Home » vaddera chandidas » Anukshanikam 2



                                86

    అక్టోబరు నెల కాలేజీలకి సెలవులు. గాయత్రి రోజంతా యింట్లోనే వుంటోంది చదువుకుంటూ.
    మోహన్ రెడ్డి సాయంత్రం అలా వెళ్ళి వస్తాడు ఒక్కోరోజు. ఒక్కోరోజు ఆలస్యంగానూ వస్తాడు_ ఏ చర్చలలోనో దిగి ఉపన్యాసం మొదలెట్టి.
    గాయత్రి ఇంట్లోనే వుంటున్నందున కూతురు అరుణని తన అమ్మా నాన్నల యింటికి తీసుకెళ్ళనివ్వటం లేదు. మీ అమ్మా నాన్నా బెంగపడి పోతున్నారు_ అని ఒక్కోరోజు అరుణని తీసుకెళ్ళిపోయి నాలుగైదు గంటలు అక్కడ వుంచుతాడు మోహన్ రెడ్డి. గాయత్రి తల్లిదండ్రులతో మోహన్ రెడ్డికి మంచి సఖ్యత యేర్పడింది. అతనిని వాళ్ళు యెంతో ప్రేమగా చూస్తారు.
    కోర్టు విచారణ సందర్భం అప్పుడు "యింటికి రా_మ్మా" అన్నాడు రామనాధం ఒకసారి.
    మోహన్ రెడ్డి ఆ మాట ఒకసారి గుర్తుచేసి "యెందుకొచ్చిన పట్టింపులు. వెళ్తే ఏంపోయింది. వాళ్ళెంత ఇదైపోతున్నారో తెలుసా?" అన్నాడు.
    "మాట వరసకో, ఆ క్షణంలో ఆ యిదిలో యేదో అనేసినంత మాత్రాన వెళ్ళటానికి నాకు సిగ్గులేదూ? నేను గాయత్రిని. ఆ విధంగా ఆ గడప దాటి వచ్చిన గాయత్రి మళ్ళీ ఆ గడప తొక్కదు. నేను తన కూతురినే కాదన్న మా నాన్న యిక్కడికొచ్చి రమ్మని పిలిస్తే యేఁవోఁ చెప్పలేను" అంది. యీ మాట రామనాథంతో యెలా అనాలో చాతకాక అనలేదు మోహన్ రెడ్డి. యిదే విషయం మరొకసారి గుర్తుచేస్తే, "నువ్వు మీ నాన్నగారింటికి వెళ్ళిరా నీ అంతట నువ్వు. అప్పుడు చూస్తా నేను" అంది గాయత్రి.
    "నేను వెళ్తే నువ్వు వెళ్తావా?" అన్నాడు మోహన్ రెడ్డి.
    "నీకు ఒకవేళ సిగ్గులేకపోయినా నాకు వుంటుంది. నేను వెళ్ళను. నీకు సిగ్గుంటే మా వాళ్ళింటికి యెందుకెళ్తావు? నాకు తల్లిదండ్రులు కానివాళ్ళు నీకు అత్తమామలవుతారా? పైగా కన్నబిడ్డని వాళ్ళకప్పగిస్తున్నావు" అని నిందించింది.
    "మా అమ్మ వచ్చి పిలిస్తే మా యింటికి వెళ్తావా లేదా చెప్పు?" అన్నాడు మోహన్ రెడ్డి.
    "హిందూసతి భర్త అనుమతి తీసుకోకుండా భర్త అభీష్టానికి వ్యతిరేకంగా బిడ్డలకోసమైనా యేమీ చెయ్యకూడదు. మీ అమ్మా హిందూసతే మా అమ్మా హిందూసతే. ఏడుస్తూ ఇంట్లో కూచుంటారు మనసు చంపుకుని" అంది గాయత్రి. "మన తండ్రులూ మనసు చంపుకునే బాధపడుతున్నారు."
    "అది వాళ్ళ మూర్ఖపు పట్టుదల వల్ల. దానికి వాళ్ళే బాధ్యులు"
    ఐతే, మోహన్ రెడ్డి తల్లి ఏమైనా వండి పంపిస్తే తిరస్కరించదు. తన తల్లి ఏమైనా వండి పంపినా తిరస్కరించదు.
    కానీ తన కూతురు వాళ్ళెవరి దగ్గిరా పెరగకూడదని గట్టిగా అనుకుంది. అది సరైన వాతావరణం కాదు అనుకుంది.
    అక్టోబరులో వున్నట్లుండి అరుణకి జ్వరం విపరీతంగా వచ్చింది. వెంటనే డాక్టరుకి చూపెట్టారు. చికిత్స చేస్తున్నాడు. మూడురోజులైనా తగ్గలేదు. మరో యిద్దరు పీడియాట్రిషియన్స్ కి చూపెట్టారు. చికిత్స చేస్తున్నారు.
    రాత్రీ పగలూ నిద్ర లేకుండా ఒళ్ళో పెట్టుకుని కూచుంటుంది గాయత్రి. వాళ్ళ వాళ్ళు అడిగితే, "గాయత్రి వూరెళ్ళింది. కూడా అరుణని తీసుకెళ్ళింది_అని చెప్పు వాళ్ళతో" అంది మోహన్ రెడ్డితో. ఆమెకి యిష్టంలేదు వాళ్ళ సేవలు.
    పదోరోజు రాత్రి అరుణ చనిపోయింది.
    గాయత్రి యేడ్చింది. యెన్నడూ ఏడ్వని గాయత్రి రాత్రంతా, మరసటి పగలంతా.
    యేం జరుగుతున్నా యెన్ని జరుగుతున్నా లెక్కచెయ్యకుండా తల ఎగరేస్తూ అన్నిటినీ దూరంగా నెట్టేసుకోగలిగిన గాయత్రి యేడ్చి యేడ్చి_
    మూడురోజులైనా ఒక్క మెతుకు తినలేదు, మంచినీళ్ళు మోహన్ రెడ్డి మరీ బలవంతం చేసి బ్రతిమిలాడగా నాలుగు గుక్కలు టీ గానీ కాఫీ గానీ.
    అప్పటినుంచి గాయత్రి స్థబ్దుగా వుంటూంది. యెప్పుడూ కూతురు ఫోటో వంక చూస్తూ కూచుని వుంటుంది.
    మోహన్ రెడ్డి కనిపించినప్పుడల్లా రామనాథం అడుగుతున్నాడు. "గాయత్రి ఇంకా రాలేదా! చిట్టితల్లిని ఒకసారి తీసుకురా బాబూ యెన్నాళ్ళో ఐనట్లుంది చూసి" అని అంటే "యింకా రాలేదు. తన స్నేహితురాలు బలవంతం చేస్తే అక్కడే వుండిపోయింది." అని చెప్పాడు.
    కాలేజీలు తెరిచారు. గాయత్రి వెళ్ళటంలేదు. యింట్లోనే వుంటోంది.
    రామనాధం మళ్ళీ అడిగితే_కాలేజీలు తెరిచినందున గాయత్రి తిరిగి వచ్చిందనీ పిల్లని తీసుకురావటం యిష్టం లేదని_ అనుకుంటాడేమోనని, యెప్పుడైనా చెప్పాల్సిందిగా అని విషయం చెప్పాడు.
    "చిట్టితల్లికి అంత జబ్బు చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు బాబూ?" అని అడిగాడు రామనాథం.
    మోహన్ రెడ్డి మౌనంగా వున్నాడు.
    "ఆ తరవాతైనా చెప్పొచ్చుగా బాబూ. మేమేం పాపం చేశాం?"
    "గాయత్రి చెప్పక్కర్లేదంది" అన్నాడు చిన్నగా.
    పెదవులు బిగించి, భారంగా శ్వాస విడిచి స్వాభిమానంగా ముందుకి చూస్తూ, "వస్తా బాబూ" అని ముందుకు వెళ్ళిపోయాడు రామనాథం.
    కాలేజీలు తెరిచి పదిహేను రోజులైనా గాయత్రి యింట్లోంచి బయటికి కదలటం లేదు.
    మోహన్ రెడ్డి పోరు భరించలేక కాలేజేకి వెళ్ళటం మొదలెట్టింది. చదువుమీద వుత్సాహం లేదు.
    సాంఘిక ఆర్ధిక అధ్యాయాలు, మార్క్సిజం లాంటి అంశాలు తెస్తే ఆ వ్యధ మరిచి మాట్లాడటం గమనించిన మోహన్ రెడ్డి వీలైనంతవరకు ఏదోరకంగా ఆ విషయాల ప్రసక్తి తెస్తున్నాడు.
    ఒకసారి, "యేఁవిఁటి యీ మధ్య నీకు అస్తమానం అదే స్మరణ ఐపోయింది?" అంది గానీ గ్రహించలేకపోయింది_ అతను యెందుకు ఆ విషయాల ప్రసక్తి యెక్కువగా తెస్తున్నదీ.
    మరో నెల గడిచింది. డిశంబరు ఆఖరి వారం. ఓ ఉదయం పూట ఒకావిడ పసిబిడ్డతో యింటికి వచ్చింది. మోహన్ రెడ్డి బంధువుననిచెప్పింది. తనకి గుండె జబ్బు అనీ యిక్కడ పెద్ద డాక్టరుకి చూపెట్టుకోమంటే వచ్చిందట. భర్తకి తీరిక లేదట. "మన మోహన్ వున్నాడు అన్నీ వాడే చూస్తాడు పో" అని భర్త పంపితే వచ్చిందట. రాత్రికి మోహన్ రెడ్డి వచ్చాడు. ఆమె తన విషయం చెప్పింది. ముందు గదిలో ఆమెకి పడక యేర్పాటు చేశారు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.