Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    ఒక విచిత్రం ఏమంటే - క్రీస్తు అవతరించి ప్రభవించిన ప్రాంతంలో మహమ్మదు ప్రవక్త ఆవిర్భవించేనాటికి క్రైస్తవ ప్రభావం లేదు. ఇస్లాం దావానలంలా ఆసియా, ఆఫ్రికాఖండాల్ను వ్యాపించేదాకా క్రైస్తవం జాడ కనిపించదు. నేటికీ ఈ రెండు ఖండాల్లో - క్రైస్తవపు జాడ నామమాత్రమే!
    
    నాకు మతద్వేషమే కాదు - ఏ ద్వేషమూ లేదనే విషయం 'జీవనయానం' పాఠకులు గ్రహించి ఉంటారు. నేను నిత్యాన్వేషిని నా అన్వేషణ ఈ జన్మతో మాత్రమే మొదలైంది కాదు. ఈ జన్మలో నిలిచిపోదు. నేను ద్వేషాన్ని ద్వేషిస్తాను. ప్రేమను ప్రేమిస్తాను.
    
    "ఇష్కి కోయీకిసీకె మర్నే సె మర్ జాతానహీ
    రూమ్ మెఁ ఘమ్ బన్కె రహజాతాహై జాతానహీ"
    (వలపు ఏ ఒక్కని చావుతోనో చచ్చేది కాదు.
    మనసులో వలపు గూడు కట్టుకుంటుంది పోదు.)
    
    నా అన్వేషణమూ ఒక వలపే.
    
    భారతదేశపు ఉదార తాత్త్వికతను పాశ్చాత్యుల సంకుచిత దృష్టితో పరిశీలిస్తే అర్ధం కాదు అనే విషయం సమాజవాదపు కోట ద్వారాలు తెరుచుకొని బయటపడ్డాక అర్ధం అయింది.
    
    అప్పుడు నాకు హిమవదున్నత భారత తాత్త్విక చింతన దర్శనం ఇచ్చింది. గంగవలె నిరంతరం నిర్మలంగా ప్రవహిస్తున్న భారత సంప్రదాయం దర్శనం ఇచ్చింది. గగనతలం కన్న విసాలంయాన సాహిత్యం దర్శనం ఇచ్చింది. సముద్రంకన్న లోతైన భారత ఆలోచనా విధానం దర్శనం ఇచ్చింది.
    
    ఇది మహా విశ్వదర్శనం ఇది అన్మత దర్శనం ఇది అనాది దర్శనం. ఇది నన్ను చకితుణ్ణి చేసింది. సంభరమాశ్చర్యాల్లో ముంచింది. ఉక్కిరి బిక్కిరి చేసింది. సచేతనున్ని చేసింది.
    
    ఆ ప్రభావంతో - ఆ స్ఫూర్తితో - ఆ జ్ఞానంతో - ఆ చైతన్యంతో వాల్మీకి రామాయణం (1963), వ్యాస భాగవతం (1968), వ్యాస మహాభారతం (1994) సరళ తెలుగు వచనంలో సవ్యాఖ్యానంగా ప్రచురించాను. నన్నయకు ముందునుంచి నేటివరకు ఏ ఈమూడు గ్రంథాలను ఒకే రచయిత రచించిన నిదర్శనాలు అరుదు. ఇది భగవానుడు ప్రసాదించిన శక్తి - కేవలం భగవదనుగ్రహం. కాకున్నా నాలాంటి సామాన్యునికి ఇది దుస్సాధ్యం - అసాధ్యం. పూర్వజన్మ సంస్కారం అయినా కావచ్చు.
    
    హరివంశ సహిత శ్రీమహాభారత రచన, ప్రచురణ తరువాత భగవానుడు వేదాలను అనువదించే సంకల్పం కలిగించాడు. భగవానుడే సంకల్పం కలిగించాడని ఎందుకంటున్నానంటే - వేయేళ్ళ ఆంద్ర సాహిత్య చరిత్రలో ఈ సంకల్పం కలిగిన జాడ అరుదుగానైనా కనిపించదు. నేను సామాన్యునికి అర్ధం అయ్యే సరళ ఆంద్రవచనానువాదం సంకల్పించాను.
    
    నన్నయ భట్టారకుడు శ్రీమహాభారత ఆంధ్రానువాదాన్ని స్వచ్చందంగా చేపట్టలేదు. సంస్కృతంనుంచి అనువదించడానికి వెనుకాడాడు. ఒక రాజకీయ ప్రయోజనంకోసం రాజు అర్ధించగా చేశాడు. తిక్కనామాత్యుడు ఆంద్రమహాభారత రచన సాగిస్తూ, భగవద్గీతను అనువదించడానికి జంకాడు. కేవలం 42 గద్యపద్యాల్లో ముగించా ననిపించాడు.
    
    అలాంటప్పుడు అనేక విధి నిషేధాలున్న వేదాలను సామాన్య పాఠకులకు అర్ధం అయ్యేలా తెలుగులో అనువదించ సంకల్పించడం ఎంత సాహసమో గ్రహించాలి. అందుకే ఇది కేవలం భగవంతుడు కలిగించిన సంకల్పం అని విన్నవించాను.
    
    అసలు సవ్యాఖ్యానంగా నాలుగు వేదాల్ను సపాదించడం గగనం అయింది. తెలుగులో లేవు. దేవనాగరి సంస్కృతంలో అన్ని వేదాలనూ ఒకే ప్రచురణ సంస్థ ప్రచురించలేదు. గ్రంథాలు సాధించడమే ఒక యజ్ఞం అయింది. ఆ మహాయజ్ఞ విషయం శ్రీమదాంధ్ర వచన ఋగ్వేదసంహిత పీఠికలో వివరించాను.
    
    యజ్ఞయాగాది క్రతువుల జోలికి పోలేక కేవలం భగవదారాధన చేసి, భావ పుష్య పౌర్ణమి 16-1-95న ఋగ్వేద సంహిత ఆంద్రవచనానువాదం ప్రారంభించాను. నిద్రాహారాలు పట్టించుకోక నిరంతరం రోజుకి పది, పన్నెండు గంటలు శ్రమించి కృష్ణ యజుర్వేద సహితంగా నాలుగు వేదాల ఆంద్ర వచనానువాదం ఈశ్వర పుష్య శుక్ల ఏకాదశి 24-1-98 ఉదయం 9.15కు ముగించినప్పటి మహాదానందం అనుభవించాల్సిందే! అక్షరానికి అందదు ఆనాడు సకుటుంబ బాంధవంగా జీడికంటి రామచంద్రస్వామిని దర్శించుకొని, మరుసటిరోజు యాదగిరి లక్ష్మీనరసింహాస్వామి వారి కళ్యాణం చేయించాం. చేయించడానికి మనం ఎంతటి వారలం? ఆ స్వామియే చేయించుకున్నాడు.
    
    ఇంత తొందరేల? అంటే, నేను 70 ఏళ్లవాణ్ణి. జీవితపు చరమాంకంలో ఉన్నాను. వేదాలను అనువదించి, ఆంద్రులకు అందించకుండా వెళిపోతానేమోనని భయం! "క్షుద్రం హృదయం దౌర్భల్యం" అన్నాడు కృష్ణపరమాత్మ. భగవంతుడే నీతో పూర్తి చేయించదలచినాక భయమేల? అంటే, అజ్ఞానం! నేను మానవమాత్రున్నే!!
    
    ఈ మహదనువాద కార్య మహాయజ్ఞంలో ఏ ఒక్కరూ నాకు సాయపడ్డవారు లేరు. వారించిన, ఆటంకపరచిన, దుష్పరిణామాలు చూసి భయపెట్టిన మహానుభావులున్నారు. కనీసం పుస్తకం వెదికి అందించినవారు లేరు. వ్యాస భగవానునికి గణపతి వ్రాయసకాడయినాడు. నాకు వ్రాయసగాడూ లేడు. ఈ వయసులో, అంతం మాత్రపు ఆరోగ్యంలో అయిదువేల పేజీలు వ్రాశాను! ఇది సామాన్యం కాదు!! ఇదీ ఈశ్వరుడు ప్రసాదించిన శక్తియే!!!
    
    ఒకే వ్యక్తి ఆధునిక సాహిత్యపు నవలలు మున్నగునవి వ్రాసి; రామాయణ, భారత, భాగవతాలూ నాలుగు వేదాలూ అనువదించిన నిదర్సనాలు భారత సాహిత్య చరిత్రలోనే కొదువ! యావద్భారతంలోనూ ఒక్కడే నాలుగు వేదాలు అనువదించడం అరుదాతి అరుదు. ఇది వాస్తవాలు తెలియపరచడానికే! నాకు గర్వం లేదు ఏలనన -
    
    పలికెడిది భాగవతమట
    పలికించు విభుండు రామభద్రుండట నే
    బలికిన భవహరమగునట
    పలికెద వేరొండుగాథ బలుకగనేలా!
    
    నాది పోతన మార్గం. నన్ను నేను కర్మయోగిని అనుకుంటాను. నాది శ్రీ నాథుని దారికాదు. కావుననే భగవదనుగ్రహం తప్ప అన్యం అంతగా ఆర్జించినవాణ్ణి కాదు. అయినా గ్రాస వాసో దైన్యం జాడలేదు.
    
    అనువాద యజ్ఞం:
    
    అనువాదం కష్టం వాదం సులభం, అనువాదం దుస్తరం అందునా వేదానువాదం అసాధ్యం కాకున్నా దుస్సాధ్యం. 'సంస్కృతం' సాంతం ఒకే భాషకాదు. కావ్య, వైద్య, జ్యోతిష, పురాణాది సంస్కృతాలు వేరు వేరు. ఎవరికి వారికి వారి శాఖా సంస్కృతమే తెలుస్తుంది. సమస్త సంస్కృతం తెలిసినా డుండడు.
    
    నాకు కావ్య సంస్కృతం తెలుసు. ఆ పరిజ్ఞానం కరదీపిక అవుతుంది కాని పదార్ధం కాదు. కాబట్టి వేద సంస్కృతం అర్ధం చేసికోవడానికి అహరహం కృషి చేశాను. అయిన అది నాకు పరిపూర్ణంగా ద్యోతకం అయింది అనజాలను. సాయణాచార్య,ల్ మహీధర, ఉవటాచార్యుల వ్యాఖ్యానాల, అన్య అనువాదాల ఆధారంగా అనువదించాను.
    
    'వేదం' సామన్యం కాదు. పౌరుషేయం కాదు. అపౌరుషేయం. వేద మంత్రపు లోతు తెలియడం అసాధ్యం. అనువాద యజ్ఞం వంటరిగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏడ్చాను. ఇంత మహత్కార్యనైకి ఎందుకు పూనుకున్నట్లు? ఆ మేరు పర్వతాన్ని ఈ సామాన్యుడు మోయగలడా? అలాంటి దిగజారుడు, మానసిక బలహీనత, హృదయ దౌర్బల్యంతో ఒక తేజోకిరణం దర్శనం ఇస్తుంది. 'ఆగకు, సాగు' అన్నట్లు బోధిస్తుంది. కన్నీరు తుడుస్తుంది. ముందు నడుస్తుంది. నన్ను నడిపిస్తుంది!
    
    నేను ప్రతి మంత్రాన్నీ అర్ధం చేసుకోవాలి. అనుమానాలను నివృత్తి చేసికోవాలి. మంత్రం తన పరిపూర్ణజ్యోతితో నాకు దర్శనం ఇవ్వాలి.
    
    నాకు అర్ధం కానిది నేను చెప్పలేను. అర్ధం అయిన దాన్ని అనువదించాలి. తేటతెనుగులో అందరికీ అర్ధం అయ్యే సరళభాషలో చెప్పాలి.
    
    అందుకు నేనొక తపస్సు చేశాను. రోజుకు పది, పన్నెండు గంటలు శ్రమించాను. ఇరవై నాలుగ్గంటలు - నిద్రలో సహితం - మంత్రాల మననం. అర్ధం వెదకడానికి పలకరింపులూ సహజమైపోయాయి! ఈ స్థితిని ఎవరు సహిస్తారు? కమల సహించింది!
    
    వేదం ముందుంచుకొని కూర్చుంటాను. భయం - ముందు మహారణ్యం కనిపిస్తుంది. సింహాలు, పులులు, సర్పాలూ, మహా మృగాలు కనిపిస్తాయి. అందులో అడుగుపెట్టలేం అనిపిస్తుంది. కాగితంమీద కలం పెడ్తాను. మహారణ్యం రమ్య ఉద్యానం అవుతుంది. సింహాలు, పులులు, సర్పాలూ, మహామృగాలు - లేళ్ళు కుందేళ్ళు, నెమళ్ళు రంగురంగుల పక్షులు అవుతాయి. రాచబాటలు, పుపొదరిండ్లు, వృక్షచ్చాయలు, తామరల కొలనులు అవుతాయి. రచన అనాయాసంగా సాగిపోతుంది. ఏదో మహాత్తమ శక్తి నాతో వ్రాయిస్తున్నట్లనిపిస్తుంది! వ్రాస్తున్నంతసేపు ఏదో చల్లని వెలుగు నన్ను నడిపిస్తుంది! కాలం సాగుతుంది! మనసు పొంగుతుంది! ఉప్పొంగుతుంది! మహదానందం! 'ఆనందోబ్రహ్మ!'
    
    ఎన్ని విచిత్ర, వింత, విశిష్ట సంఘటనలు! ఒక్కొక్కసారి వాక్యం ప్రారంభిస్తాను. ముందుకు సాగదు. అయోమయం! లిప్తలో కాలం వెంట వెలుగు పాయ! వాక్యం పూర్తవుతుంది! అది నాకే ముద్దొచ్చేంత ముద్దుగా ఉంటుంది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.