Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అలా ఉండగా హైదరాబాదులో శ్రీరంగం శ్రీనివాసరావుగారిని పదివేలరూపాయిలతో సన్మానించడానికి ఒక సంస్థ నిర్ణయించింది. 4-7-1970 న జూబ్లీ హాలులో అనుకుంటా - సభ ఏర్పాటు చేశారు. శ్రీశ్రీగారు అందుకు అంగీకరించి హైదరాబాదు వచ్చారు.
దిగంబర కవుల్లో కొందరు - మరి కొందరు సాయుధ విప్లవం మీద విశ్వాసం ఉన్న యువకులకు - శ్రీ శ్రీ వంటి విప్లవకవి ఒక సంస్థ సన్మానం పొందడం బాగనిపించలేదు. వారు ఆ రాత్రి శ్రీశ్రీని కలిశారు. వారి అధ్యక్షతన 'విప్లవ రచయితల సంఘం' స్థాపించారు. వారు తుపాకి గొట్టంనుంచి విప్లవం వస్తుందని విశ్వసించారు. అపప్తికి తెలంగాణమునకు పాకిన నక్సలయిటు సాయుధ పోరాటానికి సుమారు అనుబంధ సంస్థ అయింది విరసం.
విరసం యువకులను మేధావులను విశేషంగా ఆకర్షించింది. వారు విస్తృతం అయిన కార్యక్రమాలు నిర్వహించారు. రచన అంటే విప్లవ రచన అనేంత స్థాయికీ పాకింది విరసం.
సంప్రదాయ సాహిత్యాన్ని రాస్ఖిమ్చుకోవాలని 'యువభారతి' సంస్థ విశేష కృషిచేసింది. వారి స్బహలకు రాజకీయసభల కన్న ఎక్కువ ప్రజా హాజరయింది. వారు క్రమశిక్షణతో అత్యంత ఆధునిక పద్దతులలో పుస్తక ప్రచురణ - వితరణ చేపట్టారు. 'ప్రేమ్ చంద్ జీవితం - సాహిత్యం' అని నేను రచించిన పుస్తకాన్ని వారు ప్రచురించారు. "చిల్లరదేవుళ్ళు" ఆంగ్లంలో పరిచయం చేశారు.
సాహిత్యవాతావరణం ఇలా ఉన్నప్పుడు అభ్యుదయ రచయితల్లో ప్రధాన కవులు అరసంనుంచి విడిపోయారు. అరసంలో పార్టీ జోక్యం ఎక్కువయిందని ఆరోపించారు. వేరే అభ్యుదయ రచయితల సంఘం ఏర్పరచుకున్నారు. అలా విడిపోయినవారిలో ఆరుద్ర - సోమసుందర్ - దాశరథి మున్నగువారు ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో 'అభ్యుదయ అధిపతులు' అరసాన్ని పునరుద్దరించాలనుకున్నారు. అది ఎదురీత! హైదరాబాదు నగర అరసంతో ప్రారంభించాలనుకున్నారు. నన్ను నగర అరసం అధ్యక్షులుగా ఉండమని కోరారు. ఇది నాకు ఒక క్లిష్ట సమస్య. మా అన్నయ్య వేరే అరసంలో ఉన్నారు. యువభారతి - విరసంలో కూడా నాకు మిత్రులు ఉన్నారు.
నాకు తొలినుంచి అరసం అంటే అభిమానం. అరసం తొలిరోజుల్లో ఉభయ ఆంద్రములలోని అనేకమంది రచయితలకు స్ఫూర్తి నిచ్చింది. మార్గనిర్దేశం కలిగించింది. అయితే అరసంలోకి చొచ్చుకుని నేను ఎన్నడూ పనిచేయలేదు. నాకు నాటినుండి నేటివరకు ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం లేదు. ఎవరి వల్లా నేను ఇసుమంత ప్రయోజనం పొందలేదు. ఆళ్వార్స్వామి - చిరంజీవికి నాకు ఉన్న బాంధవ్యంవల్ల నాకు ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నదని కొందరు ముద్ర వేశారు. అది పచ్చి అబద్దం.
అరసం వారి అభ్యర్దనను నాకుగల అభిప్రాయాల దృష్టితో పరిశీలించాను. నాకు సాయుధ విప్లవం మీద విశ్వాసం లేదని మనవి చేశాను. విరసం వారు రచయితలు విప్లవం తేగలరని నమ్మారు. ఎంతటి విప్లవంలోనూ రచయిత పాత్ర ప్రజలను విప్లవోన్ముఖం చేయడం మాత్రమేనని నా నమ్మకం. విప్లవ నిర్మాత లెనిన్ అగును, గోర్కీ కాడు. నేను సిద్దాంతపరంగా విరసాన్ని వ్యతిరేకించాను. కాని వారి చిత్తశుద్దిని శంకించలేదు. అందరూ నావలెనే ఆలోచించాలానే మూర్ఖత్వం నాకు లేదు.
నాకు సంప్రదాయ సాహిత్యంతో అనుబంధం ఉంది. అభిమానం ఉంది. అది అభ్యుదయానికి - విప్లవానికి - ఆధునికతకు వ్యతిరేకం అని నేను భావించను. మన వారసత్వాన్ని మనం గౌరవించాలి. అంతేగాని, అదే సమస్తం అని భ్రమించరాదు. సంప్రదాయ సాహిత్యంతో ఎవరినో సాధించగలం అనుకోవడం బూటకం.
వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అరసం నాకు తగిన వేదిక అని నిర్ణయించుకున్నాను. ఇతర సాహితీ సంస్థలను - ముఖ్యంగా విరసంను దూషించరాదని చెప్పి, అరసం అధ్యక్ష పదవికి అంగీకరించాను. విరసం - అరసం లక్ష్యం ఒక్కటే - మార్గాలు వేరు. కాబట్టి అయిక్య వేదికకు పిలుపు ఇవ్వాలని 'నాయకత్వాన్ని' ఒప్పించాను.
హైదరాబాదు నగర అభ్యుదయ రచయితల సంఘ ప్రథమ మహాసభ 5-10-1072న ఆంద్ర సారస్వత పరిషత్తు హాలులో జరిగింది. నేను అధ్యక్షత వహించాను. వ్యక్తి ఆస్తి దుష్ఫలితఃలను తెలియచెప్పడానికి అందరూ కలిసి కృషి చేయాలన్నాను. గజ్జల మల్లారెడ్డిగారు సాహిత్యంలో అతివాద, ప్రజాతంత్ర శక్తుల అయిక్యతకు పిలుపు ఇచ్చారు. యువరచయితల కవితా సంకలనం "అలజడి"ని తుమ్మల నరసింహమూర్తిగారు విడుదల చేశారు. విరసం ప్రచురించిన కొన్ని పుస్తకాలను ప్రభుత్వం నిషేధించడాన్ని నిరసిస్తూ తీర్మానం ఆమోదించబడింది.
సమావేశానికి రచయితలూ ప్రజలూ పెద్దసంఖ్యలో వచ్చారు. విరసం, యువభారతి మున్నగు సాహిత్య సంస్థలకు ప్రాతినిధ్యం వహించే రచయితలూ వచ్చారు.
నాకు గుర్తున్నంతవరకు - ఆ తరవాత - అరసంవాళ్ళు విరసంను తిట్టలేదు. విరసం - అరసంను తిట్టడం మానలేదు.
హైదరాబాదు అరసం అధ్యక్షునిగా - ఆ సంక్షుభిత కాలంలో - నేను కొన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగాను. యువతను ఉత్సాహపరచగలిగాను. అరసంకు హిమాయత్ నగరంలో ఒక కార్యాలయం ఏర్పడింది. నేను వారానికి రెండుసార్లు సాయంకాలాలు కార్యాలయంలో ఉండేవాణ్ణి. రాంభట్ల కృష్ణమూర్తి - బూదరాజు రాధాకృష్ణ - గజ్జల మల్లారెడ్డి వంటి ప్రముఖులతోపాటు యువతీ యువకులు వచ్చేవాళ్ళు. అది ఒక చర్చాగోష్ఠిగా - కార్యశాలగా ఉండేది. అనేక విషయాలు చర్చకు వచ్చేవి. యువకుల - యువతుల రచనలు చూడడం, ప్రోత్సహించడం జరుగుతుండేది.
నగరంలో సగటున నెలకు ఒక సభ జరిపాం. వాటిలో సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపిన ప్రముఖ రచయితల జీవితాలు - రచనల గురించిన ఉపన్యాసాలుండేవి. ఆ రచయితలను గురించి యువకులతో వ్యాసాలు వ్రాయించి చదివించేవాళ్ళం. అందువల్ల యువతలో ఉత్సాహం కలిగి, వ్యాసాలు కవితలు వ్రాసేవారు. అలా చేసిన ఉత్సవాల్లో వీరేశలింగం - గిడుగు - గురజాడ - గోపీచంద్ - గోర్కీ - ప్రేమచంద్ - మాడపాటి - వట్టికోట ఆళ్వార్ స్వామి - నార్ల చిరంజీవి మున్నగువారిని గురించి వివరించడం జరిగింది.
ఆ ఉత్సవాల సందర్భంలో యువకులు వ్రాసిన వ్యాసాలలో కొన్నింటిని "కాలం బొమ్మలు" పేరా డిసెంబర్ 1973లో పుస్తకంగా ప్రచురించాం. అలాగే యువతతో కథలు వ్రాయించాం. చాలామంది కొత్తగా కాలం పట్టినవాళ్ళు మంచి కథలు వ్రాశారు. వాటిలో మంచివాటిని ఎన్నుకుని "కెరటాలు" అనే కథల సంపుటిగా ప్రచురించాం.
పాత పట్నంలో రచయితల సభలు జరిపాం. అక్కడి యువరచయితల కవితల సంపుటి ప్రచురించడం జరిగింది. సభల సందర్భంగా ప్రగతి నిరోధకులనుండి వచ్చిన అడ్డంకులను తిప్పికొట్టడం, అక్కడి రచయితలలో ఈ రోజు కొందరు ప్రఖ్యాత రచయితలు కావడం సంతోషం.
నగరంలోనే కాక ఆంద్రదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించాను. అభ్యుదయ రచన - సామాజిక ఆవశ్యకత గురించి వివరించాను. ఎందరో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంచి రచనలు చేశారు. యువతలో సామాజిక అవగాహన కలగడానికి కొంతలో కొంత తోడ్పడ్డాను.
ఆ రోజుల్లో విశ్వవిద్యాలయాలలో గ్రాంథికానికి తప్ప స్థానం లేకుండింది. విశ్వవిద్యాలయాలు ఆధునిక సాహిత్యాన్ని అంటఆరదని మడి కట్టుకొని కూర్చున్నాయి. "విశ్వవిద్యాలయాల బూజు దులపండి" అనే ఒక విద్యార్ధుల ఉద్యమం నిర్మించి నిర్వహించాం. ఉస్మానియా తెలుగుశాఖ ఆధునికాన్ని అసహ్యించుకుంది. అక్కడ అనేక గోష్టులు - సభలు నిర్వహించాం. ఇది అధిపతులను కొంత చిరాకు పరిచాయి. ఈ రోజు విశ్వవిద్యాలయాల పాఠ్యాంశంలో ఆధునిక సాహిత్యం చేరడానికి - కొంతవరకు - ఆ ఉద్యమం కారణం.





