Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



        అజో - పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో - పి సన్
        ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మ్యాత్మ మాయయా 6

    నేను జన్మ రహితుడను. నిత్యుడను. సమస్త ప్రాణులకును ఈశ్వరుడను ఐనను ప్రకృతిని ఆధీనములో వుంచుకొంటాను. యోగమాయచే అవతరించుచుందును.
        యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
        అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ 7

    ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అధర్మం పెచ్చు పెరిగినప్పుడు నేను అవతరిస్తాను. అధర్మాన్ని నశింప చేస్తాను. ధర్మాన్ని ఉద్ధరిస్తాను.

    దీపిక:

    1. ధర్మానికి ఏనాటికి హాని సంభవించదు. అది నష్టపడదు. సూర్యచంద్రులకు గ్రహణము వలె, అద్దమునకు దుమ్మువలె కనిపించకుండును. అదియే గ్లాని
    2. అలాంటి సమయములో స్వామి అవతరిస్తాడు. అవతరించడమంటే దిగటము. తన అంతస్తును క్రిందకు దించడము. మానవుడుగా జన్మించడము.
    3. స్వామి అంశా మాత్రముగా జన్మిస్తాడు. ఒకేసారి ఎన్ని అవతారాలు ఎత్తుతాడో తెలియదు. తెలిసినంతవరకు రాముడు - పరశురాముడు ఒకేసారి అవతరించారు.
    4. స్వామి అవతారాలు పది మాత్రమే కావు. స్వామివి అనేక అవతారాలు. స్వామి ఎవరికీ స్వస్వరూపముతో దర్శనమివ్వడు. ఆకలికి అన్నంగా - దాహానికి నీరుగా - ఎండకు నీడగా - అవసరమునకు మిత్రునిగా దర్శనమిస్తాడు.
    5. జ్ఞానికి తప్ప స్వామి సహాయము చేశాడని తెలియదు. నా వరకు నేను అజ్ఞుడను. నన్ను యింతటి విద్యావంతునిగా, విద్వాంసునిగా, రచయితగా, సత్పురుషునిగా తీర్చిదిద్దనవాడు స్వామి అనియే నా పూర్తి విశ్వాసము.
    స్వామి సమస్తము
    సమకూరుస్తున్నాడు
    ఐనా అనన్యంగా
    ఆశ్రయించలేకపోతున్నాను.   
        పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
        ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే 8

    సాధువులను రక్షించుటకు, ఫుష్టులను శిక్షించుటకు, ధర్మసంస్థాపన చేయుటకుగాను యుగ ముగములందు సంభవించుచున్నాను.

    దీపిక:

    యుగము అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు మాత్రము కావు. మానవ జీవన విధానము పూర్తిగా మారినప్పుడు యుగము అవుతుంది. స్థూలముగా మనకు ఆంగ్లయుగము, స్వాతంత్ర్యయుగము, పారిశ్రామిక యుగము కావచ్చు.
        జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః
        త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో- ర్జున 9

    అర్జునా! నా దివ్య జన్మకర్మలను తాత్వికముగా తెలిసినవాడు దేహమును వదలుతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. నన్ను చేరుకుంటాడు.
        వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః
        బమవో జ్ఞాన తపసా పూతా మద్భావ మాగతాః 10

    రాగ, భయ, క్రోధ రహితులూ; స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన పెక్కురు భక్తులు జ్ఞాన, తపస్సంపన్నులై, నా స్వరూపమును పొందినారు.
        యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్!
        మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః 11

    అర్జునా! నన్ను భక్తులు ఏ రీతిగా సేవింతురో నేను వారిని ఆ రీతిగనే అనుగ్రహించుచున్నాను. మానవులందరు వివిధ రీతులుగా నా మార్గమునే అనుసరించుచున్నారు.

    దీపిక:
    
    ఇచ్చట స్వామి ఉదార హృదయము వెల్లడైనది. నరులు దేశము, కాలము, కులము, మతము, సిద్ధాంతము, భాషలు వేరైనను స్వామిని అనుసరించుచున్నారు.
    సర్వదేవతలకు చేసిన నమస్కారం కేశవునే చేరును. సర్వదేద నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
    ఆకాశాత్పతితం తోయం సాగరం ప్రతిగచ్చతి
    ఆకాశమునుండి రాలునట్టి నీరు సముద్రమునే చేరుచున్నది. దేవతలు వేరైనను పరాత్పరుడు ఒక్కడే. అతడే స్వామి.
        కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః
        క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భోవతి కర్మజా 12

    కర్మఫలమును కోరువారు ఇతర దేవతలను పూజింతురు. అందువలన వారికి త్వరగా ఫలప్రాప్తి సిద్ధించును.
        చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః
        తస్య కర్తారమపి మా విద్ద్య కర్తార మావ్యోయమ్ 13

    గుణ, కర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా నేనే విభజించినాను. నేనే దానికి కర్తను. అట్లయ్యు నన్ను అకర్తగా అవ్యయునిగా గుర్తించుము. గుర్తెరుగుము.
        న మాం కర్మాని లింపంతి న మే కర్మఫలే స్పృహా
        ఇతి మా యొ - భిజానాతి కర్మభిర్న స బధ్యతే 14

    నన్ను కర్మలు కదిలించవు. నాకు కర్మ ఫలాసక్తి లేదు. ఇది ఎరిగినవాడు కర్మబద్ధుడు కాజాలడు.
        ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః
        కురుకర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ 15

    ఇది తెలిసికొన్న, మోక్షమును ఆశించిన పూర్వజనులు కర్మలను ఆచరించినారు. కావున నీవును నిష్కామకర్మలను ఆచరింపుము.
        కిం కర్మ కిమ కర్మేతి కవయో - పయత్ర మోహితాః
        తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ జ్ఞాత్వా మోక్ష్య సే-శుభాత్ 16

    కర్మ అకర్మలను గురించి, విద్వాంసులే తికమకలగుచున్నారు. నేను నీకు ఆ కర్మను ఉపదేశింతును.
    దానిని తెల్సుకొనుము. అశుభముల నుండి విముక్తుడవు అగుము.
        కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః
        అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః 17

    కర్మ అకర్మలను తెలిసికొనవలయును. వికర్మతత్వంబు గూడ తెలియుట అవసరము ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది.
        కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః
        స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్న కర్మకృత 18

    కర్మలో అకర్మను - అకర్మలో కర్మను చూచువాడు బుద్ధిశాలి అగుచున్నాడు. అతడు యోగి, సమస్త కర్మకుడు అగుచున్నాడు.
        యస్య సర్వే సమారంభాః కామసంకల్ప వర్జితాః
        జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః 19

    ఎవని కర్మలు కామ సంకల్ప వర్జితములో, ఎవనీ కర్మ జ్ఞానాగ్ని దగ్ధమో అట్టివానిని విద్వాంసులు విబుధులు అనుచున్నారు.
        త్యక్త్వా కర్మఫలా సంగం నిత్య తీప్తో నిరాశ్రయః
        కర్మణ్యభి ప్రవృత్తో - పి నైన కించిత్ కరోతి సః 20

    ఎవడు కర్మలను వదలినవాడో, నిత్యతృప్తుడో నిరాశ్రయుడో అట్టివాడు కర్మలు చేసియు అకర్మకుడు అగుచున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.