Home » vaddera chandidas » Anukshanikam 2



    తమ సబ్జెక్టులో విశేషమైన కృషిచేసి డాక్టరేటు పోస్టు డాక్టరేటు చేసి యింకా నిరుద్యోగులుగా వున్నవాళ్ళకి డిపార్ట్ మెంటులో మరింత కృషి చేస్తుండమని, యు.జి.సి. వారు తాత్కాలిక జీవనాధారంగా చేసే యేర్పాటు అది.
    "నీకేమోయ్ ఆఫీసర్ వి!" అని సరదాగా మిత్రులు అంటే-
    "పూల్ అంటే గుంట. పూల్ ఆఫీసరంటే గుంటలోపడి కొట్టుకుంటున్న వాడు అని అర్ధం. అదైనా మేలే. పూలైనా కాదు, పూల్ ఆఫీసర్. ఫూల్ అంటే యేం చాతకాని దద్దమ్మ అని అర్ధం. యే వుద్యోగమూ సంపాదించుకేడవలేని చవట కదా అని జాలిపడి చదువుల పురుగు లెమ్మని కనికరించి- మనొవర్తిచ్చి మొగుడు తగిలేసిన పెళ్ళాంలా, యూజీసీ వాళ్లిస్తున్న భ్రుతితో రోజులు వెళ్ళదీస్తున్నవాడు అని అర్ధం. యిహపోతే, కొన్నాళ్ళు  చూసి-యీ ముండ ఎన్నాళ్ళకి చావటంలేదు యెంత కాలమని మనోవర్తిచ్చేదని వో వైకుంఠ మాత్ర వేయించినట్లుగా; నాల్రోజుల తరవాత వీడ్కోలు పత్రం సమర్పిస్తారు. యేడ్చినా బతక్క తప్పనప్పుడు, నవ్వుతూనే బతుకుదాం. దేనికైనా పెట్టి పుట్టాలి!" అని ఛలోక్తిగా అంటూంటాడు వరాహశాస్త్రి.
    అదే బస్సులోంచి దిగిన శ్రీదేవి వడివడిగా నడిచి వొచ్చి మెట్లెక్కుతోంది. కాలుజారి పడబోయి, నిలదొక్కొని మెట్లెక్కి లోనకి వెళ్ళింది.
    -పడితే దెబ్బ తగిలివుండును. ఏం చెప్పగలం, యే నవరగంతనో తగిలితే యెంత చిన్నగా తగిలినా యిట్టే పోతుంది ప్రాణం మీద నుంచి బస్సు వెళ్ళిపోయినా చెక్కుచెదరకుండా వున్నవాళ్ళున్నారు. ముళ్ళు గుచ్చుకుని నిలువెల్లా విషంతో చివికిపోయి చచ్చిపోయిన వాళ్ళున్నారు పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంగా సోఫాతో కూచుని, "హలో" అని చిర్నవ్వుతో పలకరిస్తున్న మనిషి పలకరిస్తున్నట్లే గుండె ఆగిపోయి ప్రాణం పోనూ వొచ్చు-స్వప్న-గుండె ఆగిపోయి ప్రాణం పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. గుండె ఆగిపోయి ప్రాణం పోయిందా, ప్రాణంపోయి గుండె ఆగిపోయిందా అని నేనడిగితే రెండూ వొకటేగా అన్నాడు, డాక్టరు. గుండె వుంది కదా మరి ప్రాణం యెక్కడికి పోయింది? ప్రాణం గుండెలో వుంటుందా? గుండె వుండి మనిషి వున్నా మనిషి పోయిందంటున్నారు. ప్రాణంతోనే ప్రాణంతోపాటు మనిషికూడా పోతే మనిషి చచ్చిపోయినట్లు యెలా అనుకోవటం? మరణం అంటే పంచభూతాల్లో కలిసిపోటమా? ఆ పంచభూతాల శరీరం యింకా అక్కడే వుందిగా? పుట్టటం అంటే పంచభూతాల్లోంచి రావటమా? వొచ్చి? పంచభూతాల్లోంచి ప్రాణం ప్రయాణించి-ప్రయాణించి- ప్రయాణించేశాకగా తెలిసేది! ప్రకృతంతా ప్రాణమే కదా- ప్రాణం పోవటం అంటే ప్రకృతై పోవటమా? ప్రాణం పోకముందు? ప్రాణం విడిగా బొందిలో వుందనా? యీ బొంది ప్రకృతి కాదూ? సర్వం ప్రకృతే. సర్వం ప్రాణమే. మరి జననమేఁవిఁటి? మరణవేఁవిఁటి? జనన మరణ సంఘాతమే ప్రకృతేమో - సంఘాతమూ కాదేమో - సంయోగ మేమో-రాగలీన స్వప్నలీన-సర్వమూ పోయినా స్వప్న పోదు. స్వప్న, స్వప్నకదా. పోదు. స్వప్న, రాగలీనకదా. రాగలీన స్వప్నపోదు.
    అందరూ పోతారు. ప్రతిదీ పోతుంది. యెవరూ పోరు. యేదీపోదు పోనిదే రావటం యెలా? రానిదే పోవటం యెలా? యీ రావటం పోవటం లోంచి-
    అన్నీ యధావిధి సాఫీగా కొనసాగుతున్నాయి యీమండే పగటెండ వెన్నెలవేళ మేలుకున్న వారి వ్యధా విధి తప్ప-అన్నీ యధావిధిగా సాఫీగా సాగిపోతున్నాయి.
    క్షణం వెనక క్షణం ముందు క్షణం లోన క్షణం కింద క్షణం పైన క్షణం పక్క క్షణం క్రితం క్షణక్షణం, క్షణికం ; క్షణిక క్షణంలో పుట్టుకే గిట్టుకలా అసలు ఆరంభమే అవనట్లుగా, గిట్టుకే పుట్టుకలా అసలు అంతమే అవనట్లుగా; క్షణక్షణాల క్షణికాల, క్షణికక్షణికాల క్షణం; అంతలోనే అంతమయ్యే క్షణికాల దొంతర, యెంతకీ అంతమనవి దొంతర క్షణి మూల, విశ్వాంతర్ల్పావిత సంకీర్ణక్షణికాలు అంతలోనే అంతమయ్యే యెంతకీ అంతమవని నిరంతర క్షణికం అనుక్షణికం.
    
                       * సమాప్తం *




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.