Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అదిగో, అప్పుడే మా అన్నయ్యకు గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు నన్ను వారించారు. నిలువలేకపోయాను. ఆస్పత్రికి వెళ్ళాను. అన్నయ్య బోనులో సింహంలా ఉన్నాడు. 'తమ్ముడూ! ఇలా అయిందిరా నా స్థితి' అని నన్ను పట్టుకున్నాడు. "పెద్దబాబూ! ధైర్యంగా ఉండాలె" అన్నది మా పెద్దమ్మాయి ఉదయ. "ఉదయక్కా! నాకు ధైర్యం లేదమ్మా!" అని ఆమెను పట్టుకుని పెద్దగా ఏడ్చేశాడు!
నేను నిర్విన్నున్ని అయినాను. మా అమ్మా - నాయనా పోయినప్పుడు కూడా అన్నయ్య ఏడవలేదు! మా ఆన్నయ్య సింహం. ఎవరికీ బెదరలేదు. ఇప్పుడు గుండె చెదిరాడు! నేనూ చెదిరియే ఉన్నాను. అయినా నిబ్బరం వహించాను. కన్నీటిచుక్క రాల్చలేదు!
అన్నయ్యా - నేనూ ఇద్దరం అనారోగ్యంగానే ఉన్నాం. అన్నయ్యకు గుండెపోటు తగ్గింది. ఆసుపత్రినుంచి విడుదల చేశారు. మా ఇంటికి రావలసినవాడు హైదర్ గూడెంలోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
కమలా - నేనూ అన్నయ్యను చూడడానికి వెళ్ళాం. ఆస్పత్రిలోకంటే బావున్నాడు. ఆపిల్ కోసి పెడ్తే ముక్కలు తిన్నాడు. చిన్ననాటి ముచ్చట్లన్నీ తోడిపోశాడు. "1950లో ఖమ్మం హీరాబాద్ ఇంట్లో జబ్బున పడ్డాను. నువ్వు నా మూత్ర పురీషాలు ఎత్తిపోశావు" అన్నాడు మరెన్నో ముచ్చట్లు చెప్పాడు.
అన్నయ్య బాగవుతాడు మళ్ళీ మా ఇంటికి వస్తాడు, ముచ్చట్లు చెపుతాడు చాయ్ తాగుతాడు. భోజనం చేస్తాడు. అనుకున్నాం.
మళ్ళీ మేం 1-11-87న వెళ్ళాం. అన్నయ్య నన్ను తన మంచంమీద కూర్చుండపెట్టుకున్నాడు. తాను వ్రాసినవి-వ్రాయదలచిన వాటిని గురించి ముచ్చటించాడు. "అన్నయ్యా! నీ జబ్బు నయం అయింది. కోలుకోవాలి అంతే" అన్నాను. "నేనూ అదే అనుకుంటున్నాను" అని ధైర్యం కనబరచాడు. సంతోషంగా తిరిగివచ్చాం.
5-11-87 కార్తీక పూర్ణిమ, వ్యాసపూర్ణిమ, గురుగోవింద్ జన్మదినం, మహమ్మద్ జన్మదినం. ఆరోజు మా అన్నయ్య బాత్ రూంలో పడిపోయాడు. ఇందిరా "నాన్నా! నాన్నా!" అంటూలోనికి ఉరికింది. ఇంకెక్కడి నాన్న? ఎక్కడినుంచో పిలుపు వచ్చింది. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు!
ఆనాడు నామీద కొండలు కూలిపడినాయి. లోకం చీకటి మూకల మాయం అయింది. అన్నయ్య వెళ్ళిపోయీ మనం బతగ్గలమా? అనుకున్నాను.
దేశేదేశే కళత్రాని దేశేదేశే చ బాంధవాః
తంతుదేశం2నపశ్యామి యత్రభ్రాతా సహోదరః
ఏ ప్రాంతంలో నయినా భార్యలుంటారు. బంధువులుంటారు. తోడపుట్టిన సోదరుడు ఉన్న దేశం కనిపించదు అని విలపిస్తాడు రాముడు - లక్ష్మణుడు మూర్చపోయినపుడు.
ఏడవడం తప్ప చేయగలిగిందేముంది? అందుకే ఏడ్చాం. ఏదీ తప్పదు. అన్నయ్యను అంబరపేట శ్మశాన వాటికలో అగ్నికి ఆహుతిచేసి వచ్చాం.
కవితా శరధి దాశరథి అస్తమించారు! ఈ వార్తను రేడియో, టి.వి., పత్రికలూ పతాక శీర్షికల్తో ప్రకటించాయి. సుమారుగా తెలుగు పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాశాయి. మేంచేయాల్సిన దినవారాదులు ముగించాం.
ఒక వెలుగుల రాశి ఆరిపోయింది
ఒక సింహరాజం కన్నుమూసింది.
"నిర్భయంగా వచ్చాను నిర్భయంగా వెళతాను
ఉచ్చ్వసిస్తూ వచ్చాను. నిశ్వసిస్తూ వెళతాను
మృత్యువు నృత్యం చూపి జడిపిస్తారెందుకని?
భయమెందుకు? నా ఇంటికి నే వెళ్తాను"
అని నిర్భయంగా మృత్యువును తన ఇంటిని చేసికోగలిగిన మహా యోధుడు మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య.
కాలానికి కనికరం లేదు. సాగిపోతూనే ఉంటుంది. అది దేనినీ పట్టించుకోదు.
నేను ఆఫీసుకు వెళ్తున్నాను. అప్పుడప్పుడూ విజయ్ వచ్చిపోతున్నాడు. నెల్లూరులో అయొడైజ్డ్ ఉప్పు ఫ్యాక్టరీ పెడ్తున్నామని చెప్పారు. అన్నదమ్ములు ఉద్యోగాలు వదిలేస్తారట. ఫ్యాక్టరీ నడిపించుకుంటామన్నాడు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిగింది. మమ్ములను పిలువలేదు. ఎంచేతంటే, నాగమణి - ఆమె మొగుడు అక్కడికి రాక తప్పదు.
ఆఫీసుకు ఒకనాడు ఆత్రేయ అన్నగారు వచ్చారు. వారిని చూచి మనసు వికలం అయింది. ఆ ఠీవి - ఆ గర్వం - కనిపించలేదు. జూలు తీసిన సింహంలా ఉన్నారు. నవ్వులో వెన్నెల వసివాడలేదు. దాశరథి గురించి ముచ్చటించుకున్నాం. ఇరువురి మనసులు చెమర్చాయి.
ఆత్రేయకు వీడ్కోలు చెప్పడానికి బయటిదాకా వచ్చాను. కారు కనిపించలేదు కాఉర్లేని ఆత్రేయను ఊహించడానికే మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది! ఆటోలో వెళ్తాను అన్నారు. ఆ నవ్వు వెలవెలబోతున్నది! 'ఆటోకు డబ్బులున్నాయా' అడిగాను. 'అక్కడవాళ్ళు ఇస్తారులే' అన్నారు. నా కళ్ళకు గిర్రున నీళ్ళు తిరిగాయి. ఆటో తెప్పించాను. నా దగ్గర ఉన్న డబ్బు వారి జేబులో పెట్టిపంపించాను. 'కాశివిశ్వేశు కలిసె వీరారెడ్డి కనకాంబరంబు లేరాయడిచ్చు?' అన్న శ్రీనాథుని చాటువు గుర్తుకు వచ్చింది.
ఆ తరువాత కొద్దిరోజులకే మనసు కవి ఆత్రేయ మనలను విడిచి వెళ్ళిపోయారు. - 'దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ'.
ఆంద్రదేశం ఒక సుకవిని కోల్పోయింది నేను మరొక అన్నను కోల్పోయాను!
31-3-1988 నా ఉద్యోగ విరమణ దినం. ముఫ్ఫయి సంవత్సరాల పైబడి సర్వీసులో చాల పదవుల్లో పని చేశాను. కాని ఎక్కడా ఎవరికీ హాని చేయలేదు. చేయగలిగినంత మేలు చేశాను. ఎంతటి పై అధికారికయినా తలవంచలేదు. తప్పు చేయలేదు. అందరూ అభిమానించారు.
ఈ జీవితంలోనే అనేక జన్మలుంటాయి. ఉద్యోగి జన్మ అంతరిస్తున్నది! నేను జీవన భ్రుతి కోసం ఉద్యోగం చేశాను - అధికారం కోసం కాదు. అందువల్ల నాకు అంతగా బాధ అనిపించలేదు. కొందరితో అనుబంధాలు పెంచుకున్నాను. అనుబంధాలు నా సంపద!
ఉదయంనుంచి చాలామంది వస్తున్నారు, కలుసుకోవడానికి మధ్యాహ్నం విజయ్ వచ్చాడు. సాయంత్రందాకా ఉన్నాడు. సాయంకాలం ఆఫీసువాళ్ళు వీడ్కోలు విందు ఇచ్చారు. పూలదండలు - ఫలములు - బహుమతులు - ఆర్ద్ర వచనములు! ఆఫీసు వదులుతుంటే మనసు 'కలుక్కు'మంది వెంట విజయ్ ఇంటికి వచ్చాడు! '83 తరవాత ఇప్పుడే అడుగుపెట్టడం!
ఇంటి దగ్గరికి కూడా మిత్రులు, బంధువులు, వారూ పళ్ళూ, పూలూ, వస్త్రాలు తెచ్చారు. వచ్చిన వాళ్ళు వెళ్ళేవరకు కొంత సమయం పట్టింది. అయినా కమల బయటికి రాలేదు. ఆమె వణికిపోతున్నది - విజయ్ వచ్చాడు, మల్లెం గొడవో అని! భగవాన్! ఎలాంటి పరిస్థితి కల్పించావు స్వామీ! కొడుకు వస్తే తల్లి స్మబరపడలేని దశ!
నేను కమలను బయటికి తీసుకొచ్చాను. భయం భయంగా వచ్చింది. కాని విజయ్ తల్లిని పలకరించాడు! మేమిద్దరం మురిసిపోయాం. అంతేనండీ! ఒక్కమంచి మాటకోసమే మా తాపత్రయం!
విజయ్ అప్పుడప్పుడూ వస్తున్నాడు. అంతే చాలును అనుకుంటున్నాం మేము!
రిటైర్మెంటు బాపతు నాకు రెండు లక్షలు వచ్చాయి. అందరూ వద్దంటున్నా నలుగురు పిల్లలకు సమానంగా యాభయివేల చొప్పున ఇచ్చాను. మనం ఉండగా ఇస్తే మనకు, వాళ్ళకు సంతృప్తి అని నా ఉద్దేశం!
విజయ్ - ఆడపిల్లలు, అల్లుళ్ళు, వాళ్ళపిల్లలు మమ్ములను అందరినీ నెల్లూరు తీసికెళ్ళాడు. అన్నదమ్ములు అందరినీ ఆదరించారు. అందరం తిరుపతి వెళ్ళాం. సుధా - సురోత్తములు పుత్రుడు సమీర్ పుట్టువెంట్రుకలు తీయించాం. ఆ నాలుగు రోజులు - కుటుంబం అంతా ఒకచోట - సంబరంగా గడిచిపోయాయి! తిరిగి వచ్చేశాం.
విభవ సంవత్సర అధిక శ్రావణ శుక్ల సప్తమి మంగళవారం 24-8-1928 నేను పుట్టినరోజు మా పిల్లలు నా షష్టిపూర్తి జరుపడానికి నిశ్చయించారు. విజయ్, విరించి పేరా ఆహ్వాన పత్రాలు అచ్చయినాయి. 24-8-1998 బుధవారం షష్టిపూర్తి అని అందరికీ ఆహ్వానాలు పంపారు.
24-8-2988 బుధవారంనాటి నా షష్టిపూర్తి ఉత్సవానికి బంధువులు - మితుర్లు అనేకమంది వచ్చారు. శ్రావ్య నాదస్వర వాద్యము, సంస్కృత - ద్రావిడ వేద ఘోషల మధ్య శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం - సహస్రధార మున్నగునవి మహావైభవంగా జరిగాయి. కమలకు ఏడేళ్ళుండగా మంగళసూత్రం కట్టాను. అది అంతగా గుర్తులేదు. ఆరోజు మంగళవాద్యాలు, వేదమంత్రాల నడుమ కమలకు మళ్ళీ మంగళసూత్రం కట్టాను. సభ కరతాళధ్వనులతో ప్రతిధ్వనించింది. అందరూ భోజనాలు చేశారు. ఉత్సవం ఉత్సాహంగా ముగిసింది.
శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం - అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో - ఆ సాయంకాలం భాషానిలయంలో - నా అభినందన సభ ఏర్పాటయింది. దేవులపల్లి రామానుజరావుగారు అధ్యక్షత వహించారు. గజ్జల మల్లారెడ్డిగారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.





