Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
నగరంలోని అనేక సాహితీ సంస్థలు - నా మెడ వంచేటన్ని పూలదండలు వేసి - శాలువాలు కప్పి నన్ను సత్కరించారు.
"దేవదాసు ఉత్తరాలు" అనే నా గ్రంథాన్ని సాందీప్ గారు, దాశరథి రంగాచార్య నవలల్లో 'జనపదం' అనే పరిశోధనా వ్యాసగ్రంథాన్ని కేతు విశ్వనాథరెడ్డిగారు విడుదల చేశారు.
నేను - మా అన్నయ్య దాశరథి, మామయ్యా ఆళ్వార్ స్వామి, భాయ్ జాన్ నార్ల చిరంజీవిని స్మరించుకున్నాను.
సభ సంబరంగా ముగిసింది.
ఎందరో నన్ను అభినందించారు.
షష్టిపూర్తి తరువాత విజయ్ మళ్ళీ నెల్లూరు వెళ్ళలేదు. విరించి ఇక్కడ, అక్కడ ఉంటున్నాడు. మాతో సామరస్యంగానే ఉంటున్నాడు.
ఉమను కమల ఆనాడు తిట్టింది. కాబట్టి మమ్ములను లొంగదీయాలని ఉమ ప్లాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధించాలి. విరించిమీద వత్తిడి ఎక్కువయింది. విరించి మమ్ము వేధించినాడు. ఉమ తల్లితండ్రులు, మేము ఒక హోటల్లో కలుసుకున్నాం. అది ఒక పంతం. అక్కడ మాట్లాడాల్సింది ఏమీలేదు, ఆ లాంఛనం పూర్తిచేశాం.
వివాహం వ్యక్తుల కలయిక మాత్రంకాదు. వివాహం కుటుంబాల కలయిక. వివాహం శరీరాల కలయిక కాదు - మనసుల కలయిక వివాహం వ్యక్తిగత విధి కాదు. సామాజిక విధి. వివాహం సంతాన ప్రాప్తికి కావలసిన పవిత్రబంధం. కలగానున్న సంతానంమీద పై ఏడు తరాల ప్రభావం ఉంటుంది. పాశ్చాత్య నాగరికతకు ఈ పరిజ్ఞానం లేదు. అందుకే అక్కడ కుటుంబాలు కరిగిపోయాయి. మనం - నిన్న పుట్టి ఇంకా వికసించని, పై మెరుగుల పాశ్చాత్య నాగరికత మోజులో - అనాదిగా వస్తున్న భారత సాంప్రదాయాన్ని - కలదన్నుతున్నాం ఇందుకు భావితరాలు మనను మన్నింపవు!
విజయ్ తన సేవాతత్పరతతో మమ్ములను మైమరపించాడు. ఇంటి పనులన్నీ తానే చూచుకున్నాడు. మాకు కావలసినవి అన్ని సమకూర్చాడు. VCP తెచ్చిపెట్టాడు. రోజూ కాసెట్లు తెచ్చి పిక్చర్లు చూపించాడు. విజయ్ లేనిది క్షణం గడవదు అన్నట్లు ప్రవర్తించాడు. మాకు - ఏ తల్లిదండ్రులకయినా - అంతకుమించి కావలసినది లేదు.
విజయ్ తాను ఇంట్లో ఉండి - మమ్ములను ఔరంగాబాదు పంపించాడు. మేము ఎల్లోరా, అజంతా వగైరాలు చూచి శిరిడి దర్శించుకుని వచ్చాం. మమ్ము ముంబాయి పంపించాడు. ఎలిఫెంటా గుహలు వగైరా చూచి వచ్చాం.
గయ వెళ్ళి మా తల్లితండ్రులకు పిండ ప్రవానం చేసి రావాలని సంకల్పించాం. సికిందరాబాదునుంచి విజయవాడకు, అక్కన్నుంచి కలకత్తాకు విజయ్ రిజర్వేషను చేయించాడు. ఒకేసారి ప్రయాణం - అలసిపోతారు - ఖమ్మంలో దిగి, మా చిన్నమ్మాయి దగ్గర ఉండమని చెప్పాడు. 21 మార్చి 1989 మంగళవారం ఆటో తెచ్చి మమ్ములను ఎక్కించాడు. వీడ్కోలు చెప్పేప్పుడు విజయ్ కనులు చెమ్మగిల్లడం కమల గమనించింది. 'విజయ్ మనను విడిచి ఉండలేకపోతున్నాడు' అన్నాను.
కమలా నేనూ కోణార్కలో సాయంత్రం అయిదింటికి ఖమ్మంలో దిగాం. ముంబాయినుంచి తెచ్చిన వస్తువులు పిల్లలకు ఇస్తున్నాం. సుధా చాయ్ చేసి ఇచ్చింది, తాగుతున్నాం. సికిందరాబాదునుంచి ఫోను నేనే అందుకున్నాను. 'అంకుల్! విజయ్ సీరియస్ - వెంటనే బయలుదేరండి' - పక్కింటి మున్నా చెప్పాడు. పెట్టేశాడు. కమలకు చెప్పనేలేదు, గ్రహించింది. ఆమె వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. నా మనసు మల్లెతోట మీద పిడుగులు పడి ధ్వంసం అయింది. క్షణం చేష్టలుడిగాను. నాగిని విషపు కోరలు బుసకొట్టాయి. ప్రమాదం శంకించాను. ఎవరికీ ప్రణాల్లో ప్రాణాలు, మనసులో మనసులు లేవు.
సురోత్తం ఒక టాక్సీ తెచ్చాడు. అందరం అందులో పడ్డాం, బయలుదేరాం. అది కాళరాత్రి, అది సుదీర్ఘప్రయాణం, తెగదు. చాయ్ లు, సిగరెట్లకు అంతులేదు. మనసులు కీడు శంకిస్తున్నాయి. ఎప్పుడో తెల్లవారు జామున ఇంటికి చేరుకున్నాం. ఇంటిముందు - అంతరాత్రి జనం! ఇంటిముందు అగ్ని!!
కమల ఆ వాతావరణం చూచింది. విరుచుకుపడిపోయింది. నా నోట మాట రాలేదు, కూలబడ్డాను. రమణ - లక్ష్మి, వదిన - ఇందిరా, ఇతర బంధువులు మిత్రులు ఓదార్చారు! కాని పుత్రశోకాన్ని ఎవరు ఓదార్చగలరు? 'పుత్రశోకం పునఃపునః' అన్నారు. ఇది జీవితకాలం ఉండే గుండెమంట! ఇది వ్రాస్తుంటే గుండె భగభగ మండుతున్నది.
విజయ్ మమ్ములను పంపించాడు. తాను ఉరి పెట్టుకున్నాడు. మేము విజయ్ శవం చూడాల్సివచ్చింది. విజయ్ అందగాడు! శవంగా కూడా ముద్దు వస్తున్నాడు! శవంమీద పడి గుండెలు పగుల ఏడ్చాం! అంతకు మించి ఏమీ చేయలేని అభాగ్యులం! దౌర్భాగ్యులం!!!
స్వామీ! చేయని యే నేరానికి ఈ శిక్ష!!!
విజయ్ మరణం ఒక మిస్టరీ! వాడు నాగు ఇంటికి వెళ్ళి వచ్చి, ఉరిపెట్టుకున్నాట్ట! తన చావుకు ఎవరూ కారణం కాదని వ్రాసిన విజయ్ 'ఇప్పుడైనా అది నన్ను అర్ధం చేసుకుంటుంది' అని వ్రాశాడు. దాని పేరు 'నాగు' కాదు ఒక పెళ్ళయిన పిల్లను బద్నాం చేయరాదని మారుపేరు వాడాను. మా విజయ్ చావుకు అదే కారణం, అదే కారణం, అదే కారణం ముమ్మాటికి ఆ రాక్షసియే కారణం.





