Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఆకాశవాణినుంచి 'మాలపల్లి' నవల సీరియల్ గా చదివించడానికి ఒక ఉద్యమం అవసరం అయింది. రచయితలం ప్రదర్శనలు - నినాదాలు చేయవలసి వచ్చింది. ఆకాశవాణి అధికారుల అభివృద్ధి నిరోధకత్వాన్ని ఎదిరించి, "మాలపల్లి" సీరియల్ గా చదివించడంలో విజయం సాధించాం.
హైదరాబాదులో నార్ల చిరంజీవి గ్రంథాలయం స్థాపించాం. దీన్ని సి. నారాయణరెడ్డిగారు ప్రారంభించారు. సికిందరాబాదులో వట్టికోట ఆళ్వార్ స్వామి గ్రంథాలయాన్ని రావి నారాయణరెడ్డిగారు ప్రారంభించారు.
ప్రభుత్వం కొందరు విరసం రచయితలను అరెస్టు చేసింది. విరసంవారు ఆంద్రసారస్వత పరిషత్తు ప్రాంగణంలో ఒక నిరసన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో నన్ను మాట్లాడమన్నారు. నేను అరసం అధినాయకులను అడిగాను. వారు వారించారు. రచయిత ఏ రంగు, రూపు, రుచి వాడయినా అతని నిర్భందాన్ని నేను నిరసిస్తాను అన్నాను. S.B. గిరి M.P. సహితంగా ఆ సభలో మాట్లాడాం. 'పదకొండు వందల సంవత్సరాల ఆంద్ర సాహిత్య చరిత్రలో రచయితలను నిర్బంధించిన దుర్మార్గం ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందనీ - వెంటనే రచయితలను సగౌరవంగా విడుదల చేయాలని' అన్నాను.
నేను రెండు సంవత్సరాలు హై.అ.ర.సం. అద్యక్షునిగా నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను. పదవులను ఒకే వ్యక్తి కరచిపట్టుకుని కూర్చునే ప్రజాస్వామ్యం నాకు గిట్టదు. అందువల్ల అధ్యక్ష పదవిని స్వచ్చందంగా విరమించాను. అయినా కార్యకర్తగా అరసంలో శక్తిని మించి పనిచేశాను.
తరువాత పరిస్థితులు గుర్తులేవు. ఆంద్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడింది. ఆ బాధ్యత నన్ను నిర్వహించమని కోరారు. నేను కొద్దిగా వెనుకంజ వేశాను. ఉద్యోగంలో ఉండి అంతటి బాధ్యత నిర్వహించగలను అనే నమ్మకం నాకు కలుగలేదు. అయినా 'నాయకత్వపు' వత్తిడికి లొంగవలసి వచ్చింది. నేను జబ్బుగా ఉన్నాను. నా అనుప స్థితిలో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
పార్టీ సభ్యుడు కాని అరసం ప్రధాన కార్యదర్శిని బహుశః నేనే నేమో!
ప్రధాన కార్యదర్శిగా - నాకు సంతృప్తి కలిగేంత పని చేయలేకపోయాను. వివిధ ప్రాంతాల్లో సభలు - సమావేశాల్లో
పాల్గొనడం తప్ప నిర్మాణాత్మక కార్యక్రమం ఏదీ నిర్వహించలేకపోయాను. అయితే, ఆ వ్యవధిలో స్మృతి పథంలో నిలిచిపోయేది నాగార్జున సాగరంలో జరిగిన టాల్ స్టాయ్ శతజయంతి ఉత్సవాలు! అక్ఖడ శ్రీశ్రీగారు నేనూ ఒకే వేదికమీద మాట్లాడాం. ఒక రోజంతా ఆ మహాకవితో కలిసి ఉండి, మాట్లాడే-చర్చించే-కవితలు వినే అవకాశం లభించింది.
నేను విశ్వనాథ వారితో - శ్రీశ్రీతో - గద్దర్ తో ఒకే వేదిక మీద మాట్లాడగలిగినాను. నాకు సాహిత్యం సాంతం ఒకటే! మనిషికీ, సాహిత్యానికీ గోడలు నేను సహించలేను. మెరపు ఎక్కడున్నా మెచ్చగలను. నాకు అడ్డుగోడలు గిట్టవు. దీవారేఁ తోడ్ దో - దర్వాజే ఖోల్ దో - గోడలు కూల్చండి - ద్వారాలు తెరవండి అంటాను. మంచి రచనకు గోడల అడ్డులేల? అంతములేని ఈ భువనమంతయు నాకు కళారంగమే!
రెండు సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. స్వచ్చందంగా పదవి వదులుకున్నాను. అరసం అధి నాయకత్వానికి నాతో పని తీరింది. నన్ను కరివేపాకును చేశారు!
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ అనేక విధాల నచ్చకున్నా - పేదలకు సాయం అందినంతవరకు నాకు నచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన్నాటినుంచి నాటివరకు సాధారణ ప్రజానీకాన్ని అంతగా గుర్తించినవారు లేరు. ఇందిర బంగ్లాదేశ్ ను విడగొట్టారు - బ్యాంకులను జాతీయం చేశారు. రాజ భరణాలు రద్దు చేశారు. ఇంతటి సంస్కరణలు ఏ ప్రధానీ ఇంతవరకు అమలుపరచలేదు! ఇందిరా గాంధీ తన పదవిని రక్షించుకోవడానికి ఇదంతా చేసిందనేవారు. వారూ తాము గద్దె ఎక్కడానికే ఇందిరను గద్దె దించ ప్రయత్నించారు. పదవి నిలుపుకోవడానికయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాస్వామ్యం!
నాకు దేనివలనా కలుగనట్లే - ఎమర్జెన్సీ వలన సహితం - ఇసుమంత ప్రయోజనం చేకూరలేదు. పైగా, మరింత హాని జరగాబోయి ఆగింది 'జనపదం' నవల అప్పుడే వచ్చింది. నగరంలోని ప్రెస్సులలో దాన్ని అచ్చు కానివ్వలేదు. నవయుగ సాంబశివరావుగారు తెనాలిలో అచ్చువేయించారు. పైగా ఆఫ్సర్ షాహీ - అధికారులు చెలాయించే ప్రభుత్వం - నన్ను విప్లవకారుల్లో చేర్చింది. నా రచనలు తెలిసిన అధికారులు ఉండడంవల్ల ఉద్యోగం ఊడలేదు. గండం గడిచింది.
ఆ రోజుల్లో నేను 'తూర్పు తెల్లవారింది' అనే ఒక రేడియో నాటకం వ్రాశాను. అందులో పల్లెపెద్దల దుర్మార్గాలను, ప్రజల చైతన్యాన్ని వివరించాను. Toorupu Tellavarindi Written in Telengana dialect, this play made the best listning. Yet on the 20 point programme అని 'హిందూ' వ్యాఖ్యానించింది.
కె. చిరంజీవి రచించిన 1. కొక్కరొకో 2. శాంతి సమరం 3. నీలిదీపాలు రేడియో నాటకాలను హిందీలో అనువదించాను. అదొక మరుపురాని సంఘటన. శారదా శ్రీనివాసన్ ఇంట్లో పెసరట్లు తింటూ, చాయ్ చప్పరిస్తూ, ఉర్దూ కవిత వినిపిస్తూ నేను చెప్పడం, శారదగారు వ్రాయడం. వారికి రాని హిందీలో చెమక్కులకు చిరంజీవిగారు వాహ్, వాహ్, అనడం రోజులు రోజులు అలా వ్రాస్తూ గడిపేశాం. నేను అనువదించిన మూడు నాటకాలు ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారం అయినాయి. నేను చేసిన హిందీ అనువాదంనుంచి ఇతర అన్ని భాషలకూ అనువదించబడి ప్రసారం చేయడం హిందీ అనువాదంనుంచి ఇతర అన్ని భాషలకూ అనువదించబడి ప్రసారం చేయడం జరిగింది. హిందీవాళ్ళు మెచ్చేంత అందంగా వచ్చింది అనువాదం. అందుకు కారణం మూల రచయిత ముందున్నాడు. నేను మనసుపెట్టి అనువాదం చేశాను.
భాష ఒక సమస్యకాదు. మనసుంటే మార్గాలు అనేకం.
ఆకాశవాణి వారు "అఖండ దీపం" పేర గ్రామ విముక్తిని గురించి నన్ను మూడుగంటల నాటకం వ్రాయమన్నారు. పేరున్న సినీతారలతో నాటకం వేయించి, వారం రోజులపాటు సీరియల్ గా ప్రసారం చేస్తామన్నారు.
నేను 'పెట్టినుంచి విముక్తి' సమస్యగా తీసుకొని రచించడానికి ప్రణాళిక సిద్దం చేశాను. ఆ గ్రామంలో రామయ్య సావుకారు. ఆ ఊళ్ళో మనుషులూ - పనిముట్లూ అన్నీ రామయ్య తాకట్టులో ఉంటాయి. ఊరు సాంతం అతనికి కట్టుబానిస. ఆ ఊరికి వచ్చిన టీచర్లు అతనికి లెక్కలు వ్రాస్తారు. స్కూలు భవనం అతనికి గిడ్డంగి అవుతుంది. రామయ్య ఆ ఊరి ఏలిక!
ఆ ఊరికి పావని టీచరుగా వస్తుంది. ఆమె రామయ్య లెక్కలు వ్రాయదు. ప్రజలకు పగలూ - రాత్రీ చదువు చెపుతుంది. చదువంటే అక్షరాలు మాత్రంకాదు. శ్రమ విలువనూ - శ్రామిక శక్తినీ వివరిస్తుంది. వారిని సంఘటిత పరుస్తుంది. చైతన్యవంతులయిన ప్రజలు రామయ్యను ఓడిస్తారు. ప్రాణంలేని ఆస్తికన్న ప్రాణం ఉన్న మనిషి మిన్న అని రామయ్య గ్రహిస్తాడు. గ్రామస్తులతో ఆస్తీ - ఆనందం పంచుకోవడానికి సిద్దం అవుతాడు, అలాగే జీవిస్తాడు.
"ఇంత ఆనందం చూస్తుంటే పిచ్చెక్కేట్లుంది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అంధకారాన్ని మింగి, వెలుగులు చిమ్మే ఈ 'అఖండదీపం' వెలుగుతూనే ఉండాలి - ఆరిపోరాదు" అంటుంది పావని.
నాటకం వ్రాసి ఆకాశవాణివారికి ఫిబ్రవరి 1977లో ఇచ్చాను. మార్చిలో జరిగిన ఎన్నికల్లో సంజయ్, ఇందిర సహితంగా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మురార్జీ ప్రధానిగా జనతా ప్రభుత్వం ఏర్పడింది. జనతా ప్రభుత్వపు ఛాయ 'అఖండ దీపం' మీద పడింది.
అంతకు ముందు ఆకాశవాణి ఈ నాటకాన్ని సినీతారలతో వేయించడానికి నిర్ణయించింది. అప్పటుకి ఆ ప్రతిపాదన విరమించింది. ఆకాశవాణి నటీనటవర్గంతో నాటకం రికార్డు చేయడం జరిగింది. ప్రసారం చేసే తేదీకూడా ప్రకటించడం జరిగింది. కాని, ఆ రోజు ప్రసారం కాలేదు. రేడియో స్టేషనులో విచారించాను. ఢిల్లీనుంచి ఆపుచేయించారని తెలిసింది. వివరాలు అప్పటికి అందలేదు.





