Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                               ఐదవ అధ్యాయము

                                               కర్మసన్యాస యోగము

    అర్జున ఉవాచః
        సన్న్యాసం కర్మణాం కృష్ణ! పునర్యోగం చ శంససి
        యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్

    కృష్ణా! ఒకసారి కర్మ సన్యాసము అంటావు. మరియొకసారి కర్మయోగము అంటావు. వీనిలో ఏ ఒక్కటి నిశ్చితముగా శ్రేయస్కరమో ఉపదేశింపుము.

    దీపిక:
        
    అర్జునుడు నరుడు, సాధారణుడు, జ్ఞానము లేనివాడు.
    అతనికి పరమ జ్ఞానియైన పరాత్పరుడు ఉపదేశించుచున్నాడు. భారత తాత్వికత విశాలము, విభిన్నము, వినూత్నము విశారదము చెప్పినదే చెప్పవలసివస్తుంది. దానిని పునరుక్తి అంటారు. ఇది వినువానికి లేక చదువు వానికి సులభముగా తెలియుటకు ప్రవేశపెట్టిన విధానము. ఇది కాస్త చిక్కు కాబట్టి పలుమార్లు చెప్పుటవల్ల అర్థమవుతుంది.
    అర్జునుడు ఇదివరకు గూడా ఇటువంటి ప్రశ్న వేసినాడు. నాల్గవ అధ్యాయములో కేవలము కర్మయోగము, కర్మ సన్యాసము మాత్రమే చెప్పబడలేదు. జ్ఞానము, యజ్ఞము గూడా చెప్పినాడు. అని అర్జునునికి అర్థము కాలేదని తెలుస్తుంది. సామాన్యుని స్థితి అదియే. సంతోషమేమనగా కర్మయోగము, కర్మసన్యాసము అతనికి తెలిసినవి. ఇందులో ఏదో ఒకటి తనకు క్షేమకరమైనదని తెలియపర్చమని కోరుచున్నాడు.
    సామాన్య మానవుడు సాధారణముగా తనను గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇతరుల లోకాన్ని గురించి తెలుసుకోడు. ఆలోచించడు.
    
    శ్రీ భగవానువాచః

        సన్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయ సకరావుభౌ
        తయోస్తు కర్మ సంన్యాసాత్ కర్మయోగో విశిష్యతే 2

    కర్మసన్యాసము, కర్మయోగము రెండును శ్రేయోదాయకములే. వాటిలో కర్మసన్యాసము కన్నా కర్మయోగము విశిష్టమైనది.
        జ్ఞేయ స్స నిత్య సన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి
        నిర్ద్వంద్వో హి మహాబాహో! సుఖం బంధాత్ ప్రముచ్చతే 3

    అర్జునా! ద్వేషము, కాంక్షలేని కర్మయోగిని నిత్యసన్యాసిగా తెలియవలయును. ద్వంద్వములను అధిగమించినవాడు బంధములనుండి విముక్తుడగుచున్నాడు.

    దీపిక:
    
    ద్వంద్వములు అనగా జంటలు. అవి సుఖదుఃఖములు, జయాపజయములు, రాగద్వేషములు మున్నగునవి. ఇవి ఒకదానికి నీడగా మరొకటి యుండును. ఈ అనుభవము గూడా అట్లే జరుగుచుండును. ద్వంద్వమును అధిగమించిన విముక్తుడు అగుచున్నాడు. అధిగమించుట సామాన్యము గాదు.
        సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః
        ఏక మప్యాస్థిత స్సమ్యక్ ఉభాయోర్విందతే ఫలమ్ 4

    తెలియనివాడు సాంఖ్యమును, కర్మయోగమును వేరు వేరుగా భావించుచున్నారు. పండితులు అట్లు భావించరు. ఈ రెంటిలో దేనిని ఆచరించినను రెండింటి ఫలము లభించుచున్నది.    
        యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే
        ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి 5

    సాంఖ్యమునకు ఎట్టి ఫలము లభించుచున్నదో, యోగమునకు అట్టిదే లభించుచున్నది. సాంఖ్యమును, యోగమును ఒక్కటిగా చూచినవాడే చక్కగా చూచినవాడు అగుచున్నాడు.
        సన్న్యాసస్తు మహాబాహో! దుఃఖమాప్తు మయోగతః
        యోగయుక్తో మునిర్ర్బహ్మ నచిరేనాధి గచ్ఛతి 6

    అర్జునా! సాన్యసము అతికష్టమైనది. యోగయుక్తుడగు ముని బ్రహ్మమును త్వరలోనే చేరుకొనుచున్నాడు.
        యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
        సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే 7

    యోగయుక్తుడు, నిర్మలాత్ముడు, విజితాత్ముడు, జితేంద్రియుడు, సర్వభూతములను తననుగానే భావించువాడు. కర్మచేసియు, ఆకర్మకుడే అగుచున్నాడు.
        నైవ కించిత్కరోమీతి యుక్తోమన్యేత తత్త్వ విత్
        పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ 8

    
        ప్రలపన్, విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి
        ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ 9

    తాత్వికుడైన సాంఖ్య యోగి చూస్తాడు. వింటాడు. తాకుతాడు. వాసన చూస్తాడు. తింటాడు. నడుస్తాడు. ఎదిరిస్తాడు. ఉఛ్పాస నిశ్వాసలు జరుపుతాడు. మాట్లాడుతాడు. శ్వాస వదులుతాడు. పట్టుకొంటాడు. కనులను మూస్తాడు. తెరుస్తాడు. అట్లయినను ఇంద్రియములు తమ పనిని తాము చేయుచున్నవని అనుకొంటాము. కాని అవి చేయుట లేదని భావిస్తాడు.
        బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
        లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా 10

    తామరాకు మీది నీటిబొట్టు. ఆకును తాకదు. కదులుచుండును. అట్లే భగవంతుని ఆశ్రయించి ఆసక్తి వదిలి ఎవడు కర్మలను చేయుచున్నాడో వానిని పాపములు తాకవు.
        కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి
        యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా -త్మ శుద్ధయే 11

    ఆసక్తి రహితుడైన యోగి శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములతో గూడా కర్మచేయును. ఇది ఆత్మశుద్ధికి అగుచున్నది.
        యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్
        అయుక్తః కామాకారేణ ఫలే సక్తో నిబధ్యతే 12

    కర్మయోగి, కర్మఫలమును వదలును, శాంతిని పొందును. అర్హత లేనివాడు కామకారణముగా ఫలములనాశించి బద్ధుడగుచున్నాడు.
        సర్వకర్మాణి మనసా సన్న్యస్యా - స్తే సుఖం వశీ
        నవద్వారే పురే దేహీ నైవకుర్వన్ న కారయన్ 13

    కర్మలన్నింటిని మనస్ఫూర్తిగా సన్యసించువానికి సుఖము వశమునందుండుచున్నది. ఈ తొమ్మిది తొర్రల  పురమునందు ఆత్మ చేయకున్నది. చేయించకున్నది.
        న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
        న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే 14

    స్వామి కర్త కాడు. లోకములందలి కర్మలను సృజింపడు. కర్మఫల సంయోగి కాడు. వీటన్నింటియందు స్వభావమే వర్తిల్లుచున్నది.

    దీపిక:

    స్వామి ఏమీ చేయను అనుచున్నాడు. జరుగువాటి నన్నింటికి స్వభావమే కారణము అనుచున్నాడు. ఈ స్వభావము చాలా గొప్పది. ఇదియే ప్రకృతి. సూర్యుని స్వభావము మండుట. భూమి స్వభావము సంహించుట. వహించుట. గాలి స్వభావము వీచుట. మనిషి స్వభావము పనిచేయుట. ఇట్లు స్వభావములే కర్తలు అగుచున్నది అనుచున్నాడు. ఇవి లోతుగా ఆలోచించవలసిన విషయములు. ప్రకృతి వేరు. పరమాత్ముడు వేరు. అనుద్వైతమా? విశిష్టాద్వైతమా?
        ఈ స్వభావమును కల్పించినవాడు స్వామి కాడా?
        నాదత్తే కస్య చిత్పాపం న చైవ సుకృతం విభుః
        అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః 15

    స్వామి పాపము చేయకున్నాడు. పుణ్యము చేయకున్నాడు. జ్ఞానము, అజ్ఞానముచే ఆవరించబడియున్నది. ఇందువల్ల ప్రాణులు మోహితులగుచున్నారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.