Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
వేదాల్లో అన్నింటినికాని కొన్నింటినిగాని వ్యాఖ్యానించిన పాశ్చాత్య విద్వాంసులు మాక్సుములర్, కీత్, గ్రిఫిత్, పిశల్, గ్లేడ్నర్, త్సరర్, వేవర్, ఓల్డన్ బర్గ్, బ్లూమ్ ఫీల్డ్, భారతీయ వ్యాఖ్యాతలు మహర్షి దయానందసరస్వతి, మహర్షి అరవిందులు సాయణాచార్యుల వ్యాఖ్యానంమీదనే ఆధారపడ్డారు.
విచిత్రం ఏమంటే - బుద్ధుడు, ఆదిశంకరుడు, శ్రీమద్రామానుజులు మున్నగువారు వేదకర్మలను నిరసించినా వేదప్రకాశం వసివాడలేదు.
వేదం - స్వరం:
వేదానికి స్వరం ఉంది. దానికి శాస్త్రం ఉంది. పదపాఠ ,క్రమపాఠ, జట మున్నగునవి స్వర పద్ధతులు. స్వరంతో చదివిన వేదమంత్రానికి నాదం ఉంది, గుణం ఉంది, మహిమ ఉంది.
వేదం శృతి. వినిపించడంలో ఆనందం ఉంది. వినడంలో అమృతం ఉంది. అనువాదం అర్థం అవుతుందేకాని ఆనందం కాజాలదు - అమృతం కాజాలదు.
స్వరబద్ధమైన వేదనాదం మనసును కదిలిస్తుంది. మంచి కలిగిష్టుంది. శాంతిని ప్రసాదిస్తుంది.
వేదం గగన సదృశం.
నేను అద్దంలో దాన్ని చూపగలిగాను.
అంతకు మించిన అవకాశం ఇచట లేదు.
మనిషి జీవించి ఉన్నపుడూ, విగతాత్మ అయినపుడూ శాంతికోసం తపిస్తున్నాడు. శాంతి అతనికి మరీచిక, గగనకుసుమం అవుతున్నది. శాంతిని గురించి వేదం ఇలా నినదిస్తున్నది :-
ద్యేః శాన్తిరన్తరిక్షశ్శాంతిః పృథివీశాన్తి రాపఃశాన్తి
రోషధయః శాన్తిః
వనస్పతయః శాన్తి ర్విశ్వే దేవాఃశాన్తిర్భ్రహ్మశాంతిః
సర్వమ్ శాన్తిః శాన్తిరేవశాన్తిః సామాశాన్తిరేధి|
ద్యులోకమునకు శాంతి, అంతరిక్షమునకు శాంతి, పృథివికి శాంతి, ఓషధులకు శాంతి, వనస్పతులకు శాంతి, విశ్వేదేవతలకు శాంతి, బ్రహ్మకు శాంతి, సర్వమునకు శాంతి, శాంతికే శాంతి. అలాంటి శాంతి నన్ను వర్ధిల్ల చేయునుగాత!
ఇన్నింటికి శాంతి - శాంతికి సహితం శాంతి ఉంటేనే మానవజాతి వర్ధిల్లుతుంది!!
ఓం శాంతిః శాంతిః శాంతిః
నలభై ఒకటిః "స్వస్తిప్రజాభ్యః"
జీవితం ఒక యానం - ప్రయాణం. ఈ ప్రయాణం విమానంమీద, రైలుమీద, బస్సుమీద, కారుమీద, ఎద్దుల బండిమీద, కాలినడకనా కావచ్చు. కాని గమ్యం మాత్రం ఒక్కటే - సాధనాలు వేరు.
నాకు కాలినడకన ఇష్టం. దాని అందం, దాని చందం, దాని మజా మరొకదానికి రాదు. నడక నా స్వంతం, నడకలో నేను పరాధీనుణ్ణి కాను. నా చుట్టూ పచ్చని ప్రకృతి - పిల్లగాలి - పక్షుల కిలకిలలు - తోటి బాటసారుల ముచ్చట్లు. సాగిపోతుంటాను. నా ఇష్టం, నడుస్తే నడుస్తాను. లేదా చెట్టు నీడన కూర్చుంటాను. అలసిపోతానా బావిలో చేదవేసి, నీళ్లుతోడి, కాళ్లూ చేతులు ముఖం కడుక్కుంటాను. బొక్కెనతో నీళ్లు త్రాగుతాను. గుడ్డపరచుకుని మర్రికింద పడుకుంటాను. దీనికి పైసా కర్చులేదు. అంతా నా స్వంతం. కాళ్లకు పని! ఆరోగ్యం!!
భగవంతుడు మనకు కాళ్లిచ్చింది నడకకే! సాధనాలు మానవుడు ఏర్పరచుకున్నాడు. త్వరగా చేరాలని ఆతురత! ఇంకా సాధించాలని దురాశ! ఎంత సాధించినా ఎంతటి వాడైనా గమ్యం ఒక్కటే!
"జాతస్య మరణం ధ్రువం" పుట్టినవాడు గిట్టకమానడు. ఏ భాషలో, ఏ తీరున చెప్పినా, చెప్పకున్నా ఇది సత్యం. ఇది తథ్యం. ఇది నిత్యం. దీనికి అతీతులు లేరు. రామకృష్ణాద్యవతారాలకూ, క్రీస్తుకూ, మహమ్మదుకు ఇది తప్పలేదు.
ప్రకృతికి కులమతాలూ, దేశాలూ, వర్గాలూ, మార్గాలతో పనిలేదు. అది అందరికీ సమానమే! ఎండ అందరికోసం కాస్తుంది. వాన అందరికోసం కురుస్తుంది. వెన్నెల అందరికోసం విడుస్తుంది.
ప్రకృతి మనకు తల్లి. ఆమెకు అంతా సమానమే!
అన్నదములే తన్నుకుచస్తారు!!
విచక్షణారహితంగా సకల ప్రాణిజాలం ఒకేరకంగా జన్మిస్తుంది. ఒకే రకంగా మరణిస్తుంది. ఈ జనన మరణాల మధ్య నాలుగు రోజులదే నాటకం!
"ఉమ్రెదరాజ్ మాంగ్ లాయీ థీచార్ యూమ్ కీ
దో కట్ గయే ఉమ్మిద్ మెఁదో ఇంతజార్ మెఁ"
అంటాడు బహదూర్ షా జఫర్ - చివరి మొగల్ చక్రవర్తి కవి.
దేవునినుంచి నాలుగురోజులు అడిగి తెచ్చుకున్నాను. రెండు ఆశించడంలో, రెండు నిరీక్షణలో గడిచిపోయాయి! ఈ నాలుగురోజుల నాటకమే ప్రపంచాన్ని ఆట లాడిస్తున్నది. సుఖపడనీయదు, దుఃఖాల వైపే గుంజుతుంది. ఆశ, దురాశల, మధ్య కొట్టుకుంటుంది. తొమ్మిది తొర్రల తిత్తి ఒకనాడు తుర్రుమంటుంది.
భీష్మపితామహుడు అంపశయ్యమీద అస్తమించినపుడు నిశ్శబ్దమైన పక్షిలా ప్రాణాలు ఎగిరిపోయాయి అంటాడు.
పక్షి ఎగిరిపోయింది. ప్రయాణం ముగిసిందా? ముగియదు. ఇది అంతము లేని యానము. ఎన్ని జన్మలు సాగుతుందో ఎరుగము. మనం ఎరగం కావున అది లేదనడం మూర్ఖత్వం!
కొలంబస్ కనుగొనకముందు అమెరికా లేకుండెనా? ప్రకృతి రహస్యాల్లో అణుమాత్రం కూడా తెలిసికోలేని మానవుడు తనకన్నీ తెలుసునని విర్రవీగుతాడు! మూర్ఖుడు - అజ్ఞాని - అహంకారి!!
ఇన్ని కోట్ల సంవత్సరాల నిరంతర అన్వేషణలో వ్యక్తి తనను గురించి తెలిసికోలేకున్నాడు. డెబ్బైఏళ్ల జీవితంలో నన్ను నేను తెలిసికోలేకపోయాను. నా అభిరుచులేమిటి? రాగద్వేషా లేమిటి? అర్థం కాలేదు. "ప్రకృతిధర్మమగును పరిణామ మందుట" అన్నాను. నా తత్వం నిశ్చితం కాదు. మార్పును గ్రహించలేకున్నాను.
ఆదిశంకరుడు తనకేమీ తెలియదు అంటారు. 'స్వామీ, మీరు జగద్గురువులుకదా తెలియదంటారేమిటి?" అని ప్రశ్నిస్తాడు శిష్యుడు.
'నాయనా! నాకేమీ తెలియదని నాకు తెలుసు నీకు అది సహితం తెలియదు' అంటారు ఆదిశంకరులు!
సత్యం తెలియడం జ్ఞానం - తెలియకపోవటం అజ్ఞానం.
'బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున
తాన్యహం వేదసర్వాణి నత్వం వేత్థ పరంతప' అన్నాడు కృష్ణపరమాత్మ గీతలో.
(అర్జునా! నీకూ, నాకూ బహుజన్మలు గడిచాయి. గడచిన జన్మలన్నీ నాకు తెలుసు - నీకు తెలియదు.)
జ్ఞానికి సర్వం తెలుసు. అజ్ఞానికి ఏమీ తెలియదు. తెలియనిది లేదనడం మూర్ఖత్వానికి పరాకాష్ట!
ఈ మూర్ఖత్వంతోనే నేటి 'రాక్షస ఉత్పత్తి' విధానం మానవజాతిని వినాశం వైపు తరుముతున్నది. అది తెలియని మానవజాతి దానిని 'ప్రగతి' అని నమ్మి వినాశం వైపు ఉరుకులు పెడుతున్నది.
పూర్వ పరజన్మలు లేకుంటే అంతా శ్రమిస్తారు కదా! అందరూ అందలమేల ఎక్కరు? ఇది హేతువాద ప్రశ్న. హేతువాదులకు ప్రశ్నలే తెలుసు - ప్రత్యుత్తరాలు తెలియవు. ప్రకృతిలోనే ప్రశ్నలు మరిన్ని - ప్రత్యుత్తరాలు కొన్నే!
నాకు పూర్వం ఎన్ని జన్మలు గడిచాయో? రానున్న జన్మలెన్నో ఏం తెలుస్తుంది? నేనూ అజ్ఞానినే! అయితే, ఇదే చివరి జన్మ కావాలనుకుంటాను. మనం అనుకున్నవి కావుకదా!
"బహునాం జన్మనామన్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" - జ్ఞానవంతుడు బహుజన్మల తరువాత నన్ను చేరుతాడు అంటాడు పరమాత్మ. "బహు" అన్నాడు - ఎన్ని జన్మలో చెప్పలేదు!
"శ్రద్ధావాన్ లభతేజ్ఞానం" - శ్రద్ధగలవానికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ అన్నింటికీ అవసరం అని మన జీవితానుభావం. శ్రద్ధ ఉన్నంతమాత్రాన జ్ఞాని అవుతాడు అనడం లేదు. జ్ఞానం మాత్రం లభిస్తుంది అంటున్నాడు. నాకు శ్రద్ధ ఉంది. నాకు కొంత జ్ఞానం కలిగి ఉండవచ్చు. కాని, నేను జ్ఞానిని అని నమ్మలేను.
శ్రీ శుకుడు పుట్టుకతోనే యోగి అయినాడు. తల్లితండ్రులను వదిలాడు. తన దారిన పడ్డాడు. తండ్రి వ్యాసభగవానుడు "కొడకా? కొడకా" అని వెంటపడ్డాడు. శ్రీ శుకుడు వినలేదు. తన దారి వదలలేదు.
వ్యాస, శ్రీ శుకుల్లో ఎవడు జ్ఞాని? ఎవడు అజ్ఞాని? జ్ఞానాన్నీ, ధర్మాన్నీ నిర్వచించడం అసంభవం. సమయసందర్భాన్నిబట్టియే వాటి అర్థం!





