Home » vaddera chandidas » Anukshanikam 2



    "గాయత్రీ నువ్వు ఎగ్జామ్ రాస్తే మంచిగుండేది." అంది సుదతి.
    "నీలాగా నేనూ నా జూనియర్స్ తో కలిసి రాద్దామని" అని చిన్నగా నవ్వి, "బాగా రాశావుగా?" అంది గాయత్రి.
    "ఏదో రాసిన. మోహన్ కి క్లాస్ వస్తది. యింతకు ముందటంత యబౌ సిక్ట్సి పెర్సెంట్ వున్నది" అంది సుదతి.
    "రాస్తే మీకు రాంక్ వచ్చేది" అన్నాడు సుధీర్ ఇంగ్లీషులో.
    "యీ లా చదువు సంగతి మీకేం తెలుసు డర్టీ యెస్ట్ లా. నాకు ఆ పుస్తకాలు అసహ్యం. వాదాలత తీర్చుకోటానికి తప్పితే లా ప్రాక్టీస్ దేనికి? మోహన్ కోర్టులో వాగి ఏం సాధిస్తాడో చూద్దాం. లా పూర్తి చెయ్యాలనే ఆలోచన కూడా లేదు. లాలో యెందుకు చేరానో యేఁవో" అని గాయత్రి మోహన్ రెడ్డి వంక చూసింది అదోలాగా.
    అతనితో కలిసి చేరింది_లా ప్రాక్టీస్ అనే ఆలోచనతో కాదు కానీ కోర్టుల్లో వాదించి వాయించాలని అనుకుంది. ఐతే అదంతా వృధా ప్రయాస అని తరవాత తరవాత అనుకోసాగింది.
    అరుణ చనిపోయినప్పటి నుంచి అదోలాగా వుంటోంది. ఇన్నాళ్ళైనా మళ్ళీ గర్భవతి అవలేదు. మోహన్ రెడ్డి పరిక్షలకి చదువుతూ గాయత్రిని చదవమంటే, "నేను లా వదిలేస్తున్నాను. నేనేమీ చదవను. నేనేమీ కోర్టుల్లో వాదించను. నాకేదో కావాలి. నేనేదో చెయ్యాలి. యేదో అంతర్ "మధనంలా అనిపిస్తోంది." అని "మావో ఆన్ ఆర్ట్ అండ్ లిటరేచర్" పుస్తకంతో మొదలెట్టి డాసొయ్ వస్కీ నుంచి సులోచనారాణి దాకా దొరికిన ప్రతి పుస్తకమూ చదివేసిందీ రెండు మూడు నెలలూ.
    "మనవాళ్ళందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చినారా" అన్నాడు మోహన్ రెడ్డి.
    "ఇస్తున్నాం. యింకా అందరికీ ఇవ్వలే. అదేపనిలో వున్నాం. సుధీర్ పాపం సాయంగా వస్తున్నాడు" అంది సుదతి.
    "దారిలో విజయ్ కుమార్ కనిపిస్తే కూడా వెడ్డింగ్ కార్డ్ ఇవ్వలేదేమె" అన్నాడు సుధీర్.
    "మంచిపని చేసింది. డర్టీ రోగ్" అంది గాయత్రి.
    "మీ అరెస్ట్ టైంలో ఆ యస్సై అసభ్యంగా ప్రవర్తించటానికి కారణం వీడేనట. ఆ యస్సై వీడికి బాగా తెలుసట రిలేటివ్ కూడానట" అన్నాడు సుధీర్ ఇంగ్లీషులో.
    "వీడెలాగూ రోగ్. ఆ యస్సై విధి నిర్వహణలో వున్నవాడు వాడికి వుండక్కర్లా బుద్ధి? మొన్న ఒకరోజున బజార్లో మోటర్ బైక్ మీద పోతూ కనిపించాడు ఆ యస్సై. నా దగ్గిరగా స్లో చేశాడు. పరిహాసంగా ఫక్కుమని నవ్వాను. అఫ్ కోర్స్, అన్ ఇన్ టెన్షనల్ గా అనుకోకుండానే. గుర్రుగా చూసి వేగం పెంచిపోయాడు. విజయ్ కుమార్ ని మన జనార్ధన్ ప్లేస్ లో కూచోబెట్టండి యెవరితోనూ దెబ్బలాడడు. కానీ దట్ విల్ బి యె డిస్ గ్రేస్. అఫ్ కోర్స్, మెనీ మెంబర్స్ ఆఫ్ డిస్ గ్రేస్ ఫుల్" అంది గాయత్రి.
    "విడిపోయిన కవులు మరికొందర్ని లాగేసెయ్యాలని చూస్తున్నారు"
    "వాళ్ళేపాటివాళ్ళు. వాళ్ళు పూర్వకవులు. విప్లవ కవిత్వం ఏవైనా రాశారా? రాయలేదు. రాయగలవాళ్ళు, రాస్తున్నవాళ్ళు యింకా ప్రసిద్ధులవలేదు. వెనకటి వాళ్ళ వాళ్ళ ఒరిగేదేం లేదు. ఎమర్జెన్సీకి భయపడేవాళ్ళు నిరసంలో వుండతగ్గవాళ్ళు కాదు" అంది గాయత్రి.
    "ఆ మధ్య కడప ఆకాశవాణిలో ఎమర్జన్సీ స్తోత్రం చేసినారు కొందరు కవులు" అన్నాడు మోహన్ రెడ్డి.
    "ఎవరెవరు?"
    "ఆరుద్రాదులు. శ్రీశ్రీ లేడులెండి_ వున్నా ఆశ్చర్యపడక్కరలేదు. కానీ ఆ గుంపులో చొరబడితే శ్రీశ్రీ ప్రత్యేకత వుండదు. విడిగా వీలూ వాలూ చూసుకుని అధమత్వంగా ప్రవర్తిస్తాడు" అని నవ్వింది గాయత్రి.
    "నీకు శ్రీశ్రీ అంటే స్పెషల్ డిజ్ లైక్" అంది సుదతి.
    "అవును. శ్రీశ్రీ అంటేనేకాదు. విరసం నియమావళిని ఉల్లంఘించే విరసం సభ్యులైనప్పుడు."
    "ఎమర్జన్సీని సమర్ధిస్తూ వెంగళ్రావు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ స్టేట్ మెంట్ యిచ్చినట్లు తెలుస్తున్నది" అన్నాడు సుధీర్.
    "ఆశ్చర్యపడక్కర్లేదు. జైల్లో కూచోవలసి వస్తుందేమోనని. యీ పేరున జైల్లో కూచుని పేరు తెచ్చుకోవాలనుకునే చవటల కంటే అధమత్వం అంటాను. శ్రీశ్రీ శబ్దలోలుడే కాదు వ్యసనలోలుడు కూడా, సిగ్గులేకుండా తరవాత లెంపలేసుకుంటాడు. అంతకంటే సిగ్గులేకుండా విరసం క్షమించేస్తుంది. అసలు, విరసం నియమావళిలోనే కొంత లోపం వుంది. మినహాయింపులు వుండకూడదు. మనమే కఠోర దీక్షలో వుండలేకపోతే యితరులకి చెప్పే నైతిక హక్కు మనకెక్కడిది? మనమే యీ స్థితిలో వుండిపోతే యిక సరైన గ్రహింపు చైతన్యం లేని ప్రజానీకం ప్రలోభాలకి లొంగిపోవటంలో ఆశ్చర్యం యేం వుంటుంది? విరసం వర్థిల్లుతుంది. కానీ వీళ్ళ వల్లకాదు. నిజాయితీ వున్న నిజమైన యువతరం మార్క్సిస్టులతో విరసం వర్ధిల్లుతుంది. ఎమర్జన్సీని నిరసించలేనివాళ్ళు విరసంలో వుండతగ్గవాళ్ళు కాదు" అంది గాయత్రి.
    "ఎమర్జన్సీ మహా జోరుగా సాగుతోంది. రామక్రిష్ణాలో "షోలే" సినిమా అంత జోరుగా సాగుతోంది. త్వరలో, గాయత్రి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని తెలిసింది." అన్నాడు సుధీర్ ఇంగ్లీషులో.
    "ఒకానొక మూడ్ లో వుండిపోయినందునో యేవోఁ యింట్లోనే వుండి పోతున్నాను. నేను బయటికొస్తే యెప్పుడో అరెస్టు చేసి వుండేవారు. చేసి, వాళ్ళు సాధించగలిగేదేమిటి? అణిచివేత ఎన్నటికీ నెగ్గదు. ఆఖరికి మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇందిర తోడ్పాటుతో కూడా!" అని పరిహాసంగా నవ్వి, "వీళ్ళంతా వెన్నెముక లేనివాళ్ళు. మాట్లాడే వాళ్ళంతా అంతే యింత మాట్లాడుతున్న నేను__" చటుక్కున ఆగిపోయింది గాయత్రి, వుద్వేగంగా.
    "తపస్యా ఫిలిమ్ కి పోయే మూడ్ లో వున్న నిన్ను ఈ మూడ్ లోకి తెచ్చినం మేమొచ్చి" అంది సుదతి సంజాయిషీలాగా.
    "నిన్నటినుండి నేను అనంగ అనంగ సరే అన్నది. గాయత్రియే ఫిలిం మూడ్ లోనూ లేదు. ఆమెను కొంతకాలం యెక్కడికైనా రెక్లూజ్ ప్లేస్ కి తీసుకుపోవాలనుకుంటున్న. యిదంతా ఆమె స్వభావం. ఆమె వూపిరి. ప్రస్తుత సమస్య వేరే వున్నది." అన్నాడు మోహన్ రెడ్డి.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.