్రహ దృష్టి కలవాడు. సర్వదిక్కులందు దర్శనము ఇచ్చువాడు. గొప్పవారగు దేవతలను, చిన్నవారగు యజమానులను రక్షించుచున్నాడు. అందువలననే అగ్నికి అంతటను హవిస్సులు ఉన్నవి. అతడు సర్వదర్శకుడు. శిశువులవంటి యజమానులను అనుగ్రహించుచున్నాడు.

                               నూట నలుబది ఏడవసూక్తము
                            దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.


    1. అన్నము, ఆయువు రెంటిని పుత్రులవలె కలిగిన యజమానులు యజ్ఞమునందు సామమంత్రములను

    ఉచ్చ్రరించుచున్నారు. అగ్ని తన కిరణములచే వెలుగును ఇచ్చుచున్నాడు. హవిస్సులను అందుకొనుచున్నాడు. అన్నమును, ఆయువును, కలిగించుచున్నాడు.

    2. అగ్నీ ! నీవు నిత్యయవ్వనుడవు. హవిస్సులే అన్నముగా కలవాడవు. మేము నీ కొఱకు మిక్కిలి పూజ్యములు. ఉత్తమములు అయిన సూక్తములను సాధించినాము. ఆలకింపుము. ఒకడు యాగమును నిరోధించును. ఒకడు యాగమును స్తుతించును. మేము స్తుతించువారము. నీ దివ్యమూర్తిని స్తుతించుచున్నాము.

    3. అగ్నీ ! నీవు మమతా పుత్రుని చూచినావు. అతని అంధత్వము పోగొట్టినావు. రక్షించినావు. నీ రక్షణలు సుఖకరములు. సర్వము తెలిసినవి. అవి మా చెంత ఉండగా శత్రువులు మమ్ము బాధించలేరు.

    4. అగ్నీ ! మాకు పాపము తలపెట్టినవారు, మాకు చెందవలసిన దానికి మాటతోనో, చేతతోనో అడ్డు తగులు వారికి ఆ బాధలే వారికి అధికముగా కలుగునట్లు చేయుము. ఆ దురుక్తులగు వారిని నాశనము చేయుము.

    5. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. తెలిసి బాధలను కలిగించువారినుండి నిన్ను స్తుతించువారిని రక్షింపుము. వారుచేయు పాపములకు అందకుండ రక్షింపుము.

                                 నూటనలుబది ఎనిమిదవ సూక్తము
                 ఋషి - దీర్ఘతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని దేవతలను ఆహ్వానించువాడు. బహురూపి. సర్వదేవతలకు ఉపకరించువాడు. అట్టి అగ్నిని వాయువు కట్టెలలో ప్రవేశించి మధించినాడు. బుద్ధిశాలురయిన జనులు యజ్ఞసిద్ధికిగాను వివిధ ప్రకాశములు కలిగి కోరదగిన సూర్యునివలె ఆ అగ్నిని భద్రపరచుకున్నారు.

    2. అగ్నిని స్తుతించు నన్ను శత్రువులు హింసించజాలరు. నా స్తుతులను, కార్యములను అగ్ని రక్షించును.

    3. యజ్ఞము చేయువారు అగ్నిని మధించి గృహములందు గార్హపత్యాగ్నిగా ఉంచుకొందురు. ఆ అగ్నిని యజ్ఞము నిమిత్తము రథమునకు కట్టబడి వేగముగా నడుచు అశ్వమువలె ఇష్టమయిన చోటికి తరలించుచున్నారు.

    4. అగ్ని అన్నింటిని దహించును. జ్వాలలవంటి తన దంతములతో వనములందలి వృక్షములను ధ్వంసము చేయుము. తదుపరి జాజ్వల్యమానుడయి సర్వత్ర సంచరించును. విలుకాడు శరములను విసరినట్లు అనుకూల వాయువు అగ్నిజ్వాలలను విసురుచుండును.

    5. అగ్ని గర్భమునందువలె అరణియందు ఉన్నాడు. అతనిని హింసా స్వభావులు హింసింపజాలరు. జ్ఞానశూన్యులు, కన్నుకానని వారు అగ్ని మహత్తును తగ్గించలేరు. నిత్యులయి అగ్నిని తృప్తిపరచువారు అగ్నిమహత్తును కాపాడుకొనుచున్నారు.

                                   నూట నలుబది తొమ్మిదవ సూక్తము
               ఋషి - దీర్ఘతముడు, దేవత - అగ్ని, ఛందస్సు - విరాట్.


    1. అగ్ని పూజ్యుడు. ధనములకు అధిపతి. ఇష్టార్థములను ఇచ్చువాడు. అట్టివాడు అగ్ని మా దేవ, యజనస్థానమునకు కదలివచ్చుచున్నాడు. అధికారులకు అధికారి అగు అగ్ని సంపదలకు నివాసమయిన వేదికమీద ఆసీనుడు అయినాడు. అట్టి అగ్నిని అభిషవ శిలలు పట్టుకొని యజమానులు సేవించుచున్నారు.

    2. అగ్ని వివిధ ప్రాణులకు సృష్టికారకుడు అగుచున్నాడు. అగ్ని శరీరమునందు జఠరాగ్నిగనుసంయోగకార్యమందువీర్యముగను ప్రవేశించి దేహములను నిలుపుచున్నాడు. పుట్టించుచున్నాడు.

    3. యజమానుల ఉత్తరవేదిన ప్రకాశించు అగ్ని స్వేచ్చగా సంచరించగలడు. మేధావియు, వేగవంతుడును అయి ఆకాశమున ఆయువువలె సర్వ దేవతా స్వరూపుడయి సంచరించును.

    4. అరణులు లేక ద్యావాపృథ్వులు రెంటివలన ఆవిర్భవించిన అగ్ని మూడు లోకములను సర్వలోకములను ప్రకాశింప చేయును. దేవతలను పిలుచును. ఉదకములు ఉన్నచోట ఉండును.

    5. అగ్ని రెండింటివలన పుట్టినాడు. హోమము కలిగించినాడు. అతడు హవిస్సులు కోరువాడు. సకల వరములను ఇచ్చువాడు. అగ్నికి హవిస్సులు అర్పించువానికి మంచి సంతానము కలుగును.

                                 నూట ఏబదవ సూక్తము
              ఋషి-దీర్ఘతముడు, దేవత-అగ్ని, ఛందస్సు-ఉష్ణిక్.


    1. అగ్నీ ! నీవు బహుదాతవు. నీ అనుగ్రహముననే నేను హవిస్సులు అర్పించగలుగుచున్నాను. అందువలన నిన్ను నుతింతును. అధికారి ఇంట నౌకరువలె నిన్ను సేవింతును. "తోదస్యేవ శరణ ఆమహస్య"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.