Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
'మోదుగుపూలు' ప్రజాపోరాటాల్లో ప్రాణాలర్పించిన పవిత్రాత్మలకు అంకితంగా సమర్పించాను.
'మోదుగుపూలు' అందం అయిన బాపూ వేసిన ముఖచిత్రంతో 1971, 76, 85లలో మూడు ముద్రణలను 'విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్' వారు ప్రచురించారు.
'మోదుగుపూలు' రేడియో నాటకం 19-7-1984న ప్రసారం అయింది. శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు నిర్వహించారు. నాటకంలో అనేక ఘట్టాలు శ్రోతలను కదిలించాయి. మంచి స్పందన వచ్చింది.
రేడియో నాటకం విన్నవారిలో కొందరు 'మోదుగుపూలు' సినీమా తీస్తామని వచ్చారు. గోపాలకృష్ణగారు ఎక్కువసార్లు వచ్చారు, శ్రద్ద కనబరచారు. 'క్రాంతి పిక్చర్స్' వారికి సినీమా హక్కులు ఇచ్చాను. సంభాషణలు వ్రాసి ఇచ్చాను. వారు పాటలు రికార్డు చేసారు. కొన్ని సీనులు చిత్రీకరించారు. అంతటితో ఆగిపోయింది.
'మోదుగుపూలు' గురించి పరిశోధన జరిపారు శ్రీ P.S. ప్రకాశ్ తెలుగు విశ్వవిద్యాలయం, వారికి M.Phil ప్రదానం చేసింది.
ప్రగతిలో "చిల్లరదేవుళ్ళు" "మోదుగుపూలు" సీరియల్స్ వస్తున్నప్పుడే సోదరి వాసిరెడ్డి సీతాదేవిగారి 'సమత' 'వైతరణి' సీరియల్స్ గా వచ్చాయి. అప్పటినుంచీ మాకు మైత్రి ఏర్పడింది. కొంతకాలం వారు మా కుటుంబంలో మసలారు. నాకు అకాడమీ బహుమతి వచ్చిన తరువాత సంవత్సరంలో సీతాదేవిగారి 'సమతకు' అవార్డు వచ్చింది. మేము రచనలోనూ జీవితంలోనూ కొంతవరకు ఒకే అభిప్రాయం గలవాళ్ళం. మేమిద్దరం చాల సభల్లో సమావేశాల్లో మాట్లాడాం. 'జననాంతర సౌహృదాని' అంటాడు కాళిదాసు.
సోదరి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి 'మోదుగుపూలు' ఇంగ్లీషులోకి అనువాదం జరుగుతున్నదని చెప్పారు.
"చిల్లరదేవుళ్ళు" 1938 పూర్వపు తెలంగాణ జీవితాన్ని, "మోదుగుపూలు" 1942-48 తెలంగాణా జనజీవిత సంగ్రామాన్ని చిత్రించాయి. తరువాతి ప్రజాజీవిత చిత్రణకు రంగం సిద్దం చేసుకుంటున్నాను.
సరిగ్గా ఆ సమయంలో భారతదేశంలో "నక్సలైట్" ఉద్యమం మొదలయింది. యువకులనూ మేధావులను ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ తుపాకి గొట్టంల్లోంచి విప్లవం వస్తుందన్న మావో నినాదాన్ని గురించి ఆలోచన సాగించారు. ఆనాడు అది ప్రపంచాన్ని ముంచెత్తేట్లు కనిపించింది.
నేను ఒక సాయుధ విప్లవం - అది అవతరించిన సామాజిక పరిస్థితులను చూచాను - పాల్గొన్నాను అవగాహన చేసుకున్నాను. అప్పటి - ఇప్పటి సామాజిక స్థితిగతుల్లో సాయుధ విప్లవం విజయవంతం అవుతుందని నేను విశ్వసించలేదు. ప్రజాఉద్యమాలు ఒకరి విశ్వాసాలకోసం ఆగవు. కిస్ కె రోకారుకాహై సవేరా? పొద్దు పొడుపును ఎవడు ఆపగలిగినాడు?
రచయితగా జరుగుతున్న పోరాటాన్ని అర్ధం చేసుకోవడం నా కర్తవ్యం. రచయిత సమకాలీన ఉద్యమాల ప్రభావానికి దూరంగా ఉండరాదు, ఉండలేడు. ప్రత్యక్షంగానో - పరోక్షంగానో ఉద్యమాల ప్రభావం రచయిత మీద పడక మానదు. రచన చేయడం - చేయకపోవడం అతను స్పందించిన తీరును బట్టి ఉంటుంది.
నేను నక్సలయిట్ల ఉద్యమంతో ప్రభావితున్ని అయినాను. విశ్వసించలేదు. సమాజాన్ని ఒకసారి పరిశీలించి చూచాను. స్వాతంత్ర్యసముపార్జినా రంగంనాటి విలువలు - సమాజంలోని అన్ని రంగాల్లోనూ - అంతరించాయి. స్వార్ధం సంకుచితత్వం - అవినీతి - దోపిడి - దిసమొలతో నృత్యం చేస్తున్నాయి. సమాజంలో 'దోపిడి' ఒక జీవిత విధానం అయింది. రాజకీయ నేతలు - తమ స్వప్రయోజనం కోసం - మతం - కులం - ప్రనాథం - భాషలపేరా ప్రజలను చీల్చి తను పబ్బం గడుపుకుంటున్నారు! దీన్ని సవాలు చేసినవాడు - ఎదిరించినవాడు లేకుండా పోయాడు.
అలాంటి నికృష్ణదశలో నక్సలయిట్లు నిజాయితీతో సమాజన్ని ఎదిరించారు. ఒక్క చరుపు చరిచారు. అందరినీ ఆలోచించేటట్లు చేశారు! ఇది మహత్కార్యమే! అది విశ్వాసాలకు అతీతం అయింది. వాళ్ళ ప్రయత్నాన్ని కనీసం అభినందించడం కర్తవ్యం అవుతుంది.
సమాజాన్ని విభిన్న దృక్కోణాలతో పరిశీలించాను. నా పరిశీలనలో ఈ సమాజంలోనే తీవ్రవాదం సృష్టించే లక్షణాలు కనిపించాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యువతీ యువకులకు ఉన్నమార్గాలు రెండే. ఈ సమాజాన్ని మార్చడానికి నడుం కట్టి ప్రాణాలు అర్పించడం. ఇది నక్సలయిట్ల మార్గం. ఈ సమాజం మారదని తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇది హిప్పీల మార్గం ఉబాహ్యులను సిద్దం చేసిన సామాజిక స్థితిగతులను వివరించదలచాను.
ఈ పూర్వరంగంతో ఒక నవల ప్లాను చేశాను. ఒక సాయుధ పోరాటం ముగియనున్న 1948 నుంచి మరొక పోరాటం రాగలడం వరకు గల విస్త్రుతపరిధిలో రచన సాగించాను. రెండు సాయుధ పోరాటాల మధ్య ఉద్యమాల పేరా అనేక అలజడులు వచ్చాయి. ఈ సందర్భంలో నిజాయితీగల భూదానోద్యమం లాంటివి వచ్చాయి. అమ్మలు - బాబాలు, మతకలహాలూ - ప్రాంతీయ ద్వేషాలు వచ్చాయి. అన్నింటినీ - 'పద్మపత్ర ఇవాంభసా' తామరాకు మీద నీటిబొట్టువలె - వివరించాను. నా స్వంత అభిప్రాయాలు రుద్దడానికి ప్రయత్నించలేదు. నిజాయితీగల నక్సలయిట్లు ప్రకాశం - గీత సిద్దం కావడానికి దారి తీసిన పరిస్థితులను వివరించాను. ఆత్మవినాశానికి సిద్దం అయిన 'గాంధీ' పతనానికి దారితీసిన పరిస్థితులు వివరించాను. ప్రకాశం - గాంధీ ఏదోరకంగా రామునికి పుట్టినవాళ్ళే! రాముడు సామాజిక దౌర్భాగ్యాలన్నింటికీ ప్రతీక!
ప్రకాశం రామునికి పుట్టాడు. సాయుధపోరాటం నిర్వహించిన వీరభద్రం పోషణలో పెరిగాడు. సాయుధపోరాటం అణచడానికి అనేక హత్యలు చేయించిన పోలీసాఫీసరు కూతురు గీత! ఆమెకు ప్రకాశంతో మైత్రి!
ఈ నవలకు "జనపదం" అని పేరు పెట్టాను.
'జనపదం' అంటే పల్లె - దేశం ఈ నవలకు భూమిక మాత్రం తెలంగాణం. ఇది సకల భారత సమాజానికి ప్రతీక.
'జనపదం' జనులపదం. పదం పాట అవుతుంది. పదం అడుగు అవుతుంది.
'జానపదం' జనుల లక్ష్యం. 'పదం' చేరవలసిన స్థానం. 'పరమపదం' అన్నింటికి మిన్నఅయిన స్థలము జనపదం ప్రజల స్థలము.
జనపదంలోని పాత్రలన్నీ ఏదో ఒక విశ్వాసానికి - ఉద్యమానికి - దౌర్భాగ్యానికీ సంకేతాలు.
జానపదంలో కొన్ని పాత్రలకు విపరీత నామాలు వాడాను. బలరామయ్య బలం లేనివాడు. "రాముడు" సకల దుర్గుణ రాశి. "గాంధీ" దుర్మార్గుడు "గీత" విప్లవ ప్రతీక. "వీరభద్రం" వీర్యం ఉడిగినవాడు.
సుమతి - సరస్వతి - ప్రకాశం సార్ధక నామధేయులు.
"జనపదం" పెద్ద నవల. రెండు వాల్యూముల్లో 750 పేజీల నవల. తెలుగు పెద్ద నవలల్లో ఒకటి.
"జనపదం"లో అధ్యాయాలు లేవు. నవల నాలుగు భాగాలది. ప్రతి భాగం రెండు ఎన్నికల మధ్యకాలపు పతాకాన్ని వివరిస్తుంది.
తొలి ఎన్నికలో విప్లవ ప్రతీక వీరభద్రం గెలుస్తాడు.
రెండో ఎన్నికలో వీరభద్రం ఓడిపోతాడు. బలరామయ్య దొర గెలుస్తడు.
మూడో ఎన్నికలో బలరామయ్య ఓడిపోతాడు. స్వార్ధం కోసం ఎంత నీచానికయినా దిగజారే రామయ్య గెలుస్తాడు.
నవల చివరన ప్రకాశం వీరమరణం పొందుతాడు.
'విప్లవం వర్ధిల్లాలె' గట్టిగా కేకపెట్టాలనుకున్నాడు ప్రకాశం, పెట్టలేకపోయాడు.
రక్తంలో వేలు ముంచాడు. నేలమీద రాస్తున్నాడు ప్రకాశం.
'విప్లవం వర్ధి...." చేయి వాలిపోయింది. తల వాలిపోయింది.
విగతాత్మకు వీడ్కోలు చెపుతున్నట్లు తుపాకులు పేలుతున్నాయి!
"పేలుతున్నాయి తుపాకులు
పేలుతుంటాయి తుపాకులు" - ఇవి నవల చివరి వాక్యాలు.
బలరామయ్య దొర, సాయుధ విప్లవానికి ఓడినాడు, పారిపోయినాడు. పోలీసు చర్య జరిగింది. సాయుధ పొలేఉస్లథొ ఊరికి దిగినాడు.
అమృతవాణి బలరామయ్య ఆడబాస ఊరిలో అతనికి స్వాగతం చెపుతుంది. అసువులు బాస్తుంది.
రాముడు, బలరామయ్య - అమృతవాణిల సంతానం దొరను ఎదిరించడానికి సాయుధుల్లో చేర్తాడు. సాయుధుల డబ్బు ఎత్తుకొని వస్తాడు. బలరామయ్యను - కద్దరును ఆశ్రయిస్తాడు.
వీరభద్రం సాయుధుల నాయకుడు. ఉద్యమం విరమిస్తాడు. ఎన్నికల్లో తొలిసారి గెలుస్తాడు. విచిత్ర పరిస్థితుల్లో మంగమ్మను చేరదీయాల్సివస్తుంది. మంగమ్మ కొడుకు ప్రకాశానికి తండ్రి కావలసి వస్తుంది. తుదకు కార్మిక నాయకుడుగాకూడా ఓడిపోతాడు.





