Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
కమల నలుగురు పిల్లలతో నలిగిపోయింది. 1965 సంక్రాంతి రాత్రి గుండెనొప్పి వచ్చింది. నా ప్రాణాలు పైపైనే పోయాయి! అర్ధరాత్రి! ఆధారం లేదు!! రిక్షా సహితం దొరకదు. ఏం చేయాలో తెలియదు. గిరిని పిలిచాను. పండుగ పార్టీలోంచి వచ్చాడు, గిరికి మిత్రుడు డాక్టర్ నరసింహన్ గిరి డాక్టరును లేపారు. ఇంటికి చేరుకున్నాం. డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. కమలను నిద్రపుచ్చాడు. కాని బయటికి వచ్చి నన్ను నానా చీవాట్లు పెట్టాడు. "నీకు బుద్ది లేదు. ఆమెకు తిండి పెడ్తున్నావా అని! ఆమె అలిసిపోయింది. పూర్తి విశ్రాంతి అవసరం."
అది డాక్టరుకు పేషెంటు విషయంలో ఉన్న ఆవేదన అని అర్ధం చేసుకున్నాను. కాని నాకు గుండెదడ హెచ్చింది. గిరి పార్టీకి లాక్కెళ్ళే ప్రయత్నం చేశాడు. తెల్లవార్లూ కమల పక్కనే కూర్చున్నాను. రెప్ప వాలలేదు. లోకం సాంతం అంధకారంగా కనిపించింది! కనీసం మిణుగురు లేదు. పిల్లలు నా పక్కనే పడుకున్నారు.
అయినా తెల్లవారింది. డాక్టర్ వచ్చారు. రాత్రి అన్నదానికి సారీ చెప్పారు. నాటినుంచి అతడు మా కుటుంబ సభ్యుడు అయిపోయారు. నన్ను అన్నను చేసుకున్నారు. గిరి జీపు ఇంటిముందు పెట్టాడు. తాను మా ఇంటినుంచి కదల్లేదు. పబ్బాశంకరయ్యగారు కొంత డబ్బుతెచ్చి ఇచ్చారు. వెదుక్కుంటూ వంటమనిషి లక్ష్మమ్మగారు వచ్చింది. ఇదంతా దైవికమే! "యోగక్షేమం వహామ్యహం" అన్నాడు కృష్ణభగవానుడు!
కమల సరిగ్గా నెలకు కోలుకుంది. నెల నేను ఆఫీసుకు వెళ్ళలేదు. కమల కదలడం ప్రారంభిస్తే నేను పూర్తి మనిషిని అయినాను. పిల్లల కళ్ళలో వెలుగు కనిపించింది. సంసారం మళ్ళీ దారిన పడింది.
వంటమనిషి లక్ష్మమ్మగారు వస్తువులు సంగ్రహించి ఉడాయించింది. అయితే ఉన్నన్నాళ్ళు కమలకూ - పిల్లలకూ పరిచర్యలు చేసింది. ఆమె వస్తు సంగ్రహానికి బాధపడలేదు! చెప్పి తీసికెళ్తే సంతోషించేవాళ్ళం!
నరసింహన్ -గిరి -చిరంజీవి -నేను మిత్ర చతుష్టయంగా కలిసిమెలిసి కాలం గడిపాం. జీవితంలో శకలం సాధించవచ్చు - మిత్రులు సమకూరాలి. 'నరుని కన్నుకంటే నారాయణుని కన్ను భ్రష్టుది' అనేది మా అమ్మ దైవం ఓర్చలేదు. 1971లో చిరంజీవి - 1973లో నరసింహన్ వెళ్ళిపోయారు!
తల్లికి సీరియస్ గా ఉందని టెలిఫోనులో విన్నారు నరసింహన్! అంతే రిసీవర్ తో విరుచుకుపడ్డారు! గతించారు! అంతటి మెత్తని మనసు వారిది!
మా తొలిబిడ్డ ఉదయశ్రీ డిగ్రీకి వచ్చింది. వరాన్వేషణలో పడ్డాం. అభినవ పోతన - మా బంధువు - వానమామలై వరదాచార్యులవారు సంబంధం కుదిరించారు. చెన్నూరు వారయినా కొదుమగుళ్ళ వీర రాఘవాచార్యులవారి ప్రథమ పుత్రుడు వీరమోహనాచార్యులు - ఇంజనీరింగ్ ఫైనల్లో ఉన్నారు.
ఉదయ - మోహన్ చూసుకున్నారు. మాట్లాడుకున్నారు. తరవాత వాళ్ళు పలకలేదు. తరవాత నచ్చలేదని కబురు వచ్చింది! అమ్మాయిపెళ్ళిగదా - పదిచోట్ల తిరగింది కాదు అనుకున్నాం. ఇంకా అన్వేషణకు ఉపక్రమించలేదు. వాళ్ళవాళ్ళు మా కుటుంబపు సంస్కారం - సంప్రదాయాన్ని గురించి మోహనుకు నచ్చచెప్పారు. మోహను వప్పుకున్నాడు. ఉదయ భీష్మించింది. 'మొదట నచ్చనిదాన్ని ఇప్పుడెలా నచ్చాను?' అన్నది. మేము నచ్చచెప్పే ప్రయత్నం చేశాం, ఫలించలేదు. మోహను స్వయంగా వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఉభయులూ అంగీకరించారు! ఇంత తేలిగ్గా సంబంధం కుదురుతుంది అనుకోలేదు!! అదీ దైవనిర్ణయమే!!
ఉదయ మోహనుల వివాహం 1971 మే 8 తెల్లవారు జామున జరిగింది. ఆ సాయంత్రం విందు ఏర్పాటు చేశాం. మహాకవులు దాశరథి - వానమామలై - శశాంక - కప్పగంతుల - చిరంజీవి - పోతుకూచి - భీమన్న వీనులవిందుగా కవితాశీర్వాదం మహోత్సవంగా జరిగింది.
అప్పగింతలే మమ్ములను ఏడిపించాయి! శాకుంతలంలో కణ్వుడు శకుంతలను సాగనంపిన ఘట్టం చదివినపుడల్లా ఉదయను పంపాల్సివస్తుందని గుండె కలుక్కుమనేది. సినీమాల్లో అలాంటి దృశ్యం వస్తే కళ్ళు మూసుకునేవాణ్ణి!
ప్రత్యక్షంగా ఉదయను అప్పగించడం! కమలా - నేను భోరున ఏడ్చాం. గిరి, మా అన్నయ్య సహితంగా ఎవరూ ఊరడించలేకపోయారు. వధువు - మా ఉదయ - కన్నతల్లి కమల కడుపుకు చల్ల మజ్జిగ రాస్తుంది. గడపలకు మజ్జిగ చల్లుతుంది. మాతో బంధం తెంచుకుని వెళ్ళిపోతుంది. ఉదయ మమ్ములను పట్టుకుని ఏడుస్తుంది! మేము ఓదార్చగలమా?
అలా అత్తవారింటిది అయింది ఉదయ. ఇప్పుడు ఆ ఇంటినే 'మా ఇల్లు' అంటుంది! మేము వేరయిపోయాం!! అయినా మోహను - ఉదయ - ఉజ్వల్ కు మేమంటే అభిమానం, అనుబంధం.
1976లో విజయకుమార్ - మా పెద్దబ్బాయి - ఇంటర్ కు వచ్చాడు. అతడు అఖండ తెలివిమంతుడు అయినా చదువుమీద కేంద్రీకరించడు. కొన్నాళ్ళు ఇంగ్లీషులో పిల్లలకథలు వ్రాశాడు. పత్రికల్లో వచ్చాయి. ఇతర కార్యక్రమాలు ఎక్కువ. మాటల్లో మొనగాడు అతడు డాక్టరో - ఇంజనీరొ కావాలని - అందరివలెనే - మేమూ కోరుకున్నాం.
ఒకనాటి రాత్రి విజయకుమార్ రోడ్డుమీద పడిపోయాడని ఒక వార్త. వార్త విన్నాం. మా గుండెలు పగిలాయి. కమలా - నేనూ కాళ్ళకు చెప్పుల్లేకుండా - ఇంటికి బెడెం వేయకుండా పరిగెత్తాం. అతడు కనిపించలేదు. ఆస్పత్రిలో ఉన్నాడు అన్నారు. అట్లాగే ఉరికాం. విషం తాగాట్ట! డొక్క శుభ్రం చేస్తున్నారు. మమ్ములను చూచాడు, ఏడ్చాడు. డాక్టర్ తెలిసినవాడే! ప్రమాదం లేదన్నాడు, వార్డుకు మార్చారు, ఏ విషయమూ చెప్పడు. ఏడుస్తాడు! గండం గడిచింది! అదృష్టం అనుకున్నాం.
ఇంటికి వచ్చాం, అప్పుడు తెలిసింది అసలు విషయం ఒక పెళ్ళయిన పిల్లతో రొమాన్స్! పిల్లమొగుడు చూచాడు. ఏం జరుగుతుందో విదితమే కదా! వాళ్ళను బెదిరించడానికి విషం తాగుతానన్నాడు.
మరునాడు ఇంటికి తీసుకొనివచ్చాం. బెదిరిపోయాడు! తెలుగు మహాసభలకు అన్నయ్య వచ్చాడు. గిరిగారు ధైర్యం చెప్పారు. కొన్నాళ్ళకు మళ్ళీ మామూలు అయినాడు.
రాజకీయాలు రొచ్చు. అది ధనబలం, కండబలం ఉన్నవారి విలాసం. దేశభక్తితో మేం అన్నాతమ్ములం గుల్ల అయిపోయాం. అది మాకు తిండి పెట్టలేదు. కాబట్టి రాజకీయాల జోలికి మాత్రం పోవద్దని పిల్లలకు తొలినుంచీ చెపుతున్నాం. మగపిల్లలు మాతో చర్చించారు. వినలేదు.
డిగ్రీలో ఉండగా విజయకుమార్ యూనియన్ వైస్ ప్రెసిడెంటుగా ఎన్నిక అయినాడు. కాలేజి ఫంక్షనుకు ఆహ్వానం వచ్చింది. అది మాకు ఏమాత్రం ఇష్టం లేదు అయినా అతణ్ణి చిన్నపుచ్చ తలచలేదు. అందరం సమావేశానికి వెళ్ళాం.
మళ్ళీ ఒక ఉపన్యాసం ఇచ్చాను, మేము పడినపాట్లు వివరించాను. దేశభక్తి కాదు - కనీసం దేశం తెలియనివారు అధికారం హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయం వ్యాపారం అయిపోయింది. మనం డబ్బున్నవాళ్ళంకాము అని బోధించాను, వివరించాను.
"ప్రాప్తే శోషేవర్షే పుత్రం మిత్రవదా చరేత్" పదహారేళ్ళు వచ్చిన కొడుకును మిత్రునిగా భావించాలి అన్నారు. మిత్రునివలెనే సలహా ఇచ్చాను.
కమల ఒకనాడు కన్నీరు రాలగా అన్నది - "ఏమండీ! మనం వాణ్ణి చూచి ఓర్వలేకపోతున్నామటండీ!" నా బుజం మీద తలపెట్టి ఏడ్చింది! ఆమెను ఓదార్చడం కాదు. నా గుండె కకావికలయిపోయింది! "కన్నందుకు అనుభవించాలె" అని ఇద్దరం ఒకరిని ఒకరం ఓదార్చుకున్నాం!
మా చిన్నమ్మాయి సుధకు చదువు అబ్బలేదు. పదితో ఆగిపోయింది. చదువు అచ్చం సాధన వలన రాదు. సాధనకు అతీతం అయింది ఏదో కావాలి. సుధను ముందుకు నెట్టడం లాభంలేదు. ఆమెకు పెళ్ళి చేయాలని నిర్ణయించాం.
సుధ కాస్త నలుపు, లావు, చదువు లేదు. మేము మరింత కట్నం ఇచ్చుకోలేం. చాల తిరగాల్సి వచ్చింది. చాల సంబంధాలు చూచాం. కొన్ని వాళ్ళకు నచ్చలేదు. కొన్ని మాకు నచ్చలేదు. కాలం ఆగదు కదా! గడిచిపోతున్నది. కమలకు దిగులు! గుండెజబ్బు వచ్చింది, నానా తంటాలు పడ్డాం. భగవదనుగ్రహం - ఆమెకు తగ్గింది.
మోహను - ఉదయ సుధకోసం ఒక సంబంధం చూశారు. వాళ్ళూ కొదుముగుళ్ళవాళ్ళే. గోపాలాచార్యులవారు పండితులు సిద్దాంతి వారి రెండో కొడుకు సురోత్తమాచార్యులు డిగ్రీ చేశాడు. చిరు ఉద్యోగంలో ఉన్నారు. సుధను చూడ్డానికి వచ్చారు.
సుధ మొండికేసింది. 'నేనేం బొమ్మనా' వచ్చినవాడి ముందుకల్లా రావడానికి! రాను ఫొమ్మ'నేసింది. ఆమె అనేది నిజమే! కాని ఇది కుదురుతుందేమో! కమల-ఉదయ-నేను వప్పించాం.
సురోత్తమాచార్యులు సుధను చూశారు. 'లక్ష్మిలా ఉంది' అని వప్పుకున్నారు! కమల పరమానంద పడిపోయింది!
సురోత్తం వాళ్ళది కరీంనగరం జిల్లా జమ్మికుంట దగ్గరి శ్రీరాములపేట - చిన్నగ్రామం - నేను వెళ్ళాను. కుటుంబం మంచిది. అయితే ఉన్నవాళ్ళు కారు. సంబంధం స్థిరపరచేముందు 'మా పిల్ల ఈ పల్లెలో ఉండలేదు' అని స్పష్టం చేశాను, వారు అంగీకరించారు.





