Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    కూతురు తాను వెళ్తానంటుంది. తల్లితండ్రులు ఉంటే మరొక పిల్లను కనగలరు అంటుంది.
    
    బాలుడు కర్రపట్టుకు వస్తాడు ఎవడా రాక్షసుడు - నేను చంపుతానంటాడు.
    
    తరవాత భీముడు వెళ్ళడం -బకాసురుని చంపడం ఎల్లరు ఎరిగిన కథ.
    
    గమనించాల్సిందేమంటే - కుటుంబాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికయినా సిద్దం కావడం ఇది త్యాగం నేర్పిన కథ!
    
    పారిశ్రామిక విప్లవం మనిషికి వ్యాపారం మాత్రం నేర్పింది. మనిషిని, మనసును అమ్మకానికి పెట్టింది. పారిశ్రామిక రక్కసిని సామాజిక శాస్త్రం గిట్టదు. ఆ రక్కసి మనిషిని వెనక్కు నడిపించింది. త్యాగాన్ని త్యాగం చేయించింది. వ్యక్తిత్వం అనే వెధవపేరిట మనిషిని రాతికాలపు వంటరిని చేసింది. పాశ్చాత్యదేశాల్లో రాక్షస నాగరికత -మానవతా చిహ్నాలయిన వివాహం, కుటుంబాలను - విచ్చిన్నం చేసింది. ఇప్పుడు తల బాదుకుంటున్నది. దినవారాలు సంవత్సరీకాలూ జరుపుతున్నది.
    
    పాశ్చాత్యదేశాల సామాజిక స్థితి భయంకరంగా ఉంది. ఆదికాలం నాటివలె తండ్రిలేని బిడ్డలు తయారయినారు. సగానికి పైగా పెళ్ళికాని తల్లులున్నారు. స్త్రీ స్వేచ్చపేర పురుషుని 'జన్నె' కు వదులుతున్నారు. బాధ్యతారహితుని చేస్తున్నారు. నాగరికతపేర ఏ.సి. ఇళ్ళల్లో ఆదిమ నరుడు నివసిస్తున్నాడు. ఇది మానవునకు ప్రమాద సంకేతం! మానవతకు సమాధి సంకేతం! తస్మాత్ జాగ్రత్త - జాగ్రత్త!!!
    
    మనం అనదికలంగా - మనకు ఉన్న సంప్రదాయాల ఆధారంగా వివాహ - కుటుంబ వ్యవస్థలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాం.
    
    నాకు పన్నెండేళ్ళు - కమలకు ఏడేళ్ళు ఉన్నపుడు మాకు 1939-40లో పెళ్ళి జరిగింది. దేశభక్తి ఆవేశంలో ఎనిమిదేళ్ళు కమలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అదృష్టం కమలదే కావచ్చు అనేకసార్లు మృత్యుముఖంలోంచి బయటపడ్డాను. అనాదిగా వస్తున్న సంప్రదాయ కారణంగానే కమలను పరిగ్రహించాను. కాకుంటే ఆనాడు ఆడపిల్లలు కరువుకారు. అవకాశాలూ రాకపోలేదు. సంప్రదాయం నిగ్రహాన్ని ప్రసాదించింది. కమలా నేనూ 'వాగర్దావివ' జీవిస్తున్నాం.
    
    నాకు అతి చిన్నవయసులోనే కుటుంబ భారం నెత్తిన పడింది. అమ్మనూ - ముగ్గురు చెల్లెళ్ళనూ పోషించాల్సి వచ్చింది. ఆనాటినుంచీ స్త్రీ-పురుష వ్యత్యాసం కనబరచలేదు. స్త్రీ కష్టాలకే పుట్టిందనిపించింది. మా అమ్మ బ్రతుకు అలాంటిది. మా చెల్లెళ్ళను మగపిల్లలవలెనే పెంచాను. పెద్ద చెల్లెలు శకుంతలను గుంటూరు శారదనికేతనంలో చదివించాను. రెండో చెల్లెలు రమాదేవిని డోర్నకల్లులో చదివించాను. మూడో చెల్లెలు అరుణను మా ఆన్నయ్య చదివించాడు.డబ్బు విషయంలో మొదటినుంచీ నాకు అంత ఆసక్తి లేదు. వచ్చింది అప్పుడు అమ్మకు ఇచ్చాను. ఇప్పుడు కమలకు ఇస్తాను. నాకు దాపరికాలు లేవు. డబ్బు లేకుంటే బ్రతకలేం. అది నాకు తెలుసు కాని, డబ్బే సర్వస్వం అనేదానిమీద నమ్మకం లేదు.
    
    'ధనమూలమిదం జగత్' అన్నాడు వాల్మీకి. అంటే - అన్నింటికీ ధనమే మూలం అని అర్ధం కాదు. ఈ జగత్తు నిలువడానికి ఆధారభూతం అయింది సంపద అని అర్ధం. సమాజ వికాసానికి సంపద అవసరమే కాదు - అత్యంత అవసరం. వ్యక్తి విషయంలో ధనం అగ్నిలాంటిది. వంటకు - చలి కాహ్చుకోవడానికి పరవాలేదు. అంటుకుంటే మాత్రం తగలబెడ్తుంది.
    
    1957 లో సికిందరాబాదు చేరేవరకు మాకు ఒక్కతే పాప - ఉదయశ్రీ అప్పటికి ఆమెకు డబ్బు సంగతి తెలియదు. పదార్ధాలు కొనాలనీ తెలియదు. అన్నీ ఉచితంగా ఇస్తారనుకునేది. 'ఓ అయ్యా! అది ఇస్తావా? ఇది ఇస్తావా?' అని అడిగేది. అంతటి అమాయకురాలు. ఆమెను కాన్వెంటులో చేర్చాం. అప్పటికి ఇంకా పుట్టబోయే బిడ్డకు సీటు రిజర్వు చేసుకోవడానికి తల్లులు క్యూలో నుంచునే దుస్థితి రాలేదు. పదిరూపాయిలనుకుంటా - ఫీజు కట్టాం, చేర్చాం. యూనిఫాం, బూట్లు వేసుకొని స్కూలుకు వెళ్తుంటే ముచ్చటగా ఉండేది. అయితే ఇంకా మమ్మీ - డాడీ కల్చర్ అడుగుపెట్టలేదు. ఆమె అమ్మా - బాబూ అంటుంది.
    
    ఉదయ కాన్వెంటుకు బొట్టు పెట్టుకుని వెళ్ళేది. బొట్టు లేకుండా తిరిగివచ్చేది. చెమటకు చెరుగుతుంది అనుకున్నాం. కాదట - కాన్వెంటు వాళ్ళు చెరుపుతున్నారట! బొట్టుమీద అభిమానం కాదు. బలవంతంమీద మాట! కాన్వెంటు వాళ్ళతో పోట్లాడాను. ఉదయను సర్కారు బడిలో చేర్చాను. ఉదయ సర్కారు చదువుతోనే పదిహేనేళ్ళ వయసులో పన్నెండో తరగతి పాసయింది.
    
    మగపిల్లలని నాకు ప్రత్యేకమయిన ఆపేక్ష లేదు. కమలకు ఉంది. 1958లో పిల్లవాడు పుట్టాడు. మా అన్నయ్య పిల్లవానికి "భట్టర్" అని మా మాతామహుని పేరుపెట్టారు.
    
    నేను కుటుంబంలోనూ - దేశంలోనూ బానిసత్వం అనుభవించాను. స్వాతంత్ర్యం కోసం తపించాను. పోరాడాను. నాకు స్వాతంత్ర్యం విలువ తెలుసు. అందువల్ల కుటుంబంలో స్వేచ్చ ఇచ్చాను. అంటే - పూర్తి స్వేచ్చకాదు. క్రమశిక్షణకు లోబడిన స్వేచ్చ మాత్రమే!
    
    భట్టర్ ను స్కూల్లో చేర్పించడానికి తీసికెళ్ళాను. కాన్వెంటు స్కూలే - ఇంగ్లీషు మీడియమే! మమ్మీడాడీ కల్చరే! నా ఇష్టానిష్టాలు పిల్లలమీద రుద్దడం ఇష్టం లేదు. కాలాన్ని ఎదిరించడం అసాధ్యం. స్కూలువాళ్ళు భట్టర్ ను పేరు చెప్పమన్నారు. "విజయకుమార్" అన్నాడు. అతనికి భట్టర్ ఇష్టంలేదని గమనించాను, విజయకుమార్ స్థిరపరచాను.
    
    1959లో రెండున్నర పౌనుల అమ్మాయి - నెలలు నిండకముందే పుట్టింది. ఆమెను పెంచడం మాకు ఎంతో కష్టం అయింది. ఆమెకు పేరు పెట్టలేదు, చిట్టి అన్నాం. ఆమెను తరచు ఆస్పత్రికి తీసికెళ్ళాల్సి వచ్చేది. ఒకనాడు అర్ధరాత్రి వెళ్ళాం. చీటీ వ్రాయించాలి. 'నామ్ బోలో' అడిగాడు క్లర్కు. "చిట్టి" అన్నాను. "చిట్టీ లిఖ్తేభయి, నామ్ బోలో" అన్నాడు. చిట్టి అనే పేరుంటుందని ఆ తురకకు తెలియదు. "నామ్ హి చిట్టిహై" 'అజబ్ నామ్ హై అజబ్ లోగ్ హైఁ' అని తెలుగువాళ్ళపై వ్యాఖ్యవిసిరి చీటీ రాసిచ్చాడు.
    
    1961లో మరొక పుత్రకిశోరం జన్మించాడు. కమల ఆరునెలలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. నానా బాధలు పడ్డది. ఇంకా ఆమెను బాధపెట్టడం ఇష్టంలేక నేనే ఆపరేషను చేయించుకున్నాను. పిల్లవాడి పేరు 'విరించి' అని పెట్టాం. స్కూలులో చేరేపుడు అతహాడు ఆ పేరే చెప్పాడు. పేరు అనిష్టం కాదని అర్ధం చేసుకున్నాం కాన్వెంటులో అయిదో తరగతిదాకా తెలుగులేదు. ఆరవ తరగతిలో తెలుగు, డ్రాయింగు ఆప్షన్ అడిగారు. విరించి డ్రాయింగ్ ఆప్షను ఇచ్చాడు. అదిమాత్రం నేను అంగీకరించలేదు, బలవంతంగా తెలుగు చదివించాను.
    
    రెండో అమ్మాయికి 'సుధ' అని మా నాయన నామకరణం చేశారు. ఆమె కాన్వెంటు చదువు చదవలేకపోయింది. సర్కారు బడిలోనే పదివరకు చదివింది.
    
    మేము ఆడ, మగపిల్లల విషయంలో ఎలాంటి వివక్షత చూపదలచలేదు. అయినా ఆడపిల్లలు సర్కారు స్కూళ్ళు కాలేజీల్లోనే చదవాల్సివచ్చింది. మగపిల్లలు ఉత్తమ స్కూళ్ళు, కాలేజీల్లో చదివారు! ఇది యాదృచ్చికం!!
    
    కుటుంబ నిర్వహణ - సంసారం ఈదడం - సామాన్యం కాదు. ఏ సమాజం అయినా కుటుంబంమీదనే ఆధారపడుతుంది. రానున్న తరాలను తయారుచేసే బాధ్యత కుటుంబానిదే కాబట్టే ఆశ్రమాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమైంది.
    
    పిల్లలవిషయంలో తల్లి తల్లడిల్లిపోతుంది. ఇది ప్రకృతి సిద్దం. సకల జంతుజాలంలోనూ తల్లికి అంతటి అనుబంధం! ఇది ఒకరు విధించింది కాదు. ప్రకృతి సిద్దంగా వచ్చింది. సంతహనం పెరగడానికి, సృష్టి కొనసాగడానికి 'తల్లి తపన' అత్యవసరం.
    
    మానవ సమాజం ఏర్పడిన బంధంతో తండ్రికీ బాధ్యత సంక్రమించింది. అయినా తల్లి స్వచ్చందంగా వహించినంత బాధ్యత తండ్రి వహించలేడు.
    
    మా పిల్లల పోషణబాధ్యతకూడా చాలావరకు కమల వహించింది అనేది వాస్తవ సత్యం. పిల్లలను పిల్లిలా కరిచిపెట్టుకుని పెంచింది. తీరిక ఉన్నప్పుడు - ఇంట్లో ఉన్నప్పుడూ నేను పిల్లలతో గడిపేవాణ్ణి. వారి చదువు విషయంలో తప్ప ఏ విషయంలోనూ కఠినంగా ప్రవర్తించలేదు. నా భావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు వారిమీద రుద్దే ప్రయత్నం చేయలేదు. వారు అడిగిందానికీ - నాకు తెలిసినంతవరకు వివరంగా చెప్పాను.
    
    మేము భయపెట్టడానికి వ్యతిరేకులం. ముద్దు ముచ్చటతో - ప్రేమాభిమనాలతో పెంచాం. రామాయణం ప్రేమాదారం. ప్రేమాధార కుటుంబాలే పరిఢవిల్లుతాయని వాల్మీకి బోధించాడు, నిరూపించాడు.

    పిల్లలు స్కూలునుంచి రావడం ఆలస్యం అవుతే - వెళ్ళినవాళ్ళు సమయానికి రాకుంటే - తల్లడిల్లిపోయాం. కాలుకాలిన పిల్లిలా తిరిగాం. వారి కాలికి ముల్లుగుచ్చుకుంటే మా కంట్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు విలవిలలాడాం.
    
    మేం పడిన బాధలు పిల్లలు పడరాదు అనుకున్నాం. మా శక్తికిమించి వారికి సమకూర్చాం. వారికీ ఏ లోటూ రాకుండా ప్రయత్నించాం. మా ఆర్ధికస్థితి అంతమంచిదేంకాదు. అయినా అది వారికి తెలియనీయలేదు.    

    ఒకప్పుడు నాకు విదేశం వెళ్ళే అవకాశం వచ్చింది. "మీరు లక్షలు తెస్తరు. ఒక బిడ్డ దారి తప్పితే ఆ లక్షలు దారికి తెస్తవా? మీరు వెళ్లొద్దు, లక్షలు తేవొద్దు, ఉన్నదానితోనే కలో గంజో కలిసే తాగుదాం" అన్నది కమల. పిల్లలను గురించి అంతటి తపన ఆమెది! నేను ఆమె మాట కాదనలేదు!! పిల్లలతోటిలోకం లక్షల్నుమించిందే మరి!!!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.