Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
నన్ను గ్రామస్థులు అనేకులు ఆత్మీయంగా - అభిమానంతో సన్మానించారు. నా ఉపన్యాసం రాత్రి పదకొండింటికి మొదలయింది. జనం నిశ్శబ్దంగా ఉన్నారు.
నేను గూడూరుకు - రామాలయానికి - ఆకేరుకు - తుమ్మిడి చెరువుకూ - తామరకుంటకూ నమస్కరించి ఉపన్యాసం ప్రారంభిస్తే సభలో కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి.
"మీరు కురిపించిన ప్రేమాభిమానాలు - తీర్చడానికి కాదు - అనుభవించడానికి మరిన్ని జన్మలు కావాలి" అని చిల్లర దేవుళ్ళు పాత్రలు వాతావరణం మన వూరుదే అని వివరించాను.
రాత్రి పన్నెండుకు మొదలయిన అధ్యక్షోపన్యాసంలో "దేవుడు ప్రత్యక్షమైన ఏం కావాలి అంటే రంగాచార్యులవారు 'మరు జన్మలో చిన్న గూడూరులో పుట్టించు' అనేట్లున్నారు. జన్మభూమిని అంతగా ప్రేమించారు" అని వక్కాణించారు అధ్యక్షులు.
అంతటి అభిమానం పట్టలేకపోయాను. ఆ రాత్రి నిద్రపోలేదు. తెల్లవారి మళ్ళీ ఏట్లో స్నానాలు చేసి, ఆత్మీయములయిన పలకరింపులు - వీడ్కోళ్ళతో మావూరు గూడూరును - అతిభారంగా - వదిలివచ్చాం.
మిత్రులు A.B.K ప్రసాద్ గారి ప్రోద్బలంతో చిన్నగూడూరు సత్కారాన్ని గురించి ఒక వ్యాసం వ్రాశాను. అది "నా చిన్నప్పటి చందమామ - చినగూడూరు" అనే శీర్షికన 9-2-91నాటి 'ఆంద్రభూమి'లో ప్రచురించబడింది. అది చూచి గూడూరు వారు ఎంతో సంతసించారు.
గార్ల మావూరు అని సగర్వంగా చెప్పుకోగలం. అక్కడ మేము అనేక ఉద్యమాలు నిర్వహించాం. మంగపతిరావు నాయకత్వంలో గార్ల యువకులు 6-6-1993 ఆదివారం నాకు సన్మానం చేశారు. అప్పుడు ఉద్యమాల్లో పనిచేసినవారు - ఇంకా మిగిలినవారు బహుకొద్దిమంది సభలో పాల్గొనడం విశేషాతివిశేషం.
స్టేషనుకు మమ్ము ఆహ్వానించడానికి అనేకమంది వచ్చారు. మల్లెల దండలు మాకు వేశారు. స్టేషను సాంతం గుబాళించింది. సభాస్థలి - వర్తకసంఘ భవనం - రమ్యంగా అలంకరించబడింది. రమ్యమైన నాటి సాయంతన సభకు మంగపతిరావు అధ్యక్షత వహించారు. గార్ల మిత్రులు - మిత్రుల పిల్లలు ఒక్కొక్కరే మల్లెలదండలు శాలువలు ఉత్తరీయాలతో నన్ను సన్మానించారు. మల్లెల రాశి సభాస్థలిని గుబాళింపచేసింది.
కూలిన రాతిస్తంభాన్ని స్తుతించి నేను ఉపన్యసించాను. రాతిస్తంభం - తాసిల్దారు బంగళా కూలడం ఒక వ్యవస్థ కూలడం అన్నాను. గార్ల జీవితం కమ్మరి కొలిమి. బాలసంఘంనుంచి అనేక నిప్పురవ్వలు - కణికలు - మంటలు వివరించాను.
బాల్యమిత్రులు చందా వీరభద్రం - కొదుమూరి వేంకటేశ్వరరావు - మాటేటి శ్రీనివాసరావు మాట్లాడారు. సభ ముగిసింది. కలిసి భోజనాలు - వెన్నెట్లో డాబామీద అందరం పడుకున్నాం. రాత్రి సాంతం ముచ్చట్లే! తెగవు. తెల్లవారింది.
ఇలాంటి అదృష్టం అందరికీ లభించదు!
మిత్రులు - ఆప్తులు గండి మల్లికార్జునరావుగారు డోర్నకల్లులో 20-6-1993 ఆదివారం మా దంపతులకు సన్మానం ఏర్పాటు చేశారు. సన్మానం స్వాతంత్ర్య సమరయోధుల సంఘం పక్షాన జరిగింది. సభకు హీరాలాల్ మోరియా అధ్యక్షత వహించారు. గ్రామ పంచాయతీ - వివిధ సంస్థలు - పూర్వం న అడగ్గర చదువుకున్న విద్యార్ధులు కమలనూ - నన్నూ బహు గొప్పగా సన్మానించారు. నేను అక్కడి మిత్రులను గురించి - నాటి పరిస్థితులను గురించి - 'శరతల్పం' రచనకు గురువయ్య జీవిత స్ఫూర్తిని గురించి మాట్లాడాను. గండి సత్యనారాయణ - మల్లికార్జునరావు - కొలిపాక మధుసూధనరావు - పుల్లాభట్ల వెంకటేశ్వర్లు ప్రసంగించారు. అప్పుడు రావూరి వీరయ్యగారు - బాల్య మిత్రులు - నాకు బంగారు ఉంగరం బహూకరించారు.
గండి మల్లికార్జునరావుగారు - తమ ఇంట్లో - సుమారు అయిదువందల అమ్ధికి రుచికరమైన భోజనం వడ్డించి తినిపించారు.
మా అమ్మాయిలు - అల్లుళ్ళు - మనవలు - మనవరాలు గార్ల, డోర్నకల్లు సభల్లో పాల్గొన్నారు.
చావా శివకోటిగారిది గోకిన పల్లి. నా దగ్గర చదువుకున్నా నంటారు. ప్రఖ్యాత రచయిత. నేనంటే ఎనలేని అభిమానం. సాహితీ హారతి పక్షాన శ్రీముఖ పుష్యపూర్ణిమ - 27-1-1994న 'చంద్రునికి నూలుపోగు' పేర - చంద్రునంతటి ఘనమూ - ఆనందమూ - ఆత్మీయము అయిన సన్మానం ఏర్పాటు చేశారు. మా ఖమ్మం పట్టణంలో! అది మకుట సన్మానం - మా ఉభయులకు చేసిన సన్మానం.
సభాస్థలి - వర్తక సంఘ భవనం - చేరుకున్నాం. మేము వేదికవరకు వెళ్ళడానికి కొత్త పంచెలు పరచి గులాబీలు ఏర్పరచారు. ముందు మంగళవాద్యం - తరువాత వేదపఠనం - తరువాత పూర్ణకుంభం - ఆ వెనుక మా దంపతులను పెళ్ళిపిల్లలలా నడిపించి, వేదికమీద ఆసీనులను చేశారు.
సభకు చేకూరి కాశయ్యగారు అధ్యక్షత వహించారు. మా దాశరథికి మేము సన్మానం చేస్తున్నందుకు గర్విస్తున్నాం అన్నారు.
శివకోటిగారు స్వాగతం పలికారు. మా ఉభయులకు కలిసి ఒకే గులాబీల పెద్దదండ వేశారు. సభలో కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి. తరువాత వస్త్రాలతో సత్కరించారు. చందా వీరభద్రం - కొదుమూరి వేంకటేశ్వర దంపతులు - ఇతరులు మాకు బట్టలు పెట్టి, పాదాభివందనాలు చేశారు.
అనంతరం నిండు పున్నమి చంద్రుని సమక్షంలో - మంగళవాద్యాలు - వేద ఆశీస్సుల మధ్య శివకోతి - చిరంజీవి - రమణ కలిసి నా శిరసున వెండి కిరీటం అలంకరించారు. సభలో ఎడతెరిపిలేని కరతాళ ధ్వనుల మధ్య రజత కిరీట భారంతో నేను వారిని కౌగలించుకున్నాను. వారు మా దంపతులకు పాదాభివందనం చేశారు.
ప్రఖ్యాత కళాకారుడు - రచయిత చంద్ర నాతో వారికి ఉన్న పరిచయాన్ని వివరించాడు. నా "చిల్లరదేవుళ్ళు" చలనచిత్రానికి చంద్ర ఆర్ట్ డైరెక్టరుగా పనిచేశారు. వాటి అనుభవాలను వివరిస్తూ వరంగల్లులో తన అనుభవాలను చెప్పుకున్నారు.
జ్వాలాముఖి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. విద్వాంసునికి ఎక్కడయినా ఆదరం లభిస్తుంది. కాని రంగన్నకు స్వంత ప్రదేశంలో ఇంత ఆదరం లభించడం అపూర్వం' అన్నారు. రామాయణ, భారత భాగవతాలు - చిల్లరదేవుళ్ళు - జనపదం వంటి ఉత్తమ నవలలు రచించి దాశరథి మానవునిగా పరిపూర్ణత్వం సాధించారు. వారు తెలుగు జాతికి 'పరిపూర్ణ మానవుని' నవల అందించాలని కోరారు.
ప్రసిద్ద సంపాదకులు ఏ.బికే ప్రసాద్ మాట్లాడుతూ, దాశరథి తమ నవలల్లో రానున్న పరిణామాలను సహితం సూచించడం ఆశ్చర్యకరం అన్నారు. పున్నమి చంద్రుని సాక్షిగా ఉన్న ఊళ్ళో ఇంతటి సన్మానం. అందుకోవడం దాశరథి మంచి మనసుకు నిదర్శనం అన్నారు. ఆంద్ర సామాజిక జీవిత చిత్రణకు ఉపకరించే తెలుగు నవలల్లో దాశరథి నవలలది అగ్రస్థానం అని కితాబు ఇచ్చారు. "రంగాచార్య జీవితమే ఒక ఉద్యమం - వారు తమ జీవిత చరిత్ర వ్రాసి ఆంద్రజాతికి అందించాలని సభాముఖంగా కోరుతున్నాను" అని కరతాళ ధ్వనుల మధ్య ఉపన్యాసం ముగించారు. ఆ స్ఫూర్తితోనే ఈ రచన.





