Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    వివరాలు తదుపరి తెలిశాయి. హైదరాబాదు ఆకాశవాణి ఇంకా ఇందిరాగాంధీ భజన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నదనీ - 'అఖండ దీపం' అలాంటి నాటకం అనీ - ఎవరో ఢిల్లీకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీవారు ఆపుచేయించారు.
    
    "అఖండ దీపం" భజన అంటే నాకు అనంతబాధ కలిగింది. జీవితంలో ఎవరినీ స్తుతించినవాణ్ణి కాదు. ప్రయోజనం పొందినవాణ్ణీ కాదు. నాకు నచ్చకుండా నేను నమ్మకుండా రచన చేయలేదు. 'భజనముద్ర' వదిలించుకోవడానికి ఉపక్రమించాను. కొందరు జనతాపార్టీ M.P. లను, MLAలను కలిశాను. నన్ను ఎరిగినవారు కావున భజన నమ్మలేదు. వారికి నాటకం ప్రతులు ఇచ్చాను, చదివించాను. వారు అర్ధం చేసుకున్నారు. 'ఆస్తి కన్న మనిషి మిన్న' అన్న సత్యం ఉంది - భజన లేదు అన్నారు.
    
    జనతా ప్రభుత్వంలో అద్వానీగారు సమాచార ప్రసారశాఖామాత్యులు వారికీ నేను వివరంగా వ్రాశాను - నన్ను గురించిన కథా కమామీషూ వివరించాను. నాటకం ప్రతి పంపించాను. అఖండదీపం చదివిన MLAలతో, M.Pలతో ఉత్తరాలు వ్రాయించాను. అద్వానీగారు "అఖండదీపం" ఇంగ్లీషు మతలబు కావాలన్నారు. కథా, సంగ్రహము - వివరణ ఇంగ్లీషులో వ్రాసి పంపాను. ఆకాశవాణి నుండి అఖండ దీపం టేపు తెప్పించుకున్నారు. 'అఖండ దీపం'లో భజన లేదని ఎగిరినారు. అయినను సర్కారు కదా! నాటకమును కత్తిరించి ఒక గంటకు కుదించి ప్రసారము చేయమని హుకుము జారీ చేసినారు.
    
    ప్రజాస్వామ్యం ఏనుగులాంటిది. రాజకీయ పార్టీలు అన్నీ గుడ్డివే! వారి చేతికి అందించే ప్రజాస్వామ్యం ప్రజలను గాలికి వదిలారు. పార్టీలన్నీ స్వామ్యములు అయినాయి.
    
    "ప్రజల రాజ్యమొచ్చె ప్రజలంతా ప్రభులైరి
    ప్రజల నెత్తిమీద పడెను బండ
    ప్రభువు లెవ్వరయిన ప్రజలకు మిండలే!
    
    విశ్వజనుల వాణి వినర రంగ" అన్నాను - 1961లో ప్రచురితం అయిన జనరంగంలో.
    
    "ఆకాశవాణి"వారు సర్కార్ హుకుం తామీల్ చేసిన్రు. 'అఖండ దీపం' గంట ప్రసారం చేసిన్రు!
    
    ఉర్దూలో 'సర్' అంటే 'తల'; 'కార్' అంటే పనిచేసేవాడు. తలపనిచేసేవాడు సర్కార్! కత్తిరిస్తాడు. కొరుగుతాడు. మర్దన చేస్తాడు!
    
    నాకు పడిన 'భజన' ముద్ర వదిలింది. అది వదిలించుకోవడానికి ఇంత కార్ గుజారీ - కార్యక్రమం!
    
    చతుర మాసపత్రిక సంపాదకులు - మిత్రులు చలసాని ప్రసాద్ గారు నన్ను నవల వ్రాసి ఇవ్వమని కోరారు. వారికి 'అఖండ దీపం' కథ వివరించాను. దాన్ని నవలగా వ్రాసి ఇస్తానన్నాను. వారు అంగీకరించారు. 'పావని' పేరుతో అఖండ దీపం వస్తువును, నవలగా అలంకరించి ఇచ్చాను. ప్రసాద్గారు 'పావని'ని ఎంతో మెచ్చారు. 'పావని' నవలగా చతుర 1978 జూన్ సంచికలో ప్రచురితం అయింది.
    
    పావని అనేక మందిని ఆకర్షించింది. ఒకరిద్దరు పావనిని చలనచిత్రీకరించడానికి విఫల ప్రయత్నం చేశారు.
    
    'అఖండ దీపం' నాకు తెలియకుండా దూరదర్సన్ కు చేరిందని తెలియవచ్చింది.
    
    1987లో నేను మంచం పట్టాను. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. 'అఖండ దీపం' దూరదర్సన్ ఆమోదం పొందింది అన్నాడు. అఖండ దీపం హక్కులు కావాలన్నారు. నాకు - రచయితకు - తెలియకుండా 'అఖండ దీపం' దూరదర్సన్ అనుగ్రహం ఆర్జించడం ఆశ్చర్యం కలిగించింది. డబ్బు అక్కరలో ఉన్నాను. పదిహేనువేలు అన్నాను, అంగీకరించాడు, వెళ్ళిపోయాడు, పత్తాలేడు!
    
    1988లో అనుకుంటా -అతను ఫోను చేశాడు. నా బ్యాంకు అక్కౌంటు నంబరు అడిగాడు - చెప్పాను. మళ్ళీ ఫోను చేశాడు. అయిదువేలు జమకట్టానని తెలియపరిచాడు. వెనువెంటనే కర్చుపెట్టాం. అతను నన్ను కనీసం రశీదు అడగలేదు.
    
    ఆ తరువాత ఇంకొక తను వచ్చాడు. హక్కులు కావాలన్నాడు. ఇంకొకరికి ఇచ్చానన్నాను. 'అలాగా!' అన్నాడు వెళ్ళిపోయాడు.
    
    రెండేళ్ళు గడిచిపోయాయి. ఎవరూ జాడలేదు. 1991లో ఒకతను వచ్చాడు. పదివేలు ఇచ్చాడు. కాగితంమీద సంతకం పెట్టించుకుపోయాడు. అప్పుడు నేను వికల మనస్కుడనై ఉన్నాను. మా పెద్దబ్బాయి విజయ్ గతించాడు. రిటైరయినాను. ఆ బాధల్లో ఉన్నాను. డబ్బు ఉపకరించింది.
    
    19 ఏప్రిల్ 1991 శుక్రవారం సాయంత్రం ఏడుగంటలకు 'దూరదర్సన్'లో 'అఖండ దీపం' తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది. అది చూచాను. నా గుండె లిప్త నిలిచింది! నేను చకితుణ్ణి అయినాను. ఏమీ అర్ధం కాలేదు.
    
    'అఖండ దీపం' ఆరిపోయింది. సీరియల్ పేరు, నా పేరు తప్ప అంతా అయోమయం! అది నా కథకాదు!!! ఆత్మహత్య - కల్లుదుకాణం - దుబాయ్ పోవడం! నాకు తలకొట్టేసినంత పని అయింది.
    
    అప్పటికి నేను దూరదర్సన్ డ్రామా అడ్వయిజరీ కమిటీ మెంబరును. డైరెక్టరు నాకు ఆకాశవాణినుంచి తెలిసినవాడు. టెలిఫోను చేయడానికి గంటల తరబడి నిరంతరం ప్రయత్నించాను. ఎవరూ అందరు! మా దొరల గడీల వలె దూరదర్సన్ దుర్భేధ్యం అని అర్ధం అయింది.
    
    నా పేర మరొక కథ ప్రసారం! బహుశా చరిత్రలో జరిగి ఉండదు. ఆనాటి యాతన నేను జీవితంలో అనుభవించలేదు. వేదన నిద్రమాత్రలను మించింది. రాత్రి సాంతం నిదురలేదు!
    
    తెల్లవారి "అఖండ దీపం నా కథ కాదు - నిలిపివేయండి" అని పత్రికా ప్రకటన విడుదల చేశాను. అన్ని పత్రికలూ ప్రచురించాయి. దూరదర్సన్ డైరెక్టరుకు, డైరెక్టర్ జనరల్ కు - ప్రసార శాఖామాత్యులకు టెలిగ్రాములు ఇచ్చాను. దరఖాస్తులు పంపించాను. అప్పుడున్నది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ అని గుర్తు.
    
    ఒకనాడు ప్రొడ్యూసర్ కొంత డబ్బు నాకు ఇస్తానని వచ్చారు. నాకు కథ కావాలి, డబ్బు కాదు అని కచ్చితంగా చెప్పాను. ఢిల్లీనుండి వత్తిడి ఎక్కువయింది. డైరెక్టరు నన్ను రమ్మన్నారు, వెళ్ళాను. కథ మారుస్తాం. కొద్ది మార్పులకు అనుమతించండి అన్నారు, అంగీకరించాను. దూరదర్సన్ కు అనువర్తించడానికి మార్పులకు అంగీకరించాను. అలా వ్రాసి ఇచ్చాను.
    
    ఇంత జరిగినా కథ మారలేదు. కొందరు యువకులు దూరదర్సన్ ముందు ధర్నా చేశారు. డైరెక్టరును ఘోరావ్ చేశారు. నగరంలోని సాహిత్యసంస్థలు మాత్రమే కాక రాష్ట్రంలోని సంస్థలు ఈ అన్యాయాన్ని ఖండించాయి. దూరదర్సన్ కు ఢిల్లీకి ఉత్తరాల ఉద్యమం సాగింది.
    
    అయినా 'అఖండ దీపం' నా కథ కాకుండానే నా పేర నిరాటంకంగా ప్రసారం అవుతున్నాది.
    
    ప్రొడ్యూసర్లు కోర్టునుంచి 'నన్ను ఆటంకం కల్పించరాద'ని 'స్టే' ఉత్తరువులు తెచ్చారు.
    
    క్రింది కోర్టులోనూ, హైకోర్టులోనూ నా మీద నేను వారిని మానహాని చేసినట్లు కేసులు పెట్టారు.
    
    మా వకీలు నందిగం కృష్ణారావుగారు మానహాని కేసులు కొట్టివేయించారు. స్టే మాత్రం తొలగింపజేయ లేకపోయారు. ప్రసారం నిలిపివేయాలని దూరదర్సన్ మీద కేసు పెట్టారు.
    
    ప్రొడ్యూసరు పక్షం వకీలు చతురుడు. వాయిదాలు వేయిస్తూ కాలం గడిపారు. కొంతకాలం మెజిస్ట్రేటు శలవు పెట్టారు. ఒకనాడు కోర్టు ముందు గట్టిగా వాదించాను. ఈ కేసును దూరదర్సన్ కేసుతో కలిపి విచారించవలసిందని తీర్పు ఇచ్చి న్యాయమూర్తులు చాకచక్యంగా తప్పుకున్నారు.
    
    ఈలోగా నేను జబ్బున పడ్డాను. సుగర్ బాగా పెరిగిపోయింది. ఆస్పత్రిలో పడ్డాను. పదివేలు కర్చయింది. బతికి బయటపడ్డాను.
    
    దూరదర్సన్ కేసుకూడా, వాయిదాలు - న్యాయమూర్తి శలవు వగైరాలతో అఖండ దీపం సీరియల్ పదమూడు భాగాలు ప్రసారం పూర్తి అయింది.
    
    మన న్యాయ వ్యవస్థలో 'న్యాయం' జబారులో వస్తువులవలె డబ్బులకు లబిస్తుంది అని నేర్చుకోవడానికి ఇంత శ్రమ అక్కరలేదని అర్ధం అయింది.
    
    వట్టి దూరదర్సన్ ఆమోదాన్ని లక్షలు లక్షలకు అమ్మకాలు జరిగాయని తెలియవచ్చింది.
    
    మరొక అత్యంత విచిత్రం జరిగింది. ఇంత జరిగిన 'అఖండ దీపం' మరొక పదమూడు ఎపిసోడులు పొడిగింపు ప్రసారం జరిగింది. అయితే వీటిలో నా పేరు చూపించలేదు.
    
    ఈలోగా రాజీవ్ గాంధీ హత్య - ఎన్నికలు జరగడం - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది.
    
    ఆకాశవాణి "అఖండ దీపం" వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలయింది. జనతా ప్రభుత్వంలో ముగిసింది. దూరదర్సన్ "అఖండ దీపం" వ్యవహారం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో మొదలయింది. కమగ్రేస్ ప్రభుత్వంలో ముగిసింది. ఇది యాదృచ్చికం కావచ్చు. కాని - గమనించవలసినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.