Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    1992 లో మనశ్శాంతికోసం కమలా - నేనూ కన్యాకుమారి వెళ్ళాం. వివేకానంద ఆశ్రమంలో డిసంబరు 9 నుండి 17 వరకూ ఉన్నాం. అప్పుడు శ్రీమద్రామాయణం మరొకసారి అధ్యయనం చేశాను.
    
    కన్యాకుమారిలో ఉండగా ఒకనాటి రాత్రి 'భారత రచన పూర్తిచేయాలి' అనే ధ్వని మరల మరల నా మనసులో సుడులు తిరిగింది. అమ్మవారు ఆదేశిస్తున్నారా? వివేకానందులు ప్రేరేపిస్తున్నారా? ఏమో! అది ఒక థ్రిల్! ఒక ఆవేశం! ఒక పూనకం!!!
    
    ఇంటికి చేరుకున్నాం. ఆ ధ్వని వెన్నాడుతున్నది. విడువడం లేదు. ఈ జీవితం కర్మమీద ఆధారపడి ఉన్నది. కష్ట నష్టాలకు బాధ్యత కర్మది. అందుకు భారతాన్ని దోషిని చేయడం నా అజ్ఞానం అనుకున్నాను. జ్ఞాన జ్యోత్స్నలో 31-12-92 నుండి భీష్మపర్వంనుంచి భారత రచన ప్రారంభించాను. నిరంతరం రచన సాగించాను. రాత్రింబవళ్ళు రచించాను. మళ్ళీ అగరాదు. భారత రచన పూర్తి చేయాలి. అనారోగ్యాన్ని లెక్కచేయలేదు. రచన, రచన, రచన - అంతే లోకం ఉన్నదని మరచాను. శ్రీముఖ వైశాఖ శుక్ల ఏకాదశి 31-5-1993 సోమవారంనాడు. భారత రచన పూర్తి చేశాను.
    
    పబ్బా శ్రీనివాసప్రభు. పబ్బా శంకరయ్య కొడుకు. నన్ను శ్రీముఖ ఉగాది ఉత్సవానికి అధ్యక్షత వహించవలసిందని ఆహ్వానించడానికి వచ్చాడు. అప్పుడు నేను భారత రచనలో ఉన్నాను నన్ను శంకరయ్య అడగడం - భారతరచన మున్నగునవి వివరించాను. మహాభారత ప్రచురణ విషయం ఆలోచిస్తామన్నారు.
    
    29-5-1993 నాటి ఉదయం శ్రీకృష్ణ నిర్యాణం వ్రాశాను. అంతటి పరాత్పరునకు ఎలాంటి మరణం! మనసు వికలం అయింది. కనులు చెమర్చాయి. ఆ యోగీశ్వరుని నిర్యాణ సందర్భంగా ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలనిపించింది. అలా అనుకుంటుండగానే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు ధరించిన ఒక వైష్ణవుడు ద్వారంలో కనిపించాడు. "సాపాటుకు వచ్చాను" అన్నాడు! అప్పటి నా సంభ్రమ - ఆశ్చర్యాలు వర్ణించడం అసాధ్యం! అంతే!! అంతకన్నా చెప్పలేను.
    
    ఆ స్వామికి సాపాటు ఉంచాం. వస్త్రము - దక్షిణ సమర్పించాను. వారికి పాదాభివందనం చేసి పరమానందభరితున్ని అయినాను.
    
    25-6-1993 న శ్రీ మహాభారత ఆరాధన సమారాధన ఏర్పాటు చేశాను. ఆ ఉత్సవానికి అనేకమంది బంధుమిత్రులు విచ్చేశారు. ఆనాడే 1473 పేజీలు  అయిదు వాల్యూముల శ్రీ మహాభారతం వ్రాతపత్రి శ్రీరామా పబ్లిషర్స్ శ్రీనివాస సోదరులకు అందించాను. వారు ప్రచురిస్తామన్నారు.
    
    ఒక సందర్భంగా మిత్రులు ఎ.బి.కె ప్రసాద్ గారు మాటలాడుతూ, హరివంశం చేరిందే మహాభారతం అన్నారు. అధ్యయనం చేయగా 'ఖిలేషు హరివంశం చ సంఖ్యాతాని మహార్షిణా" అని కనిపించింది. హరివంశాన్ని ఖిలపర్వం అన్నాడు వ్యాసుడు. భారత కథ సాంతం నిర్వహించిన శ్రీకృష్ణపరమాత్ముని కథ ఉండడం అవసరం అనిపించింది. 24-12-93 న ప్రారంభించి హరివంశ రచన 3-2-94న పూర్తిచేశాను. భారతంలో చేర్చాను. 1985-86 సంవత్సరాల్లో ఆంద్రప్రభ సచిత్రవారపత్రికకు వరుసగా 58 వారాలు - ఎన్నుకున్న భారత పద్యాల వివరణ - భారత సూక్తం - వ్రాశాను. గ్రంథం చివర వాటిని భారత సూక్తంగా చేర్చాను.    
    
    శ్రీమద్రామాయణ, శ్రీమహాభారత, శ్రీమద్భాగవతముల వంటి మహాగ్రంథాలను రచించే అవకాశం నాకు భగవానుడు కలిగించాడు. నేను గతజన్మలో యోగభ్రష్టుని కాకుంటే ఇంతటి మహత్కార్యం అసాధ్యం! ఇంతటి సుదీర్ఘ ఆంద్ర సాహిత్య చరిత్రలో ఒక్కరే ఆ మూడు గ్రంథాలు రచించినవారు అరుదు.
    
    రెండువేలపై పేజీలు గల శ్రీ మహాభారతపు మూడు సంపుటాలు శ్రీభవ ఉగాది 11-4-94నాటికి అచ్చయి సిద్దం అయినాయి. ఆనాడు శ్రీరామా పబ్లిషర్స్ వారు సికిందరాబాదు మహబూబ్ కాలేజి ఆవరణలో ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు.
    
    రమ్య సాయంత్రాన శోభాయమానంగా అలంకరించిన సభకు శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాకాహర్యులవారు అధ్యక్షత వహించారు.
    
    నేను శ్రీమహాభారత గ్రంథాన్ని బదరిలో వేంచేసి ఉన్న నారాయణస్వామికి భక్తిపూర్వకంగా అంకితం సమర్పించాను.
    
    రామకృష్ణమఠం స్వామి పరమార్దానంద గ్రంథాన్ని ఆవిష్కరించారు. చక్కని శైలిలో భారత ఆత్మయైన మూడు గ్రంథాలను రచించినందుకు రచయితను బహుధా ప్రశంసించారు. ప్రచురణకర్తలను అభినందించారు.
    
    శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు గ్రంథపరిచయం చేస్తూ రచయిత వివరించిన "ఆలోచనామృతం" ఎంతో ఆసక్తికరంగా, ఉపయోగకరంగా ఉందన్నారు.
    
    ప్రచురణకర్తల పక్షాన శ్రీ పబ్బా శివరామయ్య కృతజ్ఞతలతో శ్రీమహాభారత ఆవిష్కరణ సభ ముగిసింది.
    
                                   నలభై: వేదనాదం
    
    వేదంలోనే సకలమూ - సమస్తమూ -సర్వమూ ఉందనే సనాతనులున్నారు.
    
    వేదంలో ఏమీలేదు. అదంతా అవాస్తవం - మిథ్య - దోపిడీ అనే ప్రగతి వాదులూ ఉన్నారు.
    
    ఈ ఉభాయుల్లో ఎవరూ వేదం చదివి ఈ నిర్ణయానికి రాలేదని నా అభిప్రాయం.
    
    ఒకరు కేవలం విశ్వాసంమీద ఆ అభిప్రాయం ఏర్పరచుకున్నారు. మరొకరు భారతదేసంలో చెప్పుకోదగింది ఎదీలేదనే సిద్దాంతం మీద, పాశ్చాత్యులు రచించిన గ్రంథాల ఆధారంగా - తిరుగులేని అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు.
    
    ఇరవయ్యో శతాబ్దపు నాలుగు, అయిదు దశకాల్లో సమాజవాద సాహిత్య ప్రభావంతో నేనూ ప్రగతివాద భావాలనే నిశ్చయంగా నమ్మాను. 'మంచి గతమున కొంచెమేనోయ్' అనుకున్నాను. "గతానికీ మతానికీ కళ్ళు లేవు. మనిషికీ మనసుకూ కళ్ళు లేవు" అన్నాను. వేదమూ, పురాణాదులూ బ్రాహ్మణులు, ప్రభువులను, వారి దోపిడీని బలపరచాదనైకి సృష్టించిన అభూత కల్పనలు అనుకున్నాను.
    
    'సత్యం' మానవునికి అందేదికాదు. వాస్తవంకూడ తెలియడం దుస్తరం. వాట్శావం ఉపనిషత్తులందలి 'బ్రహ్మము' వంటిది. దానికి విద్వాంసులు ఏ రూపాన్నిస్తే సామాన్యులు ఆ రూపాన్నే చూడగలరు.
    
    భారత చరిత్రలో బ్రాహ్మణులు - మేధావులు - ఏనాడూ ప్రభువుల దోపిడీకి సహకరించలేదు. ప్రభువుల దుశ్చర్యలను ఖండించడానికీ, వారిని సక్రమ మార్గాన నడిపించడానికీ తమ శక్తియుక్తులను ప్రయోగించారు - ఉపయోగించారు.
    
    అందుకు స్వస్తి ప్రజాభ్యః - ప్రజలకు శుభం కలగాలి. 'పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీశాః - పాలకులు ఈ భూమిని న్యాయ మార్గాన పరిపాలింతురుగాత! అనే నినాదం నిదర్శనం. విపులంగా చర్చించడానికి ఇది సందర్భంకాదు.
    
    మధ్యయుగాల్లో యూరోపులోని క్రైస్తవ మతాచార్యులు ప్రభువుల దోపిడీకి సహకరించాడానికి అనేక దుశ్చర్యలకు పాల్పడ్డారు. చనిపోయిన వైర్కి స్వర్గం కలిగించడానికీ వారసుల దగ్గర డబ్బు వసూలు చేసి స్వర్గానికి చీట్లు వ్రాసిచ్చారు. వారి దురంతాలకు వ్యతిరేకంగా ఒక మహోద్యమం వచ్చి, మతాన్ని ప్రభుత్వంనుండి విడగొట్టడం జరిగింది.
    
    భారత సాహిత్య, సంస్కృతులను అధ్యయనం చేసిన పాశ్చాత్య విద్వాంసులు తమ చరిత్ర, నాగరికతలను దృష్టిలో ఉంచుకొని మన వాటిని వాఖ్యానించారు. ఆంగ్లేయులు మనను రాజకీయ బానిసలను మాత్రం కాదు - సాంస్కృతిక బానిసలను చేశారు. మనం వదిలించుకున్నది రాజకీయ బానిసత్వాన్ని మాత్రమే!
    
    భారతదేశంలో మతం - ప్రభుత ఎన్నడూ కలసిలేవు. ఈ 'మతం' అనే పదం కూడా పడమటి దిగుమతియే! మనది ధర్మం. 'ధర్మం' 'ప్రభుత' రెండు ప్రత్యేక వ్యవస్థలుగా వర్ధిల్లాయి. విశ్వామిత్రుని వృత్తాంతం ఇందుకు నిదర్శనం. అతడు ప్రభుత్వాన్ని వదిలి ధర్మాన్ని వరించాడు. అలాంటి రాజర్షులు అనేకులు ఉన్నారు.
    
    అనంత భారత చరిత్రలో 'ప్రవక్త'లను హింసించిన, ఉరితీసిన, శిలువలకు ఎక్కించిన ఉదంతాలు మచ్చుకైనా లేవు. క్రైస్తవం సుమారు బౌద్ధానికి అనుకరణమే! వేదాలను నిరసించినా - బుద్ధ భగవానుని, మహావీర వర్ధమానుని సకల భారతజాతి గౌరవించింది. వారి ముందు మోకరిల్లుంది. ప్రభుత్వాలు వారికీ దాసోహం అన్నాయి. భారతజాతిది తాత్త్విక చరిత్ర - రాజకీయ చరిత్ర కాదు.
    
    జాబాలి, చార్వాకులు నాస్తికులు, హేతువాదులు అయిన, భారతజాతి వారిని శిక్షించలేదు. వారి ఆలోచనా విధానాన్ని సహితం తుడిచిపెట్టలేదు. తనలో ఇముడ్చుకుంది!
    
    క్రీస్తు, మహమ్మదు ప్రవక్తలకు ముందు చరిత్ర లేదా? ఉంటే - ఆ చరిత్రను ఆయా మతాల రంగు పులిమి అధ్యయనం చేయడం వాస్తవమగునా? సత్యమగునా? ఇది సంకుచితం కాదా?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.