Home » vaddera chandidas » Anukshanikam 2



    పొద్దుపోయాక పడకగదిలో, గాయత్రిని దగ్గిరికి తీసుకుంటూ, "ఆమె చాలా దూరపు చుట్టం. అవసరానికి వచ్చినది. రేపు కార్డియాలజిస్ట్ కి చూపెట్టి ప్రెస్ క్రిప్షన్ యిప్పించి పంపేస్తా" అన్నాడు. "వుండనీ పాపం నాలుగు రోజులు. గుండె జబ్బు కదా" అంది గాయత్రి.
    డాక్టరు దగ్గిరికి తీసుకెళ్ళాడు. పరీక్షలూ అవీ అవటానికి నాలుగు రోజులు పట్టింది. ఆస్పత్రికి వెళ్ళేటప్పుడు బిడ్డని గాయత్రికి అప్పగించి వెడుతుంది. గాయత్రి చూస్తుంది. పిల్ల ముద్దొచ్చేలా వుంది. గాయత్రికి యేదో తృప్తిగా అనిపిస్తుంది ఆ పిల్లని వొళ్ళోకి తీసుకుని కూచుంటే.
    ఐదో రోజున, ముందు గదిలో కూచుని ఏడుస్తున్న ఆ పిల్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏడ్పు మాన్పించటానికి ప్రయత్నిస్తున్న గాయత్రి, వంట గదిలో ప్రెజర్ కుక్కర్ మోత ఒకటే యిదిగా వినిపించటంతో, పిల్లని చాపమీద పడుకోబెట్టి లోనకి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి ముందు గదిలోకి వస్తోంది.
    అదే వేళకి బయటినుంచి వచ్చిన ఆమె బిడ్డని అమాంతం చేతుల్తో యెత్తుకుని గుండెలకి హత్తుకుని యెదురుగా కనిపించిన గాయత్రిని చూసి, "కమ్ నిస్ట్ పోరికేమెరిక తల్లి మనసు!" అని అసహ్యించుకుంది.
    గాయత్రికి దుఃఖం పొర్లుకొచ్చింది. గిరుక్కున తిరిగి లోన గదిలోకి వచ్చింది. కుర్చీలో కూలబడింది.
    ఒక క్షణం.
    టేబుల్ మీది పుస్తకాలూ, కాగితాలూ గదంతా చెల్లాచెదురుగా విసిరేసింది.
    టేబుల్ మీద ఫోటోలో తన అరుణ బోసి నవ్వులు.
    ఆ ఫోటో చేతుల్తో పట్టుకుని లేచి మంచం మీదకి బొక్కబోర్లా వొరిగింది.
    దిండు మీద ఫోటో. ఫోటో మీద గాయత్రి ముఖం.
    గాయత్రి ముఖం నిండా ఫొటోనిండా అరుణ ముఖం. అరుణ ముఖం నిండా ఫొటో. ఫొటో నిండా గాయత్రి ముఖం. గాయత్రి ముఖం నిండా అరుణ ముఖం.
    ముఖం నిండా ఫొటో నిండా కన్నీళ్ళు.
    వెక్కి వెక్కి పడుతోంది గాయత్రి.
    "పోవే బోడీ__" అని అనలేకపోయిన గాయత్రి__వెక్కివెక్కి పడుతూనే వుంది__గాయత్రి.
    ఆ మరసటిరోజు సాయంత్రం మోహన్ రెడ్డితో కలిసి బయల్దేరింది బయటికి__అతని చెయ్యి తన చేత్తో పట్టుకుని.
    యెంతో బాగా పరిచయమైన వీధిలోకి మళ్ళింది. వాళ్ళమ్మా నాన్నల యింటి గేటు తెరిచి "అమ్మా__" గుమ్మంలో కాలు పెట్టింది గాయత్రి.

                                87

    శ్రీపతి లేపాక్షి షాపులోంచి బయటికి రాగానే అటునుంచి కాలిబాటమీంచి నడిచి వస్తున్న ఒకామె కనిపించి__
    _యీ బొడ్డుకింది చీరకట్టులో జనాన్ని చూడలేక డోకొస్తోంది. తిరగలి కంతలా బొడ్డు. మధ్యభాగం కాబట్టి నడుం అని అనుకోవాల్సొచ్చే నడుంకి అటుపక్క, యిటుపక్క కిందికి జారిన కండలు. చిరు బొజ్జా_పవిట కప్పకూడదూ_ యీ బొజ్జరాణి_ఆహాఆహా నన్ను చూడు బొజ్జ చూడు నా కలుగుబొడ్డు చూడు అంటూ__ యే ఘటోదరీ బొడ్డు కిందకి చీర కట్టటం నిషిద్ధం అని శాసనం చేస్తే బావుండును.
    _కానీ చక్కని ఆకృతి ఐతే అలా కట్టుకుంటే యెంత బావుంటుందో__ కాని యెక్కడన్నా ఓ తలోదరి ఓ శాతోదరి కనిపిస్తే అది ఖాయంగా గోక్కాడ ఐవుంటుంది. యెక్కడ చూసినా రుబ్బురోళ్ళూ దబ్బనాలూ_ యీ తల్లి వస్తాదులా కండలు తిరిగిన జబ్బలు కనిపించేలాగా ఆ పొట్టిచేతుల బ్లౌజు_అమ్మయ్య బతికించింది. రోడ్డు మీదకి మళ్ళింది. ఆ సందులోకి దొర్లిపోతుంది .... కుయ్ కయ్ కయ్ కయ్ కయ్ కయ్ కుయ్ కుయ్ కుయ్ కయ్ కుయ్ కయ్ కుక్కల గుంపు _ ఒకటీ రెండూ మూడూ నాలుగూ ఆరూ ఎనిమిదీ పదీ పన్నెండూ_కాట్లాట_వాటికి పక్కగా ఆడకుక్క ఒకటి వాటిని వూరిస్తూ నక్కుతోంది. పది పన్నెండు ఆడ కుక్కలు ఒక మగ కుక్క ఐతే యెలా వుండునో__ ఆడైనా మగైనా సూత్రం ఒకటే_ వన్ యట్ ఎ టైం_పంచదార క్కూడా అదే యేర్పాటు చేశాడు వ్యాసమహర్షి _ అందుకే కాబోలు పంచదార అంత తీపి! కానీ సాంఘికంగా కుక్కలకి సాంఘికవ్యవస్థ వుంటుందా .......
    జాన్ కంపెనీ బార్ బేకరీ ముందునుంచి నడిచి రోడ్డు దాటి అటువైపునున్న పాత పుస్తకాల షాపులోకి వెళ్ళాడు శ్రీపతి.
    ఎమగ్జన్సీలో పత్రికలేమిటి. రిపోర్టింగేమిటి నా మొహం. కలెక్టరో ఆర్టీవోనో కాదంటే తాసిల్దారో చూసి అచ్చువేస్తారు. మనం దేనికి_ఎమర్జెన్సీ_యముడి అర్జెన్సీ_యముడికి స్త్రీ లింగమేమిటి_ అంటూ పత్రిక పని మానేశాడు శ్రీపతి.
    అప్పుడు వెనక గదికోసం చూస్తే హైదర్ గూడా ప్రాంతంలో దొరికిన రెండు గదుల వాటాలోనే వుంటున్నాడు. వంటగది నిరుపయోగం.
    శ్రీపతి అడిగిన మూడు పుస్తకాలూ లేవన్నాడు షాపు అతను.
    చూస్తున్నాడు.
    పది నిమిషాలు.
    ట్రాట్ స్కీ పుస్తకం "ది రెవల్యూషన్ బిత్రేయ్డ్" తీసి చంకనపెట్టుకుని పుస్తకాలు వెతుకుతున్నాడు.
    మరో పది నిమిషాలు.
    మరో పుస్తకం__కెరొలిన్ బర్డ్ పుస్తకం, "బోర్న్ ఫిమేల్" తీశాడు.
    _"ట్రాట్స్ కీ బర్డ్ ట్రాట్స్ బర్డ్ కీ. సోగ్గాడు _ సోగ్గాడెవరు శోభనా, రాష్ట్రపు కొత్త సోగ్గాడు సుఖాడియా. ఎమర్జెన్సీలో గవర్నర్లతో ఒక్కోసారి మహా అవసరం వుంటుంది. ఆ మొన్న యూ.పీ. నిన్న కరిప్షన్ పేరిట డి.యం.కే.కి ఉద్వాసన_యవ్వనం కాటేసింది. ఆ కొత్త పిల్ల జయచిత్ర గొంతు అదోలా ఇదిగా బాగా వుంటుంది _ సోగ్గాడి సరసనా అదే__కానీ యవ్వనం కాటేసింది. యవ్వనం అంతే. అది పాపిష్టిది. కాటేస్తుంది. పాపం ఆ నెల్లూరి కుర్రజాణల జంట చంద్రికా కళారాణులు_ యస్సెకీ కాంట్రాక్టరుకీ శిక్షా_వాళ్ళకేం శిక్ష. పై కోర్టులో కొట్టేస్తారు_ చోటీపీ బాత్. ఎమర్జన్సీలో ఏవిటా చిన్న మాట_ముఝే జీనేదో_అలాగే గాంధీగారి మూడు కోతుల సూక్తి పాటిస్తే అలాగే బతకనిస్తాం. వహీదా_అంతులేని గాథ. ఆ కొత్త గంట ఏపుగా పెరిగిన పెరుగు తోటకూర కాడలా వుంది కళగానూ, ఆ మళయాళం కుర్రాడు వుత్త పోకిరీ వాడు_అంతులేని కథ అంతులేని కథే. పొడిగిస్తూ పోదనేమిటి. ఆడుతూ పోతే సాగుతూ పోతే అంతులేని కథే ఈ ఎమర్జన్సీ _ యివి ఎమర్జన్సీగా తిరుగుతున్నాయి....




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.