Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    తన కిమ్మగునంతకుదు
    ర్జనుడిష్టుడ పోలె నుండి సర్పము పోలెం
    దనకిమ్మగుడును గరచును
    ఘన దారుణ కర్మ గరళ ఘన దంష్ట్రములన్. (మహాభారతము 1-6-113)
    
    దుర్జనుడు - తనకు అనుకూలించనపుడు - అనుకూలునివలె కలిసి మెలిసి ఉంటాడు. తనకు అనుకూలించినపుడు పడగ విప్పుతాడు. దుర్మార్గపు కోరలతో కాటు వేస్తాడు.
    
    విరించి నెల్లూరులో లేడు. అతడు బెంగుళూరు వెళ్ళిన విషయం విజయ్ కి తెలుసు. బెంగుళూరు టెలిఫోను నెంబరు కూడా ఇచ్చాడు! వాడు సాయంత్రానికిగాని చేరుకోలేదు. ఈలోగా గోదావరిఖనినుంచి మా పెద్దమ్మాయి ఉదయ, అల్లుడు మోహను - వాళ్ళ పిల్లవాడు ఉజ్వల్ చేరుకున్నారు.
    
    విజయ్ ఈ పనికోసమే ఇంటికి వచ్చినట్లున్నాడు. తన పని తీర్చుకున్నాడు. మమ్ములను నిండా ముంచాడు, వెళ్ళిపోయాడు. మాకు కర్మ చేస్తాడని' 72లోనే విజయ్ కు ఉపనయనం చేశాం. ఇప్పుడు నేను అగ్గిపట్టుకుని నడవాల్సి వచ్చింది. పసివాడు విజయ్ దేహానికి అగ్గిపెట్టవలసి వచ్చింది!
    
    భగవాన్! ఇలాంటి విపత్తు ఏ తండ్రికీ రానీయకు!
    
    విజయ్ ఆస్తినిమజ్జనానికని విరించి విజయవాడ వెళ్ళాడు. అటునుంచి నెల్లూరు వెళ్ళాడు అన్నీ సర్దుకొని ఆలస్యంగా వచ్చాడు.
    
    విజయ్ కు ఉపనయనం చేశాం. కావున పరమపద ఉత్సవం సహితంగా పదమూడు రోజులు తీర్ధతిరువధ్యయనాలు చేశాం. అయ్యా! ఏం చెప్పమంటారు! ఏటా తద్దినాలు కూడా పెడుతున్నాం.
    
    విరించి నెల్లూరు చేరుకున్నాడు. విజయ్ ఆస్తికి వాస్తవ వారసుణ్ణి నేను. ఫ్యాక్టరీ వగయిరాలన్నీ చుట్టపెట్టుకున్నాడు. మా ఇంట్లో ఉండిన విజయ్ స్కూటరు సహితం అమ్ముకున్నాడు. నాకు కష్టానికి ఒక్కపైసా ఇవ్వలేదు, కాదు - చూపలేదు. పైగా, ప్రాణంమీదికి వచ్చిందని నా దగ్గరనుంచే పెద్దమొత్తం రాబట్టాడు!
    
    5 అక్టోబరు 1989న విరించి - ఉమ పెళ్ళిచేసుకున్నారు. పిలవకున్నా - సిగ్గులేక - మేం వెళ్ళాం. తల్లితండ్రులకు సిగ్గు - లజ్జ ఉండరాదు. పెళ్ళి చేసుకొని వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళారు. కనీసం మాతో చెప్పలేదు. పెళ్ళినాడు కన్నీరు రాల్చరాదని దిగమింగాం.
    
    విరించి - ఉమా లాంఛనానికి ఒక్కసారి ఇంటికి వచ్చారు. తరువాత నెల్లూరు చేరుకున్నారు. పత్తా లేరు!    
    
    4-12-92 శుక్రవారం సాయంత్రం విరించి - ఉమా వారి పసిబాలుణ్ణి థేఉస్కొని వచ్చారు. పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు. 16-7-92న పుట్టాట్ట! శ్రేష్టి అనిపేరు పెట్టారట. ఇప్పుడు తీసుకొని వచ్చారు. మనుమని చూచి ఇద్దరమూ మురిసిపోయాం. వాళ్ళు సికిందరాబాదు మారారట. మారేడు పల్లిలోనే ఉంటున్నారట. అప్పటినుంచి వచ్చిపోతున్నారు! శ్రేష్ఠ్ కు మేమే అన్నప్రాశన చేయాలన్నారు. సంబరంగానే చేశాం. రాక తగ్గించారు. ఏం చేస్తాం? వచ్చిన్నాడు సంబరపడ్డాం.
    
    శ్రీముఖ సంవత్సరంలో కమల పుట్టింది. ఆడపిల్ల అంటే అలుసు. వాళ్ళ పుట్టినరోజులు - జతఃకాలు వ్రాసిపెట్టేవారుకారు. మా నాయన మా ఇద్దరి జాతకాలు మాత్రమే వ్రాశారు. ముగ్గురు చెల్లెళ్ళది వ్రాయలేదు.
    
    కమల నాకు ఛాయవలె వెన్నెంటి నడిచింది. ఆమె సహకారం లేకుంటే నా ఈ బరువయిన జీవితం - దుర్భరం అయ్యేది అందువల్ల కమలకు షష్టిపూర్తి జరుప సంకల్పించాను. ఆమె పుట్టినరోజు తెలియదు. కావున నా పుట్టిన రోజున జరుపాలనుకున్నాను.
    
    ఆడవారికి షష్టిపూర్తి జరపడం ఆచారం కాదు. అంతేకాదు - సంప్రదాయ విరుద్దం అన్నారు కొందరు. న షష్టిపూర్తి జరిగినపుడే ఆమె షష్టిపూర్తి జరిగింది. మళ్ళీ జరుపరాదన్నారు మరికొందరు. విపరీత పరిణామాలు జరుగుతాయని భయపెట్టారు ఇంకొందరు.
    
    ఎవరు ఏమన్నా - ఏమి జరిగినా 24-8-1993న కమల షష్టిపూర్తి జరుపడానికి నిశ్చయించాను. విరించి - ఉమ, ఉదయ - మోహన్, సుధ, సురోత్తంతో చర్చించాను. ప్రయత్నాలు ప్రారంభించాను.
    
    అదిగో, ఆనాటినుంచి విరించి - ఉమ రావడం మానేశారు. ఆహ్వానపత్రికలు నా పేర వేశాను. భర్త భార్యకు చేసిన షష్టిపూర్తి బహుశా ఇదే మొదటిది!
    
    కమల షష్టిపూర్తి వేదఘోషలు - మంగళ వాద్యాలు - ఆయుష్యహోమం - సహస్రధార మున్నగు విధి విధానములతో - నా షష్టిపూర్తి కన్న - గొప్పగా జరిగింది. బంధుమిత్రులు అనేకులు వచ్చారు. ఆనాడు మా ఇద్దరికీ వేసిన పూలదండల్లో మేం మునిగిపోయాం. ఉదయ-సుధ వాళ్ళు మామీద కనకవర్షం-పుష్పవర్షం కురిపించారు.
    
    రచయిత బి. ఎస్. రాములు దంపతులకు సాహిత్యసత్కారం చేశాం.
    
    చిరంజీవి కామేశ్వరరావుకు దాశరథి విజయకుమార్ స్వర్ణపతకం ప్రదానం చేశాం.
    
    సుమారు వేయిమంది రుచికరమయిన సాత్విక భోజనాలు చేశారు.
    
    కమల షష్టిపూర్తి మహత్ వైభవంగా జరిగింది. నేను ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాను.
    
    ఉదయ-మోహను స్వయంగా వెళ్ళి, విరించి - ఉమలకు పత్రిక ఇచ్చి ఆహ్వానించి వచ్చారు. ఇందిర వెళ్ళి ఉత్సవ పరిసమాప్తి సమయంలో వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చింది. ఆ తరువాత మళ్ళీ బంద్.
    
    విరించి, వాళ్ళు మారేడుపల్లిలో మా ఇంటికి సుమారు కిలోమీటరు దూరంలో ఉంటారు. అయినా ముఖం చూపరు! మేము వారినుంచి ఆశించింది "మంచిమాట" మాత్రమే! అదీ కరువయింది! శ్రేష్ఠ్ ను కనిపించనీయరు!
    
    ఇప్పుడు మా గూటిలో మేము ఇద్దరమే! ఏప్రెల్ 1994 లో కమలకు గుండెపోటు వచ్చింది. ఆప్సత్రిలో చేరింది. ఆడపిల్లలు అల్లుళ్ళు వచ్చారు. సేవలు చేశారు. చెప్పి పంపాం. విరించి - ఉమ ఆస్పత్రికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళారు. ఇంటికి రాలేదు!
    
    వ్యాఘ్రేవ తిష్టతి జరా పరితర్జయన్తీ
    రోగాశ్చ శత్రువ ఇవ ప్రహరన్తి దేహం
    ఆయుః పరిస్రవతి భిన్న ఘటాదివామ్భో
    లోకస్తథాప్యహిత మాచరతీతి చిత్రమ్ (భర్త్రుహరి)
    
    వార్ధక్యం పులిలా నిలుస్తుంది, బెదిరిస్తుంది. వ్యాధులు శతృవులు అవుతాయి. దేహాన్ని పీడిస్తుంటాయి. ఆయువు ఓటికుండలోని నీటివంటిది. వడిసిపోతుంటుంది. అన్నీ తెలుసు. అయినా లోకం ఆహితమే ఆచరిస్తుంది. ఎంత విచిత్రం!!!
    
                                               ముఫ్ఫయి ఎనిమిది
    
విద్వాన్ సర్వత్ర పూజ్యతే:
    
    ఈలోకం ఇలా నిలువడానికి రాజకీయం. శాసనం. బలప్రయోగం మాత్రం కారణాలు కావు. ఈ లోకం నిలవడానికి ప్రేమ - అభిమానం - అనుబంధం - అనురాగం - ఆత్మీయత వాస్తవ కారణాలు. మానసిక అనుబంధపు దివ్వెలను వెలిగించి వెలుగులు చిమ్ముటకు ఉపకరించే సంప్రదాయం - సాహిత్యం సంస్కృతి ప్రధాన కారణాలు.
    
    సాహిత్యం - సంస్కృతి మానవ సంబంధాలు మెరుగుపరచడానికి తోడ్పడ్తాయి. అందుకే సమాజం వాటిని అభిమానిస్తుంది, ఆదరిస్తుంది, పూజిస్తుంది.

 

                     




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.