Home » vaddera chandidas » Anukshanikam 2
శ్రీపతి నడుస్తున్నాడు.
రోడ్లమీదా గోడలమీదా చెట్లమీదా వాహనాలమీదా మనుషులమీదా గాలిలోనూ యిందిరాగాంధి ఫోటో కాగితాలు కాంగ్రెసేది? కాంగ్రెసు సభ్యులేరి? యిందిరే యిండియా యిండియాయే యిందిర-అని వొకప్పుడని జారుకున్న బారువాలూ బీరువాలూ యెక్కడా కనిపించటంలేదు.
-కాంగ్రెసే యిందిరగా యిందిరే కాగ్రెసుగా, ఆమె రాజకీయ జీవితం సాగుతూ వొచ్చింది. యిందిర యిండియా ఐనా, యిండియా యిందిర కాదు.
శ్రీపతి నడుస్తున్నాడు-చూస్తూ.
-సర్వం యిందిరామయం. యింది రామం. అందులో ఆపద సమయంలో జారుకోకుండా అంటిపెట్టుకుని వుండిపోవటమే కాక అలాంటి సమయంలోకూడా తనని కొలిచిన వాళ్ళకే చోటు పెట్టింది. అన్నీ చేసీ చివరి గడియల్లో యెందురైనా గాని వొచ్చి కావిలించుకున్న కామలాంటి వాళ్ళకి వొక్క మినిస్ట్రీ కాసు కూడా రాల్చలేదు. అందరికంటే పీవీ అదృష్టవంతుడు. యిప్పుడీమె-నేనేం చేసినా ప్రజలకోసమే చేస్తాను. నన్నలాగిలాగా చెయ్యమని ప్రజలు యెన్నుకున్నారంటుంది ప్రజాస్వామ్యం మైనారిటీ స్వామ్యం ప్రజానియంతృత్వం నియంత నియంతృత్వం రాజు నియంతృత్వం రాణి నియంతృత్వం యేదొక నియంతృత్వం - మెజారిటీ అభిప్రాయం తప్పు అని వివిధ రంగాలలో యెప్పటికప్పుడు ముందుకాలంలో నిర్ధారణవుతూంటుంది. మాబాక్రసీ, నీరోక్రసీ 'పోపాక్రసీ' ఆవురంగజేబాక్రసీ, జారాక్రసీ, స్టాబినాక్రసీ హిర్లాక్రసీ జ్యూరాక్రసీ ప్రజాక్రసీ యిందిరాక్రసీ విజయేందిరాక్రసీ అఖిలభారత నిజయేందిరా క్రసీ-
135
యిది సంజయ్ రుతువు యిందిరా పవనాలు వీస్తున్నాయి. యేరుతువైనా యేపవనాలైనా మారటం ప్రకృతిధర్మం మార్పూ మారే రీతీ, అప్పటి కాలగతిననుసరించి వుంటుంది.
సంక్రాంతి సెలవులు ముగిసి-విద్యాలయాలు తెరిచారు, యివాళ.
శ్రీపతి లా కాలేజీకి వెళ్ళబోతూ యిటు తిరిగి, వుస్మానియా విశ్వ విద్యాలయం భవనం మెట్లెక్కుతున్నాడు.
నేను మారవని మొండికేసినట్లుగా యీ భవనం అప్పటికీ యిప్పటికి అలాగే వున్నట్లనిపిస్తుంది అన్ని మార్పులూ వొకేలాగా వుండవు. లో మార్పు, పూర్తిగా మారక బయటపడుతుంది. పై మార్పు మూలంలో మారకుండానే మారినట్లు కనిపిస్తుంది. దేవతకెప్పుడూ ముఫ్ఫయ్ మూడేళ్ళేనట. శ్రీపతీ అలాగే కనిపిస్తాడు. యీ భవనమూ అంతే. అప్పటికీ యిప్పటికీ ప్రౌడలాగే వుంది. కానీ యెప్పుడో వుండుండి కొంత కాలం తరవాత చూస్తూండగా కళ్ళముందు ముసిలిదై పోతుంది. అంచేత దేవతలూ అంతేననుకోవాలేమో. దేవతలున్నారా? మనలో యెందరమో దేవతలం- యెందరమో దెయ్యాలంలాగా దేవతలూ మనుషులే. దెయ్యాలూ మనుషులే.
శ్రీపతి, మెట్లెక్కి ఆ మెట్లపైన, గుమ్మానికి యివతలగా యెడమ రాతి స్తంభానికి భుజం ఆన్చి బరువంతా యెడమ కాలిమీద మోపి, కుడిచేతి మడిచిన చూపుడు వేలి కణుపుతో పెదాలమీద నొక్కుంటూ, ముందుకి దూరంగా, కిందికి చూస్తున్నాడు.
వొచ్చిపోతున్న బస్సులు కార్లుస్కూటర్లు, అటూయిటూ వెడుతున్న, మెట్లెక్కి పైకి వొస్తున్న జనాన్ని గమనించటంలేదు అతను. అలా అని పరిసరాలను గమనించలేని స్థితి అనీ కాదు.
రిటైర్డ్ ప్రొఫెసర్ జీలకర్ర దిబ్బావధాన్లు కొడుకు, సంస్కృత లెక్చరర్ గా పనిచేస్తున్న జె.జె అవధాని బెల్ బాటం స్టెప్ కట్ యెలెవేటెడ్ షూజ్ బండి చక్రాల షోకు కళ్ళజోడు కాక, గావంచా జందెప్పోగు బోడిగుండు పిలకతో వొచ్చినా- తొమ్మిదింటికే వొచ్చి బస్టాపు దగ్గిర చేరిన రామినీడు వీరభద్రరావు విశ్వేశ్వర్ ల బృందం; బస్సులోంచి దిగుతున్న ఆడపిల్లల మీద మురికి జోక్స్ వేస్తూ పిల్లీ నక్కా కుక్కా కోడీ కూతలతో కాలేజీ లోపలిదాకా సాగనంపటంలో పాకం మరీ ముదిరి యేదో గొడవ జరిగినా-రిటైర్డ్ యింగ్లీష్ ప్రొఫెసర్ సి.టీ. జట్కావాలా కొడుకు కెమిస్ట్రీ లెక్చరర్ పిటీ. జతకావాలా పాల తెలుపు లఖ్నవీ పైజమా కుర్తాలో కాక; ఫుల్ సూట్ లో వొచ్చినా-సోషియాలజీ ప్రొఫెసర్ ఐన ఖలీల్ ముస్తఫా షేర్వాని రూమీ టోపీ తీసేసి బంగాళీ ధోవతీ జుబ్బాలో వొచ్చినా-ఆమధ్య డాక్టరేట్ పుచ్చుకుని మూన్నెలల క్రితం హిస్టరీ లెక్చరర్ అయిన త్రిపురసుందరి అందంగా హుందాగా కాక : గజ్జెల గుర్రాల్లా మెట్లెక్కి నా-
యిలాంటివి యేవైనా జరిగితే ప్రత్యేకం గమనించనూ గమనిస్తాడు, శ్రీపతి.
అంతకుముందు దమ్మిడీ ఆస్తిలేకపోయినా ప్రస్తుతం సిటీలో మూడు యిళ్ళ స్తలాలు, వొక హౌసింగ్ బోర్డు కొంప యెలాట్ మెంటు, రీడర్ షిప్పూ సంపాదించిన కుక్కుటేశ్వరరావు వొచ్చి స్కూటర్ ఆపాడు.
వో చెట్టుకింద నుంచుని కరుణాకర్ రెడ్డి, అప్పలరాజు రామశర్మలతో యేదో చెబుతూ అటుగా వెడుతున్న యింద్రసేనారెడ్డి వంక చూపెట్టి యేదో అని నవ్వుతున్నాడు.
అటు వెడుతున్న యింద్రసేనారెడ్డి అతని పక్కనున్న వినాయక రావుతో, వొచ్చే యేడు కాలేజీ యూనియన్ యెలక్షన్ల వ్యూహం గురించి చెబుతున్నాడు.
లైబ్రరీనుంచి నాలుగు దిండు గ్రంథాలు మోసుకొస్తున్నాడు రామ్మూర్తి-తన సంసారాన్ని మోస్తున్నట్లుగా.
బస్సు దిగి, "శివ దీక్షాపరురాలమర శీల మెంతైన విడువజాలనుర-దీక్ష యెంతైనా విడువజలనుర" అని గొంతులో అనుకుంటూ సైన్సు బిల్డింగ్ వైపుకి నడుస్తున్నాడు వరాహశాస్త్రి. ప్రస్తుతం పూల్ ఆఫీసర్ గా వుంటున్నాడు, జుఆలజీ డిపార్ట్ మెంటులో.



