Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    ఆ తరవాత పోటీలకు పంపడం మానేశాను. పోటీల విషయంలో నా అనుభవం మనవి చేస్తాను.
    
    ప్రభ సచిత్ర వారపత్రిక హైదరాబాదు వచ్చిన కొత్త రోజులు విద్వాన్ విశ్వం సంపాదకులు. నవలల పోటీకి నన్ను ఒక న్యాయ నిర్ణేతగా నియమించారు. నాకు అందిన పది నవలల్లో ఒకటి - రెండు- మూడు బహుమతులకు నిర్ణయించాలి. మిగతావి సాధారణ ప్రచురణలు అవుతాయి.
    
    నేను ఒక 'విలువైన' నవలను ప్రథమ బహుమతికి సూచించాను. రెండవ నిర్ణేతలు అడపా రామకృష్ణారావుగారు వారూ అదే సూచించారు. మూడవ నిర్ణేత పేరు గుర్తులేదు. వారూ అదే సూచించారు.
    
    విశ్వంగారు నవల విలువ విషయంలో ఏకీభవించారు. పత్రిక పాలసీ విషయం వ్యాపార విషయం వివరించారు. మరొక నవల సూచించారు. మేము ససేమిరా అంగీకరించాలేదు. మేము సూచించిన నవలకే ప్రథమ బహుమతి ఇచ్చారు. కాని దానికి పాఠకుల నుంచి 'స్పందన' లేదు. మరుసటి సంవత్సరంనుంచి సమాధానపడ్డాం. విశ్వంగారు ఉన్నన్నాళ్ళు నేను న్యాయ నిర్ణేతగా ఉన్నాను.
    
    చంద్రంగారినుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. నాకు సిగ్గు అనిపించింది. మరొక నవల వ్రాసి ప్రగతికి ఇవ్వాలని సంకల్పించారు. గార్లలో మేము జరిపిన పోరాటం ఇతివృత్తంగా ఒక నవల ప్లాను చేశాను. అందులో నవాబుల విశృంఖల జీవితం - మైదానప్రజల జీవితం, ఉద్యమం - ఆటవికుల ప్రాకృతిక జీవనం, వారి పోరాటం చిత్రించాలనుకున్నాను. ఇది నేను రచించిన తెలంగాణ సామాజిక జీవిత చిత్రణలో రెండవ నవల అవుతుంది. దానికి 'మోదుగుపూలు' అని నామకరణం చేశాను. గత రెండు దశాబ్దాల్లో అడవులు అంతరించాయి. మోదుగులు - మోదుగుపూలు లుప్తం అయినాయి. అందువలన కొంత వివరణ అవసరం అయింది.
    
    1. పాలాశం సంస్కృత సాహిత్యంలో ప్రశస్తం అయింది. తెలుగు సాహిత్యంలో మోదుగుపూలకు సముచిత స్థానం ఉంది. 'పూచిన మోదుగుంబువుల పుక్కిటినుండి వసంత రాజు రక్తాచమనంబు సేయు సమయంబిది' అన్నాడు దాశరథి "రుథిరసంధ్యా" గీతంలో అందులోనే -
    
    'అగ్నిజ్వాలిక వోలిక
    నగ్నముగా నాట్యమాడు నవవాసంతో    
    ద్విగ్న పలాస ప్రసవా
    లగ్న జపాలక్త రక్తరమ కనుపించెన్' అన్నారు దాశరథి.
    
    2. మోదుగు వసంతంలో వళ్ళుదాచుకోకుండా పూస్తుంది. ఆకులుండవు - అగ్నికణికల్లాంటి పూలు తప్ప మోదుగు వనం పూసినప్పుడు రక్తాంబరం నెలకు వాలినట్లుంటుంది. మోదుగు ఎరుపు. క్రాంతికి - విప్లవానికి సంకేతం.
    
    3. మోదుగులు అడవిలోనే ఉంటాయి. ఆటవికులు - గిరిజనులు అడవుల్లోనే ఉంటారు. వారు కోపిస్తే నిప్పులు కురిపిస్తారు!
    
    "హోళికలో - వసంతోత్సవంలో - మోదుగుపూల రంగు చల్లుకుంటారు. అది అంటిందంటే బట్ట ఎరుపు వదలదు చిరగాల్సిందే! విప్లవవాది సహితం అంతే!
    
    అందుకు నా నవల "మోదుగుపూలు" అయింది. చిల్లరదేవుళ్ళు కొన్ని గుణపాఠాలు నేర్పింది. అందులో కులాలు సూచించే పేర్లు పెట్టాను. రామారెడ్డి - రామచంద్రరావు వంటివి. నేను తెలంగాణం పర్యటించిన సందర్భంగా 'ఆ పేరుకు రావు తగిలిస్తే సరిగ్గా మా దొరవుతడు' అనటం విన్నాను.
    
    అంతేకాక - ఒక కులం మొత్తానికి దోపిడిముద్ర వేయడం సరికాదు అనిపించింది. అందువల్ల తరువాత వ్రాసిన నవలల్లో పేర్లచివర కులాలను తొలగించాను.
    
    "చిల్లరదేవుళ్ళు" యాసలో ఎక్కువ ఉర్దూకలిసి పాఠకులకు కొంత క్లిష్టత ఏర్పడింది. అందువల్ల యాస మాత్రం ఉంచి - ఉర్దూను పలచబడేశాను.
    
    'మోదుగుపూలు'లో ఒక అధ్యాయం మైదాన ప్రజా జీవితం, తరువాతది కోయదొరల జీవితం వివరించాలని నిర్ణయించాను. కోయ దొరల జీవితంతో - పోరాట కాలంలో - నాకు పరిచయం ఉంది. కాని ఒక నవలలో వివరించాల్సినంత అవగాహన లేదు. అందువల్ల వారి జీవితం అధ్యయనం చేయడానికి కోయగూడేలకు వెళ్ళాను. దశాబ్దాల్లో గిరిజనుల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి, నేనూ మారాను. వారు నన్ను గుర్తించలేదు. నన్ను 'సర్కారుమనిషి' అనుకున్నారు. వారిని గురించి నాకు వివరించలేదు. నేను నిరుత్సాహపడింది వాస్తవం. ప్రయత్నం మాత్రం విరమించలేదు.
    
    అడవుల మధ్య ఉంది 'పినిరెడ్డిగూడెం' అనే పల్లె ఆ పల్లెలో ఉంటారు మా మిత్రులు పెంట్యాల చలమయ్యగారు. వారి ఇంట్లో మకాం వేశాను. అది మా ఇల్లే! నేను అతిథినీ కాను! చలమయ్యగారికి నా అవసరం విన్నవించాను. నిలువెల్లా నవ్వారు, పరిహాసం చేశారు. 'వాళ్ళ బతుకుల్ల ఏమున్నదయా నువ్వు రాయటానికి? గుమ్మతుగ మాట్లాడుతున్నావు' అన్నారు. అయినా వారిని విడువలేదు. నా వెంట గూడేలకు రావడానికి వప్పించాను.
    
    ఇద్దరం వెళ్ళాం, చెట్లకింద మంచాలమీద మేము - నేలమీద కోయదొరలు. నేను అడిగేవి దొరలకే వింతగా తోచాయి పెద్దలను పిలుచుకు వచ్చారు. పెద్దలంటే వయసుకు పెద్దలు వారికి వయసు తెలియదు, గుర్తులు చెపుతారు. నూరేళ్ళు దాటినవారు ఉన్నారు. వారికీ వివరాలు తెలుసు, చెప్పడం రాదు. అలా అనేక రోజులు అనేక గూడేలకు తిరిగాం. వారితో ఉన్నాం, తిన్నాం, పన్నాం, అలా అవుతేగాని వారు నమ్మరు. అట్ల కూసింత కూసింత కూర్చినం. మంకిడి సమ్మయ్య సిద్దిబోయిన రామయ్య - సిద్దిబోయిన లక్ష్మయ్య వివరాలు అందిచ్చిన్రు.
    
    "మా కతంత 'బడ్డె' చెప్పుతడు - బడ్డెనడుగుండి" అన్నారు వారు. కష్టపడి బడ్డెను పట్టుకున్నాం. 'బడ్డె' వాళ్ళ  పురోహితుడు. అతడు కొన్ని వివరాలు చెప్పాడు. అప్పటుకి అక్కడే ఆపాం. చాలరోజులయింది. పినిరెడ్డి గూడెం తిరిగి రానున్నాం.
    
    "రేయంత - కొండమీద - నెమళ్ళు - కూసినయి - వాన తగులుకుంటది - బిన్న గూటికి చేరున్రి" అని దొరలు మమ్ము సాగనంపిన్రు.
    
    'ఎండ బాగా కొడ్తుంటే వానంతా రేమిటి? పిచ్చివాళ్ళు' అనుకుంటూ నడక సాగించాం. ఇంకా ఊరికి చేరుకోకముందే జోరున వాన తగులుకుంది. తడిసి ఇంటికి చేరుకున్నాం.
    
    పశుపక్ష్యాదుల ప్రవర్తనలను బట్టి రుతువుల క్రమం తెలుసుకునే విద్య వారికి తెలుసు. ఈ విద్య కోసం కూడా ఎన్నో ప్రయోగాలు జరిగి ఉంటాయి. అది వంశ పారంపర్యంగా - సంప్రదాయబద్దంగా వారికీ అందుతున్నది. అవి మన సాంకేతిక పరిజ్ఞానం కన్న పరిపుష్టంగా ఉంటున్నాయి. ఎలుకలు - జిర్రపురుగులు ప్రవర్తన రానున్న భూకంపాన్ని తెలుపుతుందని చైనావారు రుజువు చేశారు. అది మానవులనుండి మనం గ్రహించవలసింది చాల ఉంది!
    
    రెండురోజులు విశ్రాంతి. మళ్ళీ బయలుదేరాం. అప్పుడు నక్కా సూరయ్య కోయాల పురాణగాధలను డోలు వాయించి వినిపించాడు. ఆ డోలు - ఆ విన్యాసం - ఆ కథ చెప్పు పద్దతి! ఓహ్ - హృదయంగమం!
    
    "నాగలోకంల నాగేంద్రునికి రాచపుండు పుట్టింది. పన్నెండేండ్లనుంచి బాధపెడుతున్నది. నాగేంద్రుడు కోయదొరలను పిలిచిండు. నయం చెయ్యమన్నడు తాము కోరింది ఇయ్యాలెనన్నరు దొరలు. అట్లనే ఇస్తనన్నడు నాగేంద్రుడు బెరంబోయిన రాజు సిరిబొద్దు చెట్టును తవ్విండు. రాచపుండుకేసి కట్టిండా, రాచపుండు నయమయిందా, నాగేంద్రుడు నిద్రపోయిండా, అట్లనే పన్నెండేండ్ల నిద్రపోయిండు."
    
    పన్నెండేండ్లకు నాగరాజు లేచిండు కోయ దొరలను కోరుకొమ్మన్నడు. బెరంబో యినరాజు ఏం కోరిండయా అంటే - నాగతంబళ్ల వాయిద్యం వాయించెటోడు కావాలెనన్నడు. వాడు నా ప్రాణం - నేనెట్ల ఇత్తును? అన్నడు నాగేంద్రుడు అట్లయితే మాట తప్పు - మేం పోతున్నమన్నడు బెరంబోయినరాజు. నాగేంద్రుడు మాట తప్పలేదు, కన్నీరు కారుస్తనే పంపించినాడు!
    
    "నాగేంద్రుడు వాడిని సాగనంపినాడు.
    వాడే కోయదొరలకు డోలువాడయినాడు -"
    
    అలా కథ  చెప్తూపోయినాడు సూరయ్య వారి విశిష్టత గమనించాలి. నాగేంద్రుని వారు ధనధాన్యాలు అడుగలేదు. వాద్యం అడిగారు మనసును కదిలించే వాద్యం ఆర్జించడానికి ఆదిమానవుని తపన గ్రహించాలి!
    
    వల్లభదాసు నరసింహ, గుంగుల ముత్తయ్య జముకుమీద ఆదిశక్తి కథ వినిపించారు.
    
    "జలప్రళయ మొచ్చింది. కలిఘ్రమంత మునిగిపోయింది. సముద్రంమీదికి కలకోడి వచ్చింది, గుడ్డు పెట్టింది, అది వేయేండ్లకు చితికింది. కలకోడి దుఃఖించింది ఇంకొక గుడ్డు పెట్టింది. అది వేయేండ్లకు చితికింది. కలకోడి దుఃఖించింది. మూడో గుడ్డు పెట్టింది, దానిమీద కూర్చున్నది, పొదిగింది, అప్పుడు గుడ్డు పగిలింది.
    
    పగిలిన పైచెక్క ఆకాశమయ్యింది
    కిందచెక్క బోర్లపడి బూమి అయ్యింది
    గుడ్డునుంచి కామధేనువు పుట్టింది
    ఈశ్వరుడు పుట్టిండు విష్ణు పట్టిండు"
    
    సృష్టిని గురించిన వారి ఊహ ఎంత సొగసుగా ఉంది! ఎంత అందంగా ఉంది!! కలకోడి అంటే కాలం అనే కోడి. ఆకాశం - భూమి ఏర్పడడాన్ని ఎంత అందంగా చెప్పాడు!!! వీటిని అన్నింటిని వివరంగా 'మోదుగుపూలు'లో చేర్చాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.