Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః
తేషామాదిత్య వజ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ 16
ఎవరి అజ్ఞానము జ్ఞానములోన నశించుచున్నదో వారికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించుచున్నది.
తద్బుద్ధయ స్తదాత్మానః తన్నిష్ఠా స్తత్పరాయణాః
గచ్ఛంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః 17
వారిబుద్ధి ఆత్మయందు ప్రవేశించినప్పుడు వారు నిష్ఠగలవారు, తత్పరాయణులు అయినప్పుడు, జ్ఞానము వలన కల్మషము వదలించుకొన్నవారై పునరావృత్తి లేని పదమునకు చేరుతున్నారు.
విద్యావినియ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః 18
విద్యగలవాడును, వినయ సంపన్నుడును అగు బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను పండితులు సమదృష్టితో చూచుచున్నారు.
ఇహైన తైర్జిత స్సర్గః యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః 19
మనస్సును సామ్యమున నిల్పువాడు, ఇహముననే జీవితమును జయించుచున్నాడు. అతడు నిర్దోషి బ్రహ్మసమానుడు. కావున అతడు బ్రహ్మనే చేరుచున్నాడు.
నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్యనో ద్విజేత్ ప్రాప్య
స్థిరబుద్ధి రసమ్మూఢః బ్రహ్మ విద్భ్రహ్మణి స్థితః 20
ప్రియమునకు సంతోషించడు, అప్రియమునకు దుఃఖించడు. స్థిరబుద్ధిగలవాడు బ్రహ్మ విదుడు. బ్రహ్మను చేరుచున్నాడు.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్
స బ్రహ్మ యోగముక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే 21
బాహ్యస్పర్శయందు ఆసక్తిలేనివాడు, ఆత్మ యందు సుఖమును అనుభవించనివాడు బ్రహ్మసముడు అగుచున్నాడు. ఇతడు అక్షయ సుఖములను పొందుచున్నాడు.
యేహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే
ఆద్యంతవంతః కౌంతేయ! న తేషు రమతే బుధః 22
అర్జునా! రూప రసాదులైన విషయముల వలన కలుగు సుఖం - దుఃఖానికి కారణం అవుతోంది. కనుక వివేకవంతులు దానిని ఆస్వాదించరు.
శక్నోతీ హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః 23
ఈ లోకముననే ప్రాణముండగనే కామక్రోధముల వలన కలిగిన వేగమును నిగ్రహించువాడు సుఖవంతుడు అగుచున్నాడు.
యోన్తసుఖో -న్తరారామః తథాంతర్జ్యోతి రేవ యః
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో -ధిగచ్ఛతి 24
తనలోన సుఖించువాడును, సంతోషించు వాడును, అంతర్జ్యోతి యగువాడును యోగి అగుచున్నాడు. అతడు బ్రహ్మ నిర్వాణమును, బ్రహ్మమును అధిగమించుచున్నాడు.
లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః
చ్ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూత హితేరతాః 25
ఋషులు, క్షీణపాపులు, నిస్సంశయులు, ఆత్మయందే రతుడైనవాడు, సమస్త ప్రాణుల హితమ్ గోరువారును, బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నారు.
కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసామ్|
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనామ్ || 26
కామక్రోధ రహితుడును, యతులును, నిగ్రహబద్ధులను, ఆత్మను తెలిసినవారును, ఆత్మయందే ప్రవర్తించువారును బ్రహ్మ నిర్వాణమును పొందుచున్నారు.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః
ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతర చారిణౌ| 27
యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్ష పరాయణః
విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త ఏవ సః 28
విషయములను త్యజించవలయును, భ్రూమధ్యమున దృష్టి నిలుపవలెను. ప్రాణాపానములను, సమముగా చేసి ముక్కు యందు చలింపవలెను.
వీటివలన మనసు, బుద్ధి, ఇంద్రియములు, వశవర్తులు అగును. ఇచ్ఛాభయక్రోధ వర్జితుడైనవాడు సదా ముక్తుడగుచున్నాడు.
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి 29
నన్ను తపోయజ్ఞములకు భోక్తగా, సర్వలోక మహేశ్వరునిగా, సర్వజీవులకు మిత్రునిగా గ్రహించి యోగి శాంతి పొందుచున్నాడు.
కర్మ సన్యాసయోగమను ఐదవ అధ్యాయము ముగిసినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః





