Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త స్సర్వ పరిగ్రహః
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ 21
ఎవడు అంతఃకరణమును, ఇంద్రియములను జయించినవాడో, సమస్త భోగసామాగ్రిని త్యజించినవాడో, ఆశారహితుడైన సాంఖ్యయోగి శారీరక కర్మడులను, ఆచరించుట వల్ల పాపము పొందడు.
యాదృచ్ఛా లాభ సంతుష్టిః ద్వంద్వాతీతో విమత్సరః
సమ స్సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే 22
లభించిన దానితో సంతృప్తుడు, ద్వంద్వాతీతుడు, మత్సరము లేనివాడు, జయాపజయములందు సమబుద్ధిగలవాడు, కర్మి అయ్యు నిబద్ధుడు కాడు.
గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే 23
శరీర సంబంధములను వదలినవాడు జ్ఞానమానసి, యజ్ఞములు చేయువాని కర్మములు పూర్తిగా విలీనములగును.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా 24
అర్పణము బ్రహ్మము, హవిర్ర్బహ్మము, అగ్ని బ్రహ్మము, కృతం బ్రహ్మము, బ్రహ్మకర్మసమాధి యుందుండువాడు బ్రహ్మయే యగుచున్నాడు.
దైవ మేవా పరే యజ్ఞం యోగినః పర్యుపాగతే
బ్రహ్మగ్నావపరే యజ్ఞం యజ్ఞోనైనోప జుహ్వతి 25
కొందరు యోగులు, దేవతలకు సంబంధించిన యజ్ఞమునే ఆచరింతురు. మరికొందరు జీవాత్మ, పరమాత్మయందు లీనమగుటయే బ్రహ్మముగా భావింతురు. వారు యజ్ఞమున జీవాత్మను బ్రహ్మాగ్నియందు సమర్పింతురు.
శ్రోత్రాదీ నీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి
శబ్దాదీన్విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి 26
కొందరు శ్రోత్రాది ఇంద్రియములను, నిగ్రహమును అగ్ని యందు దహింతురు. మరికొందరు, శబ్దాది విషయములను ఇంద్రియాగ్నియందు దహింతురు.
సర్వాణీంద్రియ కర్మాని ప్రాణకర్మాణి చాపరే
ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే 27
ఇంకొందరు ఇంద్రియ కర్మలను, ప్రాణ కర్మలను ఆత్మ నిగ్రహమను అగ్నిలో యజింతురు. వారు జ్ఞాన దీపికలు.
ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞా స్తథా -పరే
స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ స్సంశితవ్రతా 28
కొందరు ద్రవ్య యజ్ఞమును, మరికొందరు తపోయజ్ఞమును, ఇంకొందరు స్వాధ్యాయ యజ్ఞమును ఆచరించి ఆశింతురు.
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే -పానం తథాపరే
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః 29
ప్రాణాయామ పరాయణుడు, అపానమునందు ప్రాణమును, ప్రాణమునందు అపానమును చేర్చెదరు. ఇది ప్రాణాపానగతి సావనము అగుచున్నది.
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి
సర్వే ప్యేతే యజ్ఞవిదః యజ్ఞ క్షపిత కల్మషాః 30
కొందరు ఆహార నియతులు, ప్రాణములను ప్రాణములందే యజింతురు. వీరందరు యజ్ఞవిదులు. యజ్ఞమువలన కల్మషము లేనివారు అగుచున్నారు.
యజ్ఞ శిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనమ్
నామం లోకో-స్త్యయజ్ఞస్య కుతో -న్యః కురు సత్తమ 31
యజ్ఞము యొక్క శేషము, అమృతము అగుచున్నది. దానిని భుజించువారు సనాతనమగు బ్రహ్మమును చేరుచున్నారు. యజ్ఞము చేయనివారికి యీ లోకమే లేదు. పరలోకమెట్లు?
ఏవం బహువిధాయజ్ఞాః వితతా బ్రహమణో ముఖే
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వావిమోక్ష్యసే 32
వేదమున వివిధ యజ్ఞములు చెప్పబడినవి. అర్జునా వీటన్నింటిని తెలియము. వాటిని తెల్సి విముక్తుడవగుదువు.
శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప!
సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే 33
అర్జునా ద్రవ్యయజ్ఞమునకంటెను జ్ఞాన యజ్ఞము ఉత్తమము. సర్వయజ్ఞములు జ్ఞాన యజ్ఞమునందే పరిసమాప్తములు అగుచున్నవి.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః 34
అర్జునా! జ్ఞానమును తత్వముగా దర్శించిన వారిని సేవింపుము. ప్రశ్నల వలన వారివద్ద నుండి జ్ఞానమును పొందుము. వారు జ్ఞానమును ఉపదేశించువారు అగుచున్నారు.
యజ్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి 35
అర్జునా! దానిని తెలియుము. మరల మోహమును పొందకుము. దానివలన నాయందు సమస్త ప్రాణులను దర్శించగలవు
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి 36
అర్జునా! నీవు పాపులందు పాపివేయైనచో జ్ఞాననౌకను ఆశ్రయించుము. అది నిన్ను పాపసముద్రపు తీరమునకు చేర్చును.
యథైధాంసి సమిద్ధో -గ్ని భస్మసాత్ కురుతే -ర్జున
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా 37
మండుచున్న నిప్పు కట్టెలను బూడిద చేయును. అట్లే జ్ఞానమును అగ్ని కర్మలను బూడిద చేయును.
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
తత్స్వయం యోగ సంసిద్ధః కాలే నాత్మని విందతి 38
ఈ లోకములో జ్ఞానమును మించినది మరొకటి లేదు. స్వయముగా యోగసిద్ధుడైన వాడు ఆత్మ జ్ఞానమును పొందుచున్నాడు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానాం తత్పర స్సంయ తేంద్రియః
జ్ఞానం లబ్ధ్యా పరాం శాంతిం అచిరేణా గచ్ఛతి 39
శ్రద్ధ గలవానికి జ్ఞానము లభించును. ఇంద్రియ నిగ్రహము కలవానికి గూడా జ్ఞానము లభించును. జ్ఞానము లభించినవానికి త్వరలోనే పరమైన శాంతి లభించును.
అజ్ఞశ్చా శ్రద్ధధాన శ్చ సంశయాత్మా వినశ్యతి!
నాయం లోకో-స్తి న పరః న సుఖం సంశయాత్మనః 40
అజ్ఞులు, అశ్రద్ధావంతుడు, సంశయాత్మ నశించును. అట్టి వానికి యీ లోకమున, పరలోకమున సుఖము లభించదు.
యోగసంన్యస్త కర్మాణం జ్ఞానం సంఛిన్న సంశయమ్
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ! 41
అర్జునా! యోగమున సమస్త కర్మలను భగవంతునికి అర్పించిన వారిని, సంశయములను, జ్ఞానముతో తీర్చుకున్నవారిని, ఆత్మవంతులనూ కర్మములు బంధించవు.
తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థం జ్ఞానాసి నాత్మనః
చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోతిష్ఠ భారత! 42
నీకు అజ్ఞానము వలన కలిగిన సంశయములను జ్ఞానము అను కరవాలముతో ఖండించుము. సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవగుము. యుద్ధమునకు సన్నద్ధుడవు అగుము.





