Home » vaddera chandidas » Anukshanikam 2



    ఫోను అందుకుంటే "చూడు బాబూ విజయ్, నీ గురించి చూచాయగా ఇదివరకు తెలుసు. ఇవాళ సీతని పరీక్షించాను. నీ విషయం నీకు తెలిసినవాడిని సొంత భార్య విషయంలో జాగ్రత్తపడాల్సింది, నువ్వంటే_నీవొంట్లో ఇంకిపోయినయ్. అంత ఇబ్బంది వుండదు నీకు. వున్నా యేం చెయ్యాలో అనుభవం వున్నవాడివేగా_" అన్నాడు.
    "సారీ డాక్టరుగారూ పొరపాటు జరిగిపోయింది. యింక అట్లా జరగదు" అని చెప్పి తన గదిలోకి సీతను పిలుచుకువెళ్ళి తలుపువేసి, "డాక్టరు దగ్గరికెందుకెళ్ళావ్" అన్నాడు కోపంగా.
    "నీ ఒంట్లో బాగున్నట్లుగా లేదు సీతా, డాక్టరుగారి దగ్గరికెళ్ళిరా అని చిన్నత్తయ్య అంది." అని చిన్నగా అంది సీత.
    "మొగుణ్ణి నేనున్నానని గుర్తుండక్కర్లా? నాకు చెప్పకుండా యెక్కడికంటే అక్కడికి పోటమేనా? ఆ మాత్రాన చచ్చిపోవు. నాకు చెప్తే నేనివ్వనూ మందులు? ఆ డాక్టర్లకంటే నాకే బాగా తెలుసు మందులు" అన్నాడు కోపంగా. గుడ్లురిమి చూశాడు.
    తల వూపింది సీత, భయం భయంగా.
    అతని యిట్లాంటి కౄర ప్రవర్తనని అతని స్త్రీలందరూ సహిస్తారు. గింజుకునే దానికి మరికాస్త డబ్బు పారేస్తాడు. అలా ఐన అతని ప్రవర్తనని భరించలేని సహించలేనివాళ్ళు అతనిని యిష్టపడక తప్పించుకుంటారు. దిలావర్ యెంత ప్రలోభపెట్టి ప్రయత్నించినా.
    ఒకసారి మాత్రం, ఒకే ఒక్కసారి_
    నిజాం కాలేజీలో యేవో ఫంక్షన్స్ వుత్సాహంగా కోలాహలంగా జరుగుతున్నాయ్. మూడురోజుల కార్యక్రమం. మొదటిరోజున వందన భరతనాట్య కార్యక్రమం. అందరూ యెంతో మెచ్చారు. నాట్యం తెలిసినవాళ్ళు కూడా. ఒక నాట్యాచార్యుడు_"గొప్ప నాట్యకత్తెవి కాగలవమ్మా. గొప్ప నాట్యకత్తె సాధారణంగా కొన్ని అసాధారణ కఠోర నియమాలు పాటించాలి. కొన్ని త్యాగాలు చెయ్యాలి" అన్నాడు. ఆమెకి తెలుసు అవేమిటో. తనకి యిష్టంకూడా. పెళ్ళి చేసుకోదలచలేదు. తల్లి కాదలచలేదు. ఆమెకి అసలు పురుష సంపర్కం అంటేనే ఏవగింపు. అంతకంటే మించి_పురుషులంటే తనకే సరిగా తెలియని ఒకలాంటి కక్ష. తన నాట్యాన్ని మెచ్చుకోవటం వరకే పురుషులతో ఆనందిస్తుంది. ఆఖరికి వ్యక్తులుగా కూడా రుచించరు_మాట్లాడుతూ కూచోవటం కూడా.
    రెండోరోజు ఫంక్షన్ లో రాత్రి యెనిమిదిన్నరకి అటుగా వెళ్ళి వస్తున్న వందనని చూసి చకచకా నడిచి వెళ్ళి, నిన్నటి ఆమె నాట్యాన్ని అమితంగా మెచ్చుకున్నాడు విజయ్ కుమార్. అతని స్వభావము తెలిసినందున నిజాయితీ పొగడ్త కాదని తెలిసినా సంతోషించింది. "థాంక్యూ" అంది.
    మసక చీకటి.
    "వందనా నిన్ను పెళ్ళాడతాను." అని దర్పంగా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
    రెండో చేత్తో చాచి లెంపమీద కొట్టింది.
    విజయ్ కుమార్ కి_యే స్త్రీ ఐనా తనంటే భయపడటమే తెలుసు గానీ, తన చెంప వాయించటం తెలియదు. అతని చెయ్యి చటుక్కున విడివడిందిగానీ__
    "చూడు నిన్నేం చేస్తానో పూచిక పుల్ల లంజా." అని వ్యంగ్యంగా చూశాడు.
    "నీ అంత వల్గర్ గా మాట్లాడటం నీలాంటి వాళ్ళకే చేతనవుతుంది. కానీ, నీకేదో డబ్బూ, పలుకుబడీ, నీ చుట్టం ఆ చవట డి.ఐ.జీ. యస్.వి.రంగారావు వున్నాడని విర్రవీగకు. మిమ్మల్ని మించిన వాళ్ళుకూడా వుంటారు సుమీ. ఐతే అందరూ నీలాగా దుర్వినియోగపరచరు. నాలాగా కొందరు సద్వినియోగపరుస్తారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో" అంది ఇంగ్లీషులో. ఆమె గొంతులో యెంతో దర్పం, ధీమా, ధైర్యం.
    ఆమె స్థితిగతులు తెలిసినా, యీ సంఘటన జరిగిన తరవాత మరికాస్త తెలుసుకున్నాక__ గప్ చిప్ గా వందన అని ఒక అమ్మాయి వుందనే గుర్తులేనట్లుగా వుండిపోయాడు.
    ఈ ఒక్క అపశృతీ తప్పించి, అతని జీవితంలో తన కౄరశృతి యేనాడూ అపస్వరం పలకలేదు.
    ఆ తరవాత సీత మళ్ళా డాక్టరు దగ్గిరికి వెళ్ళనేలేదు. ఒకసారి డాక్టరు యింటికొచ్చినప్పుడు పరామర్శిస్తే__బాగానే ఆరోగ్యంగా వున్నట్టు చెప్పింది సీత.  
    భర్త విజయ్ కుమార్ యిచ్చిన మందులు మింగుతుంది. అనారోగ్యం మందులు, అనారోగ్యం, మందులు. అనారోగ్యం.
    అలా యీ మూడు నెలలుగా గడుపుతున్న సీత, యివాళ యీ డిశంబరు ఆఖరి వారపు రాత్రి చలికి రగ్గు కప్పుకుని పడుకుంది __ నిద్ర మేలుకుని.
    భర్త విజయ్ కుమార్ పదకొండుకి వచ్చాడు. మాంచి వుత్సాహంగా వున్నాడు. ఫుల్లుగా తాగి వున్నాడు. మందు పార్టీ. బ్రాందీతో నిండిన అతని ఒళ్ళు వెచ్చగా వుంది. వుక్కగా అనిపించి చకచకా బట్టలు తీసేసి లుంగీ చుట్టుకున్నాడు.
    సీత కప్పుకున్న రగ్గు తీసి పక్కకి పారేశాడు.
    ఆమె బట్టలు వొలిచేశాడు నిమిషంలో.
    ఆమె చలికి వణికిపోతోంది__మేడమీది గది కిటికీలోంచి వస్తున్న డిశంబరు నెలాఖరు హైదరాబాదు చలిగాలికి.
    కాళ్ళ దగ్గిరగా వున్న రగ్గు తీసి కప్పుకోబోయింది.
    "ముసలిముండల్లే అట్లా వణికి చస్తావేం?" అని చీదరించుకుని రగ్గు లాగి నేలమీదకి విసిరేశాడు.
    ఆ తరవాత అతని కార్యక్రమం యధాప్రకారం చకచకా జరిగిపోయింది.
    ఐదు నిమిషాలకి గాఢంగా నిద్రపోతున్నాడు, రగ్గు కప్పుకుని.
    పది నిమిషాలు గడిచాయి.
    ఆ చలికి ఆమె వణికిపోవటం లేదు. బట్టలైనా వేసుకోలేదు. అట్లాగే కూచునిపోయింది. చలిలో చల్లని గచ్చుమీద.
    అరగంట గడిచింది.
    లేచి బల్ల దగ్గిరికి వెళ్ళి, పళ్ళు కోసే చాకు తీసింది. చేత్తో గట్టిగా పట్టుకుని గొంతు దగ్గిర కత్తి మొన ఆనించుకుంది సీత.
    నాలుగు క్షణాలు.
    వణికిపోతుంది. చలికి కాదు, భయానికి. కళ్ళవెంట నీళ్ళు.
    కత్తి బల్ల మీదకి, ఆమె మంచంమీదకి.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.