Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఆత్మీయత - అనుబంధములే నాకు సంపదలు అని ఇదివరకు విన్నవించి ఉన్నాను. మూడు దశాబ్దాలకు పైగా, మున్సిపాలిటీలో కొట్టుమిట్టాడాను. పదవీ విరమణ తరువాత పాత స్థలాలూ - పాత మిత్రులు - బంధువులు గుర్తు వచ్చారు. కమలా నేనూ బంధు - మిత్ర యాత్ర సాగించాం.
భద్రాచలంలో మా చెల్లెలు రమాదేవి ఇంటికి వెళ్ళాం. జనక తనయా స్నానపుణ్యోదక స్థలం పర్ణశాల దర్శించుకున్నాం. భద్రాచలం గ్రామంలోనూ - ఆలయంలోనూ నన్ను ఆత్మీయంగా సత్కరించారు. మా తాతలనుంచి నాయన వరకు వారి జన్మస్థలం భద్రాచలం! అక్కడి సన్మానం నా మనసును పులకింపచేసింది.
పాలవంచలో మా మేనమామ శఠగోపాచార్యులవారి ఇంటికి వెళ్ళాం. వారు చూపిన బంధుప్రేమ పాతరోజులు పట్టి తెచ్చింది. పాలవంచ సాహితీ సంస్థలు ఎంతో అభిమానంతో నాకు సన్మానాలు ఏర్పాటు చేశాయి. పాత్రికేయులు ఆత్మీయతతో ప్రత్యేక వార్తలు ప్రచురించారు.
పూర్వం టీచరుగా పనిచేసిన గోకినపల్లికి వెళ్ళాం. కురువృద్దులు సీతారామరావుగారు - కవిమిత్రులు వెంకట్రామారావుగారు మా దంపతులకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు. ఆ సభలో నా నవలలను చర్చించడం నాకెంతో ఉత్తేజం కలిగించింది. ఆ సభలోనే నేను - హైదరాబాదు 400 సంవత్సరాల ఉత్సవాల పేర, కిరాతక నిజామును మహాత్మునిగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని హెచ్చరించాను. పత్రికలు ఆ వార్తకు ప్రాధాన్యత ఇచ్చాయి. నా శాపం తగిలింది. అ ఆత్సవాలు మంట కలిశాయి!
నేలకొండపల్లిలో నాకు టీచరుగా తొలి పోస్టింగు వచ్చింది. పెండ్యాల సత్యనారాయణగారి ఇంట్లో చాలరోజులు ఉన్నాను. అక్కడికి వెళ్ళాం. సత్యనారాయణగారు పెద్దవారు అయిపోయారు. వారికి, వారి శ్రీమతికి బట్టలుపెట్టి, ఫలపుష్పాలు అందించి సత్కరించాం.
నేలకొండపల్లి కంచర్ల గోపన్న - రామదాసు - జన్మస్థలం ఆ ఊరి దగ్గరలో విరాటరాజు దిబ్బ ఉండేది. ఆ గ్రామాన్నే విరాటపురం అనేవారు. అయితే ఈ మధ్య తవ్వకాలలో ఆ దిబ్బ బౌద్దస్థూపంగా బయటపడింది. అది చూచాం. మనం బౌద్దాన్ని ధ్వంసం చేసిన పద్దతుల్లో అది ఒకటి.
మా చిన్నతనంలో ఖమ్మం వరంగల్లు జిల్లాలో భాగంగా ఉండేది. 1952 అక్టోబరు ఒకటవ తేదీన ఖమ్మం జిల్లాగా అవతరించింది. అప్పటి జిల్లా పరిషత్తు అధ్యక్షులు చేకూరి కాశయ్యగారు 1989 నుంచి జిల్లా అవతరణోత్సవాలు జరిపే సంప్రదాయం ఏర్పర్చారు. అనేకమంది జిల్లా ప్రముఖులతో పాటు నాకు కూడా సన్మానం చేశారు.
పులుపుల వేంకటశివయ్యగారు మంచి కమ్యూనిస్టు నేత. 'పలనాడు వెలలేని మాగాణిరా' అన్న మంచి కవి. వారు మాస్కోలో పరమపదించారు. గుంటూరులో వారి పేర ప్రతి సంవత్సరం ఒక రచయితను సన్మానిస్తారు. 1990 సంవత్సరంలో నన్ను సన్మానించారు. పరుచూరి రాజారాంగారు అధ్యక్షత వహించారు. సభ రమ్యంగా జరిగింది.
పులుపుల వేంకట శివయ్యగారు, నేను నర్సరావుపేటలో ఒకే వేదికమీద మాట్లాడాం.
గుంటూరులో నార్ల చిరంజీవి సతీమణి నాగరత్నమ్మ వదినగారిని దశాబ్దాల తరువాత - దర్శించుకునే అవకాశం లభించింది. వారి ఫోటో తీసి తెచ్చుకున్నాను.
1991 లో మా జన్మస్థలం గూడూరునుంచి గాడేపల్లి మధు అనే యువకుడు వచ్చాడు. నాకు - మా వూరు చినగూడూరులో - సన్మానం చేస్తానన్నాడు. అర్ధశతాబ్దం దాటింది. మా ఊరు చూడక, చూడాలనే ఉబలాటం కలిగింది.
సన్మానం కోసం కాదు - మావూరు చూడడానికి అంగీకరించాను. 12 జనవరినాడు సన్మానం నిశ్చయించారు, తెలియపరచారు.
జనవరి 11న కమలా నేనూ బయలుదేరాం. మానుకోలు - మహబూబాబాద్ స్టేషనులో దిగాం. మా పిల్లలకు మా వూరు చూపదలచాను. వారు మానుకోట చేరుకున్నారు. నా బాల్యమిత్రులు గార్లవారు చందా భద్రం - కొదుమూరి వెంకటేశ్వరరావుకూడా వచ్చారు.
నిర్వాహకులు జీపు తెచ్చారు. అందులో అందరం 'కురవి' చేరుకున్నాం. అష్టభుజ వీరభద్రుని దర్శించుకున్నాం. గూడూరుకు సాగాం. సికిందరాబాదులోనే కమల వీడియో గ్రాఫరును తీసికెళ్దామంది. 'చిన్న ఊరు - నలుగురు కూడ్తారు. ఒక శాలువా కప్పుతారు' అన్నాను వీడియో మానేశాం. నా కెమెరాలో కూడా పూర్తి రీలులేదు.
గూడూరు దగ్గర పడుతున్నది. బ్యాండు - నాదస్వర వాద్యాలు వినిపించాయి. పెళ్ళి కావచ్చు. ఊరు చేరితే అర్ధం అయింది - అది మాకు స్వాగతం పలికే వాద్యమే! ప్రజలు తండోపతండాలుగా కూడారు. మమ్ములను పూలదండలతో ముంచెత్తారు. వాద్యాలు ముందు నడువగా పెళ్ళి ఊరేగింపులా మమ్ములను తీసికెళ్ళారు. ప్రతి ఇంటిముందూ జనం నిలిచి చూచారు. దేవాలయానికి - పూర్ణకుంభంతో సమంత్రకంగా - మమ్ము ఆహ్వానించారు. అర్చన - ప్రసాద వినియోగం జరిగింది.
అంతటి ప్రజా సత్కారం - చూచి మేం పొంగిపోయాం. దేవాలయంలో వెల్లడించాను. సభ కరతాళ ధ్వనులతో స్వీకరించింది.
మేము విడిసిన ఇంటికి నిరంతర జనప్రవాహం. ఆ సాయంత్రం ఊరుచూడ బయలుదేరాం. వెంటజనం, మా మాతామహుల ఇల్లు మారలేదు. కాని, వారి వారు లేరు, అమ్ముకున్నారు. ఇంట్లోకి వెళ్ళి చూచాం. మా వాళ్ళకు వివరించాను. మా ఇంటి జాడలేదు, కూలిపోయింది. మేము పుట్టినామన్నచోట వేపచెట్టు ఎదిగింది. అక్కడనుంచొని ఫోటోలు దిగాం.
మేము తామరల చెరువుకు వెళ్ళాం. తామరులు లేవు. చెరువులో నీరులేదు. కట్టమీద మోదుగులు లేవు. కట్టకింద నాగజముళ్ళు లేవు. పశువులు ఇళ్ళకు తిరిగి వస్తున్నాయి. ఆ దృశ్యం ఫోటోలో తీశాం.
మా అమ్మాయిలు - అల్లుళ్ళు - మనవలు మహా సరదాగా ఉన్నారు. తెల్లవారి అందరం ఆకేరుకు వెళ్ళాం.
ఆ ఇసుక - ఆ ఏరు - ఆ నీరు మైకంలో పడిపోయాం. నా బాల్యాన్ని గుంజుకురావడానికి విఫలప్రయత్నం చేశాను.
రాజకీయ కారణంగా సభ 13కు వాయిదా పడింది. అదీ మంచిదే అయింది. మా ఊళ్ళో ఒకరోజు ఉండగలిగాను. జన ప్రవాహం కొనసాగుతున్నది. బుచ్చమ్మగారి మనవడొచ్చిండట - ఎక్కడ? అని ఒక పండు లంబాడీ ముదుసలి 'ఝాంకీ' వచ్చింది. మా నాయనమ్మ బుచ్చమ్మగారినాటి మనిషిని చూచి నేను పులకించాను. ఆమెను కౌగలించుకున్నాను.
ఝాంకీ కన్నీరు జలజలరాలింది.
నా గుండె పులకించింది. కన్నీరు రాల్చింది.
13నాటి సాయంత్రం సభకు ఊరేగింపు ప్రారంభం అయింది. చుట్టుపట్ల ఏడూళ్ళజనం - ఏడూళ్ళ వాద్యాలు! ఆ రోజు దుకాణాలు - ఊడ్పులు అన్నీ బంద్. జనసాగరం చినగూడూరులో అవతరించింది. ప్రతి ఇంటిముందు నిండు బిందెలు - మా కాళ్ళు కడగడం - పూలదండలు - వస్త్రాలు! జనం చెట్లెక్కి ఇళ్ళెక్కి చూస్తున్నారు!
ఒకచోట జనం విరుచుకుపడే దశ వచ్చింది. 'బాబూ! ప్రమాదం జరిగేట్లుంది అన్నది మా పెద్దమ్మాయి. 'ఇది ప్రేమ ప్రమాదమమ్మా! అందరికీ లభించదు' అన్నాను. ఒక దశలో నాకు సుగర్ తగ్గుతున్నది అంటే బిందెలతో పాలు తెచ్చారు! అంతటి అభిమనం నా పిడికెడుగుండె భరించలేకపోయింది.
అంత చిన్న ఊళ్ళో సభాస్థలి చేరడానికి అయిదుగంటలపైన పట్టింది. రాత్రి పదింటికి జనం కిటకిటలాడుతున్నారు. ఊరేగింపుతో వచ్చిన జనం నిలిచి చూడాల్సి వచ్చింది. సభకు స్థానిక యువ కవి గోవర్ధనం పురుషోత్తమాచార్యులు అధ్యక్షత వహించారు. సురేంద్రరెడ్డి M.P రెడ్యానాయక్ MLA వేదికను అలంకరించారు.





