Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
సి. నారాయణరెడ్డిగారు "ఘాట్ కే దేవతా" ఆవిష్కరించారు. "రంగన్న చిల్లరదేవుళ్ళే తెలంగాణపు తొలి నవల. అంకూర్ - నిశాంత్ - మా భూమి అన్నీ "చిల్లరదేవుళ్ళు"కు కాపీలే" అన్నారు.
సభలో గోపాలరావు ఎక్బొటె - రాధేశ్యాంశర్మ - కుట్టి మున్నగువారు అనువాదాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు.
దేవులపల్లి రామానుజరావుగారు భీమసేననిర్మల్ గారినీ - నన్నూ సన్మానించారు.
హైద్రాబాదు విశ్వవిద్యాలయం హిందీశాఖనుంచి యూసుఫ్ పాషాగారు చిల్లరదేవుళ్ళు - మైలాఅంచల్ - తులనాత్మక పరిశీలనచేసి M.Phil పొందారు.
చక్రవర్తి శేషాచార్యులవారు ఇంగ్లీషులో చిల్లరదేవుళ్ళు కథాంశాన్ని "I esser Deities" గా 'దక్కన్ క్రానికల్' లో పరిచయం చేశారు.
యువభారతి సాహితీసంస్థ ప్రముఖ తెలుగు నవలలను ఇంగ్లీషులో పరిచయం చేయపూనుకుంది. Telugu Novel పేర గ్రంథం ప్రచురించారు. అందులో "చిల్లరదేవుళ్ళు" గురించిన వ్యాసం చక్రవర్తి శేషాచార్యులవారు రచించారు.
చక్రవర్తి శేషాచార్యులవారు - ఎంతో అభిమానంతో - "చిల్లరదేవుళ్ళు" ఆంగ్లానువాదం చేశారు. మిత్రులు S.B గిరిగారు పార్లమెంటు మెంబరుగా ఉన్నప్పుడు ఆంగ్లానువాదం ప్రచురణకు ఎంతో ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించలేదు.
తెలుగు విశ్వవిద్యాలయంవారు "చిల్లరదేవుళ్ళు" ఇంగ్లీషు అనువాదం "Lesser Deities" ప్రచురించారు.
శ్రీ వెంకటేశ్వర - కాకతీయ - ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో "చిల్లరదేవుళ్ళు"పై పరిశోధనలు జరిగాయి. డిగ్రీలు లభించాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం M.A.కు, బెంగుళూరు విశ్వవిద్యాలయం B.A కు, కొంతకాలం "చిల్లరదేవుళ్ళు" పాఠ్యాంశంగా ఉండింది. ఉస్మానియా విద్యార్ధులు ఉద్యమం నిర్వహించి, "చిల్లరదేవుళ్ళు" M.A.కు పాఠ్యాంశంగా పెట్టించుకున్నారు.
Even Gods must die
But sovereign poetry
Remains
Stronger than death - "Guitar"
ముఫ్ఫయి నాలుగు
కుటుంబగోళం:
మానవునికి వ్యష్టిగా బ్రతకడం ఇష్టం. వ్యక్తిగా జీవించడం ఇష్టం. అతడు స్వేచ్చగా జీవించాలనుకుంటాడు. సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనుకుంటాడు. దేనికీ లొంగరాదనుకుంటాడు. నియమనిబంధనలు అతనికి నచ్చవు.
మానవ చరిత్ర అనంతం. "చరిత్ర" అనే పదానికే నాలుగువందలకు మించి వయసులేదు! అనంతకాలాన్ని ఈ చరిత్రతో కొలిచింది ఆవగింజంత! ఇది సాంతం కాదు. అంతంకాదు. అందాజా మాత్రమే!
తెలిసిన ఇసుమంత చరిత్రలో ఆదిమానవునికి హక్కులు లేవు, బాధ్యతలు లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు. అతనికి, ఆమెకు ఆహార - నిద్ర -భయ - మైధునాలున్నాయి. వాటిని పశువులా తీర్చుకున్నారు.
ఆమె - స్త్రీ శరీర నిర్మాణంలోనే భగవంతుడు పక్షపాతం చూపించాడు. భగవంతుడు మగవాడని కాదు. సృష్టి సాగవలసి ఉంది. అతడు - ఆమెలో ఒకరు పిల్లలను కనాలి. తప్పదు, అందువల్ల ఆ పని ఆమెకు అప్పగించాడు.
ఈ మహాకాలంలో 'తండ్రి' అనే పదంలేని కాలం ఉంది. మగవాడు తన లైంగిక అవసరం తీర్చుకున్నాడు. బయట పడ్డాడు, తల్లిగా ఆమె సకల బాధలు పడింది. సంతానాన్ని పెంచింది. అందుకే కథలన్నీ స్త్రీలవే!
సామాజికశాస్త్రం అనే పదం తెలియకపోవచ్చు - మానవ మేధస్సు ఈ పక్షపాతం - అన్యాయాన్ని సహించలేదు. మగవానికి ముక్కుతాడు వేసింది, లాగింది. తండ్రిని గుర్తించడానికి 'వివాహం' ఏదో రూపంలో ఏర్పరచింది. ఇది సులభంగా ఏర్పడి ఉండదు. ఎందరో నిరంతరం వేల సంవత్సరాలు కృషి చేసి ఉంటారు!
మానవజాతి పురోగతి తొలివ్యవస్థ వివాహం! ఆయుధం కాదు!! పశువును నరుని చేసింది పెళ్ళి. తండ్రికి తల్లితో సమానం అయిన బాధ్యతలు అప్పగించింది వివాహం. అతనిని లొంగదీసి ఆమెకు తోడుగా ఏర్పరచింది. వివాహవ్యవస్థ! - మంత్రాలు ఏర్పడినాయి. ధర్మేచ - అర్ధేచ - కామేచ నాతి చరామి - ధర్మార్ధకామాల్లో నిన్ను వదలను అని మగవానితో అనిపించడం, ఆచరింపచేయడం సామాన్యం కాదు!
సామాజిక శాస్త్రంలో భారతదేశంలో జరిగినంత పరిశ్రమ - కృషి మరెక్కడా జరిగి ఉండదు. ఒక మేనక - ఒక అహల్య - ఒక శకుంతల తఃరువాతగాని వెలుగు - సూర్యుని వంటి అవినాభావం గల సీతారాములు ఆవిర్భవించలేదు!
ఆడవారు - తాము పిల్లలను కనం అని ఎదురు తిరిగిన కాలం లేకపోలేదు. పురాణాల్లో యువనాశ్యుడు బిడ్డను కన్నాడు! అనంతకాలంలో ఇలాంటి తిరుగుబాట్లు ఎన్ని ఉన్నవో! సామాజిక శాస్త్రజ్ఞులు భార్యాభర్తలను కలిపి ఉంచడానికి ఎన్ని ప్రయోగాలు చేశారో! ఎంత కృషి సలిపారో! పలుకలేని ఆ కాలానికి ఎరుక!!!
ఈ కథ సాంతము పెళ్లిని గురించింది మాత్రమే! ఒక కుటుంబం ఏర్పరచడానికి ఎన్ని తపస్సులు అవసరం అయినవో! తొలి కుటుంబం భార్య - భర్త - పిల్లలు మాత్రమే! వృద్దుల పోషణ బాధ్యత కుటుంబానికి అప్పగించడం జరిగింది. అన్ని తరాల బాధ్యతా కుటుంబానికి వప్పగించారు. అందరికీ పెద్దవాడు వృద్దుడు. వృద్దుడు శారీరకంగా బలహీనుడు. అందువల్ల అతనిని కర్తను - యజమానిని చేసినారు. సకల హక్కులు కర్తవి. కార్యములన్ని కర్తపేర జరగాలి.
ఇలాంటి స్వయం పోషకం అయిన కుటుంబ వ్యవస్థను ఏర్పరచి - వేల సంవత్సరాలు కొనసాగడానికి దోహదం చేసిన ఆ వ్యవస్థకు నమస్సులు. 'ఉమ్మడి కుటుంబం' అనేది పాశ్చాత్యనామం. కుటుంబం విడిపోయింతరువాత వచ్చిన పేరు. కుటుంబం అంటే సంపూర్ణ కుటుంబం మాత్రమే!
కుటుంబమే ప్రపంచం. సకల శిక్షలు ఇక్కడనే లభిస్తాయి. ప్రేమ - అభిమానం - ఆత్మీయత - త్యాగం - ఈర్ష్య - ద్వేషం - అసూయ - తగాదా - అన్నింటి శిక్షణా ఇక్కడే లభిస్తుంది. ఇక్కడ నరుడు మానవుడూ కావచ్చు, రాక్షసుడూ కావచ్చు. భారతీయ తాత్త్వికతలో వృత్తుల శిక్షణకూడా కుటుంబంలో జరిగింది. అందువలననే గుణ కర్మములనుబట్టి కులాలు ఏర్పడినాయి! భారత కుటుంబం ఒక స్వయం సంపూర్ణ రాష్ట్రం!
సకల శాస్త్రాలు - సకల కళలూ కుటుంబం అనే ఈ సూర్యుని చుట్టే పరిభ్రమిస్తుంటాయి.
ఇలాంటి కుటుంబాల సమూహం గ్రామం. నా బాల్యంలో కూడా మన గ్రామాలు స్వయం సమృద్దాలు. న్యాయంకోసం కోర్టులకు ఉరకాల్సిన పనిపడలేదు. పెద్దలు - పంచాయతులు పరిష్కరించాయి. అంతమాత్రంతో అక్కడ అంత సవ్యంగా ఉందనలేం. ఉన్నదానిలో అది ఉత్తమం. ప్రకృతికి పరిపూర్ణత్వం లేదు. అంతా మంచిగల వ్యవస్థ కలలోకూడా కనిపించదు.
పారిశ్రామిక విప్లవం మానవాళికి సుఖసంపదలు ప్రసాదించడానికి ఆవిర్భవించింది. నేడు నరుని పాలిటి శాపం అయికూర్చున్నది. ఇది భస్మాసుర (హస్తం) వరలాంటిది. ఎప్పుడో తన తలమీద పెట్టుకొనకమానదు.
మహాభారతం మానవ ఇతిహాసం. అందున లేనిది ఎందున లేదు. అందులో కుటుంబాన్ని గురించి ఒక చక్కని కథ ఉంది:
పాండవులు లక్క ఇంటినుంచి బయటపడ్డారు. ఏకచక్రపురం చేరారు. ఏకచక్రపురం అగ్రహారం. అగ్రహారంమీద రాజుల శాసనం లేదు. గ్రామస్తులు పాలించుకునే గణతంత్ర గ్రామం అది. దానికి బకాసురుని బాధ తగిలింది. గ్రామస్తులు బకాసురునితో ఒక వప్పందానికి వచ్చారు. గ్రామరక్షణకుగాను ప్రతిరోజూ ఒక్కొక్క కుటుంబంనుంచి - బకాసుర భక్షణకు - ఒకరిని పంపుతామని వప్పందం చేసుకున్నారు. ఆ గ్రామప్రజల అయిక్యత - క్రమశిక్షణను అభినందించాలి. రాజకీయం లేకుండా ప్రజల స్వచ్చంధ కృషి ఈనాటికీ ఆదర్శప్రాయం.
అంతర్జాతీయరంగంలో ఈనాడూ ఒక బకాసురుడు ఉన్నాడు! భీముడు రావలసి ఉన్నాడు!!
పాండవులు ఉన్నవారి ఇంటివంతు వచ్చింది. ఆనాడు ఆ కుటుంబంనుంచి ఒక వ్యక్తి బకాసురునికి బలి కావలసి ఉంది! ఎవరు వెళ్ళాలి అనేదాన్ని గురించి మహాభారతంలో సవివరమయిన చర్చ ఉంది. సంక్షిప్తంగా మనవి చేస్తాను:
అది చిన్నకుటుంబం - చింతలు లేని కుటుంబం భార్య - భర్త - కొడుకు - కూతురు ఉన్నారు. మహాభారతంలో కుటుంబ నియంత్రణ ఉంది. అది మనకు అక్కరలేదు. పొరుగింటి పుల్లకూరే రుచి!
భర్త తాను వెళ్తానంటాడు. పిల్లలపోషణకు తల్లి అవసరం అంటాడు.
భార్య తాను వెళ్తానంటుంది. పిల్లలకు తల్లికన్న తండ్రి అవసరం మిన్న అంటుంది.





