Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
మళ్ళీ మా సుపుత్రుల జాడ తెలియలేదు. వాళ్ళు నాగిని ఇంటికి వస్తున్నారు, వెళ్తున్నారు. మాకు వార్తలు అందుతున్నవి. మనసులు కలక్కుమంటున్నవి! వాళ్ళు మాత్రం మా వీధిముఖం చూడలేదు.
"యది పుత్ర నజాయేథా మమశోకాయరాఘవ
నస్మద్దుఃఖమతో భూయః పశ్యేయ మహమప్రజాః" 2-20-36.
"రామా! నాకు దుఃఖకారకుడవుగా నీవు జన్మించావు. నీవు పుట్టకుంటే నాకీ బాధలు ఉండేవికావు. గొడ్రాలిని అనే బాధ ఒకటే మిగిలేది" అంటుంది కౌసల్య!
కౌసల్యది కన్నీటి బాట. తల్లులందరికీ కౌసల్య బాటయే!
నేను బాధపడ్తానని కమల నిబ్బరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గుండెలో మంటలు దాచుకుంటుంది. పెదవిమీద చిరునవ్వు నటిస్తుంది. నేనూ అంతే! పుత్రేషణ బహు చెడ్డది! అది మనతో పుట్టింది. మనతో పోవాల్సిందే! మంట ఆరినట్లనిపిస్తుంది. అది భ్రమ.
చెడ్డ పుత్రులుంటారు. కాని చెడ్డ తల్లి లోకంలో ఉండదు.
న ఆరోగ్యం అంతంతమాత్రమే! కాలమొక్క రీతి గడపాల్సిందే! 74లో డొక్కా ఆపరేషను అయ్యింది. 86 లో విపరీతం అయిన అజీర్ణం పట్టుకుంది. ఎంతోమంది డాక్టర్లు అయినారు. వారు మందులు ఇవ్వగలరు. నయం చేయలేరు!
అజీర్ణం అలా ఉండగా మూత్రవ్యాధి పట్టుకుంది. మూత్రం సరిగా రాదు. రాత్రికి నిద్ర ఉండదు. డాక్టర్లు చుట్టు తిరగడం - టెస్టులు - మందులు డాక్టర్లు మందులు ఇవ్వగలరు. నయం చేయలేరు!
అజీర్ణం - మూత్ర వ్యాధి ఉండగా - నాకు ఉండిన ఒకే ఒక ఆధారం ధైర్యం - ధైర్యం కోల్పోయాను. మనోవైకల్యం ఏర్పడింది. భయం - ఊరికే ఏడ్పు - ప్రాణం తీసుకోవాలని ఆరాటం!
భగవంతుడు కరుణామయుడు. కమల కల్పించుకున్న ధైర్యం నిలుపుకుంది. మా అన్నయ్య నీడలా మా వెంట ఉన్నాడు. మా అమ్మాయిలు, అల్లుళ్ళు, మా బావమరిది రమణ కుటుంబం, మా చెల్లెలు శకుంతల, ఆఫీసు మిత్రులు దయాశంకర్, నందకుమార్, దకతర్ బుచ్చిలింగం, మరెందరో మిత్రులు అండగా నిలిచారు. వారి రుణం తీరేది కాదు.
అన్నయ్య, నేను, కమల డాక్టర్ ఖాన్ సైక్యాట్రిష్టు దగ్గరికి వెళ్ళాం. అన్నయ్య అన్నీ వివరించాడు. "His sons have to come. There is no other way" అని పంపించాడు. అన్నయ్య నన్ను గురించి అంత బాధ ఎన్నడూ పడలేదు. మా ఉభయులకూ నమ్మకం లేని శని జపాలు - శని పూజలు - శని దానాలూ చేయించాడు!
అన్నయ్య మా మగపిల్లలు ఇద్దరికీ - పరిస్థితి వివరిస్తూ ఉత్తరాలు వ్రాశాడు. టెలిగ్రాములు ఇచ్చాడు. వారికి వార్తలు తెలుసు. ఇక్కడి పుట్టలు అందిస్తూనే ఉన్నాయి! ఇద్దరూ అన్నయ్య ఇంట్లో దిగారు. మామీద విషం కక్కారు. "డాడీ ఇక్కడికి వస్తే మాట్లాడ్తాం. డాడీకి ట్రీట్ మెంట్ ఇప్పిస్తాం. మమ్మీముఖం చూడం. వాళ్ళ గడపతొక్కం" అన్నారని అన్నయ్య వచ్చి ఎంతో బాధగా చెప్పాడు.
"తమ్ముడూ! మరదలు లేకుండా నువ్వు వాళ్ళతో మాట్లాడ్డం నాకు సమ్మతం కాదు. వాళ్ళు ఆకాశంలో విహరిస్తున్నారు. మనం పట్టుకోలేం. మరిచిపో" అన్నాడు. అన్నయ్యమాట కాదనలేం. భరించడానికే నిశ్చయించుకున్నాను. కమల మవునంగా ఉంది. మాట్లాడలేదు.
అన్నయ్య వెళ్ళిపోయాడు. 'ఏవండీ! వాళ్ళకు పనికిరానిది నేనే కదండి, మీరు వెళ్ళండి. వాళ్ళతో మాట్లాడండి. ఒకమార్గం ఏర్పడుతుందేమో?" అన్నది కమల బహు నిబ్బరంగా! ఆ తల్లి ఆశకు నా గుండె చెరువయింది! "కమలా! ఎంత ఆశయే నీకు?" అన్నాను. "మన బిడ్డలు గదండీ!" అంటే నా కన్నీరు నిలువలేదు. ఇద్దరం ఏడ్చాం.
మరుసటిరోజు - కమల మాట కాదనలేక - అన్నయ్య ఇంటికి వెళ్ళాను. వెంట మా చిన్నల్లుడు సురోత్తం వచ్చాడు. విజయ్, విరించి - మేమందరం ఆశ్చర్యపడేటంత - ఆప్యాయంగా మాట్లాడారు. "డాడీ! ఏ కష్టం వచ్చినా ముగ్గురం కలిసి ఎదిరిస్తాం. మేము వచ్చాం. ధైర్యంగా ఉండు" అన్నారు. వాస్తవంగా నాకు కొండంత ధైర్యం వచ్చింది! ఇంటికి వచ్చి కమలకు చెపితే పొంగిపోయింది! ఆడ పిల్లలు ఆనందం పట్టలేక ఏడ్చారు.
మా మగ పిల్లల ప్రత్యేకత ఏమంటే - వాళ్ళు మొత్తం కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. వారికి ఇద్దరు అక్కా, చెల్లెళ్ళు - ఇద్దరు బావలు - అప్పటికి ఒక మేనకోడలు, ఒక మేనల్లుడు - నలుగురు మేనమామల కుటుంబాలు - ముగ్గురు మేనత్తల కుటుంబాలు - ఒక పెదనాన్న కుటుంబంతో ఎవరితోనూ సంబంధం లేకుండా పోయింది. ఇంతటి మొనగాళ్ళు ఈ కాలంలో సైతం అరుదు!
25 అక్టోబరు 1986 నాడు మూత్రబాధ కోసం ఆపరేషను నిర్ణయం అయింది. రక్తంలో విపరీతంగా పెరిగిన చక్కెరను కంట్రోలు చేయడానికి ముందుగానే ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
24 నాటి రాత్రి విజయ్ ఆస్పత్రిలో నా గదిలో ఉన్నాడు. కమల వచ్చింది. 83 మే తరువాత తొలిసారిగా కొడుకును చూచింది! ఆమెలో ఎన్ని సాగరాలు పొంగి పొర్లాయో! 'నాయనా! బాగున్నావా?' అన్నది. అంతే - విజయ్ మండిపడ్డాడు. కమలను నానామాటలన్నాడు. నాగును - ఉమను ఆమె ఎన్నడో తిట్టినందుకు తల్లిని రాక్షసి - పిశాచి, అన్నాడు లేచి వెళ్ళిపోయాడు.
"నేను ఏమన్నానండీ?" అని కమల నామీద పడి భోరుమన్నది. నా స్థితీ అలాగే ఉంది. డాక్టర్లు చూస్తే ఇద్దరికీ రక్తపు పోటు పెరిగింది. 'రేపు ఆపరేషను - ఇలా అయితే ఎలా?' అని డాక్టర్లు చీవాట్లు పెట్టారు. మందులిచ్చి నిద్రపుచ్చారు.
ఆపరేషను వాడు మా అన్నయ్య నన్ను వెన్నంటి ఉన్నాడు. ఆపరేషను అయింది. థియేటరునుంచి తెస్తున్న నన్ను కమల చూచింది. విరుచుకు పడిపోయింది. డాక్టర్లు ఆమెను గదికి చేర్చారు. ఇంజక్షన్లు వగయిరా నానా తంటాలు పడ్డారు. జనంతో ఆమె గది నిండిపోయింది. విజయ్ - విరించి అటు తొక్కి చూడలేదు!
ఆనాడు ఆసుపత్రి మా బంధుమిత్రులతో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కమల కోలుకుంది. విజయ్ వెళ్ళిపోయాడు. విరించి ఉండిపోయాడు. వాడు కమలతో మాట్లాడితే ఆమె ఎంత పొంగిపోయిందో! విరించి నేను డిశ్చార్జి అయ్యేదాకా ఉన్నాడు. తానే ఆస్పత్రి బిల్లు కట్టాడు. నన్ను ఇంటికి పంపాడు. తాను రాలేదు, వెళ్ళిపోయాడు.
మూత్రవ్యాధి తగ్గింది. డిశ్చార్జి అయిన్నాడు, 30-10-1986 గురువారం రాత్రి మా ఇంట్లో మిత్రులకు - డాక్టర్లకు ఒక పార్టీ ఇచ్చాను. మా అన్నయ్య, మా అల్లుళ్ళు కూడా ఉన్నారు. ఆనాడు మద్యం వదిలేశాను. మళ్ళీ ముట్టలేదు.
మూత్రవ్యాధి ఉపశమనం అయింది. కాని రక్తంలో చక్కర పెరుగుతున్నాది. ఇన్సులిన్ కు కూడా లొంగడం లేదు. ఎంత తిన్నా చాలడం లేదు. ఆకలి ఆరడం లేదు. మానసిక వైకల్యం మరింత పెరిగింది. నిమిషా నిమిషానికీ ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. టెస్టులు - సైక్యాట్రిస్టులు - ఇతర డాక్టర్లు విధించిన టెస్టులు - చికిత్సలు నిరవధికంగా సాగుతున్నాయి. అన్నయ్య ఎడతెరపి లేకుండా డాక్టర్ల చుట్టు తిరుగుతున్నాడు. కాస్త విషమస్థితిలో 1987 సెప్టెంబరులో ఆస్పత్రిలో చేరాను. డాక్టర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
నాకు ప్రమాదంగా ఉంది. 9-10-87 న విరించి ఆస్పత్రికి వచ్చాడు. నాకు ఎంతో బలం వచ్చినట్లయింది. వాణ్ణి పడకలో కూర్చుండ బెట్టుకుని - చేయి పట్టుకొని "నాన్నా, విరించీ! నా పరిస్థితి అంత బావుండలేదు. ఆఫీసునుంచి సుమారు రెండు లక్షలు వస్తాయి. నలుగురూ సమానంగా పంచుకోండి" అన్నాను.
"డాడీ! నేను ఉమను పెళ్ళిచేసుకుంటాను."
"నాన్నా! నేను నిన్ను వద్దన్నానా?"
"మమ్మీ వద్దంటుంది."
"నువ్వు ఆమెను అడిగావా?"
"మమ్మీ ఉమను తిట్టింది కదా!"
నేను మాట్లాడలేదు. నాకు డిప్రెషన్ పెరిగిపోయింది. మనసు పరిపరివిధాల పోతున్నది. ఎంతో బాధగా ఉంది, చికాకుగా ఉంది, చింతగా ఉంది.
కమల వచ్చింది. నా పరిస్థితి చూచి కలవరపడింది.
"మమ్మీ! నేను ఉమను చేసుకుంటాను."
"నీ ఇష్టం, చేసుకునేది నువ్వు - అనుభవించేది నువ్వు" - చాలా నిబ్బరంగా సమాధానం చెప్పింది కమల.
అందుకే వచ్చినట్లు - ఎవరికో వార్త అందించాల్సినట్లు విరించి దిగ్గున లేచి వెళ్ళిపోయాడు. కమల డాక్టరుకోసం పరిగెత్తింది.
నాలుగు రోజుల్లో డిశ్చార్జి చేశారు. మావెంట విరించికూడా మా ఇంటికి వచ్చాడు!
ఎందరో పెద్ద పెద్ద డాక్టర్ల వల్ల నయం కాలేదు - ఆనాటికి ఒక పిల్ల డాక్టర్ చంద్రశేఖర్ మందుతో ఉపశమనం మొదలయింది.





