Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అంతకు ముందు మా అన్నయ్య కూతురు పెళ్ళి మద్రాసులో ఒకటి మే 1977న నిశ్చయం అయింది. అందువల్ల మా అమ్మాయిపెళ్ళి 13 మే 1977 ఉదయంగా నిశ్చయించాం.
S.B. గిరి రెండోసారి వరంగల్లు M.P. అయినాడు. ఇందిరాగాంధీకి దగ్గరివాడయినాడు. మంత్రి అవుతాడనుకున్నాం. కాంగ్రెస్ తుడుచుకుపోయింది. వారికి ఒక కూతురువల్ల మనోవ్యధ పట్టుకుంది. గుండె నొప్పి వచ్చింది. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఏఫ్రెల్ 21 న చూచి వచ్చాను. ఏప్రెల్ 22 న మద్రాసుకు బయల్దేరాం. 23 న మద్రాసు చేరుకున్నాం. గిరి పరమపదించాడనే వార్త పత్రికల్లో - రేడియోలో - అన్నయ్య ఇంటికి ఫోనులో విన్నాను. అంతే - భూకంపం వచ్చినట్లూ - భూమి పాతాళంలోకి పడిపోతున్నట్లూ అనిపించింది, పడిపోయాను. అన్నయ్య డాక్టరును తీసికొని వచ్చాడు. డాక్టరు నాకు B.P. తగ్గిందన్నారు, మందులు ఇచ్చాడు. తరవాత జ్వరం వచ్చింది దుఃఖం - ఎవరిని చూచినా ఏడవడమే!
మా అన్నయ్య కూతురు ఇందిర పెళ్ళిలో కూర్చోలేకపోయాను. జ్వరంతో మందుమాత్రలు మిమ్గుతూనే రైల్లో సికిందరాబాదు చేరుకున్నాను. లేస్తే వళ్ళు తూలుతున్నది. కమల - పిల్లలు - కొందరు మిత్రులే పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్ళినాటి ఏర్పాట్లు అన్నీ - సుమారు - అన్నయ్యే చూసుకున్నారు.
సుధ - సురోత్తమూలా వివాహం వైభవంగా జరిగింది. విశాలతమం అయిన కస్తూర్భా కాలేజి ఉద్యానప్రాంగణం వివాహభూమి. రావి వేప చెట్లున్న ఉన్నతము, విశాలమయిన వేదిక విశాల వృక్షాలకిందనే అతిథులు ఆశీనులు, నేను అతికష్టంగా పీటలమీద కూర్చుని కాళ్ళు కడుగ గలిగినాను!
రచయితలు - రచయిత్రులు - కవులు - పెద్దలు - పెద్ద సంఖ్యలో వచ్చారు. భోజనాలు సాయంకాలం వరకూ జరుగుతూనే ఉన్నాయి! వాతావరణం ఎంత బావుందంటే - వచ్చిన సహృదయులు చెట్లకింద చాపలు పరచుకొని కూర్చున్నారు. వాళ్ళకు టీలు కాఫీల సరఫరా!
పెళ్ళి ఉదయం పదింటికి, అందువల్ల అనేకమంది సహృదయులు - పెద్దలు వచ్చారు. నేను సుస్తీగానే ఉన్నాను. అయితే అంత మిత్ర సంపద! అలాగే అందరిలో తిరిగాను పలుకరించాను, ముచ్చట్లు విన్నాను.
రాత్రికి మళ్ళీ అప్పగింతల సీను పునరావృతం తల్లి కడుపునకు చల్ల - ఇంటి గడపలకు చల్ల రాయడం ఒక సత్సంప్రదాయం. "అమ్మా! నాన్నా! నేను వెళ్ళిపోతున్నానని మీరు దుఃఖిస్తారు! మీరు దుఃఖ విముక్తులయి, మీరు చల్లగా - ఇల్లు చల్లగా ఉండండి" అనడం!
ఈ తడవ మాతోపాటు మగపిల్లలూ విలపించారు! ఇది ఒక విచిత్రం అయిన ఎడబాటు! పున్నమినాడు అస్తమించే సూర్యుడు పడమట - ఉదయించే చంద్రుడు తూర్పున శోభాయమానంగా ఉంటారు. సూర్యుడు క్రుంగుతున్నందుకు బాధయా? చంద్రుడు ఉధయిస్తున్నందుకు ఆనందమా?
ఆడపిల్ల మనకు దూరం అవుతుంది. అనుబంధాలకూ అనురాగాలకూ ఆత్మీయతలకూ దూరం కాదు!
పెళ్ళి ముగిసింది. సుధ అత్తవారింటికి వెళ్ళింది. మిగిలింది మేమిద్దరం - మగపిల్లలు ఇద్దరు! సందడి తగ్గినట్లు చిన్నబోయాం! "ఏమండీ! మనం వెళ్ళిపోయినంక - ఆడపిల్లలను పిలిచి - విస్తరేసి అన్నం ఎవరు పెడ్తారండీ?" అని బళ్ళుమంది కమల! నాకు దుఃఖం ఆగలేదు!
"మేం లేమా? ఎందుకు ఏడుస్తారు!" అని ఓదార్చారు విజయ - విరించి.
మళ్ళీ విజయ్ రొమాన్సులో పడ్డాడు. ఆ పిల్లపేరు నాగమ్మ అని పెట్టుకుందాం. మాకు దగ్గరి చుట్టం. సికిందరాబాదు అత్తిల్లు. అత్తా సతాయిస్తూందంటే ఆశ్రయం ఇచ్చాం. భర్త సహితంగా మా ఇంట్లోనే మకాం. పాముకు పాలు పోస్తున్నామని గ్రహించలేదు. భర్తలో కొంత బలహీనత ఉన్నట్లుంది - విజయ్ ను పట్టింది. విచిత్రం ఏమంటే - భర్త సహకరించాడు! ఇంట్లోనే సరసాలు! నేను ఎప్పుడూ ఇంట్లో ఉండను కదా! కమల వారించింది. ఆమె మీదకు ఎగబడ్డాడు విజయ్. అప్పటిదాకా కమల నాకు తెలియనీయలేదు. నేను భార్యాభర్తలను ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. వారు తమ ఇంటికి పోలేదు. వేరే కాపురం పెట్టారు. విజయ్ మకాం సుమారు అక్కడే!
ఈ పరిస్థితుల్లో విజయ్ B.Sc పాసయ్యాడు. అతణ్ణి ఇక్కనుంచి తప్పించాలనుకున్నాను. నానా తంటాలుపడి ఆంద్రవిశ్వవిద్యాలయంలో M.Sc సీటు సంపాదించాను. విజయ్ ను విశాఖలో ఉంచాం. అక్కడికీ చేరుకున్నారు నాగమ్మా - దాని మొగుడూ!
అది 1979. నేను విశాఖనుంచి వచ్చాను. నన్ను చూచి కమల నివ్వెరపోయింది! నేను చిక్కి శల్యం అయిపోయానట! డాక్టర్ బుచ్చిలింగం చూచారు. "మనసు పాడుచేసుకున్నావు. డయాబెటిక్స్ తెచ్చుకున్నావు" అన్నారు. వాటినుంచి మధుమేహం నన్ను వరించింది. దానికి విడాకుల చట్టం వర్తించదు.
1979 జూన్ 30 న మా నాయనగారు ఉభయ వేదాంత ప్రవర్తక విద్వాన్ దాశరథి వేంకటాచార్యులవారు ఖమ్మంలో పరమపదించారు. మా చిన్నమ్మ ఇటు మాకు తెలియపరచి, అటు దహనం చేయించింది. మేము వెళ్ళి బూడిద దర్శించుకున్నాం.
1898 - విళంబి ఆశ్వీజ శుక్ల సప్తమి గురువారంనాడు భద్రాచలంలో జన్మించిన మా నాయనగారు 30-6-1979 సిద్దార్ది ఆషాఢ శుక్ల షష్టి శనివారం ఖమ్మంలో పరమపదించారు. మా తాతగారినీ, నాయనమ్మనూ దహనం చేసిన మున్నేటి వడ్డునే మా నాయనగారూ దహనం అయినారు.
అన్నయ్య నేనూ సికిందరాబాదులో వైభవంగా - మా నాయనగారికి తీర్ధ తిరువధ్యయనాలు చేశాం. మా చిన్నమ్మ కొడుకులు లక్ష్మణ - విష్ణు ఖమ్మంలో వేరుగా చేసుకున్నారు.
1979 సెప్టెంబరు పదిన మా చిన్నమ్మాయి ప్రసవించి - ఆడపిల్లను కన్నది. ఆమె సహజ. ఆమెయే మాకు మనవరాలు. 1981లో ఉదయకు ఉజ్వల్ - 1987 లో సుధకు సమీర్ కలిగారు.
అదే సంవత్సరం ఒకనాటి రాత్రి విరించి బాల్కనీలో చదువుకుంటున్నాడు. తరవాత చూస్తే పుస్తకాలున్నాయి. విరించి లేడు! వస్తాడేమోనని చాలాసేపు చూచాం, రాలేదు. వీధిలోకి పరిగెత్తాం. పిల్లలు చెప్పారు - విరించిని ఎవరో కార్లో పట్టుకుపోయారట! కమల తల బాదుకొని ఏడ్చింది. ఆమెను ఇంటికి చేర్చాను. నాకు గుండెదడ మొదలయింది.
రాత్రి చాల అయింది. రాలేదు. తెలిసినచోటుకల్లా టెలిఫోను తిప్పాం. ప్రయోజనం లేదు. ఇద్దరం బాల్కనీలో భగవంతుని ప్రార్ధిస్తూ కూలబడ్డాం. అర్ధరాత్రి దాటింది. రక్తసిక్తం అయివచ్చాడు విరించి. కమల అతనిని చూచింది. విరుచుకుపడిపోయింది. నేను ఇద్దరిని చూచాను, శిలనైనాను. నేను తేరుకునేవరకు విరించి కమలను లేపుతున్నాడు. నేను డాక్టరును పిలుచుకు వచ్చాను. వారు విరించికి కట్టు కట్టారు, కమలకు తెలివి వచ్చింది.
తెలిసిందేమంటే - స్టూడెంట్స్ యూనియన్ కక్షలు. ఆ తరువాత విరించి కూడా స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంటు అయినాడు!
ముఫ్ఫయి అయిదు
వెలుగుల దారి:
1968 లో కమల పిల్లలను తీసుకుని తల్లిగారి సహితంగా వాళ్ళ గ్రామం - అడ్లూరు - వెళ్ళింది. భాయిజాన్ నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారు, మకాం అక్కడే పెట్టాను.





