Home » vaddera chandidas » Anukshanikam 2



                                93

    రీగల్ టాకీసులో రెండో ఆట సినిమా చూసి, లక్డీకపూల్ మలుపులో యిరానీ హోటల్లో టీ తాగి బయటికొచ్చిన రామ్మూర్తి ఆ పక్కగా నుంచుని వున్న ఒకామెని చూసి పెదవి విరిచి, "అన్నీ ఎదురుబడ్డ శాల్తీలే_" అనుకున్నాడు. అతని కళ్ళలో తారస్తనా క్షణకాలం మెదిలాయి. ఐతే అతనికి వెనకటిలా ఆలోచనల ప్రవాహమూ భావనల స్రవంతీ లేవు. పగటికలలు సాగవు. నిదట్లోనూ రావు. వచ్చినా తియ్యటి కలలు రావు. యెప్పుడన్నా వచ్చినా, పొద్దుట లేచాక యేదో ఛాయలా యిబ్బంది పెట్టటం తప్ప కల గుర్తుకి రాదు.
    ముందుకి అడుగులు వెయ్యబోతూండగా, ఆమె రామ్మూర్తి ముఖంలోకి చూసింది. ఆ చూపులో పడి గిజగిజలాడుతున్నాడు రామ్మూర్తి. అతనికి అలాంటి చూపు అనుభవంలో లేదెన్నడూ.
    ఆమె రమణి.
    చూపుతో అతనిని చుట్టేసి_ "హలో" అంది చిన్నగా రామ్మూర్తి గిజగిజలాడటం పసికట్టి, "హౌలాంగ్?" అంది.
    ఆ చూపు_పదునైన కత్తితో హల్వా ముక్క తీసినట్లు_పిసరంత కూడా నొప్పిలేకుండా గులాబిరేకుతో శరీరాన్ని యిటునుంచటుకి రెండు ముక్కలుగా గీసెయ్యటం సాధ్యమైతే యెలా వుంటుంది" అలా అనిపించింది రామ్మూర్తికి.
    పెదాలతో నిశ్శబ్దంగా నవ్వింది. నవ్వినప్పుడు ఆ చూపు రమ్మని పిలిచినట్లుగా అనిపించింది. కానీ ఆ చూపు రమ్మని సైగ చెయ్యనే లేదు. ఆ చూపు విద్యుత్ వలయంలా చుట్టేస్తుంది. ఎటువైపుకి కదిలినా షాక్ కొట్టి ప్రాణాలెగిరిపోతాయి. ఆ చూపులో గుంజేతనం. మేగ్నేట్ లా కాక, పొత్తి కడుపు కండరంలో వేలిని నొప్పి లేకుండా గుచ్చి కుదుట్లో పట్టి గుంజినట్లుగా అనిపిస్తుంది. ఆ చూపుకీ హృదయానికీ సంబంధం వున్నట్లనిపించదు. ఆ చూపుకీ, నరాలకీ కూడా సంబంధం వున్నట్లనిపించదు. సెక్సెంటింపు అవయవాలు కలిగించే అలజడీ తిమ్మిరీ కాదు. విషంలా నరాలలో ప్రాకే యేదో సెగ_చుట్టేసి ప్రాణిని అసాంతం కంబళించి వేసే సెగ. అలాంటి సెగ చూపులో పడి గిలగిలా తీపుగా కొట్టుకులాడుతున్నాడు రామ్మూర్తి.
    రామ్మూర్తి పక్కగా అడుగులు వేసి అతని చేతిని తనచేతిలోకి తీసుకుంది రమణి. అతని చెయ్యి కంపించింది. ముందుకు అడుగులు వేసింది. అతని కళ్ళలో ఆమె చూపు. అతని చుట్టూ ఆమె చూపు. ఆ మహాకామపు విద్యుత్ వలయం ముందుకు సాగిపోతుంటే నిస్సహాయంగా తనూ సాగిపోతున్నాడు!
    "మే ఐ నో యువర్ గుడ్ నేమ్?" అంది.
    "రామ్మూర్తి" అన్నాడు రామ్మూర్తి తడబడుతూ.
    "యీ వూరేనా?" అంది ఇంగ్లీషులోనే.
    "వూఁ" అన్నాడు.
    "యెటునుంచెటు?" అంది ఉర్దూలో!
    "ఉర్దూ రాదు" అన్నాడు ఇంగ్లీషులో.
    "అసలేవూరు?" అంది ఇంగ్లీషులోనే.
    "మచిలీపట్నం" అన్నాడు.
    "బందరు బుల్లోడివన్నమాట" అంది తెలుగులోనే.
    "రామ్మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. అతనికెందుకో_ ఉత్తరభారతం మనిషి అనుకున్నాడు.
    "హీఁ_ హీఁ_" అన్నాడు.
    "ఇంటిపేరు" అంది.
    "పురాణం."
    "చతుర్వేదుల లింగమూర్తి తెలుసా?"
    "వుఁహూఁ"
    "కంగారు రంగారావు?"
    "వుఁహూఁ"
    "నిజంగా ఆ వూరేనా? కంగార్రంగారావు తెలియనివాళ్ళు నామాల లింగమూర్తి తెలియనివాళ్ళూ బందర్లో వున్నారన్నమాట. మీరు క్రిత శతాబ్దంలోనన్నా పుట్టి వుండాలి. లేకపోతే ఐదేళ్ళ క్రితమన్నా పుట్టివుండాలి అని నవ్వింది.
    చెయ్యి విడిపించుకున్నాడు. తప్పుకుని వెళ్ళే యత్నంలో వున్నాడు. కంటికొనలోంచి అతని కళ్ళలోకి చూసింది_ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. భుజానికి భుజం ఆనుతూంది. ఆ చూపులోపల, ఆ రెండు భుజాలూ కలిసిపోతున్నాయి.
    నడుస్తోంది. ఆమె చూపు అతణ్ణి ఈడ్చుకుపోతోంది.
    యివాళ సాయంత్రం పూనా నుంచి వచ్చిన రైల్లోంచి దిగింది రమణి. దిగాక కొచ్చిన్ వెళ్ళాలని తెలిసింది. పొద్దునే కాజీపేటకి చేరి ఢిల్లీ నుంచి వచ్చే రైలు పట్టుకోవాలి. యెందుకంటే__
    మూడు నెలలక్రితం బొంబాయిలో ఒకతనితో వుంటూండగా తనకి కడుపులో బాగా నొప్పిగా వుంటే ఓ డిస్పెన్సరీకి తీసికెళ్ళాడు అతను. చిన్న అల్సర్ వుంది తీసెయ్యాలట. ఆ సందర్భంలో ఆ సర్జను రమణి గురించి ఆసక్తి కలిగి ఆమెను పరీక్షించాడు. ఆ సర్జనుకి అరవై ఐదేళ్లుంటాయి. మిలటరీలో చేసి రిటైరయ్యి ప్రాక్టీసు పెట్టుకున్నాడు. మంచి నిపుణుడు. రమణి అంత ఆరోగ్యంగా యెలావుందో అతనికి అంతుపట్టలేదు. ఆమె ఒంట్లో లేని సుఖవ్యాధులంటూ లేవు. ఒంట్లో యింకిపోయిన స్థితీ దాటిపోయింది. అసలు లేనట్లుగా వొళ్ళే వాటితో తయారైనట్లుగా ఐన స్థితి. అంతుపట్టలేదు. పూర్తిగా యెలా సాధ్యమో. నెత్తురు, వుమ్మి, మూతం_ పరిక్షలకి పంపించాడు_ మైక్రోబయాలజీ. వైరాలజీ_తదితర నిపుణులకి. ఏ కాంప్లికేషన్ లోకి రాణి ఒకలాంటి విషపుజీర ఆ మూడింటిలోనూ వున్నట్లు తేల్చారు. ఆ సర్జన్ కి రమణిని తీసుకెళ్ళి అతను బాగా తెలుసు. విషయం చెప్పి "నాలుగు మూడు రోజులంటే ఫరవాలేదు. కొంతకాలంపాటు వుంటే తెలియని యెలాంటి హాని మీ వొంట్లోకి ఇంకుతుందో చెప్పలేం." అని సలహా యిచ్చాడు.
    రమణి ఆపరేషన్ అయ్యి కాస్త కోలుకున్న దగ్గిర్నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. బయట బయటే వుండి వస్తున్నాడు.
    'పొమ్మనలేక మొహమాటపడి ఛస్తున్నాడు పిచ్చినాగన్న' అని అనుకుని క్షణంలో బిచాణా ఎత్తేసింది, చెప్పకుండా. బిచాణా ఎత్తేసెయ్యటమంటే మరేమీ వుండదు. వున్నపళంగా ఉత్త చేతుల్తో రైలెక్కటమే. యెన్నడూ మూడు చీరల కంటే మించి కొనుక్కోదు. యెవరన్నా కొంటే యెన్ని కొన్నా పడుతుంది అన్నీ. యెన్ని కొనిచ్చినా ఏమేమీ కొనిచ్చినా, తాను బిచాణా యెత్తేసేటప్పుడు_ చెప్పనూ చెప్పకు. యేమీ వెంట తెచ్చుకోనూ తెచ్చుకోదు. వొక్కతే ఓ గది తీసుకుంటున్న సందర్భంలో_ఓ కూజా, ఓ చాప, ఒక బొంత, దిండు. రైలు ఎక్కేటప్పుడు అవీ అక్కడ వదిలేస్తుంది. తాగుడూ సిగరెట్టూ అలవాటు లేదు. తోడు కోసం అరసీసా నీట్ ఖాళీ చేసి పది సిగరెట్లు ఏకబిగిన వూదెయ్యనూ గలదు. కానీ వాటిమీద మనసెన్నడూ పోలే. తానుగా వాటినెన్నడూ ముట్టుకోనూ ముట్టుకోలేదు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.