Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    కోయల జీవిత వృత్తాంతాలు - విశేషాలు తెలుసుకొనడానికి పడుతున్న బాధలను గురించి భాయ్ జాన్ చిరంజీవికి ఉత్తరం వ్రాశాను. వారు వ్రాసిన జవాబు రచయితలందరికీ వర్తిస్తుంది.
    
    "వ్రాస్తున్న నవల - వేదనలేందే వేదం కాదు కదా! ఎన్నో దృశ్యాలు మనస్సునీ, కాలాన్నీ కల్లోల పరుస్తాయి. ఇన్ని ఆలోచనల్నీ వేదనలనీ చీల్చుకుని, దూసుకుని వచ్చిందే కవిత - లేదా మరొకటి."    
    
    "వ్రాయి, మనస్సు ఉష్ణజలకాసారం కానీయ్, వ్యధార్త జీవుల ఆక్రందనల కొక రూపం రానీయ్, మూగ జీవుల మూగకళ్ళకి, మూగబాసకి వెలుతురూ, ధ్వనినీ కల్పించు, అది లక్ష్యం. విడిచిన బాణాలు వెనక్కురానీకు. గుచ్చుకోవలసిన చోట గుచ్చుకోనీ, చండప్రచండ వాతూలహతికి - పండుటాకులు ఎండుటాకులు రాలనీ, పోనీ ప్రతి అధ్యాయం - ప్రతి పూట మానవేతిహాసాన్ని ప్రతిబింబించనీ! నెత్తురోడ్చే కళ్ళలో, లోలో రేపటిపై ఆశ చిగురించనీ, రేపటి కలలు ఎదగనీ, పెరగనీ! ఏ ఇనుప చేతులు వాటిని దునుమలేవని రుజువుచేయ్. ప్రణయగాధావల్లరి పఠిస్తున్న ఈ తరానికి ప్రళయ ఝంఝానిలం తాకనీ!"
    
    కోయదొరల మథురాతిమధుర జీవిత విశేషాలు మూటకట్టుకుని గార్ల జాగీరులోని పినిరెడ్డిగూడెంనుంచి సికిందరాబాదు చేరుకున్నాను. ఆంధ్రప్రభలో 'మాయజలతారు' కన్న ముందు ప్రగతిలో మోదుగుపూలు రావాలని ఆశయం! పెద్దలు చంద్రగారిని నిరాశపరచారాదు, అదీ లక్ష్యం!
    
    'మోదుగుపూలు' రచన 7-2-1970న ప్రారంభించాను. రాత్రింబవళ్ళు వ్రాశాను. 18-5-1970న - అంటే, సుమారు నూరురోజుల్లో పూర్తిచేశాను.
    
    'మోదుగుపూలు' మేము గార్లలో నిర్వహించిన పోరాటగాధకు కళారూపం మాత్రమే! అందువల్ల రచనా కాలంలో అందులో లీనం అయిపోయాను. ఒక అనంత సానుభూతి పొందాను. ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక స్పందన - అది వర్ణనాతీతం!
    
    'మోదుగుపూలు' పాత్రలు సుమారు వాస్తవాలు. అవి జీవం పోసుకున్నాయి! నా రచనతోపాటు ఎదిగాయి. ఒక దశలో అవి నా కాలానికి లొంగలేదు, నేను చెప్పినట్లు వినలేదు. ఎదురు తిరిగాయి! భీష్మించాయి!! అప్పుడు వాస్తవంగా కోపం రావాలి! నాకు ఆనందం కలిగింది! ఆడాలనిపించింది. పాడాలనిపించింది! నేను సృష్టించిన పాత్రలకు వ్యక్తిత్వం వచ్చింది. అవి స్వతంత్రిస్తున్నాయ్! ఎంత సంతోషం! మనం కన్నబిడ్డలూ అంతే!
    
    'మోదుగుపూలు' రచనలో అనేక అనుభవాలు - ఉసిళ్ళపుట్టలా ముసురుకుంటున్నాయి! అన్నీ చెప్పను. ఒక్కటి మాత్రం చెప్పకుండా ఉండలేను:
    
    తాసిల్దారు ఇంటిముందరి కట్టుగొయ్యకు వడ్డెర పీరయ్యను కట్టేశారు. విపరీతంగా కొట్టారు. రక్తపు ముద్ద అయినాడు. కట్టుగొయ్యవాడు గోరీలగడ్దకే పోతాడు. ఇది మామూలు కాని, ఈ కొలిమిలోంచి విప్లవం రాజు కోవాలి! అందుకు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి???
    
    మూడురోజులు నిద్రాహారాలు లేవు. సిగరెట్టు పెట్టెలు పెట్టెలు భస్మం అవుతున్నాయి! టీ బిందెల కొద్ది తాగుతున్నాను. ఆలోచన రాదు, రాదు. ఆ బాధ - ఆవేదన - ఆ తపన - చెప్పరానివి! అది ప్రసవవేదన. నాకు పిచ్చెక్కుతుందని కమల భయం!
    
    ఒకనాటి రాత్రి పడుకుని ఉన్నాను. నిద్రకాదు - కాని నిద్రలాంటి అవస్థ కిటికీలోంచి ఒక వెలుగు వెల్లువ అందులోంచి శిలువలు - శిలువలు వరుసగా వస్తున్నాయి. నాలో ప్రవేశిస్తున్నాయి. అలా కొంతసేపు జరిగింది. మెరుపులా ఆలోచన వచ్చింది! ప్రసవం జరిగిపోయింది! ఆనందమే - ఆనందం!
    
    మోదుగుపూలునుంచే ఉటంకిస్తాను:-
    
    " "తమ్ముడూ నాగేశ్! ఇన్ని శతాబ్దాల తరువాత ఒక ప్రాణిని గురించి తపించేవారు ఈ రోజు వెలిసినారు. ఇది తక్కువా? ఈ ఆవేదన అందరిలో వస్తే నువ్వనుకున్న విప్లవం దానంతట అదే వస్తుంది. ఏం చెయ్యాలి? ఇదే నేను ఆలోచిస్తున్న."
    
    "బాగా ఆలోచించు, మంచి నిర్ణయానికిరా" నాగేశ్.
    
    "అందుకోసమే ఇంత తపన. తమ్ముడూ! కాస్త ఓపికపట్టు"
    
    మళ్ళీ మౌనం వెలసింది. కాని అందులో భయం లేదు, ఆవేదన ఉంది, తపన ఉంది, తపస్సు ఉంది.
    
    అమాంతంగా ఆలోచన వచ్చేసింది రఘుకు. నాగేశ్ భుజాలు పట్టుకొని ఊపుతూ అన్నాడు:-
    
    "నాగేశ్! ఈ రోజు గుడ్ ఫ్రైడే! క్రీస్తు శిలువకెక్కిన రోజు, అమరుడైన రోజు"
    
    నాగేశ్ వెర్రిగా చూచాడు. అతనికేమీ అర్ధం కాలేదు.
    
    "శిలువ క్రైస్తవులకు పవిత్ర చిహ్నం. దాన్ని చూచి వారు క్రీస్తుపడిన యతహనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పీరయ్య మనకు జీసస్, కట్టుగొయ్య మనకు శిలువ."
    
    "వహ్వా! మంచి ఆలోచన, అయితే ఏంచేద్దమంటరు?"
    
    'పీరయ్య సమాధి నిర్మించాలె. దానిమీద కట్టుగొయ్య పాతాలె. దాన్ని చూచి ప్రజలు తమ బాధ్యత గుర్తించాలె. అది దౌర్జన్యానికి చిహ్నం కావాలె. రాక్షసత్వానికి సమాధి కావలె. ఏమంటరు?"
    
    'ఇన్కిలాబ్ జిందాబాద్' అన్నాడు నాగేశ్ పిడికిలి బిగించి.
    
    అలా ముగించిన "మోదుగుపూలు" తొలుత భాయి జాన్ కు చూపించాను. కాస్త విసుక్కున్నారు, చిరాకు పడ్డారు. లాంఛనంగా 'మంచి నవల వ్రాశావు' అన్నారు. ఒక్కొక్కసారి మనిషి వ్యక్తిత్వం గుణాలను - సిద్దాంతాలను - తత్వాలను - మతాలను మూసేస్తుంది! గ్రహణం పట్టిస్తుంది!! రచన విషయంలో తమను సంప్రదించలేదని భాయిజాన్ అలక!!! సంప్రదించకపోవడానికి కారణం "మాయజలతారు."
    
    నేను చంద్రంగారిని సంతృప్తిపరచగలిగాను. 'మాయజలతారు' కన్న ముందుగానే 13-11-70 నుంచి ప్రగతిలో 'మోదుగుపూలు' సీరియల్ ప్రారంభం అయింది. 5-3-1971న ముగిసింది. 'మాయజలతహరు' ఆంద్రప్రభలో 6-1-1971న మొదలయి 14-5-1971న ముగిసింది.
    
    'రఘులాంటి వ్యక్తి ఎలా మార్పుచెందుతూ వచ్చాడో చిత్రీకరణ బావుంది. మంగలి రాముడు వగైరా దుర్భరజీవితాన్ని సహించలేక చిరవకు ఎలా బ్రతుకుదెరువుకోసం సాహస చర్యలకు దిగారో సహేతుకంగా సహజంగా నిరూపించాడు. కథాగమనంలో పాత్రల స్వభావాలు ఎలా మారుతూ వచ్చాయో చిత్రించడంవల్ల రచయిత అభిప్రాయాలు పాత్రలపై రుద్దుతున్నాడనే భావం పాఠకునికి కలుగదు. అదే ఉత్తమ రచనా విధానమని నా అభిప్రాయం - అందుకు మీకు అభివందనాలు."
    
                     - మద్దుకూరి చంద్రశేఖరరావుగారు - ప్రగతి సంపాదకులు, 2-11-70.
    
    "మా చండ్ర రాజేశ్వరరావుగారు మిమ్ములను ఆంద్రగోర్కీ అన్నారు. ఇక ఆ స్థాయిని మీరు ముందు ముందు నిలుపుకోవలసిన బాధ్యత మీ పైన పడిందన్నమాట! అందుకు సంసిద్దులుకండి."     -నిడమర్తి ఉమారాజేశ్వరరావు, 3-11-71.
    
    "Tales of great heroism are told with a passion for liberty and truth. The local colouring is genuine"
    
                                        -A chanta Janakiram, Indian Express, 8-2-1972.
    
    "నవలాసాహిత్యంలో పీరియడ్ నావెల్స్ అనే విభాగం ఉన్నట్లు పేర్కొంటారు. వాల్టర్ స్కాట్ 'వేవర్లా' నవలలు ఆ జాతికి చెందినవే. స్కాటిష్ చరిత్రలోని ఉజ్వల ఘట్టాలను నవలలుగా రచించాడాయన. "చిల్లరదేవుళ్ళు", "మోదుగుపూలు" నవలలు ఇటీవలి చరిత్రకు సంబంధించినవినా వాటిని పీరియడ్ నావెల్స్ గా పేర్కొనాలి. విప్లవోద్యమ చరిత్రకు ఇలాంటివి అవసరం. అది 'ఘాటెక్కిన గంధకధూమం.' ఆ కీలలూ, దూమమూ జగమంతా వ్యాపించాలి - వ్యాపిస్తాయి."
    
                                                                          -సృజనరహి, జనవరి, 1972.
    
    విప్లవోద్యమ నిర్మాతల్లో ఒకరు కె.జి. సత్యమూర్తి బహుశః 1975-76 లో వారు అరెస్టయ్యారు. వారిని ముషీరాబాదు జేల్లో ఉంచారు. వారిని చూడాలని గిరిగారికి చెప్పాను. వారు జెలు అధికారులతో మాట్లాడారు, ఏర్పాటు చేశారు.
    
    గిరి, నేను మిఠాయిలు తీఉస్కుని జేలుకు వెళ్ళాం. సత్యమూర్తిగారిని ఒక గదిలో కలిశాం. 'సత్యమూర్తి'ని చూడ్డమే నా సంకల్పం. చర్చించడం కాదు, గిరి -సత్యమూర్తి మాట్లాడుతున్నారు, నేను చూస్తూ కూర్చున్నాను.
    
    'ఇతను ఎవరో తెలుసా. మా గురువు - దాశరథి రంగాచార్య' అని గిరి పరిచయం చేశారు. అది విన్న సత్యమూర్తి చప్పున లేచారు. వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకున్నారు. " 'మోదుగుపూలు' గొప్ప విప్లవ నవల వ్రాశారు. మేము అండర్ గ్రౌండులో ఎంతో ఉత్సుకతతో సీరియల్ చదివాం" అన్నారు. ఇంకా ఎంతో పొగిడారు సత్యమూర్తిగారు.
    
    'తొలి నవలతోనే నవలారచయితలలో అగ్రేసరులయి సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన శ్రీ రంగాచార్యులవారు ఈ రెండవ నవల 'మోదుగుపూలు'తో భారతీయ నవలా సాహిత్యంలోనూ పెద్దపీట వేసుకున్నారు.' - డాక్టర్ తిరుమల రామచంద్రంగారు "మోదుగుపూలుకు సువాసన" సమకూర్చిన పీఠికనుంచి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.