Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    దేవతలకు రూపాలు, ఆయుధాలు, వాహనాలు, స్థానాలు వేదంలో నిర్దేశించ బడినాయి. చెట్టు, పుట్ట, గుట్టనుంచి ఇంద్రాగ్ని, సూర్యచంద్రాది దేవతలను యజ్ఞంద్వారానే పూజించడం, స్తుతించడం ఆరాధించడం జరిగింది.

 

    ఆరాధనలన్నీ కోర్కెలు తీర్చుకునే కామ్య కర్మలే. కామ్య కర్మలు సాధారణంగా యజమానులు చేయరు. పురోహితులు వారితో చేయిస్తారు. కామ్య కర్మలన్నీ కాయకములు. మనసుతో వాటికి పని ఉండదు. మనసును గురించి వేదంలో చెప్పబడింది. కాని, ఉపనిషత్తులలో మనసునకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు.

 

    దేవతలు పురాణాలలో వలె ప్రత్యక్షంకారు - వరాలివ్వరు. తమ మహత్తులు చూపరు. ఒకరితో ఒకరు కక్ష సాధించడానికి యుద్ధాలు చేయరు. వారి అస్తిత్వం మాత్రమే కనిపిస్తుంది కాని ఆర్భాటాలు కనిపించవు.

 

    వేదంలో వాస్తవాలే ఉన్నాయి. కాని, ఆధునిక కాల్పనిక సాహిత్యంలో ఉన్నట్టి అవాస్తవాలు లేనేలేవు. దేవతలు చచ్చినవాణ్ణి బ్రతికించడం, కోపించి ఒకణ్ణి అణగదొక్కడం, ప్రసన్నులైన ఒకనికి అమాంతపు సంపద ప్రసాదించడం చేయరు.

 

    వేదంలో - మనం అనుకుంటున్నట్లు వైరాగ్యం ఎక్కడా కనిపించదు. ఇహమును గురించే ఎక్కువగా చెప్పబడింది. యజమానులు దేవతలను సుఖసంపదలే అర్ధిస్తారు. పరలోకాన్ని గురించి ప్రార్దించేది తక్కువ.

 

    స్వర్గాన్ని గురించీ, అమృతాన్ని గురించీ వేదంలో చెప్పబడింది. కాని పురాణాల్లోవలె స్వర్గభోగాలు, రంభా ఊర్వశులు పరిష్వంగాలు కనిపించవు. నరకము - అందులోని యాతనల వర్ణనలేదు. 'అకము' అనగా వ్యాధులు, దుఃఖాలు. అవి లేనిది 'నాకము.' స్వర్గము 'నాకం'గా చెప్పబడింది.

 

    ఇంద్రుని రాజ్యము స్వరాజ్యం. స్వరాజ్యంలో దుఃఖాలూ, బాధలూ ఉండవు. కాబట్టి మానవుడు అలాంటి రాజ్యం కోరుకున్నాడు - "స్వరాజ్యబైరాజ్యం" అన్నారు.

 

    వేదాల్లో వైరాగ్యం లేనట్టే, ఉపనిషదాదుల్లోకూడా వైరాగ్యం లేదు. మానవుని జీవితాన్ని సుఖసంతోషాలతో నింపడానికే భారత తాత్త్వికత, భారతసాహిత్యం నిరంతరం కృషి చేసింది. వేదాంతానికి వైరాగ్యం అనే అర్థంకూడా స్వప్రయోజనపరుల కల్పనయే! వైరాగ్యాన్ని గురించి చెప్పినా అది ఇహసుఖం. కోసమే, పరలోకం కోసం కాదు. సుఖశాంతులతో కూడిన సమాజాన్ని ఏర్పరచడమే భారతీయ మేధావుల, ఋషుల, మునుల, మహాత్ముల, యోగుల, పరమ యోగుల పరితాపం, కృషి, తపస్సు!

 

    పరమాత్మ సత్యస్వరూపుడు. మానవజాతి సత్యసాక్షాత్కారం - పరమాత్మ సాక్షాత్కారంకోసం - దేశకాలవ్యత్యాసాలు లేక నిరంతరం అన్వేషిస్తున్నది. సృష్టి, స్థితి లయకారకుడగు ఆ పరమాత్మ అనిర్వచనేయుడు, అగమ్యగోచరుడు. అతడు - ఆమె అందరు. అందని పరాత్పరునికోసమే అన్వేషణ. అందని, చూడని ఆ స్వామిని  సాకారుడని, నిరాకారుడని నిరూపించుటకు నిష్పలయత్నము చేసినాడు, చేస్తున్నాడు అల్పుడు మానవుడు.

 

    మానవుని జ్ఞానము పరాత్పరుని ఎరుగుటకు అపర్యాప్తము.

 

    ఆ భగవతి - భగవంతుడు మహాసాగరము. మానవుడు కనీసము దోసిలి కాజాలడు. అతడు వంగిన నింగివరకే సముద్రాన్ని చూడగలడు. సముద్రాన్ని దర్శించజాలడు.

 

    ఆ పరమాత్మ - పరమేశ్వరియే ఈ సమస్త చరాచర ప్రపంచాన్నీ 'యద్ దృశ్యతే, శ్రూయతేపినా' కంటికి కనిపించే, చెవికి వినిపించే వానిని సృష్టించారు. ఆధారము లేకనే భూమినీ సూర్య, చంద్ర, గ్రహ నక్షత్రాదులను నిలిపి ఉంచినారు.

 

    ప్రకృతిని - తన ప్రకృతిని -ఎరుగలేని దుర్భాల మానవుడు అన్నీ ఎరిగినానని బీరాలు పలుకుతాడు. మానవుడే అన్వేషణ - అన్వేషణయే మానవుడు! ఈ నిరంతర అన్వేషణ ఫలితమే దేవతలు!! అయితే మహాత్ములు, మహర్షులు చూపిన దేవతలన. ఆరాధించడం తప్పుకాదు. అతడు అందడు. వారు అందినవారిని దర్శనము  చేయించినారు.

 

    పరమాత్మ సత్యము. దేవతలు విశ్వాసము
    సత్యదర్శనము కానపుడు విశ్వాసమే మహత్తం.

 

    దేశంలో ప్రభుత్వం అంతటా ఉంటుంది. గ్రామస్తునికి గ్రామాధికారే ప్రభుత్వం. అతనికిచ్చిన పన్ను ప్రభుత్వానికి అందుతుంది. గ్రామాధికారులవంటివారే దేవతలు!

 

    మనం బహుదేవతారాధకులం. వేదం ఇది మనకు నేర్పింది. క్రీస్తుకు ముందు ప్రపంచం సాంతం బహుదేవతారాధన చేసింది.

 

    మనం బహుదేవతారాధకులం. నాకు రామకృష్ణాద్యవతారాలతోపాటు ముత్యాలమ్మ, మరిడమ్మ, పోశమ్మ దేవతలే! ఈ విషయంలో మనం సిగ్గుపడాల్సిన అవసరంలేదు. ఏ ఒక మతాన్నో సంతోషపెట్టడానికి మనం ఏకేశ్వరోపాసకులం అని నిరూపించ ప్రయత్నించనక్కరలేదు.

 

    "ఏకం సద్విప్రాబహుధావదంతి" - ఒకే సత్యాన్ని పండితులు బహువిధాలుగా చెప్తున్నారు - అనే వేద వచనాన్ని పట్టుకొని మనం ఏకేశ్వరోపాసకులం అని నిరసించడం మారేడుకు మసిపూయడంలాంటిది మాత్రమే!

 

    ఒక విషయం స్పష్టం - సత్యం - ఋతం - ఒక్కొక్క మతానికి ఒక్కొక పరమాత్మ, పరాత్పరుడు, భగవానుడు ఉండడు.

 

    ఉన్నది ఒకే పరమాత్మ
    ప్రవక్తలు అనేకులు.

 

    ఏ ప్రవక్తా తనను పరమాత్మునిగా చెప్పుకోలేదు. ప్రవక్తలు, అవతారాలు, మహాత్ములు, పరమహంసలు, పరమాత్ములు అంశామాత్రులు మాత్రమే!

 

    'ఏకోవై బ్రహ్మనా ద్వితీయం' - బ్రహ్మము ఒక్కడే - రెండవవాడు లేడు.

 

    వేదార్ధం:

 

    కౌత్సఋషి వేదానికి అర్థం ఉండదనీ, తెలిసికోరాదనీ అన్నాడు.

 

    క్రీస్తుకు వేయిసంవత్సరాల పూర్వపు ' యాస్కుడు' "వైవస్థాణోరపరాథః యదేనం అంధోనపశ్యతి. పురుషాపరాధః సభవతి' - స్తంభాన్ని చూడకపోవడం స్తంభపు తప్పు కాదు, మనిషి తప్పు అన్నాడు.

 

    స్థాణురయం భారవాహః కిలాభూత్
        అధీత్యవేదాన్ నవిజానాతి యో2ర్థమ్!
    యో2అర్ధజ్ఞఇత్ సకలం భద్రమశ్నుతే
        నాకమేతిజ్ఞాన విధూతి పాప్మా!!

 

    వేదం చదివి అర్థం తెలిసికోనివాడు తెలియని బరువు మోయు యంత్రం లాంటివాడు. వేదం చదివి అర్థం చేసికొన్నవాడు జ్ఞానియై, పాపరహితుడై, స్వర్గాన్ని చేరుకుంటాడన్న యాస్కుడు రచించిన నిరుక్తమే నేటికీ వేదార్థానికి ఆధారం.

 

    తరువాత స్కందస్వామి, ఉద్గీత, వేంకట మాధవులు వేదాన్ని వ్యాఖ్యానించారు. స్కందస్వామి వల్లభి నివాసి. వల్లభి ఖమ్మంజిల్లాలోని గ్రామం. కావున స్కందస్వామి తెలుగువాడని గర్వించవచ్చు.

 

    వేదాలకు సాధికారిక వ్యాఖ్య రచించిన తెలుగువాడు ఆచార్య సాయణుడు (1315-1387). నేటి ప్రాక్, పాశ్చాత్య వ్యాఖ్యాతలందరు సాయణాచార్యుల వ్యాఖ్యాదర్పణంతోనే వేదాన్ని దర్శిస్తారు. పాశ్చాత్య ప్రభావంగల వేద విద్వాంసులు నిందిస్తారు. అయితే, గమనిం చాల్సిందేమంటే - ప్రతి వినియోగానికీ అతడు పూర్వప్రమాణం ఉదాహరించాడు.

 

    వినియోగం అంటే వాడుక. ఏ సూక్తం దేనికోసం వాడాలో చెప్పడం వినియోగం. ఇందును గురించి ఎంతో చెప్పాల్సి ఉంది కాని ఇది సందర్భంకాదు.

 

    సాయణుడు శుక్లయజుర్వేదాన్ని వ్యాఖ్యానించలేదు. మహీధర - ఉవటాచార్యులు వ్యాఖ్యానించారు.

 

    నేను ఆంధ్రానువాదానికి సాయణ, మహీధర, ఉవట వ్యాఖ్యలనే అనుసరించాను.

 

    దక్షిణాపథంలో అన్యమతస్థుల రాజ్యాలు స్థిరపడి విస్తరిస్తున్నపుడు విద్యారణ్యుడు హరిహర బుక్క రాయలచేత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపచేశాడు. బుక్క రాయలు వేద ధర్మాన్ని ఉద్ధరించదలచి సాయణాచార్యులను వేదాలకు భాష్యం చెప్పమని అర్థించాడు. వేదవ్యాఖ్య మధ్యలో ఉండగానే బుక్కరాయలు అస్తమించాడు. రెండవ హరిహరరాయలుకూడా తన తండ్రివలె వేదవ్యాఖ్య బృహత్కార్యానికి సర్వవిధాల సహకరించాడు.

 

    సాయణుడు ఆంధ్ర బ్రాహ్మణుడు. అతనిది భారద్వాజస గోత్రము. బోధాయన సూత్రము. మాయన -శ్రీమతి అతని తల్లిదండ్రులు. అతడు వేదసంహితలనే కాక 1. తైత్తిరీయ బ్రాహ్మణము 2. తైత్తిరీయ అరణ్యకము 3. ఐతరేయ బ్రాహ్మణము 4. ఐతరేయ అరణ్యకము 5. శతపథ బ్రాహ్మణము 6. తాండ్య బ్రాహ్మణము 7. సద్వింస బ్రాహ్మణము 8. సమవిధాన బ్రాహ్మణము 9. ఆర్షేయ బ్రాహ్మణము 10. దేవతాధ్యాయ బ్రాహ్మణము 11. ఉపనిషద్ బ్రాహ్మణము 12. సంహితోపనిషద్ బ్రాహ్మణము 13. వంశ బ్రాహ్మణములను వ్యాఖ్యానించాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.