Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
నాకు ఏదో పూర్వజన్మపుణ్యం ఉందనిపిస్తుంది. కాకుంటే భగవానుని నిర్హేతుక కటాక్షం కలిగి ఉండాలి.
అయతి శ్శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః|
అప్రాప్య యోగసంసిద్ధిం కాంగతిం కృష్ణగచ్ఛతి||
'శ్రద్ధగలవాడే, నిగ్రహం ఉండదు. అలాంటివాడు యోగ భ్రష్టుడవుతాడు. అతనికి యోగం సిద్ధించదు కదా? వాడు ఏ గతికి చేరుకుంటాడు?' అని అర్జునుడు కృష్ణపరమాత్మను అడిగాడు.
భగవానుడు చెప్పుచున్నాడు :-
ప్రాప్య పుణ్యకృతాం లోకనుషిత్వా శాశ్వతీః సమాః|
శుచీనాం శ్రీ మతాంగేహీ యోగీ భ్రష్టో2భిజాయతే||
(యోగభ్రష్ఠుడు శాశ్వత సమములగు పుణ్యకృత్ లోకాలను అనుభవించి శుచిమంతులగు శ్రీమంతుల ఇంట జన్మిస్తాడు.)
పుణ్యలోకాలు అనుభవించింది ఎరుగను - కాని శుచీనాం శ్రీమతాంగేహే జన్మించాను.
శ్రీమద్రామానుజ యతి తరువాత ఆచార్య పీఠాన్ని అధిష్టించిన 'దాశరథి' వంశం మాది. మాకు తెలిసినంతవరకు మా పూర్వులందరూ విద్వాంసులు, సద్వైష్ణవులు, నిష్ఠాగరిష్ఠులు.
భగవదనుగ్రహం, పూర్వజన్మసుకృతం లేకుంటే ఈ జన్మలో నేను పడినన్ని కష్టాలు, అనుభవించిన దుఃఖం తట్టుకొని జీవించడం దుర్లభం!
నిజదారసుతోదరపోషణార్ధం ఆర్జించడం తప్ప మిగతా జీవితం ప్రజాసేవకూ, మానవసేవకూ - ఫలాపేక్షారహితంగా - అంకితం చేశానని సగర్వంగా చెప్పగలను.
తెలిసి ఇంతవరకు అబద్ధం ఆడలేదు. ఉపకారం తప్ప అపకారం చేయలేదు.
పరిపూర్ణమైన విశ్వాసంతో కమ్యూనిస్టుగా ప్రజాపోరాటాల్లో పాల్గొన్నాను. స్వాతంత్ర్యం వచ్చాక ఫలితాలకు ఆశించలేదు. బట్టవిడిచినట్లు రాజకీయాలు వదిలి, స్వయంకృషితో డిగ్రీలు తెచ్చుకొని ఉదర నిమిత్తం ఉద్యోగంలో చేరాను.
నేను ఎవరి 'శుశ్రూష' చేయలేదు. గురువును ఆశ్రయించలేదు. ఉపదేశం పొందలేదు. నాకు గురువులు లేరు - శిష్యులూ లేరు.
'నను కనిపెంచినత్తి తెలంగాణ'కు నా కర్తవ్యంగా తెలంగాణ ప్రజా జీవితాన్ని చిత్రించే నవలలు వ్రాశాను. ఇహ ఎవరూ రాయలేరు!
నాస్తికత్వ, హేతువాదాలనుండి స్వచ్చందంగా బయటపడి - శ్రీమద్రామాయణ, శ్రీమహాభారత, శ్రీమద్భాగవత, చతుర్వేదాల వచనానువాదం చేశాను. సుమారు పన్నెండువేల అచ్చు పేజీలు వ్రాశాను. ఎంత చదివి ఉంటాను!
భగవదనుగ్రహంలేక నావంటి సామాన్యునికి ఇది సాధ్యమా?
"ఎక్ ఖత్రా జిందగీకొ సిఖాతాహై సబఖ్
కభీ షబ్నమ్ బనా కభీగోహర్ బనా కభీ అష్క్" అంటారు ఇక్బాల్ మహాకవి.
ఒక బిందువు జీవితానికి పాఠం నేర్పుతుంది. అది ఒకప్పుడు మంచుబిందువు, ఒకపుడు ముత్యం, ఒకపుడు బాష్పబిందువు అవుతుంది.
తుహిన బిందువు బాల్యం. ముత్యం యవ్వనం, బాష్పబిందువు వార్ధక్యం.
నేను బాష్పబిందువుగా ఉన్నాను. అయినా సాహిత్యపరిశ్రమ కొనసాగిస్తున్నాను. "మైఁఅభీ జవన్ హుఁ అభీ జవాన్ హుఁ" అనాలనిపిస్తుంది.
1997 సెప్టెంబరులో విశాఖ సహృదయ సాహితివారు నాకు గురజాడ అవార్డు ఇచ్చి సత్కరించారు. అక్కడ నాకు చిత్రకవి ఆత్రేయ మైత్రి - శ్రీభాష్యం అప్పలాచార్యులవారి మంగళాశాసనాలూ లభించాయి.
1998 జనవరిలో కాకతీయ విశ్వవిద్యాలయం వారు కనులపండుగగా డాక్టరేటు ప్రదానం చేశారు. ఇంత కాలానికా? అన్నారు మిత్రులు. "దూర్ సె ఆయీ, దేర్ సె ఆయీ ఫిర్ భీ ఆయీ సుహాగ్ కీరాత్" అన్నాను.
బహుధాన్య శ్రావణశుక్ల సప్తమి 30-7-98కి నాకు డెబ్బది నిండాయి.
మా మగపిల్లలో ఒకడు ఈ లోకం వదిలిపోయాడు. ఒకడు మమ్ము విడిచిపోయాడు అని వ్యధగా ఉండింది.
15-2-1998న అనుకోకుండా మనుమడు "శ్రేష్ఠ్" ఆరేళ్లవాడు తాతా, నాన్నమ్మా అని మీదపడ్డాడు. మేం పొంగిపోయాం.
11-5-1998న కోడలు ఉమ వచ్చింది. మేం స్వాగతం పలికాం పల్లెత్తుమాట అనలేదు. ఇల్లు నిండుగా ఉంది.
22-5-1998న విరించి, ఉమ, శ్రేష్ఠి వచ్చి నాకూ కమలకూ పాదాభివందనాలు చేశారు.
సుమారు ఒకటిన్నర దశాబ్దం తరువాత ఇంటికి చేరుకున్నారు.
వాళ్లూ, మేమూ మా కూతుళ్లూ, అల్లుళ్లూ, మనుమలూ కలిసి సంబరాలు చేసుకున్నాం.
అంతంలేనిది జీవనయానం.
ఎంతకని చెప్పడం?
ముగింతాం ఇంతటితో.
సర్వేసి సుఖినస్సంతు - అంతా సుఖించాలి!
సర్వేసున్తునిరామయాః - అంతా వ్యాధిరహితులు కావాలి!!
సర్వేభద్రాణి పశ్యన్తు - అంతా శుభములే చూడాలి!!!
మాకశ్చద్దుఃఖ భాగ్భవేత్ - ఏ ఒక్కడూ దుఃఖభాజనుడు కారాదు!!!!
ఇది బహుధాన్య ఆషాఢశుక్లపంచమి 28-06-1998 ఆదివారం
* ముగింపు *




