Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    నేను నా అనుభవాలు - మా వూరి ముచ్చెట్లు గంటపైగా మాట్లాడాను. సభాపదులు - పున్నమి చంద్రుడు ఇంకా వింటామన్నా ముగించాను.
    
    చిరంజీవి కృతజ్ఞతలు సమర్పించడంతో సభ ముగిసింది.
    
    మా పిల్లలు ఉదయ - మోహన్ - ఉజ్వల్, సుధ - సురోత్తం - సహజ - సమీర్ సభలో పాల్గొన్నారు.
    
    రవి స్వీట్సు శ్రీనివాస్ అందరికి ఆత్మకింపయిన భోజనం ఏర్పాటు చేశారు.
    
    నా అదృష్టం ఏమంటే - మా ఊళ్ళల్లో - మావాళ్ళే ఎంతో ఆత్మీయంగా అభిమానించారు, ఆదరించారు. మా పూర్వుల భద్రాచలంలోనూ, మా జన్మభూమి చినగూడూరులోనూ - బాల్యం గడిచిన ఖమ్మంలోనూ - ఉద్యమాలు నడిపిన గార్లలోనూ ప్రజలు నన్ను అపూర్వంగా ఆదరించారు. సగంపైనా జీవితం గడిపిన జంటనగరాల్లో అనేక సత్కారాలు జరిగాయి. అయితే, ఈ మధ్య జరిగిన గోపీచంద్ సత్కారాన్ని మాత్రం వివరిస్తాను.
    
    త్రిపురనేని గోపీచంద్ మహా మానవుడు. మహత్తమ రచయిత. యువకళా వాహినివారు గోపీచంద్ పేర ప్రతి సంవత్సరం ఒక రచయితకు అవార్డు ఇస్తారు. 1993  గోపీచంద్ అవార్డు నాకు ప్రదానం చేశారు.

 

                       
    
    బహుమతి ప్రదానోత్సవం 8-9-93 బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగింది. సభకు జె. బాపురెడ్డిగారు అధ్యక్షత వహించారు. సోదరి వాసిరెడ్డి సీతాదేవి ప్రారంభోపన్యాసం చేశారు. వాస్తుశిల్పి బి. ఎన్. రెడ్డిగారు నాకు సన్మానం చేశారు. డాక్టర్ పి.వి. రంగారావుగారు ముఖ్య అతిథిగా విచ్చేసి, నాకు అవార్డు అందించారు.
    
    నేను తగురీతిని మాట్లాడాను. సంస్థ అధ్యక్షులు వై.కె. నాగేశ్వరరావుగారి కృతజ్ఞతలతో సభ ముగిసింది.
    
    నేను గత అర్ధశతాబ్దంగా సాహిత్యంలో కృషి చేస్తున్నాను. ఇప్పటికి ఎనిమిదివేల పేజీల పైగా ముఫ్ఫయి పుస్తకాలు ప్రచురణ జరిగింది. కాని, ప్రభుత్వంనుంచి ఇసుమంత సాయంకాని - ఆదరణకాని లభించలేదు. అందుకు నేను ఆవగింజంత బాధపడడం లేదు. ప్రభుత్వం ప్రతిభను కాక పైరవీని మాత్రమే గుర్తిస్తుందని చెప్పడం నా ఉద్దేశం.
    
    జయన్తి తే సుకృతినో రససిద్దాః కవీశ్వరాః
    నాస్తితేషాం యశః కాయే జరామరణజం భయం భర్త్రుహరి.
    
    కవులు పుణ్యపురుషులు వారు మంచి రచనలు చేస్తారు. వారు రసములను పండించగలరు. బంగారం చేసే రససిద్ది వారికి ఉంది. కవుల కీర్తికాయానికి జరామరణ భయం లేనేలేదు.
    
                                                 ముఫ్ఫయి తొమ్మిది
    
భారతామృతం:
    
    ఇతిహాస ప్రదీపేన మోహావరణ ఘాతినా
    లోకగర్భ గృహం కృత్స్నం యథావత్ సంప్రకాశితమ్.
    
    మహాభారత ఇతిహాసము జ్వాజ్జ్వల్యమానమై ప్రకాశించు దీపము. ఇది మోహాంధకారమును దూరము చేయుము. అంతఃకారణములను పునీతము చేయుము. జ్ఞాన జ్యోతిని వెలిగించును.
    
    భారతీయులంగా మనం భాగ్యవంతులం మనకు అనంత చరిత్ర ఉన్నది. గొప్ప సంస్కృతి ఉన్నది. అంతం ఎరుగని సంప్రదాయం ఉన్నది. హిమాలయం ఉన్నది. వింధ్య ఉన్నది. గంగా ఉన్నది. యమున ఉన్నది. గోదావరి ఉన్నది. కృష్ణ ఉన్నది. కావేరి ఉన్నది.
    
    అన్నింటినిమించి తరగని సాహితీభాండాగారం ఉన్నది. మనకు వేదములు - ఉపనిషత్తులు - బ్రాహ్మణములు - ఆరణ్యకములు - పురాణములు - కావ్యములు కొల్లలుగా ఉన్నవి. వీటి అన్నింటిని కాచివడపోసిన రామాయణ భారత భాగవతాలున్నవి. ఇంతకుమించిన సంపద లోకంలో ఏ దేశాని కుందండీ? లేదు, లేదు, లేదు. మనమే సంపన్నులం! క్షీయంతేఖలు భూషణాని సకలం వాగ్భూషణం భూషణం అలంకారాలు అన్నీ నశిస్తాయి! నశించనిది విద్యాభూషణం మాత్రమే!!
    
    మహా భారతం మనకున్న మహా సంపద అది మనలో ఆనందం కలిగిస్తుంది. ఆహ్లాదం నింపుతుంది. ఆత్మోన్నతిని కలిగిస్తుంది. మనసును పులకింపజేస్తుంది. కన్నుల నీరు నింపుతుంది. మహా జ్యోతిని ముందు నిలుపుతుంది. మనను పెంచుతుంది. పరవశింపచేస్తుంది.
    
    మనసు మానవులను చేస్తుంది
    మహోన్నతికి తీసుకుపోతుంది
    పరమపదం చేతికి అందిస్తుంది.
    
    వ్యాసభగవానుడు మహాభారతం రచించాడు. మానవజాతికి మహోపకారం చేశాడు. ఏమిచేసినా అతని రుణం తీరదు. అతడు మనకు అక్షయపాత్ర అందించాడు. మీరు ఇవ్వదలచుకున్నంత ఇవ్వండి. ఇంకా ఉంటుంది. అలాంటి వ్యాసభగవానునికి మనం ఏమీ ఇవ్వలేం. అందుకే నమస్కరింతాం.
    
    వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం
    పారాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం.
    
    భగవంతుడు నాకు రామాయణ, భాగవతాలు రచించే భాగ్యం కలిగించాడు. మిత్రులు పబ్బా శంకరయ్యగారు వాటిని ప్రచురించారు. వస్తు ప్రాధాన్యత - శైలీ సౌలభ్యం వల్ల అవి జనాదరణ పొందాయి. నాతో భారతం వ్రాయించవలసిందని అనేక మంది పాఠకులు కోరారు.
    
    పబ్బా శంకరయ్యగారు నన్ను భారతం రచించమన్నారు. ఒక పుష్కరం మా యింటికి తిరిగారు, అర్ధించారు. నేను పూనుకొనలేకపోయాను. ఒకనాడు శంకరయ్యగారు కోపంగా వచ్చారు. "రంగాచార్లూ! నేను బతికి ఉండగా భారతం వ్రాసిస్తావా లేదా?" అన్నారు.
    
    "డొంక తిరుగుడు ఎందుకు శంకరయ్యా! నేను బతికుండగా భారతం వ్రాస్తావా? అని కదా నువ్వడిగేది? భగవంతుడు సంకల్పం కలిగించడం లేదు. ఏం చేయమంటావు?" అన్నాను.
    
    "నీకు ఇష్టంలేదు మధ్యన దేవుడెందుకు?" అని కోపంగా లేచి వెళ్ళిపోయారు. అంతా ఉట్టిదే, బెదిరింపు శంకరయ్య నాకు మిత్రులు అనేకసార్లు మళ్ళీ వచ్చారు!
    
    కారణం తెలియదు. భారత రచన సాగలేదు.
    
    1963 లో చందా రాజేశ్వరరావుగారు భారతం వ్రాయమన్నారు. గ్రంథాలు సమకూర్చారు. వ్రాయలేకపోయాను.
    
    1981 లో సూర్యాపేట కాలేజీవారు నన్ను సన్మానించారు. ఆంద్ర మహాభారతం బహుకరించారు. 'మీ శైలిలో మాకు భారతం కావాలి' అని సభాముఖంగా కోరారు. వాగ్ధానం చేయలేదు. 13-3-1982న మహాభారత రచన ప్రారంభించాను. 1983లో ఆపదలు విరుచుకుపడ్డాయి. మగపిల్లలు వెళ్ళిపోయారు. మా అత్తా మామలు పరపపదించారు. కమలకు ప్రాణాపాయకరమైన జబ్బు చేసింది. భగవదనుగ్రహం వల్ల బయటపడింది.
    
    మహా భారతాన్ని గురించి మన దేశంలో ఒక అపప్రధ ఉంది. మహా భారతం పూర్తిగా చదవడంగాని - వ్రాయడంగాని అసాధ్యమే కాదు - అపాయకరం అంటారు. అందువల్ల అప్పటికి ముగించిన విరాటపర్వంవద్ద నిలిపిచేశాను. మళ్ళీ దాన్ని ముట్టలేదు. అనంతరం మా అన్నయ్య, మా విజయ్ ఒకరి తరువాత ఒకరు గతించారు. విరించి మమ్ము అంటక ముట్టక దూరంగా ఉన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.