Home » vaddera chandidas » Anukshanikam 2
ప్రజలకి-యెమర్జెన్సీ పూర్వాపరాల కంటేకూడా గతరెండున్నరేళ్ళ జనతాపార్టీ పాలన భయభ్రాంతులను చెయ్యకపోయినా పరమ చీదరగా అసమర్ధంగా అనిపించి వుండాలి.
కొంతకాలంగా మిడిసిపడుతూ వొచ్చిన నీలం వారి రాష్ట్ర పతిత్వం యిప్పుడు యిందిరాగాంధీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వుంది. యిందిరమ్మ అభయహస్తం దేశానికే కాక దేశ రాష్ట్రపతికి కూడా శరణ్యం ఐంది.
యివాల్టి జనవరి పదిహేనో తేదీ దినపత్రిక చంకనపెట్టుకుని బాస్సెక్కాడు శ్రీపతి.
బస్సులో-జరిగిన యెలక్షన్ల గురించీ లోకల్ పాలిటిక్స్ గురించీ కొత్త కేంద్ర మంత్రివర్గం గురించీ - రకరకాల మాటలు వ్యాఖ్యలు కసుర్లు విసుర్లు అక్కసులు ఆనందాలు.
శ్రీపతి, బస్సు దిగి నడుస్తున్నాడు.
-జనతా అభ్యర్ధిగా లక్కీగా యెన్నికయ్యి లక్కీగా రాష్ట్రపతి ఐన సంజీవరెడ్డి మహా అదృష్టవంతుడనుకున్నారు. జనం జనతా పార్టీ కుక్కలు చించిన విస్తరిలాగా ఐపోతే లక్కీగా మంత్రాంగం తంత్రాంగం చేసే అవకాశం చిక్కింది. అవి నీలం వారి సహజసిద్ద లక్షణాలు. రాజ్యంగాన్నీ వో పిసరంత అనుంటా పెట్టి, నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ అని అంతరాత్మ ప్రబోధాన్ని త్రేన్చాడు. యిప్పుడీ పార్టీల్లో యే వొక్కదానికీ సరిపడా మెజారిటీ రాదు. యే యిద్దరూ నికరంగా కలవలేరు. అంచేత, నీలం వారి అధినాయక పరిపాలన తప్పదు - అని రాజకీయ పామరులు పండితులు అందరూ అనుకున్నారు. యెవరూహించాం మరోమహావింత జరుగుతుందని రాష్ట్రపతి నామమాత్రపు అధినాయకుడుగా కాక సర్వం స్వహాధికారం చెలా యిస్తాడనుకున్నారు. జన గణ మన అధినాయక జయహే-అని టాగోరు మన యిష్టా యిష్టాల ప్రసక్తి లేకుండా మనని పరిపాలించే పరాయిరాజును పొగిడినట్లు, నేరుగా ప్రజలు యెన్నుకొని వుత్సవిగ్రహానికి జన గొణ మొన యద నాయక జయహే - అని ప్రజలు కీర్తించేవారు. అలాంటిది-మరణ శిక్ష పడినవాళ్ళకి ప్రాణభిక్ష-అని ప్రజలు కీర్తించేవారు. అలాంటిది-మరణ శిక్ష పడినవాళ్ళకి ప్రాణభిక్ష పెట్టగల రాష్ట్రపతికి యిప్పుడు తనకే కుర్చీభిక్ష అవసరం ఐంది. భిక్ష వెయ్యగల వ్యక్తి - యేమైనా చెయ్యగల వ్యక్తి- మెడలో పూలమాలలా వెయ్యొచ్చు, కత్తివేటుతో పీకతప్పించనూవొచ్చు.....
శ్రీపతి నడుస్తున్నాడు.
"నీ కాల్మొక్కుత దొరా, మంచిగున్న వా"
శ్రీపతి తల పక్కకి తిప్పి చూశాడు బిచ్చకత్తె, చిన్న చక్రాల బండిలో ఆమె కుంటిమొగుడు. ఆ బండి యీడుస్తూనో తోస్తూనో వీధులలో అడుక్కుంటుంది.
-యీ ముసలమ్మ-కాదు అనసూయ సిటీ అనసూయ, నిజభర్తని ఆ బండిలో కూచోబెట్టుకుని బండి లాగుతూ వీధుల్లో అడుక్కుంటుంది. వెనకోసారి విద్యార్ధి వీరుల కత్తిపొట్ల సందర్భంలో హాస్టళ్ళు మూసేస్తే సిటీలో మెస్సులో ఆశ్రయం పొందినప్పుడు-ఆ వీధి కొసన వున్న చెట్టు కింద వీళ్ళ కాపరం యేం తోచకో దేనికో వాళ్ళ జీవనాన్ని పరిశీలించబట్టి తెలిసింది. ఆదివారాలు అడుక్కోటానికి వెళ్ళేదికాదు. విధిగా కోడికూర-కూరకాదు, కోడిని డ్రెస్సింగ్ చేసి, చీరి అక్కర్లేని పేగులూ గట్రా తీసేసి మాంఛి మసాలా సరుకు నూనె అవీ నింపి సర్జన్ లాగా కుట్టేసేది. అప్పుడా కోడి చూడటానికి బూరు పీకిన కోడిలా వుండేది. దాన్ని వో కర్రకి తగిలించి పేళ్ళ మంటమీద కాల్చేది. దీనికి యే హోటల్ బంజరాలోనో ఐతే వందరూపాయలకి తగ్గకుండా వసూలు చేస్తారు వారం రోజులలో అప్పుడప్పుడు దొరికిన గుప్పెడు గుప్పెడు బస్ మతి బియ్యం విడిగా దాచి వొండేది. ప్రతి ఆదివారం ఇలాంటి విందు భోజనం భర్తకి పెట్టి తనూ తినేది. యిదంతా గమనించి వోసారి చెరుకు విసిరితే దేనికుండే కష్టాలు దాని కుంటాయన్న విజ్ఞతను తెలియపరిచింది. యీ పుణ్య భూమిలో పాపభీతిలో ధర్మం చేసే వాళ్ళకి కొదవలేనందున ధర్మాత్ములకి కొదవలేదుగానీ, అన్నిటికీ వున్నట్లే బిచ్చమెత్తుకోటానికుండే సామాజిక రాజకీయ సమస్యలు దానికున్నాయి. నగరంలో బిచ్చపు మండలాధిపతులు న్నారట. వాళ్ళు నగరాన్ని బిచ్చపు వార్డులు గానూ, కీలకస్థానాలను బిచ్చపు సెంటర్లు గానూ విభజించి-వాళ్ళ వాళ్ళ బలాబలాలను బట్టి వాటికి అధిపతులవుతారట. బిచ్చగాళ్ళు వాళ్ళ రోజు కమీషన్, పండగ స్పెషళ్ళు యిస్తుంటారట. ప్రభుత్వోద్యోగులకిలాగే వీళ్ళకీ వొక మండలం నుంచి యింకో మండలానికో వొక సెంటరునుంచి యింకో సెంటరుకో ట్రాన్స్ ఫర్ కావాలంటే లంచం యిచ్చుకోవాలట- కొన్నాళ్ళు యాచిస్తూ పొగడటంతోపాటు, యిలా యాచించటం అవమానకరంగా అనిపిస్తుందట వాళ్ళకి. అవును మరి, దేశాన్ని యాచించటం వేరు. ఆఖరికి బిచ్చగళ్ళు కూడా యెలా అంటే అలా చిత్తమొచ్చినట్లుగా వుండి యిష్టమొచ్చినచోట అడుక్కోవటానికి లేదన్న మాట! బ్రతుకంటేనే సామాజిక మనుగడ. కానీ యీ చట్రం లోనే తానుగా నిలవాలి. వ్యక్తిత్వం కాపాడుకోవాలి-పేరడాక్సికల్. పేర డాక్సికల్ గానే మనిషి చారిత్రక ఆర్ధిక సామాజిక బద్దం. కానీ వొకో వెర్రి వెంగళప్ప యీ పరిధిని దాటి వూపిరి పీలుస్తాడు అప్పుడు వాడి కొంప మునిగిపోతోంది. వాడి కొంప మునగాకపోతే సమాజం కొంప మునుగుతుంది. వొక్కోసారి రెండు కొంపలూ జమిలిగా మునిగిపోతాయి. బుద్ధుడు సోక్రటీసు బ్రూనో కోపెర్నికస్ న్యూటన్ డార్విన్ ఫ్రాయిడ్ యిబ్సెన్ స్పేంగ్లర్ ఐన్ స్టీన్ హైజన్ బర్గ్ మార్క్స్-వీళ్ళందరూ కొంప ముంచుకున్న వాళ్ళో కొంప ముంచినవాళ్ళో-రెండూనో అలా వర్తమాన చారిత్రక సామాజిక పరిధి నధిగమించి వూపిరి పీల్చి కొంప ముంచటం లోంచి కొంప మునుగుతూ వినూత్నంగా తేలుతుంది. యిది కూడా చారిత్రక నియతే. అందుకే చారిత్రకత తననితాను చీల్చుకుంటూ తిరస్కరించుకుంటూ పెంపొందించుకుంటూ కొనసాగుతుంది. హెగిలు, యీ చారిత్రక అస్తిత్వాన్ని బూడిద అంటే-కాదు బుసి అన్నారు మార్క్స్. యింకో బూర్క్స్, బుసి కాదు మసి అంటాడు. ఐతే వీళ్ళంతా తనదే తుదివాక్యం పరసుపదం అని భ్రమిస్తారు. భ్రమించకపోతే అలా క్రమించలేడు. అది, పరిధి నధిగమించేతనపు పరిమితి. యివన్నీ నేనేనంటూ చారిత్రకత, తన కథ కొనసాగిస్తూనే వుంటుంది-ఆగామిగిద్ధుడు గీక్రటీస్ గైన్ స్టీన్ గార్విన్ గైజన్ బర్గ్ గ్రాయిడ్ గిబ్సెన్ గార్క్స్ లు, కాలిలో ముల్లులా నరాలలో డయా లిటిక్ నెత్తుర్లా గుచ్చుకుంటూ పాకుతూ వుంటే- యివన్నీ నేనేనంటూ చారిత్రకత తన కథ కొనసాగిస్తూనే వుంటుంది. యీ చారిత్రక సామాజికత ముక్కుకి సూటిగా దాని దారిన అది పోదు. దానితో అది విభేదిస్తూ, దాని మీద అది ఆధారపడుతూ నానా గొడవగా నానా రీతులలో పరస్పర ఆధారత్వాన్ని అల్లుతూ వుంటుంది. యీ విశ్వంలో యెక్కడో వొకమూల యేదో జరిగితే దాని ప్రభావం యెన్నెన్ని చోట్లనో వుంటుంది. యీ భూమ్మీద వొక చోట యేదో జరిగితే యెన్ని చోట్లో యేదో ఐపోతుంది. నేనిలా పెళ్ళీ పెటాకులూ లేకుండా వుండిపోతే అది నావరకే పరిమితం కాదు. దేశ జన సంపదని పెంచని నేరం చేసినవాడినన్నమాట. వో అరబ్బు బుడే సాయిబ్బుకి వుల్లిపాయలు కావాలిస్తే కూరగాయలు కావాలిస్తే బుల్లెమ్మలూ కావాలిస్తే వైట్ హౌస్ లో క్రెమ్లిన్ లో కుట్రాన్ బాంబు సంతకం చేస్తే పీకింగ్ లో బెటాలియన్ చెంగ్ చుంగ్ మినపగింజ కళ్ళతో దూరంగా చూపు సారిస్తే అక్కడ ఢిల్లీ పాదుషా వారు వాళ్ళ మనవడి పుట్టినరోజు పండక్కోసం బాంబరు విమానాలో బార్లీ గింజలో కొంటే-యిక్కడ మన తిండిలో పడకలో నడకలో తభిసీళ్ళొస్తాయి. చూడగా ఆదిమ మానవుడివేవీ లేకుండా--కానీ వాన్నెవరు బలవంతం చేశారిలా యిందాకా పాక్కుంటూ రమ్మని! బహుశా అది ప్రాణి మూలతత్వమేమో యిలా పోయి పోయి సాఫీగానూ పోదు, మధ్యలో-బుటక వేస్తుంది, మునిగిపోతూంటుంది. బుటకేస్తూనే మునిగిపోతూనే మెలాయించుకొస్తుంది.......



