Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
శ్రీ మదాంధ్ర మహాభాగవతంలోని 'సిరికింజెప్పడు' పద్యం సాక్షాత్తు శ్రీరామచంద్ర మూర్తియే పూరించా డంటారు. అలాంటి ప్రత్యక్ష అనుభవాలు నాకు కొల్లలు. స్వామి దర్శనం ఇచ్చాడని అబద్ధం చెప్పలేను. కాని, ఆ స్వామియే వ్రాయించిన అద్భుత, ఆశ్చర్యకర, అనిర్వచనీయ అనుభూతులు అనేకానేకం! అని అక్షరాల్లో పట్టవు.
పిల్లలమర్రి పినవీరభద్రునివలె 'వాణి నా రాణి' అనే సాహసం చేయజాలను. కాని, పోతనవలె సరస్వతిని 'మదంబ' - మా అమ్మ అని సగర్వంగా చాటగలను.
నేను ఈ వేదానువాదానికి కర్తను కాను - ద్రష్టను మాత్రమే అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి? అదే సత్యం, అదే నిజం, అదే వాస్తవం!
ఒక్కొక్కసారి మంత్రం నన్ను ముప్పతిప్పలు పెడ్తుంది. సాయణుని వ్యాఖ్య, అనువాదాలు కరదీపికలు కాలేవు. సతమతం అవుతాను. కొండ నెత్తిన కూలినట్లవుతుంది. ఇహ అనువాదం సాగదు అనిపిస్తుంది. గుబులు పుడుతుంది. ఆలాంటపుదు నిశ్శబ్దంగా ధ్యానంలోనికి సాగిపోతాను. పరిసరాల ధ్యాస ఉండదు.
అప్పుడు ఒక కాంతి బిందువు కనిపిస్తుంది! అది కాంతి బింబం అవుతుంది! కళ్ళు తెరుస్తాను. మంత్రం అర్ధం అవుతుంది! వివరణ విదితం అవుతుంది! అనువాదం వెలుగు వాగులా సాగిపోతుంది!
భగవానుడు అంతటి కృపాకటాక్షం కురిపించకుంటే ఇంతటి మహాయజ్ఞం, ఇంత కొద్ది వ్యవధిలో పూర్తికావడం అసాధ్యం - అనితరసాధ్యం - దుస్సాధ్యం!
అనన్తావై వేదాః
'వేదం' ఏకవచనం. వేదం 'పవిత్రవిద్య' అని అధర్వవేదం, శతపథబ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం చెపుతున్నాయి.
'వేదాః బహువచనం' -
'చత్వారోవా ఇమే వేదా ఋగ్వేదో యజుర్వేదో సామవేద, బ్రహ్మవేద ఇతి' అని గోపథపూర్వము వేదాలు నాలుగు అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద బ్రహ్మవేదములు. బ్రహ్మవేదమే అథర్వవేదము. యజుర్వేధం శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం అనేది.
ఏవమిమే సర్వేవేదా నిర్తితాః ససంకల్పాః, సరహస్యాః, సబ్రహ్మణాః, సోప నిషాత్కాః, సేతిహాసాః, సాన్వ్యాఖ్యానాః, సవాకోవాక్యాః - అని గోవథ బ్రాహ్మణం.
వేదాలన్నీ సంకల్పం, రహస్యం, బ్రాహ్మణులు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వ్యాఖ్యానాలు, పురాణాలు, స్వరాలు, సంస్కారాలు, నిరుక్తాలు, అనుశాసనాలు, అనుమార్జనాలు, వాక్కు యొక్క వాక్యాల సహితంగా నిర్మించబడినవి.
"అనన్తావై వేదాః" "ప్రాజాపత్యోవేదాః" అని తైత్తరీయం. వేదాలు అనేకం వేదం ప్రాజాపత్యం.
'ప్రజాః సృష్ట్యాపాలయస్వేతి తస్మాత్ప్రజాపతి రభవత్' అని గోవథ పూర్వం. ప్రజలను సృష్టించి పాలించడంవల్ల ప్రజాపతి అయినాడు.
వేదాలుసహితం ప్రజాపతి కార్యాన్నే నిర్వర్తిస్తున్నాయి. "అపరిమితోషి ప్రజాపతిః" - ప్రజాపతి అపరిమితుడు. కావున వేదాలు అపరిమితాలు - అనన్తావై వేదాః!
వేదమేకం చతుర్విధం:
వేదాలు అపరిమితాలు - అనంతాలు అట్లయిన వేదాలు నాలుగు ఎట్లయినవి?
"ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః
వ్యవధాత్యజ్ఞసంతతత్యై వేదమేకం చతుర్విధం" - అంటుంది శ్రీమహాభాగవత పురాణం.
కృపావాత్సల్య పూర్ణుడగు వ్యాస భగవానుడు అజ్ఞులు, అవ్యవధానులగు సంతతుల కోసం ఒకే వేదాన్ని నాలుగుగా విభజించాడు.
వ్యాస భగవానుడు త్రికాలజ్ఞుడు రానున్న తరాలవారు కేవలం భౌతికవాదులూ, విరామం లేనివారూ అవుతారని గ్రహించి, "చకార వేదమేకం చతుర్విధం" అన్నాడు.
'చకారవేదమేకం చతుర్విధం' అని ఒక్క వాక్యంలో చెప్పాడు వ్యాసుడు. కాని మానవ కళ్యాణమే ధ్యేయంగా తన జీవితాన్నంతటినీ కప్పురంలా అర్పించిన వ్యాసుడు అందుకు ఎంత శ్రమించిందీ చెప్పుకొనలేదు!
అనంతములు, అపరిమితములగు వేదాలను నాలుగు 'వేదసంహితలు'గా విభజించడం మానవమాత్రులకు సాధ్యం అయ్యేపనిమాత్రం కాదు.
వ్యాసభగవానుడు - సూర్యదేవునివలె - మధ్యన ఆసీనుడై, గ్రహనక్షత్రాదులవంటి శిష్యగ్రణము పరివేష్టించి ఉండగా ఒక్కొక్క మంత్రాన్నీ, సూక్తాన్నీ ఎందరో చదువుతుండగా నిర్ణయించి పరిష్కరించి ఉండవచ్చు. మనోఫలకంమీద వెలసిన ఆ దృశ్యమే అద్భుతం! ఆశ్చర్యకరం!! ఆనందకరం!!!
వ్యాసభగవానుడు ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలు నిరంతరం కృషిచేసి వేదసంహితలు నాలుగని నిర్ణయించినాడో! ఇవి మాత్రమే వేదములు. అన్యములు కావు అని వప్పించడానికీ వ్యాసమహర్షి, అతని అపారశిష్యగణము ఎంత శ్రమించినారో!! అందును గురించి కనీసం అంచనా వేయగల శక్తిస్తోమతలు మనకు లేవు. మనది అల్పబుద్ది! మనం అల్పాయుష్కులం!!
వ్యాసభగవానుడు మానవజాతికి చేసిన అనంత సేవను గురించి చెప్పుకునే శక్తిలేదు ఈనాటి దౌర్భాగ్య క్రుతజ్ఞ మానవాళికి!
వ్యాసుడు భరతవంశం అంతరించకుండా రక్షించాడు. పంచమవేదమగు శ్రీమహా భారతాన్నీ, అందులో అమృత తుల్యమగు శ్రీమద్భగవద్గీతను కృష్ణపరమాత్మచే ప్రవచింపచేశాడు. మానవజాతికి శాంతిప్రదమగు భక్తిని శ్రీమద్భాగవతంలో ప్రవచించాడు. అనేక పురాణాలు రచించాడు.
వ్యాసుడు సంఘసంస్కర్త అయినాడు. భిషగ్వరుడు అయినాడు. రాజకీయవేత్త అయినాడు.
అతడుకానిది ఏది?-
అతడు సర్వస్వమైనాడు!
ఇంతచేసిన వ్యాసుడు తనకోసం ఏమీ చేసికోలేదు! అతనికి కనీసం తన పుత్రుడు దక్కలేదు. ఏ గుడిశలోనో, ఏ చెట్టుకిందనో ఉండి, పిడికెడు మెతుకులు తిని ఇన్ని ఘనకార్యాలు సాధించి, కనీసం చెప్పుకొనలేదు. ఆ మహర్షికి మనం ఏమి ఇవ్వగలం?
వ్యాసం వశిష్టనప్తారం శక్తేః పుత్రమకల్మషం!
పారాశరాత్మజం వన్డే శుకతాతం తపోనిధిం!!
వ్యాసభగవానుడు దర్శనం ఇస్తే అతని పాదారవిందములను చుంబించాలని ఉంటుంది. నాకుగల అసాధ్యమైన ఆశ అది!
వేద సంహితలు
వేదాల్లోని సూక్తాలను అనేకమంది ఋషులు వారివారి సమయాల్లో దర్శించారు. ఋషులు మంత్రాలకు సూక్తలకు ద్రష్టలు, స్మర్తలు మాత్రమే. స్రష్టలుమాత్రం కారు. పరాత్పరుడు ప్రవచించిన దానిని వారు విన్నారు. స్మరించారు - లిఖించారు.
తరువాత వచ్చిన మతప్రవక్తలంతా ఈ విధానాన్నే అవలంబించారు. బైబిల్, ఖురాన్ మున్నగు గ్రంథాలనుకూడా భగవంతుడు వెలువరించగా ప్రవక్తలు దర్శించి మానవాళికి అందించారు.
వేదాలకు ఇతర మతగ్రంథాలకు ఒక ప్రధానమైన భేదం ఉంది. వేదం ఏ ఒక్క దేశ, ప్రాంత, మతానికి సీమితం అయిందికాదు. ఇది సకల మానవాళికి చెందింది. వేదాన్ని ఏ ఒక్క ప్రవక్తమాత్రం దర్శించలేదు. అనేకమంది ఋషులు దర్శించారు.
సాయణాచార్యుడు ఋషిని 'అతీంద్రియదర్శి' అన్నాడు. సాధారణ ఇంద్రియము లనుమించి దర్శించువాడు అని అర్ధం. అట్టివారు అపౌరుషేయ వాక్కును దర్శించ సమర్ధులు.
ఆ విధంగా అనేకమంది ఋషుల సూక్తలను ఏర్చికూర్చినది 'సంహిత' దీనినే మనం సంకలనం అంటున్నాం. వ్యాస భగవానుడు ఆ విధంగా నాలుగు వేదాలను సంహితలుగా కల్పించాడు.
1. ఋగ్వేద సంహితలో 10,589 మంత్రాలున్నాయి. ఋగ్వేదసంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.
2. యజుర్వేద సంహితలో 1975 మంత్రాలున్నాయి. యజుర్వేదసంహిత వివిధ యజ్ఞవిధానాలను నిర్దేశిస్తుంది.
3. సామవేద సంహితలో 1875 మంత్రాలున్నాయి. ఇది దేవతలను ప్రసన్నులను చేయు గాణవిధిని నిర్ణయిస్తుంది.
4. అథర్వవేద సంహితలో 5977 మంత్రాలున్నాయి. ఇది బ్రహ్మజ్ఞానం సంహితగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.
వేదద్రష్టలగు ఋషులపేర్లు పురాణ ఋషుల పేర్లలో సామ్యం ఉన్నా వారూ, వీరు ఒక్కరు కారు. వేదాలకూ పురాణాలకూ కాలవ్యత్యాసం చాల ఉంది. వేద విశ్వామిత్రునికీ - రామాయణ విశ్వామిత్రునికీ - పురాణ విశ్వామిత్రునికీ పేరులో తప్ప సామ్యం కనిపించదు.
దేవతలు:
వేదసంహితలు దేవతలకు సంబంధించినవి. దేవతలను వివిధ రీతులుగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా 'దేవామహిమానః' దేవతలు మహిమలు గలవారు. "అమృతాదేవాః" దేవతలు అమృతులు అని చెప్పుకోవచ్చు.
"దేవతావావత్రయంస్త్రిణోశోష్టౌవసవః ఏకాదశరుద్రాః ద్వాదశాదిత్యాః ఇమేఏవ ద్యావా పృథివీ" 8 మంది వసువులు + 11 మంది రుద్రులు + 12 మంది ఆదిత్యులు + 1 ద్యావా + 1 పృథివీ = 33 మంది.
ఈ ముప్పది ముగ్గురిలో:-
11 మంది అగ్నిమున్నగు భూలోకవాసులు
11 మంది ఇంద్రాది అంతరిక్షవాసులు
11 మంది సూర్యచంద్రాది ద్యులోకవాసులు.
దేవతల సంఖ్య ఇంతటితో ఆగినట్లు కనిపించదు. రోలుమండుకము, సోమము, ఋభువులు, రాజులనుకూడ దేవతలుగా పేర్కొన్నారు.
"యస్యవాక్యం సఋషిః యతేనోచ్యతేసః దేవతా" అన్నాడు కాత్యాయనుడు. చెప్పినవాడు ఋషి - చెప్పబడినవాడు దేవత.
ఈ సకల చరాచర ప్రకృతి ఏ శక్తులవలన, ఏ పదార్ధములవలన జీవిస్తున్నధో వారందరు దేవతలే. వీరు రెండు విధముల వారు. ఒకరు స్వయం దేవతలు - సూర్యచంద్రాదులు, పృథివి, ఆకాశము, వాయువు, నీరు మున్నగువారు రెండు - కర్మవలన దేవత్వమును సాధించినవారు. ఇంద్రుడు, అశ్వములు, ఋభువులు మున్నగువారు.
భారతదేశం 'కర్మభూమి.' 'కర్మ' అంటే అదృష్టాన్ని నమ్ముకొని చేతులు జోడించి కూర్చోవడం కాదు. 'కర్మ' అంటే శ్రమ, కృషి, నైపుణ్యం. కృషివలన దేవతలైన రుభువులు మున్నగువారున్నారు. భారతీయ తాత్త్విక చింతన ప్రకారం మానవుడు దైవత్వాన్ని సాధించగలడు. 'అహం బ్రహ్మస్మి' అంటుంది ఉపనిషత్తు.
దైవత్వాన్ని సాధించడం అంటే ఈ లోకాన్ని గెలవడం కాదు - తనను గెలవడం.
"లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తమున్ గెలువ నేరవు" అంటాడు ప్రహ్లాదుడు - తండ్రి హిరణ్యకశిపునితో.
చరాచర ప్రపంచంలోని సకల పదార్దాలకూ ప్రాణముందని భారతీయుల విశ్వాసం. "ఆత్మవత్సర్వభూతాని" - సమస్త ప్రాణులను నిన్నువలెనే భావించు, వానిని బాధించకు అనే సూక్తంమీదనే సమస్త ప్రకృతి శక్తులకు హాని కలిగించక ఆరాధిస్తూ మానవ జాతి లక్షల సంవత్సరాలు సుఖంగా జీవించింది. పాశ్చాత్యుల సైన్సు అనే దురాశాపూరితవర్తకానికి నేడు ప్రకృతి శక్తులు బలియై, మానవజాతి స్వవినాశపు దరిదాపులకు చేరుకున్నది.





