Home » vaddera chandidas » Anukshanikam 2



    "మళ్ళీ ప్రెగ్నెన్సీనా?" అంది సుదతి గాయత్రితో చిన్నగా.
    లేదన్నట్లు తల కదిపింది గాయత్రి.
    పిల్లాపీచూతో ఏది చెయ్యటానికీ ఆటంకం అని మళ్ళీ కడుపొచ్చి బాధపడుతున్నదని అనుకుంది సుదతి. కాదని తెలిసి అర్ధం కానట్లుగా చూసి "దెన్ బీ ఛీర్ ఫుల్" అంది.
    "ఐ యామ్ ఆల్వేస్ ఛీర్ ఫుల్" అని లోనకి వెళ్ళింది.
    "ఎమర్జెన్సీ టైంల అరెస్టైతే యేమి కూడ అడిగేటందుకు లేదు. చాల యిన్ హ్యూమన్ గ ట్రీట్ చేస్తున్నరట. టేక్ హెర్ టు సమ్ సెక్లూడెడ్ ప్లేస్" అంది సుదతి మోహన్ రెడ్డితో.
    మోహన్ రెడ్డి ఇంతకుముందు అన్న అంశం ఆమెకి ఆ రకంగా అర్ధం అయింది.
    "ఆమె అందుకు ఒప్పుకుంటారని నేననుకోను" అన్నాడు సుధీర్ ఇంగ్లీషులో.
    సుదతిని కాబోయే భర్త వివరాలు అడిగాడు మోహన్ రెడ్డి_విషయం మార్చాలని సుదతి చెబుతోంది.
    అంతలో నాలుగు టీ కప్పులు, బిస్కిట్లు వున్న ట్రే రెండు చేతుల్తో పట్టుకుని వచ్చింది గాయత్రి.

                                92

    స్నానించి _ నందివర్ధనం పువ్వులతో నిండిన ఆకుపచ్చరంగు చీర కట్టుకుని వాకిట్లోకి వచ్చింది, స్వప్నరాగలీన__ చీకటి వెలుగుల కౌగిలిలోని అసుర సంధ్యలోకి, ఉషస్సంధ్యలా.
    పచ్చికమీద కూచుని, చేతులో వున్న చిన్న టేప్ రికార్డర్ పక్కనపెట్టి మీట నొక్కింది. హిందుస్థానీ జయజయవంతి రాగం_గాత్రం.
    అప్పటిదాకా చారుమతీ వరహాశాస్త్రీ వుండివెళ్ళారు. ఆ మధ్య జాన్ తనపెళ్ళి శుభలేఖ ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆమెతోపాటు మేరీ మరో యిద్దరు వున్నారు. మేరీని పాటలు పాడమన్నారు. ఇంగ్లీషువీ హిందీవీ సినిమా పాటలు. ఆఖరి పాట 'షోలే' లోని 'మెహ్ బూబా' అది వింటున్నప్పుడు ఆ పాట వరాహశాస్త్రి పాడగా వినటమే కాక చూడాలనిపించి నవ్వుకుంది. ఇవ్వాళ సాయంత్రం నాలుగింటికి వచ్చి ఆరింటిదాకా వున్నారు చారుమతీ, వరాహశాస్త్రీ. స్వప్న రాగలీన సినిమా పాటల ప్రసక్తి తెచ్చింది. "శాస్త్రిగారూ, మీ రాగ కౌసల్యం గురించి వినటమేగానీ గావించగా వినే భాగ్యం కలగలేదు నాకు" అంది.
    "అటు శాస్త్రీయం సాధ్యపడక, యిటు అశాస్త్రీయానికి సిద్ధపడలేక ఉభయ భ్రష్టత్వ శాస్త్రినయ్యాను_నేను పాడి వినిపిస్తే సంగీతాన్ని అనుభవించగల వాళ్ళని హింసించినట్లే అవుతుంది. యేదో సరదా కూనిరాగాలూ అరుపులూ. నేను పుట్టకముందటి, యెవరు చేసిన ఖర్మ వారనుభవింపక తప్పదన్నా_ అనో, నా చిన్నప్పటి సినిమాలో పాట_ కాశీకి పోయాను రామా హరీ_ అనో యేదో కుయ్యకుండ తప్ప పాడటం రాదంటే నమ్మండి" అన్నాడు.
    "మా అన్నయ్య కొంచెం అతిశయోక్తి పోతున్నాడు లెండి. నాకు వీణ వచ్చినంత తనకి గాత్రమూ వచ్చు. అప్పుడప్పుడు కేదారగౌళ కూనిరాగం తీస్తుంటాడు. అది వినే యోగం పట్టని అదృష్టవంతులు మీరు. త్యాగ రాజస్వామి వారి కృతులతోపాటు ఘనం శీనయ్య ప్రసిద్ధ జావళీగానీ క్షేత్రయ్య పదాలుగానీ చక్కగా పాడతాడు. సినిమా పాటలూ వొచ్చు. బైజు బావరాలో హరివోం. అనార్కలీలో పాటలూ_" అంది చారుమతి.
    అనార్కలీలోని "యే జిందగీ వుసీకి హైజో కిసీ కా హోగయా_" యెక్కడ పాడతాడో అని భయపడిపోయింది స్వప్నరాగలీన. ఒకసారి వో మంచి సంగీత విద్వాంసుడిచేత పాడించి భంగపడింది. 'ఆ పాట లత తప్ప మరెవరూ పాడకూడదు_' అనుకుంది.
    ప్యాపాలోని విందు సందర్భం పాటు, వేశ్యవాటిక పాట అడిగింది. పాడాడు_"నాకు హిందీ బొత్తిగా రాదు. బూతులు కూస్తే మీరు క్షమించాలి. మీకు హిందీ బాగా వచ్చని విన్నాను" అని,
    అప్ప్దూ అడిగింది__ "మెహ్ బూబా పాడతారూ?" అంది.
    "భలే! మీకెందుకు ఆ ఆలోచన వచ్చింది? వీడు ఆ పాట పాడుతూంటే వినడం కంటే చూడడం బావుంటుందండీ. ఆ పాటకి గమకాలు బాగా జోడించి చచ్చే హైరానా పడుతూ పాడతాడు" అని నవ్వింది చారుమతి.
    "నువ్వూరుకోవె వాళ్ళీ పాటని అసలు యీ ఫణితిలో పాడించివుంటే ఆ సినిమా ఐదేళ్ళు ఏకబిగిన నడుచును" అని ప్రారంభించాడు పాడటం.
    ఆ పాట పాడుతూండగా అతనిని చూస్తూంటే నవ్వొస్తుంది గానీ, చూడకుండా వున్నప్పుడు ఆ పాటకి వొకలాంటి లోతు తీసుకొచ్చినట్లనిపించింది.
    "ఎంతైనా సంగీతపు వంశంలో వాణ్ని. యీ జులాయి పాటతో మిగిస్తే మా పెద్దలకి అపచారం చేసినట్లవుతుంది" అని, "మరుగేలరా" పాడి ముగించాడు.
    "మీలాంటివాళ్ళు తప్పించుకోకుండా, ఈసారెప్పుడో వొక వీణ తెప్పించి వుంచుతాను సుమీ!" అని చారుమతితో అంది.
    టేప్ లో సెలయేటి జాలులా ప్రారంభమైన జయజయవంతి వేగం పుంజుకుంటోంది.
    స్వప్నరాగలీన పినతండ్రి నాగిరెడ్డి టూర్ వెళ్ళినందున వచ్చిపోయే విజిటర్స్ లేక చప్పుడు లేకుండా మరింత ప్రశాంతంగా వుంది ఆవరణ. అతను ఎప్పుడు డి.పి.ఐ. కాదు. రెవెన్యూ బోర్డులో మెంబరుగా వేశారు. టూర్లు ఎక్కువగా వుంటున్నాయి. వారంరోజులైంది వెళ్ళి.
    టేప్ లో జయజయవంతి ముగిసి_మాల్ కౌస్ రాగం ; సితార్ మొదలైంది. లోహంలోని సాంద్రతనంతటినీ అతి సన్నదనం లోకి లాగితే షికార్ పద్యం తయారై వుంటుందేమోననిపిస్తుంది_ఆమెకి.
    కనురెప్పలకి దిద్దుకున్న కాటుకలా, చీకటి ఆమె శరీరాన్ని వెలిగిస్తోంది.
    పల్చని గాలి తెర ఒంటిని తాకితే, యేవో నైరూప్యభావనలు నెత్తురై నరాలలో ప్రవహిస్తున్నాయి.
    వింటున్న సంగీతంలో రంగులు. చూస్తున్న రంగుల్లో సంగీతం_ ఆ సంగీతంలో యేదో అనిర్వచనీయమైన స్పర్శ. ఆ స్పర్శ అనేది నాలుకకి కాక అస్థిత్వం అంతటా ప్లావితమైన మాధుర్యం.
    ఉషస్సులో కరిగిపోతున్న చీకటిలా, ఆ మాల్ కౌస్ సితార్ నాదం ఆమెని ప్రకృతిలోకి కరిగిస్తోంది. ఆమె లేదు. ప్రకృతే వుంది. లేని ఆమె టేప్ పీక నొక్కి ఆపేసింది. ఆపైన ఆ సంగీతం వినలేదు. అక్కడినుంచి మౌన సంగీతం. మౌన చేతన విశ్వసంగీత మౌనలీన. ఆ మౌనంలో రంగు అదృశ్యపు రంగుల మౌన సంగీతంలో నాట్యం. నాట్యలయ, విశ్వలయలోని నాట్య నవల లోంచి_కాటుక దుప్పటిని కప్పుకుని విశ్వపుటనురాగ అంతర్యపు తలగడ మీద చెక్కిలి కనురెప్పలు వాల్చింది స్వప్నరాగలీన.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.