Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అఖండ దీపం కథ అఖండం.
1976-77లో 'మానవత' నవల వ్రాశాను. పాల్ - జానకి ప్రేమించుకుంటారు, పెద్దలు వద్దంటారు. పోట్లాట - మామూలే.
జలప్రళయం వస్తుంది. ఊరు మునుగుతుంది. ఒకే బంగళాలో గ్రామం సాంతం నివాసం. అక్కడ కులాలూ, మతాలూ అడ్డురావు, కలిసి ఉంటారు, తింటారు. పంటారు. ప్రమాదంలో లేని అడ్డంకులు పెళ్ళికి ఎందుకు? అనుకుంటారు. పాల్ - జానకి పెళ్ళి జరిగిపోతుంది.
మతం ముసుగు మాత్రమే! అది తోలుగుతే దర్శనం ఇచ్చేది "మానవత" మాత్రమే!!
'మానవత' విజయ మాసపత్రికలో వచ్చింది. నవయుగ బుక్ సెంటర్, విజయవాడవారు 1978లో పుస్తకంగా ప్రచురించారు.
ఆ రోజుల్లోనే 'శరతల్పం' నవల వ్రాశాను. వైష్ణవ నారాయణస్వామికి - హరిజన గురువయ్యతో స్నేహం ఏర్పడుతుంది. గ్రామం నారాయణస్వామిని వెలివేస్తుంది. గురవయ్య ఊరిబయట నారాయణస్వామికి ఆశ్రమం నిర్మించిపెడ్తాడు. నారాయణస్వామి సాన్నిధ్యంలో గురవయ్యకు ఆధ్యాత్మిక ఆసక్తి కలుగుతుంది. భాగవతం వింటుండగా మధ్యలో గురవయ్యకు క్షయవ్యాధి వస్తుంది. నారాయణస్వామి గురువయ్యను ఆస్పత్రిలో చేర్పిస్తాడు. తనకు మందు కాదు- భాగవతం కావాలంటాడు గురువయ్య తమ్ముణ్ణి తన ఇంటికి తెచ్చుకుంటారు నారాయణస్వామి.
"అన్నగారు! మీ రుణం ఎన్ని జన్మలకు తీరాలి?" అంటాడు గురువయ్య.
"తమ్ముడూ! గురువయ్యా! నీకు మరోజన్మలేదయ్యా!" అంటారు నారాయణస్వామి.
నారాయణస్వామిని మించి ఎదిగినాడు గురువయ్య నారాయణస్వామి భాగవతం వినిపిస్తున్నారు. చివరి పద్యం పూర్తి అయింది.
గురువయ్య నారాయణస్వామిని దరికి రమ్మని పిలిచాడు. నారాయణస్వామి గురువయ్య పక్కన నుంచున్నారు. గురువయ్య చేతులు నారాయణస్వామి పాదాలమీద పడ్డాయి. చేతులు చల్లబడ్డాయి.
"గురువయ్యగారు పరమదించిన్రు" - నారాయణస్వామి అన్నారు. కన్నీరు జలజల రాలింది!
ఇది శరతల్పం ముగింపు
స్నేహం - అనురాగం - అనుబంధం - ఆత్మీయత దైవస్వరూపాలు ఇవి కులగోత్రాలకు అతీతములు.
'శరతల్పం' జ్యోతి మాసపత్రికలో వచ్చింది. నవయుగ బుక్ సెంటర్, విజయవాడ వారు 1978లో ప్రచురించారు.
'శరతల్పం' జ్యోతి మాసపత్రికలో వచ్చింది. నవయుగ బుక్ సెంటర్, విజయవాడ వారు 1978లో ప్రచురించారు.
'శరతల్పం' రేడియో నాటకం ఆకాశవాణి హైదరాబాదువారు ప్రసారం చేశారు.
"విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః" (భగవద్గీత 5-18)
విద్యావంతుడు - వినయ సంపన్నుడు - బ్రాహ్మణుడు - గోవు - కుక్క - చండాలుడు - అందరి విషయంలో సమదర్శనం గలవాడే జ్ఞాని అవుతాడు.
ముఫ్ఫయి ఏడు
విరిగిన హరివిల్లు:
'అమ్మ' సమస్త ప్రాణిజలాన్ని కంటుంది, పెంచుతుంది, పోషిస్తుంది. ఈ సృష్టి నిలిచి ఉండడానికి కారణం తల్లి-తండ్రి మాతా పితఃరుల జంటయే ఈ సమస్త సృష్టి - స్థితికి కారణం.
సమస్త జంతుజాలపు సృష్టికి తల్లి-తండ్రి కారకులు. ఎక్కువ జంతుజాతుల్లో శిశుపోషణకు తల్లి మాత్రం బాధ్యత వహిస్తుంది. తన బిడ్డ రక్షణకోసం పిల్లి పులి అవుతుంది. కోడి డేగ అవుతుంది. తన బిడ్డను రక్షించడానికి తల్లి తన ప్రాణం తృణంగా అర్పిస్తుంది.
పశుపక్ష్యాదులు అన్నీ తల్లిని గుర్తిస్తాయి. పసిపిల్లలు తల్లిని వదలవు. వెంటనే ఉంటాయి. తల్లి నీడలో బ్రతకడం నేర్చుకుంటాయి. రెక్కలు వస్తే పక్షులు బ్రతుకడం వస్తే జంతువులు తల్లిని వదిలేస్తాయి! తమ పని తీరింది కదా! గుర్తించవు!! అయినా తల్లి తన బాధ్యత మానదు!!!!
నరులకు జ్ఞానం ఉంది. పసితనం నుంచే పిల్లలు తల్లిని తండ్రిని గుర్తిస్తారు. పిల్లల పెంపకంలో మాతాపితఃరులు ఉభయులూ పాలు పంచుకుంటాడు. హెచ్చు తచ్చులతో నిమిత్తం లేకుండా - తమకు ఉన్నదానిని మించి పిల్లలను పెంచి పెద్ద చేస్తారు.
మానవ కుటుంబం - మానవ సంబంధాలకు - ప్రేమాభిమానాలకు - కృతజ్ఞత త్యాగాలకు శిక్షణాలయం. మానవునికి తెలివి ఉన్నది. కాబట్టి పిల్లలు సహితం తల్లిదండ్రుల విషయంలో కొంత బాధ్యత వహించాల్సింది వారి బాధ్యతను గుర్తింపచేయడానికే 'మాతృదేవోభవ - పితృదేవోభవ' నేర్పారు.
మనం - ఈ కాలంలో వ్యాపార నాగరికతలో జీవిస్తున్నాం. మానవ సంబంధాలు - భార్యాభర్తలని - తల్లిదండ్రులని వర్తకములు అయినాయి! తల్లిదండ్రులతో పనితీరితే తనయులు - జంతువులవలె - వదిలి మాత్రం పోవడం లేదు. జీవితకాలం తల్లిదండ్రులను ఘోషింప చేస్తున్నారు. కొందరు సుపుత్రులు తల్లితండ్రుల ప్రాణాలు తీసి సైతం వారి ఆత్మలను విలవిలలాడిస్తున్నారు! వారికి తల్లిదండ్రులు కాదు వారి ఆస్తులు ప్రధానం!
నాగరికతలో ఎంతో ముందడుగు వేశామని విర్రవీగుతున్న నరజాతి - మానవ సంబంధాల విషయంలో - జంతువులకన్న కడుహీనంగా - కడునీచంగా - కడువంచనగా ప్రవర్తిస్తున్నది. తల్లితండ్రులు తమపాలిటి భూతాలుగా దయ్యాలుగా భావిస్తున్నది!!!!
మా పుత్రరత్నాలు ఇందుకు భిన్నంకాదు. మేం వాళ్ళను ఇలా పోషించాం - ఇన్ని త్యాగాలు చేశాం అని చెప్పుకోవలసిన దుర్గతి మాకు పట్టింది. అయినా అవి పెడచెవిని పెట్టి మమ్ములను బాధల పాలు చేయడానికి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
మేము కాలగతిని గమనించాం. పుత్రులనుంచి ప్రేమ - అభిమానం తప్ప ఏమీ ఆశించలేదు. అవి దొరుకుతే మేం బ్రతికిపోతాం అని, మా విషయంలో ద్వేషాన్ని విషం పోసి పెంచుతున్నారు వారు!
మాకు ఇద్దరు మగపిల్లలు - విజయ్, విరించి వారిని ఎలా పెంచామో చెప్పడం చర్విత చర్వణం అవుతుంది. చదువుతుండగానే ఆడవలలో పడ్డారు. పెళ్ళయిన - మొగుడున్న నాగమ్మ వలలో ఆమె గుంజినవైపు తిరిగినాడు విజయ్. ఉమను ప్రేమించానని ఆమె ప్యాంటు పాకెట్లో భద్రంగా ఉన్నాడు విరించి.
చదువులు పూర్తి అయినాయి. మాతో పని తీరింది. ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఉడాయించారు. అంతవరకు పశువుల ప్రవృత్తి. అంతటితో నయితే మేమూ సంతోషించేవాళ్ళం. వాళ్ళు మనుషులు కదా! మరికాస్త నీచంగా ప్రవర్తించాలి కదా! కథ అక్కడ మొదలవుతుంది.
15 మే 1983 ఆదివారంనాడు ఇద్దరు జతఃగా మా ఇంటికి వస్తే సంతసించాం. 'నేను ఉమను ప్రేమించాను. మీరు వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడండి' అన్నాడు విరించి. ఆలోచించి వెళ్తాం అన్నాను నేను. కమల సహించలేకపోయింది. రౌద్రం దాల్చింది. నాగుపామునూ - ఉమనూ నానాతిట్లు తిట్టింది. కొడుకులను ఒక్కమాట అనలేదు. ఆవేశంలో విరుచుకు పడిపోయింది. ముగ్గురం ఆమెకు ఉపచారాలు చేశాం, తేరుకుంది, కోలుకోలేదు.
వారు ఆ రాత్రి వెళ్ళిపోయారు. నాగుపాము పడగనీడన చేరారు. మమ్ములను భయభ్రాంతులను చేయ తలపెట్టారు. రోజూ ఇంటి ముందు ఎర్రటి అన్నం - నిమ్మకాయలు - కొబ్బరి ముక్కలు ప్రత్యక్షం. నమ్మకాలు లేవు కాబట్టి బ్రతికి బయట పడినాం.
ఎట్టివారయినా మా కొడుకులు కదా! వారిమీద మమకారంతో మంచాలు పట్టాం. కోలుకోవడానికి కమలకు మరింత సమయం పట్టింది.
విరించికి కామెర్లు నాగిని ఇంట్లో ఉన్నాడని వార్త వచ్చింది. కడుపుతీపి చెడ్డది! ఆ రాత్రే ఉరికాం. విరించిని బ్రతిమలాడాం, ఇంటికి రమ్మన్నాం. 'మీ ఇంట శాంతి లేదు. నేను రాను' అని పంపించేశాడు. వాడు అన్నందుకు కాదు - వాడు రానందుకు బాధపడుతూ తిరిగి వచ్చాం.
మా అత్తగారు రామ సీతమ్మగారు పరమపదించారు. విరించికి చెప్పంపాం. మా ఇద్దరిని తప్ప అందరినీ పలకరించాడు. బయటపడినాడు. ముందు తల్లి శవం - కొడుకు పొడిచిన పోటు. కమల విలవిల్లాడింది. సరిగ్గా పధ్నాలుగో రోజున మా మామగారు నారాయణాచార్యుల వారు దివంగతులు అయినారు. వార్త అందీ విరించి ముఖం చూపలేదు.
మనశ్శాంతి మరీచిక అయింది. అమ్మాయిలు ఉదయ - సుధ, అల్లుళ్ళు మోహన్ - సురోత్తం, మనుమరాలు సహజ - మనుమడు ఉజ్వల్ తో మొత్తం దక్షిణయాత్రలు సేవించి వచ్చాం. రాగానే కమలకు మోకాళ్ళలో నీరు వచ్చింది. నీరుతీసే ప్రక్రియలో ఇచ్చిన ఇంజక్షన్ తో షాక్ వచ్చింది. భగవదనుగ్రహం వల్ల బయటపడింది. వార్త అందినా కొడుకులు రాలేదు. అది మరింత బాధాకరం అయింది కమలకు! గుండె జబ్బు వచ్చింది.





