Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
'దాశరథి రంగాచార్య రచనల్లో జనపదం' పరిశోధక వ్యాసం పుస్తకంగా వచ్చింది.
1988లో నా షష్టిపూర్తి సభలో ఆవిష్కరించబడింది.
పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఆదర్శ భారతదేశాన్ని దర్శించాలనే ఆపేక్ష
నాకు కలిగింది. 'రానున్నది ఏది నిజం?' అనే నవల వ్రాశాను. 'రానున్నది ఏది నిజం -
అది ఒకటే సోషలిజం' అనే దాశరథి పద్యపాదం ఈ నవలకు పేరు.
దేశంలో ప్రజా విప్లవం వస్తుంది. ఒక కార్మిక నాయకుడు ప్రధాని అవుతారు. పాత
మంత్రిని అరెస్టు చేస్తారు. చెరసాలలో పెడ్తారు. 'పామం'కు ప్రస్తుత ప్రభుత్వం తమ విధానాలను
వివరించడం 'రానున్నది ఏది నిజం?' ఇతివృత్తం. ఇది ఒక ఊహా చిత్రం. ఇంతకూ అది
పామంకు వచ్చిన కల! మంత్రిగారు మేల్కొంటారు, దడుచుకుంటారు. తమ మంత్రి పదవి
దక్కాలంటే -
"ప్రాంతీయాభిమానాలను రెచ్చకొట్టాలి!
భాషపేర జనాన్ని పురికొల్పాలి!
నదీజలాల వివాదాలు రేకెత్తించాలి!
సరిహద్దు తగాదాలు ఉసి కొల్పాలి!
మత మహమ్మారిని వ్యాపింపజేయాలి!"
ఇదీ నవల ముగింపు.
నేను వ్రాసినట్లే సోషలిజం కలగా మిగిలిపోవడం విచారకరం!
రానున్నది ఏది నిజం 'విశాలాంధ్ర'లో సీరియల్ గా వచ్చింది 1973లో ఆంద్రప్రదేశ్
యువజన సమాఖ్యవారు ప్రచురించారు.
"ఈ సోషలిజం ఊహా చిత్రంలో ఉందా? లేదా? ఉంటే ఎక్కడెక్కడ ఎంత శాతంలో
ఉంది అనేది చర్చించుకోవడానికీ - చర్చించుకుని ఈ ఊహా చిత్రం రానున్నది ఏది నిజం అని
తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని అందరూ చదివి తీరాల్సిందే." (ప్రజావాహిని - కాకరాల -
11-12-1974)
"I deem this novels as one of the most
convincing and effective writing to impress on
people the good results of socialistic state.
There is discernible discipline in the
compositon of this novel."
-Indian Literature - D. Ramalingam -
May, 1992.
"చీకటి తెరలు ఎవడివక్కడ విచ్చిపోతుంటే ప్రాభాత మందానిలాలతో కలిసి ఉషోదేవి
అవతరించింది"- "చిల్లరదేవుళ్ళు" చివరి వాక్యం.
ఉద్యమరూపంలో అవతరించిన ఉషోదేవి 'మోదుగుపూలు' కు ప్రారంభం.
'కులశేఖరరావు' రంగారెడ్డి ఖద్దరు ధారులయి దిగారు - మోదుగుపూలు
ముగింపు వాక్యం.
ఖద్దరుధారి బలరామయ్య గ్రామంలో ప్రవేశించడం జనపదం ప్రారంభం.
'పేలుతుంటాయి తుపాకులు' జనపదం ముగింపు వాక్యం.
ఉద్యమాలు సాధించిన సోషలిజం 'రానున్నది ఏది నిజం?' ప్రారంభం.
1938కి పూర్వం నుంచి భవిష్యత్ భారతదర్శనం దాకా సాగిన, సాగుతున్న,
సాగనున్న ప్రజాజీవితాన్ని కళారూపంలో నవలలుగా రచించాను. ఇది జీవనధార, ఆలోచనా
స్రవంతి. ఒక స్రోతస్సునులా అధ్యయనం చేయాల్సినవి.
ముఫ్ఫయి ఆరు
కలం శ్రామికులు:
మానవచరిత్ర అనంతం అయింది. ఈ అనంత చరిత్రలో శ్రమను, శ్రామికున్ని
గురించి ఆలోచించి ఒక సిద్దాంతాన్ని నిర్వచించిన తాత్త్విక శిఖామణి కారల్ మార్క్స్ ఆ సిద్దాంతాన్ని
కార్యరూపానికి అనువదించి రష్యాలో శ్రామిక విప్లవానికి విజయపతాక ఎగురవేసిన మహితాత్ముడు
లెనిన్. రష్యాలో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా మేధావులను, ప్రజలను
కుదిపివేసింది. ఆ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది.
ప్రజా ఉద్యమాలకు రచనలూ - రచయితలూ ఉపకరిస్తారని తొలుత గ్రహించింది
కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ ప్రభావంతో 1936 లో భారతదేశంలో అభ్యుదయ రచయితల సంఘం
ఏర్పడింది. లక్నోలో జరిగిన తొలి సభలకు ప్రేమ్ చంద్ అధ్యక్షత వహించారు.
యాభయి సంవత్సరాల క్రితం ఆంద్రదేశంలోనూ అభ్యుదయ రచయితల సంఘం
ఏర్పడింది. అరసం ఆనాటి రచయితలమీద అనంతం అయిన ప్రభావం వేసింది. నడు ఉప్పెనవలె
సాగిన అన్ని ఉద్యమాలకోసం రచనలు చేయడమేకాక రచయితలు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో
పాల్గొన్నారు. కవిత్వం మాత్రమే సాహిత్యంగా చలామణి అయినపుదు వచనంకూడా సాహిత్యం అనీ,
వచన రచయితలూ ప్రభావం వేయగలరని నిరూపించింది అరసం.
నాలుగు - అయిదు దశకాల్లో అరసం సుమారు సర్వవ్యాపకం అయి
విజ్రుంభించింది. అరసం 'ఛాందసులు' అని ముద్రచేసినవారు సహితం అభ్యుదయులం
అనిపించుకోవడానికి ఆరాటపడినారు!
వ్యక్తి జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ, ఉద్యమాల చరిత్రలోనూ
హెచ్చుతగ్గులు, ఒడిదొడుకులు, మిట్టపల్లాలూ తప్పవు. పార్టీలు నడిపే పోరాటాల్లో ప్రజలు
మాయం అయినారు. పదవులు ప్రాముఖ్యం వహించాయి. వాటికోసం కుమ్ములాటలు -
వేర్పాటుల కథలు సాగేయి.
మన స్వాతంత్ర్య సంగ్రామం 1857-1947ల మధ్య 90 సంవత్సరాలు సాగింది.
ప్రధాన పోరాటం మహాత్ముని నాయకత్వంలో సాగిన కాంగ్రెసు పోరాటమే! స్వాతంత్ర్య సముపార్జన
కోసం - కాంగ్రెస్ పార్టీ - అందిన ప్రతి రాతినీ ఆంగ్రేజు సర్కారుమీద విసిరింది. స్వాతంత్ర్యం ఏమిటి?
అది వచ్చింతరువాత ఏం జరుగుతుంది? వివరించలేదు. ఆంగ్రేజువాడు పోవడమే పరమావధిగా
ఉద్యమం సాగింది.
గాంధీవాదం వ్యక్తిగత జీవితానికి ఉపకరిస్తుంది. పారిశ్రామిక సమాజానికి అంతగా
ఉపకరించదు. ఉద్యమ కాలంలోనూ కాంగ్రెస్ గాంధీజీని అనుసరించింది. గాంధీవాదాన్ని
అనుసరించలేదు.
మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అంటే స్వప్రయోజనపరులకు - పదవీ
పరాయణులకు - దొంగ వ్యాపారులకు - తక్కులమారు విద్యలవారికి స్వాతంత్ర్యం వచ్చింది.
పండిత్ జీకి ఇష్టం ఉన్నా లేకున్నా వారు భారతదేశంలో ప్రవేశపెట్టింది కేపిటలిజం - పెట్టుబడిదారీ
విధానమే. సర్కారు పరిశ్రమలు సోషలిజం కాదు.
పెట్టుబడిదారీ విధానపు నిజస్వరూపం "లాభం" లాభంకోసం వారు రంగుల
ప్యాకింగులో విషాన్ని విక్రయించగలరు! అది బలవర్ధకం అని నమ్మించగలరు!!
నమ్మిస్తున్నారు!!! మనం ప్రస్తుతం పోషిస్తున్న కంపెనీలన్నీ మానవ వినాశకారకములే! అది
తెలియడం బహ్మను తెలియడమంత దుస్తరం!!
స్వాతంత్ర్యంమీద సామాన్యులు - సాధారణ ప్రజానీకం పెట్టుకున్న దురాశలు
అడియాసలయినాయి. స్వాతంత్ర్య సమరవీరులే బికారులయినారు. సత్యమూర్తి - ప్రకాశం
వంటివారిని వంచకులు మించిపోయారు. ఇదా స్వాతంత్ర్యం అని సామాన్యుడు విస్తుపోయేంతలోనే
అతని బ్రతుకు బజారు పాలయింది. స్వాతంత్ర్యం వచ్చింతరువాత మనం విర్రవీగి గలిగినంత అభివృద్ధి
జరిగింది. కాని అదంతా పేదవాని పాలిటి పెనుభారం అయింది.
యువత ఈ నికృష్ణ పరిస్థితిని తిట్టుకుంది, దూషించింది. మంచి సమాజం
కావాలని గగ్గోలుపెట్టింది. ఈ సమాజం కుళ్ళిపోయింది. ఇది కుష్ఠుసమాజం. ఇది
సాధువచనాలకు వినదు. ఎహ్ లోగ్ సియాసీ దల్లాల్ హ్హ్వై ఇస్ కా ఖాల్ బహుత్ మోటాహై - వీరు
రాజకీయ దళారులు - వీరి చర్మం చాలా దళసరి. బూతులు తిడ్తేగాని వీరికి అర్ధం కాదు
అనుకున్నారు కొందరు తెలుగు కవులు. ఈ సమాజం 'సత్యం'కు పెనుదుప్పటి కప్పింది. దీనిని
దిగంబరం చేయాలి అనుకున్నారు.
వారు ఆరుగురు కవులు. తమ పేర్ల బట్టలను కూడా తొలగించారు. 1. ఆకారం
వీరవల్లి రాఘవాచార్యులు 'జ్వాలాముఖి'గా 2. యాదవరెడ్డి నిఖిలేశ్వర్ గా 3. బద్దం భాస్కరరెడ్డి
చెరబండరాజుగా 4. హృషి కేశవరావు, నగ్నమునిగా 5. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు
మహాస్వప్నగా 6. మన్మోహన్ సహాయ్ భైరవయ్యగా అవతరించారు.
వీరు ఆరుగురు దిగంబర కవులు. వీరు సమాజాన్ని కవితలో అసహ్యంగా తిట్టారు.
వీరి తిట్ల కవితను సకల భారత యువత ఆహ్వానించింది, అభినందించింది. దిగంబర కవులకు
విశేషప్రచారం లభించింది. వారు అతిసామాన్యుని ఇముడ్చుకునే వినూత్న పద్ధతులను
అవలంబించారు.
1965లో మే అర్ధరాత్రి అబిడ్స్ సెంటర్ లో 'నాంపల్లి పాండు' అనే రిక్షామనిషితో
దిగంబర కవుల సంచిక ఆవిష్కరింపచేశారు. రెండవ కవితా సంపుటి 1966లో విజయవాడలో
'జంగాల చిట్టి' అనే హోటల్ సర్వర్ తోనూ, మూడవ సంపుటి 1967లో విశాఖలో
'యడమనూరి యశోద' అనే వేశ్యతోనూ ఆవిష్కరణ చేయించారు.
ఆంద్రదేశంలో నక్సలయిట్ల సాయుధపోరాటం శ్రీకాకుళంలో ప్రారంభం అయింది.
సమాజాన్ని సహించలేకా - ఎదిరించలేకా తికమకలవుతున్న యువతకు ఒక మార్గం కనిపించింది.
దిగంబర కవులు సహితం సమాజం తిట్లకు అలవాటు పడిందని గ్రహించారు. సమాజాన్ని
సాపుచేయడానికి బుల్లెట్ కావాలనుకున్నారు.





