Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
` ఉద్యమపు పరువంలో సరస్వతి - వీరభద్రం ప్రేమించుకున్నారు. విడిపోయారు. పరిస్థితుల విపర్యాసం సరస్వతిని ముసలి బలరామయ్య భార్యను చేస్తుంది. ఆమె భూదాన ఉద్యమాన్ని ఆశ్రయిస్తుంది. వంచనకు గురి అవుతుంది, ఓడిపోతుంది. 'అమ్మ' అయి ఆశ్రయం నిర్మిస్తుంది. అమెరికా వెళ్తుంది. 'అమ్మ' వెంట బలరామయ్యా వెళ్ళిపోతాడు.
ఆస్తికోసం సుమతిని రామయ్య చేసుకుంటాడు. అనుమానంతో 'భర్త' ఆమెను వేధిస్తాడు. గాంధీ సుమతి కొడుకు. ఆమెకు కొడుకూ దక్కడు, భర్తా దక్కడు. భారతనారికి ప్రతీక.
సుమతి హిప్పీలతో స్పృహలేక పడివున్న తన కొడుకు గాంధీని చూచింది. 'నాయ్నా! గాంధీ!' అని చేతులు చాచి ఉరికింది. గాంధీ వినలేదు, లేవలేదు. "ఎవరు నువ్వు?" అడిగాడు గాంధీ. ఆ ప్రశ్న సుమతిమీద పిడుగులు కురిపించింది.
"నాయ్నా! గాంధీ! నేనురా! నేను నీ తల్లిని. తొమ్మిది నెలలు మోసి కన్నదాన్ని. న అరక్తం పంచుకొని పుట్టినవురా నువ్వు. నా పేగులో పేగువు, నేనే నువ్వురా, నువ్వే నేను అమ్మా! అనరా నన్ను అమ్మా! అను."
గాంధీ నుంచున్నాడు. 'మీ సంబరంకోసం చేసిందాంట్లోంచి మేం బయటపడ్డాం. దానికి ఇంత కథ ఇన్ని ముసుగులు! నీకూ నాకూ సంబంధం లేదు. నేను రాను, వెళ్ళిపో' అన్నాడు. ఒక అమ్మాయి వచ్చింది. గాంధీని లాక్కుపోయింది" ఇది హిప్పీ ఉదంతం!
ఎన్ని ఉద్యమాలు వచ్చినా, విపత్తులు వచ్చినా, విపరీత పరిణామాలు సంభవిన్చినా తామరాకుమీది నీటిబిందువువలె అంటక ముట్టక ఉన్నది సుమతి మాత్రమే! ఆమెకు ఏమీ లభించలేదు. ఆమెవి రిక్త హస్తాలు. ఆమెయే మన భారత నారి. ఆమె మన సంప్రదాయానికి ప్రతీక!
జనపదం రచన 30-5-1970లో ప్రారంభించి 20-8-1974లో పూర్తి చేశాను. నాలుగు సంవత్సరాల నిరంతర కృషి ఫలితం "జనపదం" ఈ కాలంలో వచ్చిన వివిధ రంగాల ఉద్యమాలను - అలజడులను, కల్లోలాలను అధ్యయనం చేయడానికి - అవగాహన చేసికోవడానికి ఎందరో మిత్రులు - కార్యకర్తలు సహకరించారు. యజ్ఞం వంటరిగా చేయలేం.
"జనపదం" 1974-75లో ఆంద్రజ్యోతిలో సీరియల్ గా వచ్చింది. అప్పటి ఆంద్రజ్యోతి సచిత్ర వారపత్రిక సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు - నవలకు పాఠకులనుంచి సరియైన స్పందన లేదనీ, తొలి భాగంతో ముగిస్తామనీ వ్రాశారు. అప్పుడు నాకు డొక్కా ఆపరేషను అయింది. ఆసుపత్రిలో ఆ ఉత్తరం చూచాను. ఎక్కువ శ్రమించి వ్రాసిన నవల అప్పటి కాలపు కథ జనపదం. దాన్ని పాఠకులు ఆదరించడం లేదంటే బాధ కలిగినమాట వాస్తవం.
అయితే, తొలిభాగం ముగియక ముందే సుబ్రహ్మణ్య శర్మగారి నుండి మరొక ఉత్తరం వచ్చింది. వారి పర్యటన సందర్భంగా - జానపదం నవలను పాఠకులు అపారంగా ఆదరిస్తున్న విషయం అర్ధం చేసుకున్నాననీ, సీరియల్ కొనసాగుతుందనీ వ్రాశారు. నవలలో మూడు భాగాలు సీరియల్ గా వచ్చాయి.
"జనపదం" నవలను నవయుగ పబ్లిషర్స్ వారు రెండు భాగాలుగా ప్రచురించారు.
నవల సీరియల్ గా వస్తున్నప్పుడు తొలి సంచిక చదివి పెద్దలు మద్దుకూరి చంద్రశేఖరరావుగారు ఉత్తరం వ్రాశారు:-
"ఈ రోజు ఆంద్రజ్యోతి వారపత్రిక సంచికలో మీ సీరియల్ నవల 'జనపదం' చదివాను. పూర్వస్మృతులు ఒకేసారి flash back అయినట్లుగా ఉత్తేజితుడనయ్యాను. "చిల్లరదేవుళ్ళు" "మోదుగుపూలు" లాంటి ఉత్తమ కళాఖండాలకంటే ఉత్తమ శిఖరంగా వెలుగొందబోతున్న కళాఖండంగా నాకు ద్యోతకం అయింది. మీ రచనలో నేను చదివింది కొద్ది భ్గమే అయినప్పటికీ మిమ్ములను అభినందించడానికి కారణమయింది."
ఆ తరువాత చంద్రంగారు పరమపదించారు!
"జనపదం" తొలిభాగపు ఆవిష్కకరణ 24-8-76 మంగళవారంనాడు శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషానిలయంలో జరిగింది. దేవులపల్లి రామానుజరావుగారు అధ్యక్షత వహించారు. ఇంకా సభ మొదలుకాలేదు. వారు నన్ను పక్కకు పిలిచారు. "మీరు గొప్ప విప్లవ నవల వ్రాసినారు. సర్కారు ఉద్యోగంలో ఉన్నారు. ప్ర్తమాదం కాదు గదా!" అని అడిగారు.
"రామానుజరావుగారూ! నేను రచయితగా బ్రతుక దలచాను - ఉద్యోగిగా కాదు. నేను రోడ్డుమీదినుంచి వచ్చాను. మళ్ళీ అక్కడికి పోగలను" అన్నాను.
"మీ సాహసమును అభినందించవలె" అన్నారు రామానుజరావుగారు.
నాటి సభలో 'జనపదం' వట్టి కోట ఆళ్వార్ స్వామిగారికి అంకితం సమర్పించాను. సజల నయనాలతో వట్టికోట యశోదమ్మగారికి శాలువా కప్పి "జనపదం" అందించాను. అందుకున్న యశోదమ్మగారి కన్నీరు నిలువలేదు.
రామానుజరావుగారు - అడపా రామకృష్ణారావుగారు - వాసిరెడ్డి సీతాదేవిగారు నవలను ఎంతగానో ప్రశంసిస్తూ ప్రసంగించారు.
ఆ సభలో మా అన్నయ్య డాక్టర్ దాశరథి మాట్లాడారు. వారు ఆ రోజు నా జన్మదినం అని వెల్లడించి, నాకు ఒక పెన్ను బహూకరించడంతో సభలో ఉత్సాహతరంగాలు ఉవ్వెత్తున లేచాయి. అన్నయ్య "జనపదం" గురించి గొప్పగా మాట్లాడారు.
ప్రచురణ కర్త ఆళ్ళ సాంబశివరావుగారి కృతజ్ఞతలతో సభ ముగిసింది.
"జనపదం" నవలను పత్రికలు ప్రశంసించాయి. "జనపదం గొప్ప పుస్తకం అంటే చాలదు. కాని అంతకంటే ఏమనాలి? ఈ బాణుని కాదంబరితో ఆంధ్రులు మత్తిల్లిపోవాలి, పోతున్నారు కూడా" - ఆంద్రజ్యోతి వారపత్రిక - లత.
'ఈ ఉద్యమాల పరిణామాలవల్ల ఒక గ్రామం తెలంగాణంలో ఎంత క్షోభకు, ఎటువంటి సంఘటనలకు స్థావరమైందో నవలా రచయిత అతి సూక్ష్మవిషయాల లోతులకుపోయి తమదైన ఒక ప్రత్యేక శైలిలో రచన చేశారు.' - ఆంద్రప్రభ వారపత్రిక - రాడికల్ 19-12-76.
"దేశంలో భూసమస్య పరిష్కారం కానంతవరకూ, దున్నేవారికి భూమి దక్కనంత కాలం జనపదంలాంటి నవలలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. దేశంలో సోషలిజం వచ్చేవరకూ ఇది అనుభవాలు పొదిగిన సాంఘిక నవలగా ఉంటుంది. సోషలిస్టు వ్యవస్థ ఏర్పడిన తరువాత ఇదీ, ఇకముందు రంగాచార్య కలం నుంచి ఉద్యమాలే ఊపిరిగా వెలువడే నవలలూ చారిత్రక్జాలు అవుతాయి. ఆ సత్తా అతనికి కలానికి ఉంది. ఉద్యమకాంతులకు ఎంత చక్కటి కళా సమన్వయం!" - ఈనాడు - ఏబికె -
28-9-76.
"రచయిత ఉద్రేకి. రచనలో ఉద్విగ్నత ఉంది. ఆవేశం ఉంది. చిత్తశుద్దికి లోటులేదు. వీటన్నిటా పాఠకుడు రచయితను ఆహ్వానిస్తాడు. ముందే వివరించినట్లు వస్తువును ఎన్నుకోవడంలో రచయిత కొత్తబాట ఎన్నుకున్నారు. జీవితాన్ని విశ్లేషించే ప్రయత్నం సాగింది. అందుకవసరమైన శిల్పం రచయితలో కనిపిస్తుంది."
ప్రజాశక్తి - శ్రీహరి, 21-11-1976.
"కవితలో శ్రీశ్రీగారు నూతన పంథాలు తోక్కినట్లే నవలలో దాశరథి రంగాచార్యగారు అంతకంటే సరికొత్త మార్గాన్ని శోధించేరని జానపదం నవల చదివిన ప్రతి పాఠకుడు భావించక తప్పదు." - ఆంద్రభూమి, 12-12-76.
'జనపదం' గురించి వివిధ పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు వచ్చాయి. 'జనపదం' పరిశోధనకుగాను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంవారు Ph.D ప్రధానం చేశారు.
ఒకసారి కడపలో ఏదో సభకు వెళ్ళాను. కారు దిగుతున్నాను. జి. ఎన్. రెడ్డిగారు చూచారు. పరిగెత్తుకు వచ్చారు. నన్ను కౌగలించుకున్నారు. 'గొప్ప నవలలు వ్రాశారు' అన్నారు. రెడ్డిగారు అప్పుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధిపతి. వారు, కుమారి ప్రేమావతితో "చిల్లరదేవుళ్ళు" M.Phil చేయించారు. ఆమెతోనే 'దాశరథి రంగాచార్య రచనల్లో జనపదం' అనే విషయంమీద Ph.D చేయించారు. ఈ పరిశోధనలో కేతు విశ్వనాథరెడ్డిగారు ఎంతో సాయపడినారు. G.N. రెడ్డిగారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నపుడు కుమారి డి.ఎం. ప్రేమావతికి డాక్టరేటు వచ్చింది. తరువాత G.N. రెడ్డిగారు ఆకస్మికంగా పరమపదించారు.





