Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
తరవాత T. కృష్ణనుంచి ఉత్తరం తెచ్చాడు. బెలిదె కామేశ్వరరావు అధిపతిగా కాకతీయ పిక్చర్స్ సంస్థను వరంగల్లులో స్థాపించాడు. చిత్ర నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నులయినారు.
ప్రభాకరరావుగారు డబ్బిచ్చారు. నానుండి రసీదు తీసుకోలేదు. హక్కులను గురించి పత్రం వ్రాయించకోలేదు. అయినా, వారికి పరిణామాలన్నీ తెలియపరచాను. వారు నాకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చాను.
మాధవరావుగారు చిత్రాన్ని వాస్తవ గడీ పరిసరాల్లో తీయాలనుకున్నారు. వరంగల్లు జిల్లాలోని దొరలు అందరినీ అడిగారు. "చిల్లర దేవుళ్ళు" అంటే అందరూ వ్యతిరేకించారు. ఒక్కరూ అనుమతించలేదు. ఆ విషయం వారు నాకు చెప్పారు. ఇది నాకు విజయకేతనం అన్నాను. 'అదెట్లా?' అడిగారు మాధవరావుగారు. 'నేను సంధించిన బాణం గురి తప్పలేదు. సూటిగా లక్ష్యాన్ని ఛేదించింది' అన్నాను. అర్ధం చేసుకున్నారు. "చిల్లర దేవుళ్ళు" దొరలమీద పోరాటం అన్నారు.
తుదకు మాధవరావుగారు సాధించారు. ఒక చితికిన దొరనుండి శిథిలం అయిన గడీని 'ఆత్మకూరు'లో సాధించారు. నాకు చూపించారు. "చిల్లర దేవుళ్ళు" కు అతికినట్లుగా ఉంది 'ఆత్మకూరు' - అక్కడి గడీ!
ఆత్మకూరు గడీని అనవసరం అయినంతమేరకు ముస్తాబు చేశారు. వంటలు - వార్పులు - వసతులు అన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. మాధవరావు - హరి - చంద్ర - మురళీమోహన్ - భానుప్రకాశ్ - నేను - మరికొందరు - మద్రాసునుంచి వచ్చిన టెక్నీషియన్లు అక్కడే మకాం. కలిసి భోజనాలు - కలిసి పని - కలిసి మాట - కలిసి ఆట - రోజూ పండుగలా ఉండేది. కొన్నాళ్ళు సావిత్రి - కాంచనకూడా కలిసి ఉన్నారు. వారు ఎంతో శ్రద్దగా తెలంగాణం యాసను మెచ్చి, నేర్చారు. పని ఉన్నప్పుడు మాత్రం ప్రభాకరరెడ్డి - త్యాగరాజు వచ్చి వెళ్ళారు.
రంగవిభజన - సంభాషణలు నేనే వ్రాశాను. హరి కొంత సాయం చేశాను. హరి అసోసియేట్ గా పనిచేశారు మాధవరావువారికి.
పల్లెలో ప్రతిరోజూ షూటింగు అవి చూడడానికి జాతరవలె జనం! అంతా ఒక సందడి!! సంరంభం!!!
బహుశా సావిత్రిగారిది అది చివరి చిత్రం. ఒక్క త్రాగుడు తప్ప ఆమెతో మాట విజ్ఞానం. ఆమె చిత్ర రంగంలో అన్నిటా ప్రతిభావంతురాలు ఆమె నటన సాంతం ఆమె కనుల కదలికలే! ఆ నాలుగురోజులు సావిత్రిగారు నన్ను ఎంతో అభిమానించారు. దొరసానిగా ఆమె హుందాతనం చూపించారు.
దొర సేరిగాన్ని చంపుతాడు. పాణిని వెళ్ళగొడ్తాడు. జబ్బున పడ్తాడు. వైద్యుడు పట్నం తీసికెళ్ళమంటాడు. దొర్సాని మేనాలు సిద్దం చేయమని మదార్సాబ్ ను పంపుతుంది. "ఊరు ఉడుకుతాంది. చాకలోళ్ళు రామంటున్రు. బండ్లు కట్టింతునా దొర్సానీ!" అని అడిగాడు.
అప్పుడు సావిత్రికోసం వ్రాసిన మాటలివి :-
"ఈ దొరతనమే ఇంత. సాగినన్నాళ్ళు సాగుతది. మంది తిరగబడ్తే మనగతేమైతది?"
దీనిని ఆమె ఎంతగా అర్ధం చేసుకున్నదంటే "కవిగారూ! మీరొక యూనివర్శల్ ట్రూత్ చెప్పారు" అని అంత గొప్పగా పలికారు.
కాంచన 'వనజ'గా పాత్రలో జీవించింది. పలుకుబడి చక్కగా పలికింది. మెప్పించింది. సానుభూతి సమార్జించుకుంది. సారంగపాణి సహవాసంతో వనజ ఆకాశమంత ఎదుగుతుంది. పాణిని అన్నను చేసుకుంటుంది.
"నువ్వు దేవునివి బండసువంటి నన్ను మనిషిని చేసినవు. మనసు చూపినవు. నువ్వు నాకు దేవుడివి, తండ్రివి, అన్నవు" అన్న పలుకుల్లోనూ - నటనలోనూ వనజయై నిలిచింది.
ఒక్క ప్రభాకరరెడ్డి తప్ప మిగతావారు గొప్పగా నటించారు. భానుప్రకాశ్ కారణంగా జీవించారు.
పాటలు అన్నగారు ఆత్రేయ - అద్భుతంగా - వ్రాశారు. జానపదగీతాలు నేను ఎన్నుకున్నాను. తొలిసారిగా 'ఏటికేతం పట్టి' గీతం నరసింహమూర్తి - సినీమాకు పాడారు. మహదేవ్ సంగీతం.
చిత్రనిర్మాణం త్వరలోనే పూర్తి అయింది. అనుభవం లేని నిర్మాతల తగాదాలతో "చిల్లర దేవుళ్ళు" చలనచిత్రం 11-3-1977 న నగరంలో నాలుగు థియేటర్లలోను, రాష్ట్రమంతటా విడుదల అయింది. ఈ చిత్రానికి కొన్ని విశిష్టతలు - ప్రత్యేకతలు ఉన్నాయి:
1.తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలిచిత్రం, ఇప్పటికి చివరి చిత్రం.
2. నవలారచయితయే సంభాషణల రచయిత కావడం.
3. నవలకు అనుగుణంగా - ఎక్కువ మార్పులు లేకుండా - తీసిన చిత్రం.
4. ఒక ప్రాంతపు నిన్నటి యధార్ధము - నేటి చరిత్రను - ప్రజాజీవితంగా చిత్రించడం.
5. గిరిజనులను - వారి పోరాటాన్ని - తొలిసారిగా చిత్రించిన బొమ్మ.
6. వ్యాపార దృష్టితో మరీ లాభాలు ఆర్జించడంకాక మేధావులను కదిలించిన చిత్రం.
7. ఒక నూతఃన మార్గనిర్దేశం చేసిన చిత్రం.
చిల్లరదేవుళ్ళు సినిమా రంగంలో సంచలనం సృష్టించింది. దీని ప్రభావంతోనే విశాఖ మాండలికంలో 'నాకూ స్వతంత్రం వచ్చింది' అనే పిక్చరు వచ్చింది.
'ఓ మనిషీ, తిరిగి చూడు' లాంటి ప్రగతిశీల కథా చిత్రాలు వచ్చాయి.
పేర్లు చెప్పకుండా అనేక చిత్రాల్లో "చిల్లరదేవుళ్ళు" పాత్రలు - సంఘటనలు - సంభాషణలు వచ్చాయి.
శ్యామ్ బెనగల్ 'అంకుర్' "చిల్లరదేవుళ్ళు" నిర్మాణం పూర్తిఅయింతరువాత - విడుదలకు - ముందు వచ్చింది.
ఈ మధ్యవచ్చిన 'దాసి' మీద చిల్లరదేవుళ్ళు ప్రభావం స్పష్టం 'ఆడబాప'కు కళారూపం ఇచ్చిన తొలి రచయితను నేను. తొలిరచన "చిల్లరదేవుళ్ళు."
తెలుగు ప్రజలు "చిల్లరదేవుళ్ళు" చిత్రాన్ని ఎంతో ఆదరించారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ముంబాయి, కలకత్తా, నాగపూర్ ప్రవాసాంధ్రులు ప్రత్యేకంగా ఫిలిం వేయించుకున్నారు, నన్ను ఆహ్వానించారు, సత్కరించారు.
పత్రికలు "చిల్లరదేవుళ్ళు" ను బహుధా ప్రశంసించాయి. 'నిశాంత్'లో లేని సాంఘిక దృష్టి, చిత్తశుద్ది "చిల్లరదేవుళ్ళు" లో ఉంది - జమీన్ రైతు, 25-3-77.
చిత్రరంగాన్ని కొత్తదారికి మళ్లించిన "చిల్లరదేవుళ్ళు" - సితార, 17-4-1977.
అపురూపమైన చిత్రం "చిల్లరదేవుళ్ళు" - ప్రజాతంత్ర, 3-4-1977.
"తెలుగు తెరమీద వాస్తవికతకు చోటులేదని పెదవి విరిచేవారికి గట్టి జవాబు "చిల్లరదేవుళ్ళు." రే. మృణాళ్ సేన్ లాంటివాళ్ళు తెలుగుదేశాన మరో ఏడుతరాలకైనా పుట్టిచావరని విచారించేవారికి ఇదొక గొప్ప ఆశ" - విశాలాంధ్ర, 18-3-1977.
చిత్రరంగాన్ని ప్రగతిపథానికి మళ్లించిన "చిల్లరదేవుళ్ళు" - సినీ హెరాల్డ్, 11-3-1977.
"SLICE OF LIFE" -Indian express, 19-3-1977.
"The gripping story from the pen of Dasarathi Rangacharya clothed in the innocent unsophiscated Telengana dialect holds the viewer glued to the seat" - The Skyline, 6-8-1977.
"Chillara Devullu" - a trend - setter - Deccan Chronicle, 17-3-1977. కొసమెరపు-
జంటనగరాల ఫిలిం సొసైటీవారు - 4-4-1977న - రవీంద్రభారతిలో - చిల్లరదేవుళ్ళు యూనిట్ ను సన్మానించారు. చిల్లరదేవుళ్ళు చిత్రానికి ఆ సంవత్సరం బహుమతి రావలసింది. ఆ కమిటీకి బడాదొర జన్నారెడ్డి జగన్మోహనరెడ్డి అధ్యక్షులు. "దొరలు ఇంత దుర్మార్గం చెయ్యలే అన్ని కల్పించి రాసిన్రు. బహుమతి ఇయ్యం" అని దొరతనం చూపించిండని ఎరికైంది.
"ఇది నాకు బహుమతిని మించిన కితాబు. నా బాణం లక్ష్యాన్ని ఛేదించింది" అన్నాను ఏమంటారు? నన్ను విజయం వరించలేదూ?
అనువాదాలు:
"చిల్లరదేవుళ్ళు" "షూట్ కే దేవతా" పేర హిందీలో అనువదించారు మిత్రులు ప్రొఫెసర్ భీమ సేన్ నిర్మల్ గారు. "లోక్ రాజ్" హిందీ పక్షపత్రిక దాన్ని సీరియల్ గా ప్రచురించింది. అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను. 'లోక్ రాజ్' కార్యాలయానికి వెళ్ళాను. సీరియల్ కు మంచి స్పందన లభిస్తున్నదన్నారు సంపాదకులు. అనేక లేఖలను నాకు చూపారు.
"చిల్లరదేవుళ్ళు" హిందీ అనువాదానికి నిర్మల్ జీకి దక్షిణభారత హిందీ ప్రచారసభవారి బహుమానం లభించింది.
"ఘాట్ కే దేవతా" చిల్లరదేవుళ్ళు హిందీ అనువాదం గీతాప్రకాశన్, హైదరబాదువారు పుస్తకంగా ప్రచురించారు. ఆ గ్రంథపు ఆవిష్కరణ ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో 21-5-90 సోమవారంనాడు జరిగింది. దేవులపల్లి రామానుజరావుగారు అధ్యక్షత వహించారు.
మేము కమలసహితంగా సకుటుంబంగా సమావేశంలో పాల్గొన్నాం.





